కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, దాన్ని కాపాడుకోండి
“దేవుడు ఇచ్చే కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి.”—కొలొ. 3:10.
1, 2.(ఎ) కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం సాధ్యమేనని ఎలా చెప్పవచ్చు? (బి) కొత్త వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ లక్షణాల గురించి కొలొస్సయులు 3:10-14 వచనాల్లో తెలుసుకుంటాం?
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదములో ‘కొత్త వ్యక్తిత్వం’ అనే మాట రెండుసార్లు కనిపిస్తుంది. (ఎఫె. 4:24; కొలొ. 3:10) “దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన” వ్యక్తిత్వాన్ని ఆ మాట సూచిస్తోంది. కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం మనకు సాధ్యమేనా? సాధ్యమే. యెహోవా మనుషులను తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి ఆయనకున్న అద్భుతమైన లక్షణాలను మనం అనుకరించగలం.—ఆది. 1:26, 27; ఎఫె. 5:1.
2 మనందరం అపరిపూర్ణతను వారసత్వంగా పొందాం కాబట్టి అప్పుడప్పుడు మనలో తప్పుడు కోరికలు కలుగుతుంటాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్నిబట్టి కూడా అలాంటి కోరికలు కలగవచ్చు. కానీ యెహోవా దయతో చేస్తున్న సహాయాన్ని తీసుకుంటే, ఆయనకు నచ్చినట్లు మనం తయారవ్వగలం. అందుకోసం, కొత్త వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. (కొలొస్సయులు 3:10-14 చదవండి.) తర్వాత, ఆ లక్షణాల్ని పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
“మీరందరూ ఐక్యం అయ్యారు”
3. కొత్త వ్యక్తిత్వంలో ఉన్న ఒక లక్షణం ఏమిటి?
3 నిష్పక్షపాతంగా ఉండడం అనేది కొత్త వ్యక్తిత్వంలో ఒక ప్రాముఖ్యమైన లక్షణమని పౌలు వివరించాడు. ఆయన ఇలా చెప్పాడు, “ఇందులో గ్రీకువాళ్లూ యూదులూ, సున్నతి చేయించుకున్నవాళ్లూ సున్నతి చేయించుకోనివాళ్లూ, విదేశీయులు, సిథియనులు, దాసులు, స్వతంత్రులు అనే తేడా ఏమీ లేదు.” a కాబట్టి తెగ, జాతి లేదా సమాజంలో తమకున్న హోదాను బట్టి వేరేవాళ్ల కన్నా తాము గొప్పవాళ్లమని సంఘంలోని వాళ్లెవ్వరూ అనుకోకూడదు. ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు అనుచరులముగా మనందరం ‘ఐక్యంగా’ ఉన్నాం.—కొలొ. 3:11; గల. 3:28.
4. (ఎ) యెహోవా సేవకులు ఇతరులతో ఎలా వ్యవహరించాలి? (బి) ఎలాంటి పరిస్థితులవల్ల క్రైస్తవులకు ఐక్యంగా ఉండడం కష్టం కావచ్చు?
4 మనం కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నప్పుడు, ప్రజల జాతి లేదా నేపథ్యం ఏదైనా అందర్నీ గౌరవిస్తాం, మర్యాదగా ప్రవర్తిస్తాం. (రోమా. 2:11) కానీ అలా ఉండడం కొన్ని దేశాల్లో కష్టం కావచ్చు. ఉదాహరణకు, ఒకప్పుడు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం వేర్వేరు జాతులవాళ్లకు వేర్వేరు ప్రాంతాలను కేటాయించింది. యెహోవాసాక్షులతో సహా, చాలామంది ఇప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అయితే పరిపాలక సభ మన సహోదరులను “హృదయాలను విశాలం” చేసుకోమని ప్రోత్సహించాలనుకుంది. అందుకే 2013 అక్టోబరులో, వేర్వేరు జాతులవాళ్లు ఒకరినొకరు మరింత బాగా తెలుసుకునేలా ఒక ప్రత్యేక ఏర్పాటు చేసింది.—2 కొరిం. 6:13.
5, 6. (ఎ) దేవుని ప్రజలు మరింత ఐక్యమవ్వడానికి ఒక దేశంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
5 కొన్ని వారాంతాల్లో వేరే భాషకు లేదా జాతికి చెందిన రెండు వేర్వేరు సంఘాల వాళ్లు కలిసి సమయం గడిపేలా సంస్థ ఏర్పాట్లు చేసింది. అప్పుడు రెండు సంఘాల సహోదరసహోదరీలు కలిసి ప్రీచింగ్ చేశారు, కలిసి మీటింగ్స్‌కు వెళ్లారు అలాగే ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి సమయం గడిపారు. వందల సంఘాలు ఈ ఏర్పాటును పాటించాయి. దానివల్ల బయటవాళ్ల నుండి కూడా బ్రాంచికి మంచి నివేదికలు వెళ్లాయి. ఉదాహరణకు, ఒక ప్రీస్టు ఇలా అన్నాడు, “నేను యెహోవా సాక్షిని కాను, కానీ మీ ప్రకటనా పని చాలా క్రమపద్ధతిగా జరుగుతుంది, మీలో జాతి విభేదం కూడా లేదని చెప్పగలను.” పరిపాలక సభ చేసిన ఆ ఏర్పాటు సహోదరసహోదరీలకు ఎలా అనిపించింది?
6 ఖోసా భాష మాట్లాడే నొమ అనే పేద సహోదరి, ఇంగ్లీషు భాషా సంఘంలోని సాక్షులను తన ఇంటికి పిలవడానికి మొదట్లో చాలా భయపడింది. కానీ ఆమె తెల్లజాతి సాక్షులతో ప్రీచింగ్ చేసి, వాళ్ల ఇళ్లకు వెళ్లి సమయం గడిపాక ఆ భయం పోయింది. ఆమె ఇలా చెప్పింది, “వాళ్లు మనలాంటి మామూలు ప్రజలే.” అయితే, ఇంగ్లీషు భాషా సంఘంలోని సహోదరసహోదరీలు, ఖోసా భాషా సంఘంవాళ్లతో ప్రీచింగ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్లలో కొంతమందిని నొమ తన ఇంటికి భోజనానికి పిలిచింది. వచ్చిన వాళ్లలో సంఘపెద్ద అయిన ఒక తెల్లజాతి సహోదరుడు చిన్న ప్లాస్టిక్ పీటలాంటి దాని మీద కూర్చోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ విధంగా, ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ఏర్పాటువల్ల చాలామంది సహోదరసహోదరీలు కొత్త స్నేహితుల్ని సంపాదించుకుంటున్నారు, వేర్వేరు నేపథ్యాల ప్రజలతో పరిచయం పెంచుకోగలుగుతున్నారు.
కనికరాన్ని, దయను అలవర్చుకోండి
7. కనికరం అనే లక్షణాన్ని మనమెందుకు ఎల్లప్పుడూ చూపించాలి?
7 సాతాను లోకం అంతమయ్యే వరకు, యెహోవా ప్రజలకు కష్టాలు తప్పవు. నిరుద్యోగం, తీవ్ర అనారోగ్యం, హింస, ప్రకృతి వైపరిత్యాలు, దోపిడీలు లేదా ఇతర కష్టాలను మనందరం అనుభవించాల్సి రావచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలంటే మనకు నిజమైన కనికరం ఉండాలి. అలాంటి కనికరం ఇతరులతో దయగా ప్రవర్తించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఎఫె. 4:32) కొత్త వ్యక్తిత్వంలోని ఈ లక్షణాలు దేవున్ని అనుకరించడానికి, ఇతరుల్ని ఓదార్చడానికి మనకు సహాయం చేస్తాయి.—2 కొరిం. 1:3, 4.
8. సంఘంలోని వాళ్లందరి పట్ల కనికరాన్ని, దయను చూపించినప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి? ఒక ఉదాహరణ చెప్పండి.
8 వేరే దేశం నుండి వచ్చినవాళ్లు లేదా పేదవాళ్లు మన సంఘంలో ఉంటే, వాళ్లపట్ల మనం మరింత కనికరాన్ని ఎలా చూపించవచ్చు? మనం వాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించాలి, స్నేహం చేయాలి, సొంత దేశంలో ఉన్నట్లు భావించేలా చేయాలి. (1 కొరిం. 12:22, 25) ఉదాహరణకు, డానీకార్ల్ అనే సహోదరుడు ఫిలిప్పీన్స్ నుండి జపానుకు వెళ్లాడు. అతను వేరే దేశానికి చెందినవాడు కాబట్టి ఉద్యోగ స్థలంలో అతన్ని మిగతావాళ్ల కన్నా తక్కువగా చూసేవాళ్లు. ఒకసారి అతను యెహోవాసాక్షుల మీటింగ్‌కి వెళ్లినప్పుడు ఏమి జరిగిందో చెప్తూ డానీకార్ల్ ఇలా అన్నాడు, “ఆ మీటింగ్‌కి వచ్చిన వాళ్లందరూ దాదాపుగా జపనీయులే, అయినా వాళ్లకు నేను ఎప్పటినుండో పరిచయం ఉన్నట్టు ఆప్యాయంగా ఆహ్వానించారు.” సహోదరులు చూపించిన దయ, యెహోవాకు మరింత దగ్గరౌతూ ఉండడానికి అతనికి సహాయం చేసింది. కొంతకాలానికి డానీకార్ల్ బాప్తిస్మం తీసుకున్నాడు, ఇప్పుడు సంఘ పెద్దగా సేవచేస్తున్నాడు. అతనూ, అతని భార్య జెన్నిఫర్ తమ సంఘంలో సేవ చేస్తున్నందుకు తోటి పెద్దలు చాలా సంతోషిస్తూ ఇలా అన్నారు, “వాళ్లు పయినీర్లుగా సాదాసీదాగా జీవిస్తూ, దేవుని రాజ్యాన్ని మొదట వెతికే విషయంలో చక్కని ఆదర్శం ఉంచుతున్నారు.”—లూకా 12:31.
9, 10. పరిచర్యలో కనికరాన్ని చూపించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో ఉదాహరణలు చెప్పండి.
9 దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు “అందరికీ మంచి చేసే” అవకాశం మనకు దొరుకుతుంది. (గల. 6:10) చాలామంది వేరే దేశం నుండి వచ్చిన వాళ్లపట్ల కనికరంతో, వాళ్ల భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. (1 కొరిం. 9:23) అందుకు మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో పయినీరు సేవ చేస్తున్న టిఫనీ అనే సహోదరి, బ్రిస్బేన్ నగరంలో ఉన్న స్వాహిలీ భాషా సంఘంలోని వాళ్లకు సహాయం చేయడానికి స్వాహిలీ భాష నేర్చుకుంది. ఆ భాష నేర్చుకోవడం కష్టమే అయినా, ఆమె జీవితం ఎంతో అర్థవంతంగా మారింది. టిఫనీ ఇలా అంటోంది, “మీ పరిచర్య ఆసక్తికరంగా మారాలంటే, వేరే భాషా సంఘంలో సేవ చేయవచ్చు. అక్కడ సేవచేయడం, మీ ఊరిలోనే ఉంటూ వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని రుచి చూస్తూ, సహోదరసహోదరీల మధ్య ఉన్న అద్భుతమైన ఐక్యతను స్వయంగా చూడగలుగుతారు.”
10 జపాన్‌లో ఉంటున్న ఒక కుటుంబం అలాగే చేసింది. వాళ్ల కూతురు సాకీకో ఇలా అంటోంది, “మేము ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, బ్రెజిల్ నుండి వచ్చినవాళ్లను తరచూ కలిసేవాళ్లం. వాళ్ల పోర్చుగీస్ బైబిలు నుండి ప్రకటన 21:3, 4 లేదా కీర్తన 37:10, 11, 29 వంటి లేఖనాల్ని చూపించినప్పుడు శ్రద్ధగా వినేవాళ్లు, కొన్నిసార్లయితే కంటతడి కూడా పెట్టుకునేవాళ్లు.” ఆ కుటుంబం కనికరంతో బ్రెజిల్ నుండి వచ్చినవాళ్లకు సత్యం నేర్పించాలనుకుంది. అందుకే, కుటుంబంగా పోర్చుగీస్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత, పోర్చుగీస్ భాషా సంఘాన్ని ప్రారంభించేందుకు ఆ కుటుంబం సహాయం చేసింది. వేరే దేశం నుండి వచ్చిన చాలామంది యెహోవా సేవకులు అయ్యేందుకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్లపాటు సహాయం చేసింది. సాకీకో ఇలా అంటోంది, “పోర్చుగీస్ భాష నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ దానికి మించిన దీవెనలు పొందాను. అందుకు యెహోవాకు మేము ఎంతో కృతజ్ఞులం.”—అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.
వినయాన్ని అలవర్చుకోండి
11, 12. (ఎ) ఎలాంటి ఉద్దేశంతో మనం కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి? (బి) వినయంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?
11 ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని కాదుగానీ యెహోవాకు ఘనత తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. పరిపూర్ణుడైన దేవదూత కూడా గర్విష్ఠిగా మారి పాపం చేశాడని గుర్తుంచుకోండి. (యెహె. 28:17 పోల్చండి.) మనం అపరిపూర్ణులం కాబట్టి గర్వానికి దూరంగా ఉండడం మరింత కష్టం. అయినప్పటికీ మనం వినయాన్ని అలవర్చుకోవచ్చు. ఎలా?
12 మనకు సహాయం చేసే ఒక విషయమేమిటంటే, ప్రతీరోజూ దేవుని వాక్యాన్ని చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం. (ద్వితీ. 17:18-20) ముఖ్యంగా యేసు నేర్పించిన విషయాల గురించి, వినయం చూపించడంలో ఆయన ఉంచిన అద్భుతమైన ఆదర్శం గురించి లోతుగా ఆలోచించాలి. (మత్త. 20:28) యేసు ఎంత వినయాన్ని చూపించాడంటే, ఆయన అపొస్తలుల కాళ్లు కడిగాడు. (యోహా. 13:12-17) మనకు సహాయం చేసే మరో విషయం పవిత్రశక్తి. కాబట్టి పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే, మనం ఇతరుల కన్నా గొప్పవాళ్లమని అనుకునేలా చేసే ఎలాంటి ఆలోచనలతోనైనా పోరాడేందుకు అది సహాయం చేస్తుంది.—గల. 6:3, 4; ఫిలి. 2:3.
13. వినయంగా ఉండడంవల్ల వచ్చే దీవెనలు ఏమిటి?
13 సామెతలు 22:4 చదవండి. మనం వినయంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. వినయంగా ఉంటే ఎన్నో దీవెనలు పొందుతాం. మనం వినయంగా ఉన్నప్పుడు, సంఘంలో శాంతి, ఐక్యత మరింత పెరుగుతాయి. అంతేకాదు, యెహోవా మనపట్ల తన అపారదయను చూపిస్తాడు. అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “అందరూ ఒకరితో ఒకరు వినయంగా వ్యవహరించండి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు, కానీ వినయస్థులకు అపారదయను ప్రసాదిస్తాడు.”—1 పేతు. 5:5.
సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి
14. సౌమ్యతను, ఓర్పును చూపించే విషయంలో ఎవరు అత్యుత్తమ ఆదర్శం?
14 నేటి ప్రపంచంలో సౌమ్యంగా, ఓర్పుగా ఉండేవాళ్లను ఇతరులు తరచూ బలహీనులుగా చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఈ విశ్వంలోనే అత్యంత శక్తిమంతుడైన యెహోవాయే ఆ చక్కని లక్షణాలకు మూలం. సౌమ్యతను, ఓర్పును చూపించే విషయంలో ఆయనే అత్యుత్తమ ఆదర్శం. (2 పేతు. 3:9) ఉదాహరణకు, అబ్రాహాము అలాగే లోతు యెహోవాను ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన తన దూత ద్వారా ఎంత ఓపిగ్గా ప్రతిస్పందించాడో ఆలోచించండి. (ఆది. 18:22-33; 19:18-21) అవిధేయులైన ఇశ్రాయేలు జనాంగం పట్ల 1,500 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు యెహోవా ఎంత ఓర్పు చూపించాడో ఆలోచించండి.—యెహె. 33:11.
15. సౌమ్యతను, ఓర్పును చూపించే విషయంలో యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?
15 యేసు “సౌమ్యుడు.” (మత్త. 11:29) తన శిష్యుల బలహీనతల విషయంలో ఆయన ఎంతో ఓర్పు చూపించాడు. యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయనంటే గిట్టనివాళ్లు అన్యాయంగా విమర్శించారు, నిందలు మోపారు. కానీ ఆయన తన మరణం వరకు సౌమ్యంగా, ఓర్పుగా ఉన్నాడు. హింసాకొయ్య మీద యేసు తీవ్ర వేదన పడుతున్నప్పుడు, తనను చంపుతున్న ప్రజలను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆయనిలా అన్నాడు, “వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.” (లూకా 23:34) యేసు ఎంతో ఒత్తిడిలో లేదా బాధలో ఉన్నప్పుడు కూడా సౌమ్యంగా, ఓర్పుగా ఉన్నాడు.—1 పేతురు 2:21-23 చదవండి.
16. మనం సౌమ్యతను, ఓర్పును ఎలా చూపించగలం?
16 మనం సౌమ్యతను, ఓర్పును చూపించగల ఒక విధానం గురించి మాట్లాడుతూ పౌలు ఇలా రాశాడు, “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.” (కొలొ. 3:13) మనం ఇతరుల్ని క్షమించాలంటే సౌమ్యంగా, ఓర్పుగా ఉండాలి. దానివల్ల సంఘంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది.
17. సౌమ్యత, ఓర్పు కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం?
17 మనం ఇతరులతో సౌమ్యంగా, ఓర్పుగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. కొత్తలోకంలో జీవించాలంటే మనకు అలాంటి లక్షణాలు ఉండడం ప్రాముఖ్యం. (మత్త. 5:5; యాకో. 1:21) సౌమ్యంగా, ఓర్పుగా ఉన్నప్పుడు మనం యెహోవాకు ఘనత తెస్తాం అలాగే ఇతరులు కూడా ఆయన్ను ఘనపర్చడానికి సహాయం చేయగలుగుతాం.—గల. 6:1; 2 తిమో. 2:24, 25.
ప్రేమను అలవర్చుకోండి
18. ప్రేమకు నిష్పక్షపాతానికి ఉన్న సంబంధం ఏమిటి?
18 మనం చర్చించుకున్న లక్షణాలన్నీ ప్రేమతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, శిష్యుడైన యాకోబు తన సహోదరులను గద్దించాడు ఎందుకంటే వాళ్లు డబ్బున్నవాళ్లకు ప్రాముఖ్యతను ఇస్తూ పేదవాళ్లను తక్కువగా చూశారు. అలా ప్రవర్తిస్తే, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి” అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరినట్లు అవుతుందని యాకోబు వివరించాడు. అంతేకాదు, “మీరు పక్షపాతం చూపిస్తూ ఉంటే పాపం చేస్తున్నట్టే” అని కూడా అతను చెప్పాడు. (యాకో. 2:8, 9) ఒకవేళ మనకు ప్రజలమీద ప్రేమ ఉంటే చదువు, జాతి, సామాజిక హోదా వంటివి పట్టించుకోకుండా అందర్నీ సమానంగా చూస్తాం. నిష్పక్షపాతం అనేది కేవలం పైపైన చూపించేది కాదు అది మనసులో నుండి రావాలి.
19. మనం ప్రేమను అలవర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
19 “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది” అంతేకాదు “గర్వంతో ఉబ్బిపోదు.” (1 కొరిం. 13:4) పొరుగువాళ్లకు మంచివార్తను ప్రకటిస్తూ ఉండాలంటే మనకు ఓర్పు, దయ, వినయం అవసరం. (మత్త. 28:19) సంఘంలోని సహోదరసహోదరీలందరితో కలిసిమెలిసి ఉండడానికి కూడా ఈ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి. మనందరం అలా ప్రేమగా ఉన్నప్పుడు సంఘాలన్నీ ఐక్యంగా ఉంటాయి, యెహోవాకు ఘనతను తీసుకొస్తాయి. మన మధ్య ఉన్న ఐక్యతను చూసి ఇతరులు సత్యానికి ఆకర్షితులౌతారు. కొత్త వ్యక్తిత్వం గురించి చివరిగా బైబిలు ఇలా చెప్తోంది, “వీటన్నిటికన్నా ముఖ్యంగా, ప్రేమను అలవర్చుకోండి. ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.”—కొలొ. 3:14.
‘కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండండి’
20. (ఎ) మనం ఎలాంటి ప్రశ్నల గురించి ఆలోచించాలి? ఎందుకు? (బి) మనం ఎలాంటి భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు?
20 ‘పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, దానికి దూరంగా ఉండాలంటే నేనింకా ఎలాంటి మార్పులు చేసుకోవాలి’ అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. సహాయం కోసం మనం యెహోవాకు పట్టుదలగా ప్రార్థించాలి. ‘దేవుని రాజ్యంలోకి’ వెళ్లగలిగేలా తప్పుడు ఆలోచనల్ని లేదా పనుల్ని మానుకోవడానికి కృషిచేయాలి. (గల. 5:19-21) ‘యెహోవాను సంతోషపెట్టడానికి నా ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నానా’ అని కూడా ప్రశ్నించుకోవాలి. (ఎఫె. 4:23, 24) మనం అపరిపూర్ణులం కాబట్టి, కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని దాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. భూమ్మీద ఉండే ప్రతీఒక్కరు కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, యెహోవాకున్న అద్భుతమైన లక్షణాలను చూపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి!
a బైబిలు కాలాల్లో, సిథియనులు నాగరికత తెలియనివాళ్లు అనే ఉద్దేశంతో ప్రజలు వాళ్లను చిన్నచూపు చూసేవాళ్లు.