యువత అడిగే ప్రశ్నలు
కంగారుగా ఉంటే ఏమి చేయాలి?
మిమ్మల్ని కంగారు పెట్టే విషయాలేంటి?
మీకు కూడా అప్పుడప్పుడూ ఇలా అనిపిస్తుంటుందా?
“నేనెప్పుడూ ఇలా ఆలోచిస్తూ ఉంటాను. ‘ఒకవేళ ఇలా జరిగితే . . .?’ ‘మేము వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ అయితే?’ ‘మేము వెళ్తున్న విమానం కూలిపోతే?’ సాధారణంగా ఎవ్వరూ ఆలోచించని వాటిగురించి ఆలోచిస్తూ భయపడుతుంటాను.”—ఛార్లెస్.
“నేనెప్పుడూ కంగారు పడుతుంటాను, ఎక్కడికో హడావుడిగా కష్టపడి పరిగెడుతున్నా అక్కడికి వెళ్లలేనట్టు, అక్కడే ఉన్నట్లు ఉంటుంది నా పరిస్థితి, ఏమీ చేయలేను. ఇది మార్చుకోడానికి చచ్చేంత కష్టపడుతున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా!”—ఏన.
“స్కూలుకు వెళ్తున్నందుకు చాలా సంతోషం అని నాతో ఎవరైనా చెప్తే, ‘స్కూలుకు వెళ్లడం ఎంత కష్టమో వీళ్లకేమి తెలుసు’ అని మనసులో అనుకుంటాను.”—డాన్యల్.
“నేను ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి దాన్ని. ఎప్పుడూ తర్వాత ఏం జరగుతుందో లేదా నేను తర్వాత ఏం చేయాలి అనో ఆలోచిస్తూ కంగారు పడుతుంటాను.”—లార.
జీవితంలో నిజమేంటంటే: బైబిలు చెప్తున్నట్లుగా మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1) దానివల్ల పెద్దవాళ్లతో పాటు పిల్లలు, యువతీ యువకులు కూడా కంగారు పడుతూ ఉంటారు.
కంగారు పడడం తప్పా?
కాదు. నిజానికి, మనం ప్రేమించేవాళ్లను ఎలా సంతోషపెట్టాలో ఆలోచించడంలో తప్పు లేదని బైబిలు కూడా చెప్తుంది.—1 కొరింథీయులు 7:32-34; 2 కొరింథీయులు 11:28.
అంతేకాదు, కంగారును తట్టుకుందాం—దాని వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. ఉదాహరణకు, మీకు వచ్చే వారం స్కూల్లో పరీక్షలు ఉన్నాయనుకోండి. దాని గురించి కంగారుపడడం వల్ల—మీరు ఈవారమే బాగా చదువుతారు. అప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయి.
కొంచెం కంగారు ఉండడం, కొన్నిసార్లు ప్రమాదాలను కనిపెట్టడానికి కూడా సహాయం చేస్తుంది. “మీరేదో తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టి మీకు భయం లేదా కంగారు ఉంటుంది. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొన్ని మార్చుకోవాలని మీకు తెలుస్తుంది” అని సెరీన అనే టీనేజర్ చెప్తోంది.—యాకోబు 5:14 పోల్చండి.
జీవితంలో నిజమేంటంటే: సరిగ్గా పని చేయడానికి మీకు ఉపయోగపడినంత వరకు—కంగారు మీకు మేలు చేస్తుంది
కానీ ఒకవేళ కంగారు మిమ్మల్ని ఎప్పుడూ చెడుగానే ఆలోచించేలా చేస్తుంటే?
ఉదాహరణ: “ఏదైనా కష్టం వస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించినప్పుడు, నా మనసు నెమ్మదిగా ఉండలేదు. కంగారు కంగారుగా పరిగెడుతున్నట్లు ఉంటుంది,” అని 19 సంవత్సరాల రిచర్డ్ అంటున్నాడు. “అదే విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తుంటాను. అప్పుడు నా కంగారు ఇంకా ఎక్కువ అవుతుంది.”
“సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము” అని బైబిల్లో ఉంది. (సామెతలు 14:30) కానీ ఎక్కువగా కంగారు పడితే అది శరీరానికి నష్టం కలిగిస్తుంది. తపనొప్పి, కళ్లు తిరగడం, పొట్ట పాడవడం లేదా అరగకపోవడం, విపరీతంగా గుండె కొట్టుకోవడం లాంటి వన్నీ జరుగుతాయి.
కంగారు పడడం వల్ల మీకు మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంటే అప్పుడు ఏమి చేయాలి?
మీరేమి చేయవచ్చు?
కంగారు పడడం అవసరమా అని ఆలోచించండి. “మీ బాధ్యతల గురించి ఆలోచించవచ్చు. కానీ విపరీతంగా ఆలోచించి కంగారు పడితేనే సమస్య. ఎలా అంటే, కంగారు పడడం స్టాండ్ వేసున్న సైకిల్ లాంటిది. ఎంత తొక్కినా ఎక్కడికీ వెళ్లలేం, అక్కడే ఉంటాం.—క్యాథరెన్.
బైబిలు ఇలా చెప్తుంది: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?”—మత్తయి 6:27.
దీని అర్థం ఏంటి?: కంగారు పడడం వల్ల మీ సమస్యకు పరిష్కారం రాకపోతే కంగారు పడడం వల్ల మీ సమస్య ఇంకా పెరుగుతుంది, లేదా మీ కంగారే ఒక సమస్య ఔతుంది.
ఏ రోజుకారోజు చూడండి. “బాగా ఆలోచించండి. మీరు కంగారు పడుతున్న విషయం రేపటికి జరుగుతుందా? నెలలో జరుగుతుందా? సంవత్సరంలో జరుగుతుందా? ఐదు సంవత్సరాల్లో జరుగుతుందా?”—ఎన్థని.
బైబిలు ఇలా చెప్తుంది: “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.”—మత్తయి 6:34.
దీని అర్థం ఏంటి?: రేపు వచ్చే సమస్యల్ని ఇప్పుడే పరిష్కరించుకోవాలి అనుకోవడంలో అర్థం లేదు—వాటిలో కొన్ని సమస్యలు అసలు రాకపోవచ్చు.
మీరు మార్చలేని వాటితో జీవించడం నేర్చుకోండి. “రాబోయే పరిస్థితుల్ని ఎదుర్కోడానికి సాధ్యమైనంత వరకు సిద్ధపడండి. కానీ కొన్ని పరిస్థితులు మీ చేతుల్లో ఉండవనే విషయాన్ని ఒప్పుకోండి.”—రాబర్ట్.
బైబిలు ఇలా చెప్తుంది: “వడిగలవారు పరుగులో గెలువరు, . . . తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు, ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.”—ప్రసంగి 9:11.
దీని అర్థం ఏంటి?: కొన్నిసార్లు మీ పరిస్థితుల్ని మీరు మార్చుకోలేరు, కానీ వాటి గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు.
మీ పరిస్థితి గురించి సరిగ్గా ఆలోచించండి. “నేను పూర్తి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి గానీ అందులో ఉన్న చిన్న చిన్న విషయాలు గురించి కంగారు పడకూడదని తెలుసుకున్నాను. ఏవి ముఖ్యమో తెలుసుకుని వేటికి నా శక్తిని ఉపయోగించాలో నేనే నిర్ణయించుకోవాలి అని తెలుసుకున్నాను.”—అలెక్సెస్.
బైబిలు ఇలా చెప్తుంది: మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచించాలి.—ఫిలిప్పీయులు 1:10.
దీని అర్థం ఏంటి?: సమస్యలకు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేవాళ్లు, లేదా వాటి గురించి సరిగ్గా ఆలోచించేవాళ్లు తక్కువ కంగారు పడతారు.
ఎవరితోనైనా మాట్లాడండి. “నేను ఆరవ క్లాసులో ఉన్నప్పుడు, తర్వాత రోజు గురించి భయపడుతూ చాలా కంగారుగా స్కూల్ నుండి వచ్చేవాడిని. మా అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఆ విషయాలు చెప్తూ ఉంటే వాళ్లు వినేవాళ్లు. అలా వాళ్లు వినడం నాకు చాలా మేలు చేసింది. నాకు వాళ్ల మీద నమ్మకం ఉండేది, వాళ్లతో అన్నీ ఫ్రీగా మాట్లాడగలిగేవాడిని. అప్పుడు తర్వాత రోజు గురించి నాలో ఉన్న భయం తగ్గి, ధైర్యంగా ఉండేవాడిని.”—మెర్లిన్.
బైబిలు ఇలా చెప్తుంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.”—సామెతలు 12:25.
దీని అర్థం ఏంటి?: అమ్మా, నాన్న గానీ స్నేహితులు గానీ కంగారు తగ్గించుకోవడానికి కావాల్సిన సలహాలు ఇవ్వగలరు.
ప్రార్థన. “ప్రార్థించినప్పుడు—నా మాటలు నాకు వినపడేలా గట్టిగా ప్రార్థించినప్పుడు నాకు బాగుంటుంది. కంగారు పడుతున్న విషయాలను బుర్రలో పెట్టుకునే బదులు వాటిని మాటల్లో పెట్టడానికి వీలౌతుంది. అప్పుడు యెహోవాకు నా కంగారును తగ్గించే శక్తి ఉందని అర్థం చేసుకుంటాను.”—లారా.
బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:7.
దీని అర్థం ఏంటి?: సొంతగా సమస్యల్ని తగ్గించుకోడానికి ప్రార్థన ఒక మార్గం కాదు. అది నిజంగా యెహోవా దేవునితో మాట్లాడడమే. ఆయన ఇలా వాగ్దానం చేశాడు: “దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.”—యెషయా 41:10.