మీకు తెలుసా?
స్తెఫను హింసించబడుతున్నా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు?
స్తెఫను ఎదురుగా, కోపంతో రగిలిపోతున్న కొంతమంది ఉన్నారు. వాళ్లు ఇశ్రాయేలులోని అత్యున్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యులు. ఆ 71 మంది న్యాయమూర్తులు దేశంలో చాలా పలుకుబడి ఉన్నవాళ్లు. ప్రధానయాజకుడైన కయప వాళ్లను సమావేశపర్చాడు. కొన్ని నెలల క్రితం అతని ఆధ్వర్యంలోనే మహాసభ యేసుకు మరణశిక్ష విధించింది. (మత్త. 26:57, 59; అపొ. 6:8-12) మహాసభ సభ్యులు అబద్ధసాక్షుల్ని ఒకరి తర్వాత ఒకర్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతలో, స్తెఫను ముఖం “దేవదూత ముఖంలా” కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.—అపొ. 6:13-15.
అలాంటి భయానక పరిస్థితిలో కూడా స్తెఫను ఎలా ప్రశాంతంగా, నింపాదిగా ఉండగలిగాడు? మహాసభకు రాకముందు, “పవిత్రశక్తితో నిండిన స్తెఫను” పరిచర్య పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. (అపొ. 6:3-7) విచారణ జరుగుతున్నప్పుడు కూడా అదే పవిత్రశక్తి ఆయన మీద పనిచేసింది. అది ఆయనకు ఓదార్పును ఇచ్చి, కొన్ని విషయాల్ని గుర్తుచేసింది. (యోహా. 14:16, అధస్సూచి) అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ప్రకారం, స్తెఫను ధైర్యంగా తన వాదనను వినిపిస్తున్నప్పుడు, హీబ్రూ లేఖనాల్లోని దాదాపు 20 వృత్తాంతాలను పవిత్రశక్తి ఆయనకు గుర్తుచేసింది. (యోహా. 14:26) అంతేకాదు, దేవుని కుడిపక్కన యేసు నిలబడివున్న దర్శనాన్ని చూసినప్పుడు స్తెఫను విశ్వాసం ఇంకా బలపడింది.—అపొ. 7:54-56, 59, 60.
మనకు కూడా ఏదోకరోజు బెదిరింపులు, హింసలు ఎదురవ్వవచ్చు. (యోహా. 15:20) బైబిల్ని రోజూ చదువుతూ, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటే దేవుని పవిత్రశక్తి మనమీద కూడా పనిచేస్తుంది. అప్పుడు, వ్యతిరేకత వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రశాంతంగా ఉంటాం.—1 పేతు. 4:12-14.