కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి

అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి

“ఆతిథ్యము చేయ [అంటే, అపరిచితుల పట్ల దయ చూపించడం] మరవకుడి.”హెబ్రీ. 13:1.

పాటలు: 53, 50

1, 2. (ఎ) ఈరోజుల్లో చాలామంది అపరిచితులు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) బైబిలు ఏమని ప్రోత్సహిస్తోంది? మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

 ముప్పై కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, ఓసే [1] అనే వ్యక్తి ఘానాలో ఉన్న తన ఇంటిని వదిలి యూరప్‌కు వెళ్లాడు. అప్పటికి అతను యెహోవాసాక్షి కాలేదు. అతనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “చాలామంది నన్ను పట్టించుకోలేదని నేను త్వరగానే గ్రహించాను. అక్కడి వాతావరణం కూడా నేను అనుకున్నట్టు లేదు. ఎయిర్‌పోర్ట్‌ నుండి బయటకు రాగానే జీవితంలో మొదటిసారి చలి వేసినప్పుడు ఏడ్వడం మొదలుపెట్టాను.” అక్కడి భాషను నేర్చుకోవడం ఓసేకు కష్టమౌవ్వడంతో, ఓ మంచి ఉద్యోగం సంపాదించడానికి అతనికి ఒక సంవత్సరం పైనే పట్టింది. అంతేకాదు ఇంటికి దూరంగా ఉండడంవల్ల అతనికి కుటుంబసభ్యులు గుర్తొచ్చి ఒంటరిగా అనిపించేది.

2 ఒకవేళ మీరే అలాంటి పరిస్థితిలో ఉంటే, ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో ఆలోచించండి. మీ జాతి లేదా రంగు ఏదైనప్పటికీ, రాజ్యమందిరంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించాలని కోరుకుంటారు. నిజానికి, “ఆతిథ్యము చేయ మరవకుడి” అని బైబిలు నిజక్రైస్తవుల్ని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీ. 13:1) “ఆతిథ్యము” అనే పదానికి ఆదిమ భాషలో ‘అపరిచితుల  [2] పట్ల దయచూపించడం’ అని అర్థం. కాబట్టి మనం ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం: అపరిచితులను యెహోవా ఎలా చూస్తాడు? అపరిచితుల పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలా? వేరే దేశం నుండి మన సంఘానికి వచ్చినవాళ్లు ఇబ్బందిపడకుండా ఉండేలా మనమెలా సహాయం చేయవచ్చు?

అపరిచితులను యెహోవా ఎలా చూస్తాడు?

3, 4. నిర్గమకాండము 23:9 ప్రకారం ఇశ్రాయేలీయులు పరదేశులను ఎలా చూడాలని దేవుడు కోరుకున్నాడు? ఎందుకు?

3 యెహోవా తన ప్రజలను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత, తమతోపాటు వచ్చిన పరదేశులపట్ల ఎలా దయచూపించాలో నేర్పించే నియమాలను వాళ్లకు ఇచ్చాడు. (నిర్గ. 12:38, 49; 22:21) పరదేశులకు చాలా ఇబ్బందులు ఎదురౌతుంటాయి కాబట్టి యెహోవా ప్రేమతో వాళ్ల అవసరాల్ని తీరే ఏర్పాట్లు చేశాడు. ఉదాహరణకు, కోతవాళ్లు కోతకోసిన తర్వాత మిగిలిపోయిన వాటిని పరదేశులు ఏరుకునేలా ఆయన ఏర్పాటు చేశాడు.—లేవీ. 19:9-11.

4 పరదేశులను గౌరవించమని ఇశ్రాయేలీయులను కేవలం ఆజ్ఞాపించడమే కాదుగానీ, పరదేశిగా జీవించడం ఎలా ఉంటుందో వాళ్లు గుర్తుతెచ్చుకోవాలని యెహోవా కోరుకున్నాడు. (నిర్గమకాండము 23:9 చదవండి.) తమకు బానిసలు అవ్వకముందు కూడా జాతి లేదా మత బేధాన్నిబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఇష్టపడేవాళ్లు కాదు. (ఆది. 43:32; 46:33, 34; నిర్గ. 1:11-14) పరదేశులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కష్టాలుపడ్డారు. ఆ అనుభవాల్ని గుర్తుచేసుకొని, ఇశ్రాయేలీయులు పరదేశుల పట్ల దయ చూపించాలని యెహోవా కోరుకున్నాడు.—లేవీ. 19:33, 34.

 5. వేరే దేశం నుండి వచ్చిన వాళ్లపట్ల యెహోవాలాగే దయ చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది?

5 యెహోవా మారలేదు. కాబట్టి వేరే దేశం నుండి ఎవరైనా మన సంఘానికి వచ్చినప్పుడు, అలాంటి వాళ్లపట్ల యెహోవా ఇప్పటికీ దయ చూపిస్తున్నాడని మనం మర్చిపోకూడదు. (ద్వితీ. 10:17-19; మలా. 3:5, 6) సమయం తీసుకుని పరదేశులకు ఎదురయ్యే సవాళ్ల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, వాళ్లకు కొత్త భాష అర్థంకాకపోవచ్చు దానివల్ల ఇతరులు వాళ్లతో సరిగ్గా ప్రవర్తించకపోవచ్చు. కాబట్టి వాళ్లకు సహాయం చేయడానికి, దయ చూపించడానికి కృషిచేద్దాం.—1 పేతు. 3:8.

వాళ్లపట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలా?

6, 7. బలంగా పాతుకుపోయిన పక్షపాత వైఖరిని అధిగమించడానికి తొలి క్రైస్తవులు ప్రయత్నించారని ఎలా తెలుస్తుంది?

6 యూదుల మధ్య పక్షపాత వైఖరి బలంగా పాతుకుపోయింది. అయితే, ఆ కాలంలోని తొలి క్రైస్తవులు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు. సా.శ. 33 పెంతెకొస్తున, వేరే దేశాల నుండి వచ్చి కొత్తగా క్రైస్తవులుగా మారిన వాళ్లకు యెరూషలేములోని యూదులు ఆతిథ్యం ఇచ్చారు, వాళ్లపట్ల శ్రద్ధ చూపించారు. (అపొ. 2:5, 44-47) దీన్నిబట్టి క్రైస్తవులుగా మారిన యూదులు ‘ఆతిథ్యం’ అనే మాటకున్న అర్థాన్ని అంటే ‘అపరిచితుల పట్ల దయ చూపించాలి’ అని గ్రహించారని తెలుస్తుంది.

7 ఆ కాలంలో ఏమి జరిగిందంటే, తమ విధవరాండ్రను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు మాట్లాడే యూదులు ఫిర్యాదు చేశారు. (అపొ. 6:1) ఆ సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూడడానికి అపొస్తలులు ఏడుగురిని ఎన్నుకుని వాళ్ల దగ్గరికి పంపించారు. అయితే గ్రీకు పేర్లు ఉన్న ఏడుగురు వ్యక్తులనే అపొస్తలులు ఎన్నుకున్నారు. బహుశా ఆ విధవరాళ్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకే వాళ్లు అలా ఎన్నుకుని ఉండవచ్చు.—అపొ. 6:2-6.

8, 9. (ఎ) మనలో పక్షపాత వైఖరి ఉందేమోనని ఎందుకు పరిశీలించుకోవాలి? (బి) మనం వేటిని తీసేసుకోవాలి? (1 పేతురు 1:22–23)

8 మనం గుర్తించినా గుర్తించకపోయినా, మన సంస్కృతి ప్రభావం మనందరిపై చాలా ఉంటుంది. (రోమా. 12:1, 2) అంతేకాదు మన పొరుగువాళ్లు లేదా తోటి ఉద్యోగస్థులు-విద్యార్థులు వేరే దేశం, వేరే జాతి, వేరే రంగు వాళ్ల గురించి చెడుగా మాట్లాడడం మనం వింటుండవచ్చు. అలాంటి మాటలు మనపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? లేదా మన దేశం, మన సంస్కృతికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఎవరైనా ఎగతాళి చేస్తూ మాట్లాడితే ఎలా స్పందిస్తాం?

9 అపొస్తలుడైన పేతురు కూడా ఒకానొక సమయంలో యూదులుకాని వాళ్ల విషయంలో పక్షపాతం చూపించాడు. కానీ క్రమేణా అలాంటి ప్రతికూల భావాల నుండి బయటపడడం నేర్చుకున్నాడు. (అపొ. 10:28, 34, 35; గల. 2:11-14) అదేవిధంగా, మనలో కొంచెమైనా పక్షపాత వైఖరి లేదా గర్వం ఉందని గుర్తిస్తే, దాన్ని పూర్తిగా తీసేసుకోవడానికి తీవ్రంగా కృషిచేయాలి. (1 పేతురు 1:22-23 చదవండి.) అలా చేయడానికి మనకేది సహాయం చేస్తుంది? మనందరం అపరిపూర్ణులమని, ఏ దేశానికి చెందినవాళ్లమైనా మనలో ఎవ్వరం రక్షణకు అర్హులం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. (రోమా. 3:9-11, 21-24) కాబట్టి మనం వేరేవాళ్ల కన్నా గొప్పవాళ్లమని అనుకోవడానికి లేదు. (1 కొరిం. 4:7) మనం పౌలులాగే భావించాలి. అతను తన తోటి క్రైస్తవులతో ఇలా చెప్పాడు, ‘మీరిక అపరిచితులు కాదు, పరాయి దేశస్థులు కాదు. మీరు దేవుని కుటుంబ సభ్యులు.’ (ఎఫె. 2:19, NW) కాబట్టి ఏ విషయంలోనైనా మనలో పక్షపాత వైఖరి ఉంటే దాన్ని తీసేసుకోవడానికి కృషిచేయాలి, అప్పుడే మనం కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోగలుగుతాం.—కొలొ. 3:9-11.

అపరిచితుల పట్ల దయను ఎలా చూపించాలి?

10, 11. అపరిచితులతో వ్యవహరించే విషయంలో బోయజు యెహోవాను ఎలా అనుకరించాడు?

10 నమ్మకస్థుడైన బోయజు అపరిచితులను యెహోవా చూసినట్లే చూశాడు. ఏవిధంగా? కోతకాలంలో బోయజు తన పొలాలను చూసుకోవడానికి వెళ్లినప్పుడు, వేరే దేశమైన మోయాబు నుండి వచ్చిన రూతు అతనికి కనిపించింది. ఆ సమయంలో ఆమె నేలమీద పడిన గింజల్ని ఎంతో కష్టపడి ఏరుకుంటోంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు పరిగె ఏరుకునే హక్కు ఉంది. అయినప్పటికీ ఆమె పొలంలో పరిగె ఏరుకోవడానికి అనుమతి అడిగిందని బోయజు విన్నప్పుడు అతను చాలా ముగ్ధుడై పనల మధ్యనున్న గింజలను కూడా ఏరుకునేందుకు అనుమతించాడు.—రూతు 2:5-7, 15, 16 చదవండి.

11 ఆ తర్వాత జరిగినదాన్ని చూస్తే బోయజుకు రూతు పట్ల, పరదేశిగా ఆమె పడుతున్న కష్టం పట్ల శ్రద్ధ ఉందని తెలుస్తుంది. పొలంలో పనిచేసే మగవాళ్లు రూతుతో చెడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను తన పొలంలో పనిచేసే యౌవన స్త్రీలతో ఉండమని చెప్పాడు. అతని సొంత పనివాళ్లతో సమానంగా ఆమెకు కూడా సరిపడా ఆహారం, నీళ్లు దొరికేలా చూశాడు. అంతేకాదు ఆమె వేరే దేశస్థురాలైనప్పటికీ బోయజు ఆమెను గౌరవించాడు, ప్రోత్సహించాడు.—రూతు 2:8-10, 13, 14.

12. అపరిచితులపట్ల దయ చూపించడంవల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారు?

12 రూతు తన అత్త నయోమి పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించడమే కాదు, యెహోవాను సేవించడం కూడా మొదలుపెట్టి రక్షణ కోసం ఆయన వైపు చూసింది. అందుకే బోయజు ఆమెపట్ల దయ చూపించాడు. నిజానికి అలా చేయడం ద్వారా బోయజు యెహోవా విశ్వసనీయ ప్రేమను అనుకరించాడు. (రూతు 2:12, 20; సామె. 19:17) అదేవిధంగా, ఈ కాలంలో మనం దయ చూపించినప్పుడు “మనుష్యులందరు” సత్యాన్ని నేర్చుకుని, యెహోవా వాళ్లను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు సహాయం చేయగలుగుతాం.—1 తిమో. 2:3, 4.

రాజ్యమందిరానికి వచ్చిన అపరిచితులను మనం ఆప్యాయంగా పలకరిస్తున్నామా? (13, 14 పేరాలు చూడండి)

13, 14. (ఎ) రాజ్యమందిరానికి వచ్చిన అపరిచితులను మనం ఎందుకు పలకరించాలి? (బి) వేరే సంస్కృతివాళ్లతో చక్కగా మాట్లాడడానికి మీకేమి సహాయం చేయవచ్చు?

13 రాజ్యమందిరానికి వచ్చిన అపరిచితులను ఆప్యాయంగా పలకరించడం ద్వారా మనం వాళ్లపట్ల దయ చూపించవచ్చు. వేరే దేశంలో నుండి వలస వచ్చేవాళ్లు కొన్నిసార్లు సిగ్గుపడవచ్చు లేదా ఎవ్వరితో కలవలేకపోవచ్చు. తమ సంస్కృతిని బట్టి లేదా సమాజంలో తమకున్న స్థానాన్నిబట్టి తాము వేరే జాతి లేదా దేశం వాళ్లకన్నా తక్కువవాళ్లమని మనం భావించవచ్చు. కాబట్టి మొదట వాళ్లను పలకరించి, వాళ్లపట్ల దయను నిజమైన శ్రద్ధను చూపించాలి. ఒకవేళ JW లాంగ్వేజ్‌ యాప్‌ మీ భాషలో అందుబాటులో ఉంటే, వాళ్ల భాషలో ఎలా పలకరించాలో మీరు నేర్చుకోవచ్చు.—ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.

14 వేరే సంస్కృతివాళ్లతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాంటి భావాలను అధిగమించడానికి, వాళ్లకు మీ గురించి కొన్ని విషయాలు చెప్పవచ్చు. అప్పుడు మీరు అనుకున్నట్లుగా చాలా విషయాల్లో మీకూ, వాళ్లకూ ఏం తేడా లేదని గుర్తిస్తారు. ప్రతి సంస్కృతిలోనూ మంచిచెడులు ఉంటాయని గుర్తుంచుకోండి.

వాళ్లు ఇబ్బందిపడకుండా ఉండేలా సహాయం చేయండి

15. కొత్త దేశానికి అలవాటుపడుతున్న వాళ్లను అర్థంచేసుకోగలగాలంటే మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

15 సంఘంలో ఇతరులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు సహాయం చేయాలంటే, ‘ఒకవేళ నేను వేరే దేశంలో ఉంటే, ఇతరులు నాతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాను?’ అని ప్రశ్నించుకోండి. (మత్త. 7:12) కొత్త దేశానికి అలవాటుపడుతున్న వాళ్లతో ఓర్పుగా ఉండండి. మొదట్లో వాళ్ల ఆలోచనా విధానం, స్పందించే తీరు మనకు పూర్తిగా అర్థంకాకపోవచ్చు. అయితే, వాళ్లు మన సంస్కృతికి తగ్గట్టుగా ఆలోచించాలని, ప్రవర్తించాలని ఎదురుచూసే బదులు, వాళ్లను వాళ్లలాగే అంగీకరించండి.—రోమీయులు 15:7 చదవండి.

16, 17. (ఎ) వేరే సంస్కృతివాళ్లకు దగ్గరవ్వడానికి మనం ఏమి చేయవచ్చు? (బి) వలస వచ్చిన వాళ్లు మన సంఘంలో ఉంటే వాళ్లకు ఎలాంటి సహాయం చేయవచ్చు?

16 మనం సమయం తీసుకొని వేరే దేశం గురించి, అక్కడ జీవించే ప్రజల గురించి తెలుసుకుంటే, వాళ్లను అర్థంచేసుకోవడం సులభమౌతుంది. వలస వచ్చినవాళ్లు మన సంఘంలో లేదా ప్రాంతంలో ఉంటే మన కుటుంబ ఆరాధన సమయంలో వాళ్ల సంస్కృతి గురించి కొంత పరిశోధన చేయవచ్చు. వాళ్లకు దగ్గరవ్వడానికి మరో మార్గమేమిటంటే వాళ్లను మన ఇంటికి భోజనానికి పిలవడం. ‘అన్యజనులు విశ్వసించడానికి యెహోవా ద్వారము తెరిచాడు’ కాబట్టి మనం ఆయనను అనుకరిస్తూ అపరిచితులకు అంటే తోటి విశ్వాసుల కోసం మన ఇంటి తలుపులను తెరవాలి.—అపొ. 14:27; గల. 6:10; యోబు 31:32.

వేరే దేశాలనుండి వచ్చిన వాళ్లపట్ల మనం దయతో ఆతిథ్యాన్ని ఇస్తున్నామా? (16, 17 పేరాలు చూడండి)

17 వలస వచ్చిన కుటుంబంతో మనం సమయం గడిపినప్పుడు, వాళ్లు మన సంస్కృతికి అలవాటుపడేందుకు చేస్తున్న కృషిని అర్థం చేసుకోవడానికి, దాన్ని విలువైనదిగా ఎంచడానికి మనకు సహాయం చేస్తుంది. బహుశా వాళ్లకు భాష నేర్చుకునేందుకు సహాయం అవసరమని మనం గుర్తించవచ్చు. అంతేకాదు వాళ్లకు మంచి ఇల్లు, ఉద్యోగం దొరికేలా మనం సహాయం చేయవచ్చు. అలాంటి సహాయం మన సహోదరసహోదరీలకు నిజంగా ఎంతో ఉపయోగపడవచ్చు.—సామె. 3:27.

18. వలస వచ్చినవాళ్లు రూతు చూపించిన గౌరవాన్ని, కృతజ్ఞతనే ఎలా చూపించవచ్చు?

18 వలస వచ్చినవాళ్లు, కొత్త దేశానికి అలవాటుపడడానికి చేయగలిగినదంతా చేయాలనుకుంటారు. ఈ విషయంలో రూతు మంచి ఆదర్శం ఉంచింది. మొదటిగా, పరిగె ఏరుకోవడానికి అనుమతి అడగడం ద్వారా కొత్త దేశంలో ఉన్న ఆచారాలను గౌరవిస్తున్నట్లు చూపించింది. (రూతు 2:7) తనకు హక్కు ఉంది కాబట్టి అనుమతి ఎందుకు అడగాలని గానీ లేదా ఇతరులనుండి ఏదైనా పొందడానికి తాను అర్హురాలిననిగానీ ఆమె అనుకోలేదు. రెండవదిగా, ఇతరులు ఆమె పట్ల చూపించిన దయకు వెంటనే కృతజ్ఞత చెప్పింది. (రూతు 2:13) వలస వచ్చినవాళ్లు కూడా అలాంటి చక్కని మనస్తత్వాన్నే చూపించినప్పుడు సహోదరసహోదరీలు, స్థానిక ప్రజలు వాళ్లను మరింత గౌరవించగలుగుతారు.

19. ఏ కారణాలను బట్టి అపరిచితులు ఇబ్బందిపడకుండా మనం చూసుకోవాలి?

19 యెహోవా దేవుడు అపారదయను చూపించి అన్నిరకాల ప్రజలు సువార్తను వినగలిగే అవకాశం ఇచ్చినందుకు మనం ఎంతో సంతోషిస్తాం. కొంతమందికి తమ సొంత దేశంలో యెహోవా ప్రజలతో కలిసి మీటింగ్స్‌కు వెళ్లడం కుదురుండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనతో సహవసించే అవకాశం వాళ్లకు దొరికింది. కాబట్టి తాము అపరిచితులమని వాళ్లకు అనిపించకుండా సహాయం చేయాలి. మన దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు లేదా వాళ్లకు ఎక్కువ సహాయం చేయలేకపోవచ్చు కానీ మనం వాళ్లతో దయగా ఉన్నప్పుడు యెహోవాకు వాళ్లపట్ల ఉన్న ప్రేమను మనమూ చూపిస్తాం. మన మధ్య ఉండే అపరిచితులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు చేయగలిగినదంతా చేద్దాం. ఆ విధంగా మనం ‘దేవునిపోలి నడుచుకొనే’ వాళ్లమని చూపిద్దాం.—ఎఫె. 5:1, 2.

^ [1] (1వ పేరా) అసలు పేరు కాదు.

^ [2] (2వ పేరా) ఈ ఆర్టికల్‌లో “అపరిచితులు” అనే మాట, వేరే దేశం నుండి వచ్చి మన దేశంలో ఉంటున్నవాళ్లను సూచిస్తోంది.