నమ్మకంగా ఉంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం
‘విశ్వాసము చేత, ఓర్పుచేత వాగ్దానాలను స్వతంత్రించుకునేవాళ్లను పోలి నడుచుకోండి.’—హెబ్రీ. 6:11, 12.
1, 2. యెఫ్తా, అతని కూతురు ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నారు?
ఓ యువతి, వాళ్ల నాన్నను కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. అతను యుద్ధంలో ఘనవిజయం సాధించి ఇంటికి సురక్షితంగా తిరిగొచ్చినందుకు ఆమె సంతోషంగా పాటలు పాడుతూ నాట్యం చేసింది. కానీ వాళ్ల నాన్న ప్రతిస్పందనకు, అతను అన్న మాటలకు ఆమె బహుశా ఆశ్చర్యపోయుంటుంది. అతను బాధతో బట్టలు చింపుకొని బిగ్గరగా, “అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి” అని అన్నాడు. ఆ తర్వాత, అతను యెహోవాకు ఓ మాటిచ్చాడనీ, అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనీ ఆ యువతికి చెప్పాడు. తన తండ్రి యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. అయినప్పటికీ, యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని ప్రోత్సహిస్తూ ఆ అమ్మాయి వెంటనే తన తండ్రికి చక్కని జవాబు ఇచ్చింది. యెహోవా అడిగేది ఏదైనా అది తన మంచి కోసమేననే నమ్మకం ఆ అమ్మాయి ఇచ్చిన జవాబులో ఉట్టిపడింది. (న్యాయా. 11:34-37) తన కూతురి విశ్వాసాన్ని చూసి ఆ తండ్రి చాలా గర్వపడ్డాడు. ఎందుకంటే, జీవితాన్ని యెహోవాకు అంకితం చేయడానికి ఇష్టంగా ముందుకొచ్చిన తన కూతురిని చూసి యెహోవా సంతోషిస్తాడని అతనికి తెలుసు.
2 అవును యెఫ్తా, అతని కూతురు యెహోవాపై, ఆయన మార్గాలపై పూర్తి విశ్వాసం ఉంచారు. అలా ఉండడం కష్టమనిపించిన సందర్భాల్లో కూడా వాళ్లు ఆయనకు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు యెహోవా ఆమోదాన్ని పొందాలనుకున్నారు, దానికోసం వాళ్లు ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధపడ్డారు.
3. యెఫ్తా, అతని కూతురు ఉంచిన ఆదర్శం నేడు మనకెలా సహాయం చేయగలదు?
3 నిజమే, యెహోవాకు నమ్మకంగా ఉండడం అన్ని సందర్భాల్లో తేలిక కాదు. కాబట్టి మనం ‘విశ్వాసం కోసం పోరాడాలి.’ (యూదా 3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఈ విషయంలో యెఫ్తా, అతని కూతురు ఉంచిన ఆదర్శం మనకు సహాయం చేస్తుంది. వాళ్లు తమకు ఎదురైన సవాళ్లను తట్టుకుని ఎలా నమ్మకంగా ఉండగలిగారో ఈ ఆర్టికల్లో పరిశీలిద్దాం.
లోక ప్రభావాలు ఉన్నప్పటికీ నమ్మకంగా ఉండడం
4, 5. (ఎ) వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఏమని ఆజ్ఞాపించాడు? (బి) కీర్తన 106 చెప్తున్నట్లు, ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినకపోవడంవల్ల ఎలాంటి పర్యవసానాల్ని అనుభవించారు?
4 ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినకపోవడంవల్ల వచ్చిన ఫలితాల్ని యెఫ్తా, అతని కూతురు బహుశా రోజూ గుర్తుచేసుకుని ఉంటారు. సుమారు 300 సంవత్సరాల క్రితం, వాగ్దాన దేశంలో అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తున్న వాళ్లందర్నీ చంపేయమని యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్లు యెహోవా మాట వినలేదు. (ద్వితీ. 7:1-4) బదులుగా చాలామంది ఇశ్రాయేలీయులు, కనానీయుల్లా అబద్ధ ఆరాధన చేస్తూ అనైతిక జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.—కీర్తన 106:34-39 చదవండి.
5 ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినకపోవడంవల్ల, ఆయన వాళ్లను శత్రువుల చేతికి అప్పగించాడు. (న్యాయా. 2:1-3, 11-15; కీర్త. 106:40-43) అయితే యెహోవాను ప్రేమించే కుటుంబాలకు మాత్రం ఆ సంవత్సరాలన్నిటిలో నమ్మకంగా ఉండడం కష్టంగా ఉండివుండవచ్చు. అయినప్పటికీ యెఫ్తా, అతని కూతురు అలాగే ఎల్కానా, హన్నా, సమూయేలు వంటివాళ్లు నమ్మకంగా ఉన్నారని బైబిలు చెప్తుంది. ఎందుకంటే వాళ్లు యెహోవాను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నారు.—1 సమూ. 1:20-28; 2:26.
6. నేడు లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మరి మనమేమి చేయాలి?
6 మనకాలంలోని ప్రజలు కూడా ప్రాచీన కాలంలోని కనానీయుల్లానే ఆలోచిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. సెక్స్, హింస, డబ్బు ఇవే వాళ్ల ప్రపంచం. కానీ యెహోవా మనకు స్పష్టమైన హెచ్చరికల్ని ఇస్తున్నాడు. ఆయన ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయుల్ని చెడు ప్రభావాల నుండి కాపాడాలనుకున్నట్లే మనల్ని కూడా కాపాడాలనుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్ల నుండి మనం పాఠాలు నేర్చుకుంటున్నామా? (1 కొరిం. 10:6-11) అవును, లోకంలోని వాళ్లలా ఆలోచించకుండా ఉండడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. (రోమా. 12:2) మరి అలా ప్రయత్నిస్తున్నామా?
నిరుత్సాహం ఎదురైనప్పటికీ నమ్మకంగా ఉండడం
7. (ఎ) తన సొంతవాళ్ల చేతుల్లో యెఫ్తా ఎలాంటి కష్టాలు అనుభవించాడు? (బి) యెఫ్తా ఏం చేశాడు?
7 ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోవడంవల్ల యెఫ్తా కాలంలోని ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయుల చేతుల్లో అలాగే అమ్మోనీయుల చేతుల్లో అణచివేతకు గురయ్యారు. (న్యాయా. 10:7, 8) యెఫ్తా అయితే శత్రు దేశాలవల్ల మాత్రమే కాదు, అతని సొంత సహోదరులవల్ల అలాగే ఇశ్రాయేలులోని పెద్దలవల్ల కూడా కష్టాలు అనుభవించాడు. ఎందుకంటే వాళ్లు యెఫ్తా మీద అసూయతో అతన్ని ద్వేషించి అతనికి చెందిన స్వాస్థ్యం నుండి వెళ్లగొట్టారు. (న్యాయా. 11:1-3) కానీ వాళ్ల ప్రవర్తన తన మీద ప్రభావం చూపకుండా యెఫ్తా చాలా జాగ్రత్తపడ్డాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఎలాగంటే, ఇశ్రాయేలు పెద్దలు వచ్చి తమకు సహాయం చేయమని వేడుకున్నప్పుడు యెఫ్తా వాళ్లకు సహాయం చేశాడు. (న్యాయా. 11:4-8) అలా ప్రవర్తించడానికి యెఫ్తాకు ఏం సహాయం చేసివుంటుంది?
8, 9. (ఎ) ధర్మశాస్త్రంలో ఉన్న ఏ సూత్రాలు యెఫ్తాకు సహాయం చేశాయి? (బి) యెఫ్తా దేన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచాడు?
8 యెఫ్తా ఓ యుద్ధ శూరుడు పైగా అతనికి ఇశ్రాయేలీయుల చరిత్ర, మోషే ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు. యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన తీరు నుండి తప్పొప్పుల విషయంలో దేవుని ప్రమాణాలేమిటో అతను గ్రహించాడు. (న్యాయా. 11:12-27) ఆ జ్ఞానాన్ని, జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెఫ్తా ఉపయోగించాడు. కోపాన్ని, పగను యెహోవా ద్వేషిస్తున్నాడనీ, తన ప్రజలు ఒకర్నొకరు ప్రేమించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడనీ అతనికి బాగా తెలుసు. అంతేకాదు తనను ద్వేషించేవాళ్లతో సహా ఇతరులతో ఎలా ప్రవర్తించాలో ధర్మశాస్త్రం నుండి అతను నేర్చుకున్నాడు.—నిర్గమకాండము 23:5; లేవీయకాండము 19:17, 18 చదవండి.
9 బహుశా యోసేపు ఉంచిన ఆదర్శం యెఫ్తాకు సహాయం చేసివుండవచ్చు. యోసేపును అతని సహోదరులు ద్వేషించినప్పటికీ యోసేపు మాత్రం వాళ్లపై కనికరం చూపించాడు. (ఆదికాండము 37:4; 45:4, 5) బహుశా ఆ విషయం గురించి ఆలోచించడంవల్లే యెఫ్తా యెహోవాను సంతోషపెట్టేలా ప్రవర్తించి ఉంటాడు. నిజానికి తన సహోదరులు ప్రవర్తించిన తీరు యెఫ్తాను చాలా బాధపెట్టింది. కానీ అతను తన బాధ కన్నా యెహోవా నామం కోసం, ఆయన ప్రజల కోసం పోరాడడమే ప్రాముఖ్యంగా ఎంచాడు. (న్యాయా. 11:9) అతను యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ దేవుని దీవెనల్ని పొందారు.—హెబ్రీ. 11:32, 33.
10. దేవుడు ఇష్టపడేలా ప్రవర్తించడానికి బైబిలు సూత్రాలు నేడు మనకెలా సహాయం చేస్తాయి?
10 మరి యెఫ్తా ఉంచిన ఆదర్శం నుండి మనం ఏదైనా పాఠం నేర్చుకుంటామా? ఒకవేళ మన సహోదరుల వల్ల మనం నిరుత్సాహపడితే లేదా వాళ్లు మనల్ని బాధపెడితే మనమేమి చేస్తాం? ఆ బాధవల్ల మనం యెహోవాను సేవించడం మానేయకూడదు. మీటింగ్స్కు వెళ్లడం లేదా సహోదరసహోదరీలతో సమయం గడపడం ఎన్నడూ ఆపకూడదు. మనం యెఫ్తాను అనుకరిస్తూ యెహోవా మాట వింటే అలాంటి కష్ట పరిస్థితుల్ని తట్టుకోగలుగుతాం. అంతేకాదు యెఫ్తాలా ఇతరులకు మంచి ఆదర్శంగా ఉంటాం.—రోమా. 12:20, 21; కొలొ. 3:13.
ఇష్టంగా చేసే త్యాగాలు మన విశ్వాసాన్ని చాటుతాయి
11, 12. యెఫ్తా ఏమని మాటిచ్చాడు? దానర్థమేమిటి?
11 ఇశ్రాయేలీయుల్ని అమ్మోనీయుల చేతిలో నుండి విడిపించడానికి తనకు యెహోవా సహాయం అవసరమని యెఫ్తాకు తెలుసు. ఒకవేళ అమ్మోనీయుల్ని ఓడించడానికి సహాయంచేస్తే, యుద్ధం నుండి తిరిగి వెళ్లినప్పుడు తన ఇంటిలో నుండి ఎదురొచ్చే మొదటి వ్యక్తిని “దహనబలిగా” అర్పిస్తానని అతను యెహోవాకు మాటిచ్చాడు. (న్యాయా. 11:30, 31) దహనబలిగా అర్పించడమంటే ఏమిటి?
12 మనుషుల్ని బలిగా ఇవ్వడాన్ని యెహోవా అసహ్యించుకుంటాడు కాబట్టి యెఫ్తా ఓ వ్యక్తిని నిజంగా మంటల్లో వేసి బలిగా ఇస్తానని చెప్పలేదని అర్థంచేసుకోవచ్చు. (ద్వితీ. 18:9, 10) మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దహనబలిగా అర్పించేదాన్ని పూర్తిగా యెహోవాకు సమర్పించేవాళ్లు. అదేవిధంగా తనకు ఎదురయ్యే మొదటి వ్యక్తిని పూర్తిగా దేవుని సేవకు సమర్పిస్తానని అంటే ఆ వ్యక్తిని జీవితాంతం ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఇస్తానని యెఫ్తా మాటిచ్చాడు. యెహోవా యెఫ్తా మాటను అంగీకరించి అతను ఘనవిజయం సాధించేందుకు సహాయం చేశాడు. (న్యాయా. 11:32, 33) మరి యెహోవాకు “దహనబలిగా” యెఫ్తా ఎవర్ని అర్పిస్తాడు?
13, 14. న్యాయాధిపతులు 11:35 లోని యెఫ్తా మాటలు అతని విశ్వాసం గురించి ఏం చెప్తున్నాయి?
13 ఈ ఆర్టికల్లోని మొదటి పేరాలో ఉన్న సన్నివేశం గురించి ఓసారి ఆలోచించండి. యెఫ్తా యుద్ధం నుండి తిరిగొచ్చినప్పుడు అతనికి ఎదురైన మొదటి వ్యక్తి ఎవరో కాదు, అతనికి ఎంతో ఇష్టమైన ఒక్కగానొక్క కూతురే. మరి ఇప్పుడు యెఫ్తా తన మాటను నిలబెట్టుకుంటాడా? జీవితాంతం ప్రత్యక్ష గుడారంలో ఉండి యెహోవాకు సేవ చేసేందుకు తన సొంత కూతుర్ని పంపిస్తాడా?
14 సరైన నిర్ణయం తీసుకునేందుకు ధర్మశాస్త్రంలోని సూత్రాలు అతనికి మరోసారి సహాయం చేసివుంటాయి. నిర్గమకాండము 23:19 లో యెహోవాకు తన ప్రజలు శ్రేష్ఠమైనది ఇవ్వాలని ఉన్న మాటలు అతను బహుశా గుర్తుచేసుకుని ఉండవచ్చు. అంతేకాదు ఓ వ్యక్తి యెహోవాకు ఏదైనా మాటిస్తే “అతడు తన మాట తప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను” అని కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. (సంఖ్యా. 30:2) నమ్మకస్థురాలైన హన్నా బహుశా యెఫ్తా జీవించిన కాలంలోనే జీవించి ఉంటుంది. ఆమెలానే యెఫ్తా కూడా అతని మాటను నిలబెట్టుకోవాలి. దానివల్ల తనూ, తన కూతురూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అతనికి తెలుసు. తన కూతురు ప్రత్యక్ష గుడారంలో సేవచేస్తే ఆమెకు ఎప్పటికీ పిల్లలు ఉండరు. అంటే యెఫ్తా వంశాన్ని నిలబెట్టి, స్వాస్థ్యాన్ని వారసత్వంగా పొందడానికి ఎవ్వరూ ఉండరు. (న్యాయా. 11:34) అయినప్పటికీ యెఫ్తా నమ్మకంగా ఇలా అన్నాడు, ‘నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక వెనుకతీయలేను.’ (న్యాయా. 11:35) యెఫ్తా చేసిన ఆ పెద్ద త్యాగాన్ని యెహోవా అంగీకరించి అతన్ని దీవించాడు. ఒకవేళ యెఫ్తా స్థానంలో మీరే ఉంటే అలానే చేసివుండేవాళ్లా?
15. మనలో చాలామందిమి ఏమని మాటిచ్చాం? మనం నమ్మకంగా ఉన్నామని ఎలా చూపించవచ్చు?
15 మనం యెహోవా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఏది ఏమైనాసరే ఆయన చిత్తం చేస్తామని ఆయనకు మాటిచ్చాం. అయితే ఆ మాటను నిలబెట్టుకోవడం ఎప్పుడూ తేలికగా ఉండదని మనకు తెలుసు. కానీ మనకు ఇష్టంలేని దేన్నైనా చేయమని ఎవరైనా చెప్తే మనమేమి చేస్తాం? మన భయాల్ని అధిగమించి ఇష్టంగా దేవుని మాట వింటే మనం ఆయనకిచ్చిన మాటకు కట్టుబడిన వాళ్లమౌతాం. త్యాగాలు చేయడం కష్టమే కానీ అలా చేస్తే అంతకన్నా గొప్పవైన దేవుని దీవెనలు పొందుతాం. (మలా. 3:10) ఇంతకీ యెఫ్తా కూతురు సంగతేంటి? తన తండ్రి ఇచ్చిన మాటకు ఆమె ఎలా స్పందించింది?
16. తన తండ్రి యెహోవాకు ఇచ్చిన మాటకు యెఫ్తా కూతురు ఎలా స్పందించింది? (ప్రారంభ చిత్రం చూడండి.)
16 యెహోవాకు యెఫ్తా ఇచ్చిన మాట హన్నా లాంటిదికాదు. హన్నా తన కొడుకు సమూయేలును ప్రత్యక్ష గుడారంలో నాజీరుగా సేవ చేసేందుకు ఇస్తానని మాటిచ్చింది. (1 సమూ. 1:11) నాజీరుగా సేవచేసే వ్యక్తి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనవచ్చు. కానీ యెఫ్తా తన కూతూర్ని పూర్తి “దహనబలిగా” ఇచ్చాడు. అంటే ఓ భార్యగా, తల్లిగా ఉండడంవల్ల కలిగే ఆనందాన్ని ఆమె అనుభవించలేదు. (న్యాయా. 11:37-40) ఒక్కసారి ఆలోచించండి. ఆమె తండ్రి ఇశ్రాయేలులో నాయకుడు కాబట్టి ఆ దేశంలో ఉన్న ఓ చక్కని వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ప్రత్యక్ష గుడారంలో ఓ సేవకురాలిగా పనిచేయాలి. దానికి ఆ యువతి ఎలా స్పందించింది? ఆమె తన తండ్రితో, “నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము” అని చెప్పడం ద్వారా తనకు యెహోవా సేవ చేయడమే అన్నిటికన్నా ముఖ్యమని చూపించింది. (న్యాయా. 11:36) సహజంగా ఓ అమ్మాయి తనకు భర్త, పిల్లలు ఉండాలని ఆశపడుతుంది. కానీ అలాంటి కోరికల్ని ఆమె త్యాగం చేసింది. ఆమెలాంటి స్ఫూర్తిని మనమెలా చూపించవచ్చు?
17. (ఎ) యెఫ్తా, అతని కూతురి విశ్వాసాన్ని మనమెలా అనుకరించవచ్చు? (బి) దేవుని సేవ కోసం త్యాగాలు చేసేలా హెబ్రీయులు 6:10-12లోని వచనాలు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయి?
17 వేలమంది యౌవన స్త్రీపురుషులు, యెహోవా సేవను మరింత ఎక్కువగా చేసేలా కనీసం కొంతకాలం వరకైనా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు లేదా పిల్లల్ని వద్దనుకుంటున్నారు. అంతేకాదు వయసుపైబడిన వాళ్లలో చాలామంది తమ పిల్లలతో లేదా మనవళ్లతో గడిపే సమయాన్ని త్యాగంచేసి ఆ సమయాన్ని, శక్తిని యెహోవా సేవకు ఉపయోగిస్తున్నారు. వాళ్లలో కొంతమంది నిర్మాణ పనుల్లో సహాయం చేస్తున్నారు, ఇంకొంతమంది రాజ్య సువార్తికుల కోసం పాఠశాలలో శిక్షణ తీసుకుని ప్రచారకుల అవసరం ఎక్కువున్న సంఘాలకు వెళ్లిపోతున్నారు. మరికొంతమంది, జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువ సమయం పరిచర్యలో గడిపేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నమ్మకమైన సేవకులు ప్రేమతో చేసే త్యాగాలను యెహోవా ఎప్పటికీ మర్చిపోడు. (హెబ్రీయులు 6:10-12 చదవండి.) మరి మీ విషయమేమిటి? యెహోవా సేవలో మరింత ఎక్కువ సమయం గడిపేందుకు అవసరమైన త్యాగాలు చేయగలరా?
మనం నేర్చుకున్న పాఠాలు
18, 19. యెఫ్తా, అతని కూతురు గురించి బైబిలు చెప్తున్న వాటినుండి మనమేమి నేర్చుకున్నాం? వాళ్లను మనమెలా అనుకరించవచ్చు?
18 యెఫ్తా తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను ఎలా తట్టుకోగలిగాడు? అతను తన నిర్ణయాలన్నిటిలో యెహోవా నడిపింపును తీసుకున్నాడు. చుట్టూ ఉన్న ప్రజల ప్రభావం తనపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులు బాధపెట్టినప్పుడు కూడా యెఫ్తా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. యెఫ్తా, అతని కూతురు ఇష్టంగా చేసిన త్యాగాలను చూసి యెహోవా వాళ్లను దీవించాడు. అంతేకాదు, సత్యారాధనను వృద్ధి చేయడానికి ఆయన వాళ్లిద్దర్నీ ఉపయోగించుకున్నాడు. వేరేవాళ్లు సరైనది చేయడం మానేసినప్పుడు కూడా యెఫ్తా, అతని కూతురు యెహోవాకు నమ్మకంగా ఉన్నారు.
19 అయితే బైబిలు ఇలా చెప్తోంది, ‘విశ్వాసము చేత, ఓర్పుచేత వాగ్దానాలను స్వతంత్రించుకునే వాళ్లను పోలి నడుచుకోండి.’ (హెబ్రీ. 6:11, 12) కాబట్టి మనం యెఫ్తాను, అతని కూతురును అనుకరిస్తూ యెహోవాకు నమ్మకంగా ఉందాం. అలా ఉంటే యెహోవా దీవెనల్ని పొందుతాం.