కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | భార్యాభర్తలు

పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు వదిలి వెళ్లినప్పుడు

పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు వదిలి వెళ్లినప్పుడు

సమస్య

పిల్లలు పెద్దవాళ్లైపోయి ఇల్లు విడిచి వెళ్లినప్పుడు భార్యాభర్తలకు అసలు సమస్యలు మొదలవుతాయి. ఒంటరి పక్షులుగా, ఒకరికి ఒకరు పరిచయం లేని వాళ్లలా అయిపోతారు. “భార్యతో/భర్తతో మళ్లీ ఎలా కలిసిపోవాలో నేను చాలామందికి కౌన్సిల్‌ ఇస్తాను. పిల్లలు వెళ్లిపోయారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులకు మాట్లాడుకోవడానికి గానీ, చెప్పుకోవడానికి గానీ చాలా తక్కువ విషయాలు ఉంటాయి” అని ఒక కుటుంబ నిపుణుడు గ్యార్రీ నూమెన్‌ రాస్తున్నారు. a

మీ వివాహ జీవితం కూడా కొంతవరకు అలానే ఉందా? అయితే మీరు మళ్లీ ఇదివరకులా ఉండే అవకాశం ఉంది. కానీ ముందు మీకూ మీ భర్త/భార్యకు మధ్య ఇలా దూరం పెరగడానికున్న కొన్ని కారణాలు గురించి చూడండి.

ఎందుకిలా జరుగుతుంది

చాలా సంవత్సరాలుగా పిల్లలకే మొదటి స్థానం ఇచ్చారు. మంచి ఉద్దేశాలతోనే, చాలామంది తల్లిదండ్రులు పిల్లల అవసరాలను భార్యాభర్తలుగా వాళ్లిద్దరి అవసరాలకన్నా ముందు ఉంచుతారు. దానివల్ల అమ్మగా నాన్నగా వాళ్ల బాధ్యతలకు ఎంతగా అలవాటు పడిపోతారంటే భార్యాభర్తలుగా వాళ్లిద్దరి మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని పోగొట్టుకుంటారు. ఈ విషయం పిల్లలు వెళ్లిపోగానే బయటపడుతుంది. “పిల్లలు ఉన్నప్పుడు కనీసం కలిసి పనులు చేసుకున్నాం” అని 59 ఏళ్ల ఆవిడ అంటుంది. కానీ పిల్లలు ఇల్లు వదిలి వెళ్లాక, “మా ఇద్దరు దారులు విడిపోయాయి” అని ఆమె ఒప్పుకుంటుంది. ఒక సమయంలో ఆమె తన భర్తతో ఇలా కూడా చెప్పింది: “మనిద్దరం ఒకరికి ఒకరం అడ్డుగా ఉన్నాం.”

కొంతమంది భార్యాభర్తలు జీవితంలో ఇలాంటి కొత్త పరిస్థితికి సిద్ధపడరు. “చాలామంది భార్యాభర్తలకు, దాదాపు కొత్తగా పెళ్లి చేసుకున్నట్లు ఉంటుంది” అని ఎంప్టీ నెస్టింగ్‌ అనే పుస్తకం అంటుంది. వాళ్లిద్దరిలో కలిసే విషయాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకుని, చాలామంది భార్యలు, భర్తలు వేర్వేరు పనులు చేసుకుంటూ రూంమేట్స్‌లా ఉంటారు కానీ పెళ్లైన భార్యాభర్తల్లా ఉండరు.

అయితే మంచివార్త ఏంటంటే, మీరు ఇలాంటి ప్రమాదాన్ని తప్పించుకుని, మీ జీవితంలో ఈ కొత్త అధ్యాయం వల్ల వచ్చే ఆనందాన్ని రుచి చూడవచ్చు. ఈ విషయంలో బైబిలు మీకు సహాయం చేస్తుంది. ఎలానో చూద్దాం.

మీరు ఏమి చేయవచ్చు

ఈ మార్పుకు తగ్గట్టుగా ఉండాలని నిశ్చయించుకోండి. ‘పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచును’ అని ఎదిగిన పిల్లల విషయంలో బైబిలు చెప్తుంది. (ఆదికాండము 2:24) ఆ సమయం కోసం మీ పిల్లల్ని సిద్ధం చేయడం, పెద్దవాళ్లు అయ్యాక వాళ్లు చేయాల్సిన పనులకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయం చేయడం తల్లిదండ్రులుగా మీ లక్ష్యం. ఆ విధంగా చూస్తే మీ పిల్లలు ఇల్లు వదిలి వెళ్లే స్థాయికి రావడం మీరు గర్వించాల్సిన విషయం.—మంచి సలహా: మార్కు 10:7.

నిజమే, మీరెప్పుడూ మీ పిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఒక కన్సల్టెంట్‌లా సంప్రదించాల్సిన వాళ్లే కానీ సూపర్‌వైజర్‌ లేదా అధికారి కాదు. ఈ విధమైన కొత్త సంబంధం వల్ల మీరు మీ భర్తకు లేదా భార్యకు మొదట అవధానం ఇస్తూనే మీ పిల్లలతో మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చు. bమంచి సలహా: మత్తయి 19:6.

మీ అవసరాల గురించి మాట్లాడండి. జీవితంలో ఈ మార్పు వల్ల మీ పైన ఎలాంటి ప్రభావం పడిందో మీ వివాహజతతో చెప్పండి, వాళ్లు చెప్తున్నప్పుడు కూడా వినడానికి సిద్ధంగా ఉండండి. ఓపికను, అర్థంచేసుకునే మనసును చూపించండి. భార్యాభర్తగా మీ సంబంధాన్ని తిరిగి పెంచుకోవడానికి సమయం పట్టవచ్చు, కానీ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి.—మంచి సలహా: 1 కొరింథీయులు 13:4.

ఇద్దరు కలిసి కొత్త పనులు చేయండి. ఇద్దరూ కలిసి చేయాలనుకునే లక్ష్యాల గురించి లేదా ఇద్దరూ కలిసి ఆనందించే విషయాల గురించి మాట్లాడుకోండి. పిల్లలను పెంచడం వల్ల మీరు మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు?—మంచి సలహా: యోబు 12:12.

మిమ్మల్ని దగ్గర చేసిన విషయాల్ని గుర్తు చేసుకోండి. మీరు ఒకరికి ఒకరు దగ్గరవ్వడానికి సహాయం చేసిన లక్షణాలు గురించి ఆలోచించండి. మీ ఇద్దరు కలిసి గడిపిన రోజులను, మీరు కలిసి తట్టుకున్న సమస్యల్ని గుర్తుచేసుకోండి. చివరికి, మీ జీవితంలో ఈ కొత్త అధ్యాయం చాలా ఆనందంగా ఉంటుంది. నిజానికి మీ ఇద్దరు కలిసి మీ వివాహబంధాన్ని ఇంకా మెరుగుపర్చుకునే అవకాశం ఇప్పుడు మీకు ఉంది, మీ ఇద్దరిని ఒకప్పుడు దగ్గర చేసిన ప్రేమను మళ్లీ చిగురించేలా చేసుకోవచ్చు.

a ఎమోషనల్‌ ఇన్ఫిడెలిటీ పుస్తకం నుండి తీసుకో బడింది.

b మీరు ఇంకా మీ పిల్లలను పెంచుతున్నా భార్యాభర్తలు ఇద్దరు “ఒక్క శరీరం” అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. (మార్కు 10:8) పిల్లలు తమ తల్లిదండ్రుల బంధం చాలా బలంగా ఉంది అని గుర్తించినప్పుడు మరింత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు.