కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6

మంచిచెడులను అర్థం చేసుకోవడం

మంచిచెడులను అర్థం చేసుకోవడం

మంచిచెడులను అర్థం చేసుకున్నవాళ్లు ఎలా ఉంటారు?

నీతి నియమాలు ఉన్నవాళ్లు మంచిచెడులను స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఫలానా సమయంలో వాళ్లకు ఏమి అనిపిస్తుందనే దాన్నిబట్టి మంచిచెడుల విషయంలో వాళ్లు పెట్టుకున్న నియమాలు మారవు. బదులుగా, ఈ నియమాలు ఖచ్చితమైన కొన్ని సూత్రాల ఆధారంగా ఉంటాయి. అవి వాళ్ల ప్రవర్తనను నిర్దేశిస్తాయి, చివరికి ఎవ్వరూ చూడనప్పుడు కూడా వాళ్లు ఆ సూత్రాల ప్రకారంగానే ప్రవర్తిస్తారు.

మంచిచెడులను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

మంచిచెడుల గురించి ఎన్నో తప్పుడు సందేశాలు పిల్లల చుట్టూ ఉన్నాయి. అవి స్కూల్లో వాళ్లతో పాటు చదువుకుంటున్న పిల్లల నుండి, వాళ్లు వినే పాటల్లో ఉన్న పదాల నుండి, వాళ్లు చూసే సినిమాలు, టీవీ కార్యక్రమాల నుండి రావచ్చు. దానివల్ల మంచిచెడుల విషయంలో వాళ్లు నేర్చుకున్నవాటి గురించి ప్రశ్నించడం మొదలుపెడతారు.

ముఖ్యంగా టీనేజ్‌లో ఇలాంటి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. టీనేజ్‌ వచ్చేసరికి ‘పిల్లలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆ వయసులో అందరిలో బాగా పేరు తెచ్చుకోవాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి తోటివాళ్లనుండి మీడియా నుండి వస్తుంది. కానీ వాళ్ల స్నేహితులకు నచ్చినా నచ్చకపోయినా పిల్లలు మాత్రం వాళ్ల సొంత విలువలను బట్టి, ఇష్టాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి’ అని బియాండ్‌ ద బిగ్‌ టాక్‌ అనే పుస్తకం చెప్తుంది. టీనేజ్‌ రాకముందే తల్లిదండ్రులు వాళ్లకు ఇలాంటి విషయాల గురించి తప్పకుండా చెప్పాలి.

మంచిచెడులను ఎలా నేర్పించవచ్చు?

మంచేదో, చెడేదో తెలుసుకోవడానికి సహాయం చేయండి.

మంచి సూత్రాలు: పరిణతి గలవాళ్లు “తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్లు తప్పొప్పులను గుర్తించగలుగుతారు.”—హెబ్రీయులు 5:14.

  • మంచిచెడుల విషయంలో నియమాలు పెట్టండి. రోజు జరిగే సందర్భాలను ఉపయోగించుకుని మంచికి చెడుకు ఉన్న తేడాను వివరించండి: “ఇది నిజాయితీ. ఇది నిజాయితీ కాదు,” “నమ్మకంగా ఉండడం అంటే ఇది. ఇది నమ్మకంగా ఉండడం కాదు,” “దయ అంటే ఇది. ఇది దయ లేకపోవడం” అని మీ పిల్లలకు నేర్పించండి. కాలం గడుస్తుండగా ఏ మంచి పనులు చేయాలో, ఏ చెడ్డ పనులు చేయకూడదో మీ పిల్లలు అర్థం చేసుకుంటారు.

  • మంచిచెడుల నియమాలు ఎందుకు పెట్టారో వివరించండి. ఉదాహరణకు, ఇలాంటి ప్రశ్నలు అడగండి: నిజాయితీగా ఉండడం ఎందుకు ముఖ్యం? అబద్ధాలు చెప్పడం స్నేహాన్ని ఎలా పాడుచేస్తుంది? దొంగతనం ఎందుకు తప్పు? వీటన్నిటినీ మీరు వివరించాలి ఎందుకంటే మీ పిల్లల మనస్సాక్షి, ఆలోచనా సామర్థ్యం పెరిగేది ఈ వయసులోనే.

  • నీతి నియమాల వల్ల వచ్చే ప్రయోజనాలను నొక్కి చెప్పండి. మీరు ఇలా చెప్పవచ్చు: “నువ్వు నిజాయితీగా ఉంటే, ఇతరులు నిన్ను నమ్ముతారు,” లేదా “నువ్వు దయగా ఉంటే, అందరూ నీతో ఉండడానికి ఇష్టపడతారు.”

కుటుంబంలో అందరూ మంచిచెడుల నియమాలు పాటిస్తారని స్పష్టంగా చూపించండి.

మంచి సూత్రాలు: “మీరేమిటో రుజువు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి.”—2 కొరింథీయులు 13:5.

  • మీ కుటుంబంలో అందరూ నీతి నియమాలు పాటిస్తూ ఉండాలి, అప్పుడు మీరు ధైర్యంగా ఇలా చెప్పగలరు:

    • “మన కుటుంబంలో ఎవ్వరూ అబద్దాలు చెప్పం.”

    • “మనం వేరేవాళ్లను కొట్టం లేదా వాళ్ల మీద అరవం.”

    • “దురుసుగా, ఇతరులను తక్కువ చేస్తున్నట్లు మనం మాట్లాడం.”

మంచి, చెడు కేవలం పాటించాల్సిన నియమాలు మాత్రమే కాదని అవి మీ కుటుంబానికి గుర్తింపని మీ పిల్లలు తెలుసుకోవాలి.

  • మీ కుటుంబంలో ఉన్న విలువల గురించి మీ పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. ప్రతిరోజు ఎదురయ్యే సంఘటనలను పాఠాలుగా ఉపయోగించి నేర్పించండి. మీకున్న విలువలను, మీడియాలో స్కూల్లో మీ పిల్లలు చూసే విలువలతో పోల్చి చెప్పండి. మీ పిల్లలను ఇలాంటి ప్రశ్నలు అడగండి: “మీరైతే ఏమి చేసి ఉండేవాళ్లు?” “మన కుటుంబం అయితే ఏమి చేసి ఉండేది?”

సరైనది చేయాలనే వాళ్ల కోరికను బలపర్చండి.

మంచి సూత్రాలు: “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.”—1 పేతురు 3:16.

  • మంచి చేస్తే మెచ్చుకోండి. మీ పిల్లవాడు చేసిన దానిలో మంచి ఉంటే మెచ్చుకోండి, ఎందుకు మెచ్చుకుంటున్నారో వివరించండి. ఉదాహరణకు, ఇలా చెప్పవచ్చు: “నువ్వు నిజాయితీగా ఉన్నావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను.” మీ పిల్లవాడు ఏదైనా తప్పు చేశానని ఒప్పుకుంటే, వాడిని సరిదిద్దే ముందు, మీ దగ్గరకు వచ్చి నిజాయితీగా ఒప్పుకున్నందుకు మెచ్చుకోండి.

  • చెడు ప్రవర్తనను సరిచేయండి. వాళ్లు చేసిన పనులకు బాధ్యత వహించేలా మీ పిల్లలకు సహాయం చేయండి. వాళ్లు చేసిన తప్పు ఏంటో, వాళ్ల ప్రవర్తన కుటుంబంలో ఉన్న విలువలకు ఎలా వేరుగా ఉందో మీ పిల్లలకు తప్పకుండా తెలియాలి. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు వాళ్లు తప్పు చేశారని చెప్పరు, ఎందుకంటే పిల్లలు నిరుత్సాహపడడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. కానీ వాళ్ల తప్పుల గురించి పిల్లలతో మాట్లాడితే వాళ్ల మనస్సాక్షికి మంచి శిక్షణ దొరుకుతుంది. అంతేకాదు భవిష్యత్తులో వాళ్లు తప్పు చేయకుండా జాగ్రత్తపడతారు.