ఏలీయాస్ హట, అతని అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు
మీరు హీబ్రూ బైబిలు చదవగలరా? బహుశా చదవలేరు. అసలు మీరు ఇప్పటి వరకు హీబ్రూ బైబిల్నే చూసి ఉండకపోవచ్చు. కానీ, 16వ శతాబ్దంలో పండితుడైన ఏలీయాస్ హట గురించి అతను ప్రచురించిన రెండు హీబ్రూ బైబిళ్ల గురించి మీరు తెలుసుకుంటే మీ దగ్గర ఉన్న పవిత్ర గ్రంథాలపై ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది.
ఏలీయాస్ హట 1553 లో గార్లిట్జ్ అనే చిన్న నగరంలో పుట్టాడు. ఇది జర్మనీకి పోలండ్‌తో, జెక్ రిపబ్లిక్‌తో ఇప్పుడున్న సరిహద్దుకు దగ్గర్లో ఉంది. హట జీనాలో లూథరన్ యూనివర్సిటీలో ప్రాచ్య దేశ భాషలు చదివాడు. అతనికి 24 ఏళ్లు ఉన్నప్పుడే లైప్జిగ్లో హీబ్రూ భాష అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. తర్వాత ఒక విద్యా సంస్కర్తగా హీబ్రూ, గ్రీక్, లాటిన్, జర్మన్ భాషలను నాలుగేళ్లలో నేర్చుకోవడానికి విద్యార్థుల కోసం న్యూరెమ్బర్గ్లో ఒక పాఠశాలను ప్రారంభించాడు. అప్పట్లో ఏ పాఠశాలలో ఏ యూనివర్సిటీలో అది సాధ్యమయ్యేది కాదు.
“ఈ ఎడిషన్ గొప్పతనం”
ప్రజలు పాత నిబంధన పేరుతో పిలిచే గ్రంథానికి హట 1587 లో హీబ్రూ ఎడిషన్‌ను ప్రచురించాడు. దీనికి యెషయా 35:8 నుండి తీసుకున్న ‘పరిశుద్ధ మార్గము’ అనే మాటలతో దెరెక్ హా-కోడెష్ అని పేరు పెట్టారు. “ప్రతి ఒక్కటి ఈ ఎడిషన్ అందాన్ని చాటిచెప్తాయి” అనే ప్రశంసలు రావడానికి కారణం ఇందులో ఉన్న అందమైన అక్షరాలే. ఈ బైబిలుకు ఇంత విలువ రావడానికి ఇంకో ముఖ్య కారణం, హీబ్రూ భాష నేర్చుకోవడానికి విద్యార్థులకు ఈ గ్రంథం బాగా సహాయం చేసింది.
హట రాసిన హీబ్రూ బైబిలు అంత బాగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి బైబిల్ని హీబ్రూలో చదవాలనుకునే కొత్తవాళ్లకు ఎదురయ్యే రెండు సమస్యల గురించి తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, ఇందులో (హీబ్రూ భాషలో) అక్షరాలు చాలా వేరుగా కొత్తగా ఉంటాయి. రెండవది వాటికి ముందు వెనుక ఉన్న పదాల వల్ల (ఉపసర్గ, ప్రత్యయం) అసలు మూల పదాన్ని గుర్తు పట్టడం కష్టం అవుతుంది. ఉదాహరణకు, హీబ్రూ పదమైన נפש (నెఫెష్ అని పలకవచ్చు) తీసుకుంటే, ఈ పదానికి అర్థం “ఆత్మ.” యెహెజ్కేలు 18:4 లో ఈ పదానికి ముందు ה (హా) అనే పదం ఉంటుంది. ఇంగ్లీష్‌లో దాని అర్థం “the.” కాబట్టి ఈ రెండు పదాలు కలిపితే వచ్చే మాట הנפשׁ (హాన్·నెఫెష్) లేదా “the soul” అంటే ‘ఆ ఆత్మ’ అనే అర్థం వస్తుంది. మొదటిసారి చూస్తున్నవాళ్లు, లేదా వీటి గురించి తెలియని వాళ్లు הנפשׁ (హాన్·నెఫెష్) వేరే కొత్త పదం అనుకుంటారు కాని נפשׁ (నెఫెష్) పదానికి సంబంధించినదని అనుకోరు.
అతని విద్యార్థులకు సహాయం చేయడానికి హట ఒక తెలివైన ప్రింటింగ్ లేదా ముద్రణా పద్ధతిని కనుక్కున్నాడు. ఇందులో హీబ్రూ అక్షరాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ముద్దగా ఉండే సాలిడ్ అక్షరాలు, రెండు బోలుగా ఉండే ఔట్‌లైన్ అక్షరాలు. హట ప్రతి పదానికి సంబంధించిన మూలపదాన్ని లేదా a ఇంగ్లీషులో మూలపదాన్ని ముద్ద అక్షరాల్లో దాని ముందు వెనుక చేర్చిన పదాలను సాధారణ అక్షరాల్లో పెట్టారు. ఇక్కడ చిత్రంలో యెహెజ్కేలు 18:4 వచనానికి హట హీబ్రూ బైబిల్లో మరియు రెఫరెన్సు బైబిలులో అక్షరాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు.
ధాతువుని సాలిడ్ అక్షరాల్లో ముద్రించాడు. ఆ మూల పదానికి ముందు వెనుక కలిపే ఉపసర్గ, ప్రత్యయ పదాలను ఔట్‌లైన్ అక్షరాల్లో (బోలుగా) రాశాడు. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు హీబ్రూ పదం యొక్క మూల భాగాన్ని సులువుగా గుర్తు పట్టి భాషను త్వరగా నేర్చుకోగలిగారు. నూతనలోక అనువాదం రెఫరెన్సు బైబిలు ఫుట్నోట్లలో ఇలాంటి పద్ధతినే వాడారు.హీబ్రూలో “క్రొత్త నిబంధన”
ప్రజలు క్రొత్త నిబంధన పేరుతో పిలిచే గ్రంథాన్ని కూడా హట ఒకే పుస్తకంలో 12 భాషల్లో ఉండేలా ముద్రించాడు. ఈ ఎడిషన్‌ను న్యూరెమ్బర్గ్లో 1599 లో ముద్రించారు. దీనిని ఎక్కువగా న్యూరెమ్బర్గ్ పాలిగ్లాట్ అని పిలుస్తారు. హట క్రైస్తవ గ్రీకు లేఖనాల హీబ్రూ భాష అనువాదాన్ని దానిలో కలపాలనుకున్నాడు. కానీ తన ఆస్తిని పెట్టి హీబ్రూ అనువాదం కోసం వెదికినా అది దొరికేది కాదని ఆయన అన్నాడు. b అందుకే ఆయన గ్రీకులో ఉన్న క్రొత్త నిబంధనని తనే సొంతగా హీబ్రూలోకి అనువాదం చేయాలని నిర్ణయించుకున్నాడు. మిగతా పనులన్నిటినీ ప్రక్కన పెట్టి, హట ఒక సంవత్సరంలోనే ఈ అనువాదం మొత్తం పూర్తి చేశాడు.
హట చేసిన క్రైస్తవ గ్రీకు లేఖనాల హీబ్రూ అనువాదం ఎలా ఉండి ఉంటుంది? 19వ శతాబ్దానికి చెందిన పేరు గాంచిన హీబ్రూ పండితుడైన ఫ్రాంట్స్ డెలిట్ష్ ఇలా రాశాడు: ‘భాష మీద ఆయనకు ఉన్న అవగాహన క్రైస్తవుల్లో అరుదుగా కనిపించేది. ఆయన చేసిన హీబ్రూ అనువాదంలో ఆయనకున్న అవగాహన తెలుస్తుంది. దానిని ఇప్పటికీ సంప్రదించవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ప్రతీ చోట సరైన పదాల్ని చూసి పెట్టడం ఆయనకు కుదిరినంత బాగా ఎవరికి కుదరలేదు.’
చిరకాల ప్రభావం
హట చేసిన అనువాదాల వల్ల ఆయన ధనవంతుడు అయిపోలేదు. ఆయన చేసిన అనువాదాలు పెద్దగా అమ్ముడు పోలేదు. కానీ ఆయన అనువాదం చూపించిన ప్రభావం చాలా గొప్పది, చిరకాలం ఉండిపోయింది. ఉదాహరణకు ఆయన హీబ్రూలో చేసిన క్రొత్త నిబంధనను విలియమ్ రాబర్ట్సన్ 1662 లో ఒకసారి, రిచర్డ్ కాడిక్ 1798 లో ఇంకోసారి రివైజ్ చేసి తిరిగి ముద్రించారు. మూల గ్రీకు భాష నుండి అనువదిస్తున్నప్పుడు హట కెరియోస్ (ప్రభువు), థియోస్ (దేవుడు) అనే బిరుదులకు బదులు “యెహోవా” (יהוה, JHVH) అనే పదం పెట్టాడు. ముఖ్యంగా హీబ్రూ లేఖనాల నుండి ఎత్తి రాసిన గ్రీకు లేఖనాల్లో, యెహోవా గురించి చెప్తుంది అని అనిపించిన ప్రతీచోట హట యెహోవా అని రాశాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే ఎన్నో క్రొత్త నిబంధన అనువాదాల్లో దేవుని పేరును పెట్టడం లేదు. కానీ హట మాత్రం తన అనువాదంలో పెట్టాడు. అంటే దేవుని పేరును క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో తిరిగి చేర్చడానికి ఇది ఒక రుజువు.
ఈసారి మీరు దేవుని పేరు యెహోవాను క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో లేదా రెఫరెన్సు బైబిలు ఫుట్‌నోట్‌లో చూసినప్పుడు, ఏలీయాస్ హట చేసిన పని గురించి ఆయన అసాధారణమైన హీబ్రూ బైబిళ్ల గురించి గుర్తు చేసుకోండి.
a రెఫరెన్సు బైబిలులో యెహెజ్కేలు 18:4 లో రెండవ ఫుట్‌నోట్, అపెన్డిక్స్ 3B చూడండి.
b పండితులు క్రొత్త నిబంధన హీబ్రూ అనువాదాలను అంతకుముందు చేశారు. వాటిల్లో ఒకదాన్ని 1360కల్లా సైమన్ ఆటామనోస్ అనే బైజాంటైన్ క్రైస్తవ సన్యాసి చేశాడు. మరొక అనువాదాన్ని 1565కల్లా జర్మన్ పండితుడైన ఓస్వాల్ట్ ష్రెకెన్ఫుక్స్ చేశాడు. కానీ ఈ అనువాదాల్ని ఎప్పుడూ ముద్రించలేదు, అవి ఇప్పుడు లేవు కూడా.