కంటెంట్‌కు వెళ్లు

‘పరలోక రాజ్యపు తాళం చెవులు’ అంటే ఏమిటి?

‘పరలోక రాజ్యపు తాళం చెవులు’ అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 ‘పరలోక రాజ్యపు తాళం చెవులు’ లేదా ‘పరలోక రాజ్యానికి తాళం చెవులు’ అనే మాట ప్రజల్ని ‘దేవుని రాజ్యంలోకి ప్రవేశించేందుకు’ అనుమతిచ్చే అధికారాన్ని సూచిస్తుంది. (మత్తయి 16:19; ద న్యూ అమెరికన్‌ బైబిల్‌; అపొస్తలుల కార్యములు 14:22) a “పరలోక రాజ్యపు తాళంచెవుల్ని” యేసు పేతురుకు ఇచ్చాడు. దానర్థం ఏమిటంటే, నమ్మకస్థులైన ప్రజలు దేవుని పవిత్రశక్తిని పొంది పరలోక రాజ్యానికి ఎలా వెళ్లవచ్చో చెప్పే సమాచారాన్ని తెలియజేసే అధికారాన్ని యేసు పేతురుకు ఇచ్చాడని.

పేతురు ఆ తాళంచెవుల్ని ఎవరి కోసం ఉపయోగించాడు?

 దేవుడు తనకిచ్చిన ఆ అధికారాన్ని పేతురు, మూడు గుంపుల వాళ్లు పరలోకానికి వెళ్లేందుకు మార్గం తెరవడానికి ఉపయోగించాడు. ఆ మూడు గుంపులు ఎవరంటే:

  1.   యూదులు, యూదులుగా మారినవాళ్లు. యేసు చనిపోయిన కొంతకాలం తర్వాత, పేతురు యూదులతో మాట్లాడుతూ, రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా యేసును అంగీకరించమని, వాళ్లని ప్రోత్సహించాడు. రక్షణ పొందాలంటే ఏమి చేయాలో పేతురు వాళ్లకు చూపించాడు. ఆవిధంగా రాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని వాళ్లకు చూపించాడు. కొన్ని వేలమంది ‘అతని మాటను అంగీకరించారు.’—అపొస్తలుల కార్యములు 2:38-41.

  2.   సమరయులు. పేతురు ఆ తర్వాత సమరయుల దగ్గరకు పంపించబడ్డాడు. b అతను, అలాగే అపొస్తలుడైన యోహాను వాళ్ల దగ్గరకు వెళ్లి “విశ్వాసులు పవిత్రశక్తి పొందేలా వాళ్లకోసం ప్రార్థించారు.” అలా చేయడం ద్వారా పేతురు మరొక రాజ్యపు తాళంచెవిని ఉపయోగించాడు. (అపొస్తలుల కార్యములు 8:14-17) దాంతో పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశం సమరయులకు దొరికింది.

  3.   అన్యులు. యేసు చనిపోయిన మూడున్నర సంవత్సరాల తర్వాత, అన్యులు (యూదులు కానివాళ్లు) కూడా పరలోక రాజ్యంలో భాగమయ్యే అవకాశం పొందుతారని దేవుడు పేతురుకు చెప్పాడు. అప్పుడు పేతురు వాళ్లకు కూడా ప్రకటించడం మొదలుపెట్టాడు. అలా అతను రాజ్యపు తాళంచెవుల్లో ఇంకొకదాన్ని ఉపయోగించాడు. దాంతో అన్యులు పవిత్రశక్తిని పొందడం, క్రైస్తవులుగా మారడం, భవిష్యత్తులో పరలోక రాజ్య పౌరులుగా అయ్యేందుకు అవకాశం సాధ్యమైంది.—అపొస్తలుల కార్యములు 10:30-35, 44, 45.

‘దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం’ అంటే ఏమిటి?

 ‘దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవాళ్లు’ పరలోకంలో యేసుతోపాటు తోటిరాజులుగా ఉంటారు. వాళ్లు “సింహాసనాల మీద కూర్చొని” “రాజులుగా ఈ భూమిని పరిపాలిస్తారు” అని బైబిలు ముందే చెప్పింది.—లూకా 22:29, 30; ప్రకటన 5:9, 10.

రాజ్యపు తాళంచెవుల గురించిన అపోహలు

 అపోహ: పరలోకానికి ఎవరు వెళ్లాలో పేతురు నిర్ణయిస్తాడు.

 నిజం: ‘బ్రతికివున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పుతీర్చే’ వ్యక్తి యేసు అని బైబిలు చెప్తోంది. అంతేగానీ పేతురు కాదు. (2 తిమోతి 4:1, 8; యోహాను 5:22) నిజానికి, “బ్రతికివున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి” యేసే అని పేతురే స్వయంగా చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 10:34, 42.

 అపోహ: రాజ్యపు తాళంచెవుల్ని ఎప్పుడు ఉపయోగించాలనే నిర్ణయం పేతురుకే వదిలేయబడింది.

 నిజం: రాజ్యపు తాళంచెవుల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది.’ (మత్తయి 16:19, ద న్యూ అమెరికన్‌ బైబిల్‌ ) కొంతమంది ఈ వచనాన్ని, పరలోకంలో తీసుకునే నిర్ణయాల్ని పేతురే శాసిస్తాడని అర్థంచేసుకున్నారు. కానీ అసలు గ్రీకు పదాలను గమనిస్తే, పరలోకంలో తీసుకోబడిన నిర్ణయాల్ని పేతురు పాటిస్తాడు, అంతేగానీ పరలోకంలో ఏ నిర్ణయం తీసుకోవాలో పేతురు నిర్ణయించడు అని చూపిస్తున్నాయి. c

 పరలోకం నుండి వచ్చే సూచనల ప్రకారమే పేతురు రాజ్యపు తాళంచెవుల్ని ఉపయోగించాడని బైబిల్లో మరోచోట ఉంది. ఉదాహరణకు, మూడవ తాళంచెవిని ఉపయోగించే విషయంలో పేతురు దేవుడు నుండి వచ్చిన సూచనల్ని పాటించాడు.—అపొస్తలుల కార్యములు 10:19, 20.

a బైబిలు కొన్నిసార్లు, ‘తాళంచెవి’ అనే మాటను అధికారానికి, బాధ్యతకు గుర్తుగా ఉపయోగించింది.—యెషయా 22:20-22; ప్రకటన 3:7, 8.

b సమరయులు వేరే రకమైన మతానికి చెందినవాళ్లు, వాళ్లకు యూదా ఆచారాలతో ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే మోషే ధర్మశాస్త్రంలోని కొన్ని బోధలను, ఆచారాలను సమరయులు తమ మతంలోని వాటికి జతచేశారు.

c పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం (స్టడీ ఎడిషన్‌)లో మత్తయి 16:19కు అధ్యయన గమనికను చూడండి.