శాంతి—దాన్నెలా పొందవచ్చు?
కష్టాలతో నిండివున్న లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి శాంతిని పొందాలంటే ఎంతో కృషిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు కొంతమేరకు శాంతి ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది. మరి శాశ్వతకాలం ఉండే నిజమైన శాంతిని పొందాలంటే ఏమి చేయాలని బైబిలు చెప్తుంది? ఇతరులు కూడా అలాంటి శాంతిని పొందడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
నిజమైన శాంతిని పొందాలంటే ఏమి చేయాలి?
మనం నిజమైన శాంతిని పొందాలంటే భద్రతను, మానసిక ప్రశాంతతను కలిగివుండాలి. అంతేకాదు ఇతరులతో సన్నిహిత స్నేహాలు పెంచుకోవాలి. ముఖ్యంగా దేవునితో సన్నిహిత స్నేహం ఏర్పర్చుకోవాలి. వాటిని ఎలా చేయవచ్చు?
యెహోవా పెట్టిన నీతి సూత్రాల్ని, ఆజ్ఞల్ని పాటించినప్పుడు ఆయనపట్ల మనకు నమ్మకం ఉందనీ, ఆయనతో శాంతియుత సంబంధాన్ని కోరుకుంటున్నామనీ చూపిస్తాం. (యిర్మీ. 17:7, 8; యాకో. 2:22, 23) అప్పుడు యెహోవా మనకు దగ్గరౌతాడు, హృదయ లోతుల్లో ప్రశాంతతను కలిగివుండేలా దీవిస్తాడు. యెషయా 32:17 లో ఇలా ఉంది, “నీతి సమాధానము [శాంతిని, NW] కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.” మనం హృదయపూర్వకంగా యెహోవాకు లోబడితే నిజమైన శాంతిని పొందుతాం.—యెష. 48:18, 19.
మన పరలోక తండ్రైన యెహోవా ఇచ్చిన అద్భుతమైన బహుమానం పవిత్రశక్తి. దాని సహాయంతో మనం శాశ్వతకాలం ఉండే శాంతిని పొందవచ్చు.—అపొ. 9:31.
పవిత్రశక్తి శాంతిని ఇస్తుంది
“పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే” లక్షణాల్లో మూడవది శాంతి అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (గల. 5:22, 23) కాబట్టి నిజమైన శాంతిని పొందాలంటే పవిత్రశక్తి నిర్దేశానికి లోబడాలి. మనం శాంతిని పొందడానికి పవిత్రశక్తి సహాయం చేసే రెండు మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
కీర్త. 1:2, 3) చదివినవాటిని ధ్యానించినప్పుడు, చాలా విషయాల్లో యెహోవా ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకునేలా పవిత్రశక్తి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ఆయన శాంతిగా ఎలా ఉంటున్నాడో, శాంతిని ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడో అర్థంచేసుకుంటాం. బైబిల్లో చదివినవాటిని పాటించినప్పుడు, మనం మరింత శాంతిని పొందవచ్చు.—సామె. 3:1, 2.
మొదటిగా, పవిత్రశక్తి ప్రేరణతో రాయబడిన బైబిల్ని క్రమంగా చదవడం వల్ల శాంతిని పొందవచ్చు. (రెండవదిగా, దేవుని పవిత్రశక్తి కోసం ప్రార్థించాలి. (లూకా 11:13) సహాయం కోసం తనవైపు చూసినప్పుడు, “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది” అని యెహోవా మాటిస్తున్నాడు. (ఫిలి. 4:6, 7) మనం క్రమంగా ప్రార్థిస్తూ పవిత్రశక్తి కోసం అడిగినప్పుడు హృదయలోతుల్లో ఉండే ప్రశాంతతను లేదా శాంతిని ఆయన మనకిస్తాడు. అది ఆయన సన్నిహిత స్నేహితులు మాత్రమే పొందగలరు.—రోమా. 15:13.
కొంతమంది ఈ లేఖనాధార సలహాను పాటించి తమ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకున్నారు. దానివల్ల శాశ్వతకాలం ఉండే శాంతిని అనుభవించగలిగారు. యెహోవాతో, ఇతరులతో శాంతియుతమైన సంబంధాన్ని కూడా కలిగివుండగలిగారు. ఎలా?
శాశ్వతకాలం ఉండే శాంతిని ఎలా అనుభవించగలిగారు?
నేడు క్రైస్తవ సంఘాల్లో ఉన్న కొంతమంది ఒకప్పుడు ‘కోపిష్ఠులుగా’ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆలోచనా పరులుగా, దయగా, ఓపిగ్గా, శాంతిగా ఉంటున్నారు. a (సామె. 29:22) మన సహోదరసహోదరీల్లో ఇద్దరు తమ కోపాన్ని విడిచిపెట్టి, ఇతరులతో ఎలా శాంతిగా ఉండగలుగుతున్నారో పరిశీలించండి.
డేవిడ్‌కు దురుసుగా మాట్లాడే అలవాటు ఉండేది. దేవునికి సమర్పించుకోవడానికి ముందు ఆయన ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేవాడు, తన కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడేవాడు. కానీ తన స్వభావం మార్చుకుని, శాంతిగా ఉండాలని కొంతకాలానికి ఆయన గుర్తించాడు. మరి శాంతిగా ఉండడం ఎలా నేర్చుకున్నాడు? ఆయన ఇలా చెప్పాడు, “నేను బైబిలు సూత్రాల్ని పాటించడం మొదలుపెట్టాను. ఫలితంగా నా కుటుంబసభ్యుల పట్ల నాకు గౌరవం పెరిగింది, వాళ్లూ నన్ను గౌరవించడం మొదలుపెట్టారు.”
రేచెల్ పెరిగిన విధానం బట్టి కోపిష్ఠిగా మారింది. ఆమె ఇలా ఒప్పుకుంటుంది, “మా ఇంట్లో వాళ్లందరికీ కోపం ఎక్కువ. నేను వాళ్లమధ్యే పెరిగాను కాబట్టి
ఇప్పటికీ కోపం వస్తూనే ఉంటుంది.” ఆమె శాంతిగా మారడానికి ఏది సహాయం చేసింది? “సహాయం కోసం యెహోవాకు క్రమంగా ప్రార్థించేదాన్ని” అని ఆమె చెప్పింది.బైబిలు సూత్రాలు పాటించి, దేవుని పవిత్రశక్తి కోసం అడిగినప్పుడు శాంతిని పొందవచ్చని చెప్పడానికి డేవిడ్, రేచెల్ కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. దీన్నిబట్టి ఈ దుష్టలోకంలో కూడా, మన కుటుంబసభ్యులతో అలాగే తోటి సహోదరసహోదరీలతో మంచి సంబంధాలు కలిగివుండడానికి కావాల్సిన శాంతిని పొందవచ్చని స్పష్టంగా అర్థమౌతుంది. అయితే, “మనుషులందరితో శాంతిగా మెలగండి” అని యెహోవా చెప్తున్నాడు. (రోమా. 12:18) అది సాధ్యమేనా? ఇతరులతో శాంతిగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇతరులతో శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి
ప్రీచింగ్ చేయడం ద్వారా, దేవుని రాజ్యం గురించి శాంతియుతమైన సందేశం నుండి ప్రయోజనం పొందమని ప్రజల్ని ఆహ్వానిస్తాం. (యెష. 9:6, 7; మత్త. 24:14) సంతోషకరంగా చాలామంది దానికి స్పందించారు. ఫలితంగా, లోకంలో జరుగుతున్న వాటిని చూసి వాళ్లు నిరాశపడట్లేదు లేదా కోపగించుకోవట్లేదు. బదులుగా, భవిష్యత్తు విషయంలో ఒక వాస్తవమైన నిరీక్షణతో ఉంటున్నారు. అంతేకాదు ‘శాంతిని వెదికి, దాన్ని వెంటాడండి’ అనే మాటల్ని పాటిస్తున్నారు.—కీర్త. 34:14, NW.
అయితే మనం ప్రకటించే సందేశానికి అందరూ చక్కగా స్పందించకపోవచ్చు లేదా మొదట్లో కాస్త వ్యతిరేకించవచ్చు. (యోహా. 3:19) అయినప్పటికీ శాంతియుతంగా, మర్యాదపూర్వకంగా మంచివార్త ప్రకటించేలా పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా, మత్తయి 10:11-13లో పరిచర్యకు సంబంధించి యేసు ఇచ్చిన నిర్దేశాల్ని పాటించిన వాళ్లమౌతాం. ఆ వచనాల్లో యేసు ఈ సలహా ఇచ్చాడు, “మీరు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోవాళ్లను పలకరించి, వాళ్లకు శాంతి ఉండాలని చెప్పండి. వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తే, వాళ్లకు ఆ శాంతి ఉంటుంది; కానీ వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించకపోతే, మీ శాంతి మీ దగ్గరే ఉంటుంది.” యేసు ఇచ్చిన సలహాను పాటిస్తే అక్కడినుండి ప్రశాంతంగా వచ్చేస్తాం, ఇంకోసారి కలిసినప్పుడైనా వింటారనే ఆశతో ఉంటాం.
ప్రభుత్వ అధికారులతో ఆఖరికి మన పనిని వ్యతిరేకించే అధికారులతో కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరించినప్పుడు శాంతిని పెంపొందించిన వాళ్లమౌతాం. ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఒక దేశ ప్రభుత్వం రాజ్యమందిరాలు నిర్మించే పనికి అనుమతి ఇవ్వకుండా వివక్ష చూపించింది. ఆ సమస్యను పరిష్కరించడానికి, సంస్థ ఒక సహోదరుణ్ణి నియమించింది. ఆయన ఒకప్పుడు ఆ దేశంలో మిషనరీగా సేవచేశాడు. లండన్‌లో ఆ దేశ రాయబారి ఉన్న కార్యాలయానికి సహోదరుడు వెళ్లాడు. ఆఫ్రికాలో యెహోవాసాక్షులు శాంతియుతంగా చేస్తున్న పని గురించి చెప్పడానికి ఆ సహోదరుడు వెళ్లాడు. ఫలితమేమిటి?
ఆ సహోదరుడు ఇలా చెప్పాడు, “నేను రిసెప్షన్ దగ్గరకు వెళ్లినప్పుడు, అక్కడ కూర్చున్న ఆవిడ వేసుకున్న బట్టల్ని బట్టి ఆమె ఏ తెగకు చెందినదో అర్థమైంది. వాళ్ల భాష నాకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని వాళ్ల మాతృభాషలో పలకరించాను. దానికి ఆమె ఆశ్చర్యపోయి, ‘మీరు ఎవర్ని కలవడానికి వచ్చారు?’ అని నన్ను అడిగింది. రాయబారిని కలవడానికి వచ్చానని గౌరవపూర్వకంగా చెప్పాను. ఆమె ఆ అధికారికి ఫోన్ చేసింది, ఆయన బయటకు వచ్చి వాళ్ల భాషలో నన్ను పలకరించాడు. ఆ తర్వాత, యెహోవాసాక్షులు శాంతియుతంగా చేస్తున్న పని గురించి నేను వివరించినప్పుడు ఆయన శ్రద్ధగా విన్నాడు.”
ఆ సహోదరుడు మర్యాదపూర్వకంగా ఇచ్చిన వివరణ బట్టి, మన పనిపట్ల ఆ అధికారికి ఉన్న తప్పుడు అభిప్రాయం, వివక్ష పోయాయి. కొంతకాలానికి, మన నిర్మాణ పనులపై విధించిన ఆంక్షల్ని ప్రభుత్వం తొలగించింది. ఆ సమస్య శాంతియుతంగా పరిష్కారమైనప్పుడు మన సహోదరులు ఎంత సంతోషించివుంటారో కదా! అవును, ఇతరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆఖరికి శాంతిని కూడా పొందవచ్చు.
శాశ్వతకాలం శాంతిని అనుభవించండి
నేడు యెహోవా ప్రజలు నిజమైన శాంతిని ఆనందిస్తున్నారు. పవిత్రశక్తి పుట్టించే ఈ లక్షణాన్ని కలిగివుండడానికి కృషిచేసినప్పుడు మీరు ఆ శాంతిని మరింత పెంచవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా ఆమోదాన్ని పొందవచ్చు, ఆయన తీసుకొచ్చే కొత్తలోకంలో శాశ్వతకాలం ఉండే శాంతిని సమృద్ధిగా పొందవచ్చు.—2 పేతు. 3:13, 14.
a పవిత్రశక్తి పుట్టించే లక్షణాల గురించి చర్చించే ఆర్టికల్స్‌లో త్వరలో దయ గురించి చూస్తాం.