కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పేరేంటి?

దేవుని పేరేంటి?

ఎవరి గురించైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం ముందు వాళ్లను “మీ పేరేంటి?” అని అడగాలనుకుంటాం. అదే ప్రశ్నను మీరు దేవున్ని అడిగితే ఆయన ఏమి చెప్తాడు?

“యెహోవాను నేనే; ఇదే నా నామము.”యెషయా 42:8.

మీకు ఆ పేరు కొత్తగా ఉందా? అలా ఎందుకు ఉందంటే, చాలామంది బైబిలు అనువాదకులు దేవుని పేరును చాలా తక్కువగా ఉపయోగించారు. ఆ పేరుకు బదులు ఎక్కువగా “ప్రభువు” అని వాడారు. అయినప్పటికీ, బైబిలు మూల భాష ప్రతుల్లో దేవుని పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. ఆ పేరులో నాలుగు హెబ్రీ హల్లులు ఉంటాయి. అవి YHWHతో లేదా JHVHతో సమానం. చారిత్రకంగా ఇంగ్లీషులో “జెహోవా” అని పెట్టారు.

మృత సముద్రం కీర్తనల గ్రంథపు చుట్ట క్రీ.శ. మొదటి శతాబ్దం, హీబ్రూ

టిండేల్‌ అనువాదం 1530, ఇంగ్లీషు

రేనా వలెరా అనువాదం 1602, స్పానిష్‌

యూనియన్‌ వర్షన్‌ 1919, చైనీస్‌

దేవుని పేరు హెబ్రీ భాషలో ఉన్న బైబిలు అంతటిలో, ఇంకా ఎన్నో అనువాదాల్లో కనిపిస్తుంది

దేవుని పేరు ఎందుకు ముఖ్యం

దేవునికి స్వయంగా ఆ పేరు చాలా ముఖ్యం. దేవునికి ఎవరూ ఆ పేరు ఇవ్వలేదు. ఆయనే తనకోసం ఆ పేరును ఎంచుకున్నాడు. యెహోవా ఇలా ప్రకటించాడు: “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” (నిర్గమకాండము 3:15) బైబిల్లో దేవుని పేరు ఆయన బిరుదులైన సర్వశక్తిమంతుడు, తండ్రి, ప్రభువు లేదా దేవుడు లాంటి పదాలకన్నా ఎక్కువసార్లు వస్తుంది. అంతేకాదు అబ్రాహాము, మోషే, దావీదు, యేసు లాంటి పేర్లుకన్నా ఎక్కువసార్లు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయన పేరు అందరికీ తెలియాలనేది యెహోవా ఇష్టం. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వ లోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”—కీర్తన 83:18.

యేసుకు ఆ పేరు ముఖ్యం. తండ్రి ప్రార్థన లేదా ప్రభువు ప్రార్థన అని పిలవబడే ప్రార్థనలో దేవున్ని ఇలా అడగమని యేసు తన అనుచరులకు నేర్పించాడు: “నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్తయి 6:9) యేసు స్వయంగా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” (యోహాను 12:28) దేవుని పేరును పవిత్రపర్చడాన్ని యేసు తన జీవితంలో ముఖ్యమైన పనిగా చేసుకున్నాడు, అందుకే ఆయన ప్రార్థనలో ఇలా చెప్పగలిగాడు: “నీ పేరును నేను వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”—యోహాను 17:26.

దేవుని గురించి తెలిసినవాళ్లకు ఆ పేరు ముఖ్యం. పూర్వం దేవుని ప్రజల కాపుదల, రక్షణ దేవుని సాటిలేని పేరుతో ముడిపడి ఉన్నాయని వాళ్లు అర్థం చేసుకున్నారు. “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.” (సామెతలు 18:10) “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) దేవున్ని సేవించేవాళ్లను ప్రత్యేకపర్చేది ఆయన పేరే అని బైబిలు చూపిస్తుంది. “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”—మీకా 4:5; అపొస్తలుల కార్యాలు 15:14.

ఆ పేరు ఏమి చూపిస్తుంది

దేవుని పేరు ఆయన్ని ప్రత్యేకపరుస్తుంది. యెహోవా అనే పేరుకు “తానే కర్త అవుతాడు” అనే అర్థం వస్తుంది అని చాలామంది పండితులు అంటారు. మోషేతో మాట్లాడినప్పుడు తన గురించి చెప్తూ యెహోవా దేవుడు తన పేరుకున్న అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయం చేశాడు: నేను ఉన్నవాడను అను వాడనై యున్నాను. (నిర్గమకాండము 3:14) అంటే దేవుని పేరు సృష్టికర్తగా ఆయన అన్నిటినీ సృష్టించాడు అని మాత్రమే చెప్పడం లేదు, అంతకన్నా ఎక్కువే చెప్తుంది. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తనను, తన సృష్టిని కూడా ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా చేయగలిగిన ఆయన సామర్థ్యాన్ని ఆ పేరు చూపిస్తుంది. ఆయన బిరుదులు ఆయన స్థానాన్ని, అధికారాన్ని, శక్తిని వర్ణిస్తాయి, కానీ యెహోవా అనే ఆయన పేరు మాత్రమే పూర్తిగా ఆయన ఎలాంటివాడు, ఆయన ఎలా అవ్వగలడు అని చూపిస్తుంది.

దేవుని పేరు ఆయనకు మనమీద ఉన్న ఆసక్తిని చూపిస్తుంది. దేవుని పేరుకున్న అర్థం తన సృష్టితో ఆయనకున్న వీడని బంధాన్ని చూపిస్తుంది. అందులో మనం కూడా ఉన్నాం. అంతేకాదు, దేవుడు మనకు ఆయన పేరును తెలియచేశాడనే వాస్తవమే మనం ఆయన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని చూపిస్తుంది. ఎంతైనా మనకు అడగాలని తెలియకముందే, ఆయనే మనకు తన పేరు చెప్పడానికి చొరవ తీసుకున్నాడు. ఖచ్చితంగా మనం ఆయన్ని అర్థం కాని, ఎక్కడో ఉండే దేవునిగా కాకుండా, మనం దగ్గర అవ్వగల నిజమైన వ్యక్తిగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు.—కీర్తన 73:28.

దేవుని పేరు ఉపయోగించినప్పుడు, మనకు ఆయన మీదున్న ఇష్టం కనపడుతుంది. ఆలోచించండి, మీరు స్నేహం చేయాలని అనుకుంటున్న వాళ్లకు మీ పేరు చెప్పి మిమ్మల్ని మీ పేరుతో పిలవమన్నారు. కానీ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మీ పేరును ఉపయోగించడానికి ఒప్పుకోకపోతే మీకు ఎలా ఉంటుంది? కొంతకాలానికి అసలు అతనికి మీతో ఉండడం ఇష్టమేనా అని మీకు అనిపించవచ్చు. దేవుని విషయంలో కూడా అంతే. యెహోవా మనుషులకు ఆయన పేరును చెప్పాడు, దాన్ని ఉపయోగించమని కోరుకున్నాడు. మనం అలా ఉపయోగిస్తే, మనం ఆయనకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నట్లు యెహోవాకు చూపిస్తాం. అంతేకాదు, “ఆయన నామమును స్మరించుచు” ఉండేవాళ్లను ఆయన గమనిస్తూ ఉంటాడు కూడా.—మలాకీ 3:16.

దేవున్ని తెలుసుకోవడానికి ఆయన పేరును తెలుసుకోవడం మొదటి మెట్టు. కానీ మనం అక్కడితో ఆగిపోకూడదు. ఆ పేరు వెనకున్న వ్యక్తిని తెలుసుకోవాలి. ఆయన ఎలాంటివాడో తెలుసుకోవాలి.

దేవుని పేరేంటి? దేవుని పేరు యెహోవా. ఆ పేరు ఆయన్ని ప్రత్యేకంగా, తన సంకల్పాన్ని నెరవేర్చగల వ్యక్తిగా గుర్తిస్తుంది