మన సృష్టికర్త ఇచ్చే దీవెనల్ని శాశ్వతకాలం ఆనందించండి
ప్రవక్త అయిన అబ్రాహాము వంశస్థుల్లో ఒకరి వల్ల “అన్నిదేశాల ప్రజలు” దీవెనలు పొందుతారని దేవుడు మాటిచ్చాడు. (ఆదికాండం 22:18) ఆ వ్యక్తి ఎవరు?
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, దేవుడు అబ్రాహాము వంశస్థుడైన యేసుకు గొప్ప అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు. దేవుడు అబ్రాహాముకు మాటిచ్చిన దీవెనలను, అన్నిదేశాల ప్రజలు యేసు ద్వారా పొందుతారని ఆ అద్భుతాలు చూపించాయి.—గలతీయులు 3:14.
ఆయన చేసిన అద్భుతాలు, మనుషులకు దీవెనల్ని ఇవ్వడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి యేసేనని ప్రజలు గుర్తించడానికి సహాయం చేశాయి. అంతేకాదు, మనుషులు శాశ్వతకాలం ఆనందించే దీవెనల్ని ఇవ్వడానికి దేవుడు ఆయన్ని ఎలా ఉపయోగించుకుంటాడో కూడా ఆ అద్భుతాలు స్పష్టం చేశాయి. యేసుకున్న మంచి లక్షణాల్లో కొన్నింటిని తెలుసుకోవడానికి ఆయన చేసిన అద్భుతాలు సహాయం చేస్తాయి.
జాలి—యేసు రోగుల్ని బాగుచేశాడు.
ఒకసారి, ఒక కుష్ఠురోగి తనను బాగుచేయమని యేసును వేడుకున్నాడు. అప్పుడు యేసు అతన్ని ముట్టుకొని, “నాకు ఇష్టమే!” అన్నాడు. వెంటనే అతనికున్న కుష్ఠురోగం నయమైపోయింది.—మార్కు 1:40-42.
ఉదార గుణం—యేసు ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు.
ప్రజలు ఆకలితో అలమటించడం యేసుకు ఇష్టం లేదు. ఆయన ఒకటికన్నా ఎక్కువ సందర్భాల్లో కొన్ని రొట్టెలతో, కొన్ని చిన్న చేపలతో వేలమందికి అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. (మత్తయి 14:17-21; 15:32-38) వాళ్లందరూ తృప్తిగా తిన్న తర్వాత కూడా ఇంకా చాలా ఆహారం మిగిలింది.
కనికరం—యేసు చనిపోయినవాళ్లను బ్రతికించాడు.
ఒక విధవరాలు తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయినందుకు ఏడ్వడం యేసు చూశాడు. ఆయన ఆమె మీద జాలిపడి ఆ అబ్బాయిని బ్రతికించాడు.—లూకా 7:12-15.