కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

సొలొమోను కట్టించిన ఆలయంలోని వసారా ఎత్తు ఎంత?

ఈ వసారా ఆలయంలోని పవిత్ర స్థలానికి ముఖ ద్వారంగా ఉండేది. 2023 కు ముందు ప్రచురించిన పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం సంచికల ప్రకారం, “ముందున్న వసారా వెడల్పు మందిరం వెడల్పుతో సమానం. అది 20 మూరలు ఉంది. దాని ఎత్తు 120.” (2 దిన. 3:4) వేరే అనువాదాలు కూడా వసారా ఎత్తు “120 మూరలు” అని చెప్తున్నాయి. దాని ప్రకారం అది 53 మీటర్ల (175 అడుగుల) ఎత్తున్న బురుజు అయ్యుండాలి.

అయితే 2023 లో ప్రచురించిన కొత్త లోక అనువాదం బైబిల్లో, సొలొమోను ఆలయంలోని వసారా “ఎత్తు 20 మూరలు” అని ఉంది. a అంటే 9 మీటర్ల (30 అడుగుల) ఎత్తు. ఈ మార్పుకు సంబంధించి కొన్ని కారణాల్ని చూడండి.

వసారా ఎత్తు గురించి 1 రాజులు 6:3లో లేదు. యిర్మీయా ఆ లేఖనంలో వసారా వెడల్పు, పొడవు గురించే రాశాడు కానీ ఎత్తు గురించి రాయలేదు. తర్వాత 7వ అధ్యాయంలో, ఆలయానికి సంబంధించిన ఇతర ప్రత్యేకతల గురించి ఆయన వివరంగా రాశాడు. వాటిలో కొన్ని ఏంటంటే, లోహంతో పోత పోయించిన సముద్రం, పది బండ్లు, వసారా బయట ఉన్న రెండు రాగి స్తంభాలు. (1 రాజు. 7:15-37) ఒకవేళ నిజంగా, వసారా 50 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండి, మిగతా ఆలయం కన్నా ఎత్తుగా ఉండుంటే, ఆ వివరాన్ని యిర్మీయా ఎందుకు రాయలేదు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొంతమంది యూదా రచయితలు ఈ వసారా మిగతా ఆలయం కన్నా ఎత్తు కాదనే రాశారు.

ఒకవేళ వసారా 120 మూరల ఎత్తు ఉంటే ఆలయ గోడలు దాని బరువును తట్టుకోగలవా అని కొందరు పండితులు ప్రశ్నిస్తున్నారు. పాత రోజుల్లో రాళ్లతో లేదా ఇటుకతో నిర్మించిన అత్యంత ఎత్తయిన కట్టడాలను పరిశీలిస్తే, (ఐగుప్తులోని ఆలయ ద్వారాలు లాంటివి) అవి కింది భాగంలో చాలా వెడల్పుగా ఉండి, పైకి వచ్చే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. కానీ సొలొమోను కట్టించిన ఆలయం అలా కాదు. ఆలయ గోడలు 6 మూరల (2.7 మీటర్ల లేదా 9 అడుగుల) కన్నా ఎక్కువ మందంగా ఉండేవి కావని నిపుణులు అంటారు. కట్టడాలను పరిశీలించే చరిత్రకారుడైన థియోడోర్‌ బ్యూసింక్‌ ఈ ముగింపుకు వచ్చాడు: “[ఆలయ ప్రవేశ ద్వారం] గోడ మందాన్ని బట్టి చూస్తే, వసారా ఎత్తు 120 మూరలు ఉండకపోవచ్చు.”

2 దినవృత్తాంతాలు 3:4 వచనాన్ని తప్పుగా కాపీ చేసి ఉండవచ్చు. కొన్ని ప్రాచీన రాతప్రతుల్లో ఈ లేఖనంలో “120” అని ఉన్నా, ప్రసిద్ధి చెందిన ఐదవ శతాబ్దపు కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌లో అలాగే ఆరవ శతాబ్దపు కోడెక్స్‌ ఆంబ్రోసియేనస్‌లో మాత్రం “20 మూరలు” అని ఉంది. మరైతే నకలు రాసిన వ్యక్తి, ఎందుకు పొరపాటున “120” అని రాసి ఉంటాడు? హీబ్రూ భాషలో “వంద” అనే పదం, “మూరలు” అనే పదం చూడడానికి ఒకేలా ఉంటాయి. కాబట్టి, నకలు రాసిన వ్యక్తి “మూరలు” అనే పదానికి బదులు “వంద” అని రాసి ఉంటాడు.

నిజమే, మనం ఇలా చిన్నచిన్న వివరాల్ని బాగా తెలుసుకుని, సొలొమోను కట్టిన ఆలయం ఖచ్చితంగా ఎలా ఉండేదో ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ఆ వివరాల కన్నా, ఆలయం దేనికి సూచనగా ఉందో దానిమీద, అంటే గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ మనసుపెడతాం. ఆ గొప్ప ఆలయంలో తనను ఆరాధించే అవకాశం యెహోవా తన సేవకులందరికీ ఇచ్చినందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!—హెబ్రీ. 9:11-14; ప్రక. 3:12; 7:9-17.

a “కొన్ని ప్రాచీన చేతిరాత ప్రతుల్లో ‘ఎత్తు 120’ అని ఉంది. కానీ వేరే చేతిరాత ప్రతుల్లో, అలాగే కొన్ని అనువాదాల్లో ‘ఎత్తు 20 మూరలు’ అని ఉంది” అని లేఖనంలోని అధస్సూచి స్పష్టం చేస్తోంది.