మీకిది తెలుసా?
ప్రాచీన కాలాల్లో ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు మంటను ఎలా తీసుకెళ్లేవాళ్లు?
అబ్రాహాము తన ఇంటి నుండి చాలా దూరం ప్రయాణించి బలి అర్పించాలని యెహోవా చెప్పడాన్ని ఆదికాండము 22వ అధ్యాయంలో చదువుతాం. ‘దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళ్లారు. వాళ్లిద్దరూ కలిసి వెళ్లారు’ అని బైబిలు చెప్తుంది.—ఆది. 22:6.
ప్రాచీన కాలాల్లో ప్రజలు మంటను ఎలా వెలిగించేవాళ్లో బైబిలు చెప్పట్లేదు. అయితే అబ్రాహాము, ఇస్సాకు మంటను వెలిగించి దాన్ని తమతోపాటు తీసుకెళ్లివుంటారా? ఓ బైబిలు వ్యాఖ్యాత ఏమి చెప్తున్నాడంటే, ఒకవేళ వాళ్లు వెలిగించిన మంటను తీసుకెళ్లివుంటే అది “తమ సుదూర ప్రయాణమంతటిలో మండుతూ ఉండకపోవచ్చు.” కాబట్టి అబ్రాహాము, అతని కొడుకు బహుశా మంటను వెలిగించడానికి కావాల్సినవన్నీ తమతోపాటు తీసుకెళ్లివుండవచ్చు.
అయితే ఆ కాలాల్లో మంటను వెలిగించడం అంత సులభం కాదని కొంతమంది చెప్తారు. కాబట్టి వీలైనప్పుడల్లా ప్రజలు అప్పటికే మండుతున్న మంటనుండి, బహుశా ఇరుగుపొరుగు వాళ్ల దగ్గర నుండి నిప్పుల్ని తీసుకుని మంటను వెలిగించేవాళ్లు. అబ్రాహాము తన ప్రయాణాన్ని మొదలుపెట్టకముందే మంటనుండి వేడి నిప్పుల్ని తీసుకెళ్లివుంటాడని చాలామంది విద్వాంసులు నమ్ముతారు. వాటిని అతను ఒక పాత్రలో, బహుశా గొలుసుకు కట్టివున్న కుండలో పెట్టి, ఆ కుండను తమతోపాటు తీసుకెళ్లివుండవచ్చు. (యెష. 30:14) ఆ తర్వాత అవసరమైనప్పుడు మంటను వెలిగించడానికి ఆ నిప్పుల్ని, కట్టెల్ని ఉపయోగించివుంటాడు.