మీకు తెలుసా?
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారనడానికి బైబిలు వృత్తాంతాలు కాకుండా ఇంకేవైనా ఆధారాలు ఉన్నాయా?
మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లిన తర్వాత ఆయన తండ్రియైన యాకోబు, మిగతా కుటుంబ సభ్యులు కనాను నుండి ఐగుప్తుకు వెళ్లిపోయారని బైబిలు చెప్తోంది. వాళ్లు ఐగుప్తులో, నైలు డెల్టా ప్రాంతమైన గోషెనులో స్థిరపడ్డారు. (ఆది. 47:1, 6) ఇశ్రాయేలీయుల “సంఖ్య అసాధారణ రీతిలో పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ వచ్చారు.” కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు భయపడి వాళ్లను బానిసలుగా చేసుకున్నారు.—నిర్గ. 1:7-14.
ఆ బైబిలు వృత్తాంతం ఒక కట్టుకథని కొంతమంది ఆధునికకాల విమర్శకులు కొట్టిపడేస్తారు. కానీ, షేమీయులు a ప్రాచీన ఐగుప్తులో బానిసలుగా జీవించారనడానికి ఆధారాలు ఉన్నాయి.
ఉదాహరణకు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఉత్తర ఐగుప్తులో తవ్వకాలు జరిపినప్పుడు ప్రాచీనకాలంలో అక్కడ స్థిరపడ్డవాళ్ల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఉత్తర ఐగుప్తులో, 20 లేదా అంతకన్నా ఎక్కువ షేమీయుల గుంపులు స్థిరపడ్డారు అనడానికి ఆధారాలు ఉన్నాయని డాక్టర్ జాన్ బిమ్సన్ చెప్పారు. ఐగుప్తు మీద పరిశోధన చేస్తున్న జేమ్స్ కె. హాఫ్‌మయ్యర్ కూడా ఏం చెప్తున్నాడంటే, “సుమారు క్రీ.పూ. 1800 నుండి క్రీ.పూ. 1540 వరకు పశ్చిమ ఆసియాకు చెందిన షేమీయుల భాష మాట్లాడే ప్రజలు వలస వెళ్లడానికి ఐగుప్తు ఒక అనువైన స్థలంగా ఉండేది.” ఆ కాలం, అలాగే ఇశ్రాయేలీయుల పూర్వీకులు జీవించిన కాలం ఒకటే, కాబట్టి ఆదికాండంలో ప్రస్తావించబడిన కాలానికి, పరిస్థితులకు అది సరిగ్గా సరిపోతుందని ఆయన చెప్తున్నాడు.
దక్షిణ ఐగుప్తులో కూడా మరో ఆధారం దొరికింది. దాదాపు క్రీ.పూ. 2000 నుండి క్రీ.పూ. 1600 కాలానికి చెందిన ఒక పపైరస్ ప్రతిలో, దక్షిణ ఐగుప్తులోని ఒక ఇంట్లో పనిచేసిన బానిసల పేర్లు కనిపించాయి. వాటిలో 40 కన్నా ఎక్కువ పేర్లు షేమీయులవే. బానిసలు లేదా సేవకులైన వీళ్లు వంటవాళ్లుగా, చేనేతకారులుగా, దాసులుగా పనిచేశారు. హాఫ్‌మయ్యర్ ఇలా అంటున్నాడు, “[దక్షిణ ఐగుప్తులోని] తీబైడ్‌లో ఒక్క ఇంట్లోనే నలభై కన్నా ఎక్కువమంది షేమీయులు పనిచేశారంటే, ఐగుప్తు అంతటా ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో ఇంకా ఎక్కువమంది షేమీయులే ఉండివుంటారు.”
పురావస్తు శాస్త్రజ్ఞుడైన డేవిడ్ రోల్ పపైరస్ ప్రతిలో ఒక చోట రాయబడిన కొంతమంది బానిసల పేర్లు, అచ్చం బైబిల్లో మనం చదివే పేర్లలా ఉన్నాయని రాశాడు. ఉదాహరణకు ఇశ్శాఖారు, ఆషేరు, షిఫ్రా లాంటి పేర్లు అందులో ఉన్నాయి. (నిర్గ. 1:3, 4, 15) రోల్ చివరికి ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారనడానికి ఇదే నిజమైన ఆధారం.”
డాక్టర్ బిమ్సన్ ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండడం, అక్కడ నుండి బయటికి రావడం గురించిన బైబిలు వృత్తాంతాలకు ఖచ్చితమైన చారిత్రక రుజువులు ఉన్నాయి.”
a షేమీయులు అనే పేరు నోవహు కుమారుడైన షేము నుండి వచ్చింది. ఏలామీయులు, అష్షూరీయులు, తొలి కల్దీయులు, హెబ్రీయులు, సిరియన్లు, వివిధ అరేబియన్ తెగలకు చెందినవాళ్లు షేము వంశస్థులు అయ్యుండవచ్చు.