మీరు ప్రేమించేవాళ్ల ఆరోగ్యం బాలేనప్పుడు
“నాన్నగారు హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యేటప్పుడు ఆయన రక్త పరీక్షల రిపోర్టులను మళ్లీ ఒకసారి చూసి వివరించమని డాక్టర్ని అడిగాము. రిపోర్టులన్నీ బానే ఉన్నాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. అయినా మా తృప్తి కోసం వాటిని మళ్లీ చూశారు. వాటిలో రెండుచోట్ల సమస్య ఉందని చూసి డాక్టర్ ఆశ్చర్యపోయారు. మాకు క్షమాపణ చెప్పి వెంటనే స్పెషలిస్టును పిలిపించారు. ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం బానేవుంది. అప్పుడు అలా అడిగి తెలుసుకోవడం చాలా మంచిదైంది.”—మరీబెల్.
డాక్టర్‌కి చూపించుకోవడం, హాస్పిటల్లో ఉండడం చాలా కంగారుగా, భయంగా ఉంటుంది. మరీబెల్ వాళ్ల నాన్నకు జరిగినదాన్నిబట్టి చూస్తే హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు పక్కన స్నేహితుడు గానీ, బంధువు గానీ ఉంటే చాలా మంచిది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. మీ వాళ్లు అనారోగ్యంతో ఉంటే మీరెలా సహాయం చేయవచ్చు?
డాక్టర్ని కలిసే ముందు. అనారోగ్యంగా ఉన్న వాళ్లకు ఏమి బాలేదో, ఏమైనా మందులు లాంటివి వాడుతుంటే వాటి వివరాలు రాసిపెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. డాక్టర్ని కలిసినప్పుడు ఏమి అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాటిని కూడా రాయాలి. మీ వాళ్ల సమస్యకు సంబంధించిన వివరాలు, వాళ్ల కుటుంబంలో ఎవరికైనా అలాంటి ఆరోగ్య సమస్యే ఉంటే దానికి సంబంధించిన వివరాలు రాసుకోవడానికి సహాయం చేయండి. ఇలాంటి విషయాల గురించి డాక్టర్‌కు ముందే తెలుస్తుందనో లేక ఆయనే వాటి గురించి మిమ్మల్ని అడుగుతాడనో అనుకోకండి.
డాక్టర్ని కలిసినప్పుడు. డాక్టర్ చెప్పేవి మీకూ, అనారోగ్యంగా ఉన్న మీ వాళ్లకూ బాగా అర్థం అయ్యేలా చూసుకోండి. డాక్టర్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోండి. అంతేగాని డాక్టర్ చెప్పేది కూడా పక్కనపెట్టి డాక్టర్‌కే సలహాలు ఇవ్వకండి. పేషంట్నే సొంతగా డాక్టర్‌తో మాట్లాడనివ్వండి, ప్రశ్నలు అడిగి తెలుసుకోనివ్వండి. జాగ్రత్తగా విని చెప్పినవన్నీ రాసిపెట్టుకోండి. ఏయే విధాలుగా చికిత్స తీసుకోవచ్చో అడగండి. కొన్నిసార్లు, ఇంకో డాక్టర్ సలహా కూడా తీసుకోవడం మంచిదని మీ వాళ్లకు చెప్పవచ్చు.
డాక్టర్ని కలిసిన తర్వాత. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ అనారోగ్యంగా ఉన్న మీ వాళ్లతో చర్చించండి. సరైన వైద్యం అందేలా చూడండి. డాక్టర్ చెప్పినట్టే మందులు వాడమని, ఒకవేళ మందులు పడక ఏమైనా సమస్యలు వస్తుంటే వెంటనే డాక్టర్ని కలవమని చెప్పండి. తన పరిస్థితి గురించి భయపడకుండా మంచిగా ఆలోచించమనండి. డాక్టర్ చెప్పిన అదనపు జాగ్రత్తలను, చికిత్సలను కూడా తీసుకోమని ప్రోత్సహించండి. వాళ్లకున్న అనారోగ్యం గురించి తెలుసుకోవడానికి మీవాళ్లకు సహాయం చేయండి.
హాస్పిటల్లో ఉన్నప్పుడు
ప్రశాంతంగా, అన్నీ గమనించుకుంటూ ఉండండి. హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు అనారోగ్యంగా ఉన్నవాళ్లకు కంగారుగా నిస్సహాయంగా అనిపిస్తుంది. మనం నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంటే వేరే వాళ్లు కూడా ప్రశాంతంగా ఉంటారు. కంగారులో పొరపాట్లు చేయకుండా ఉంటారు. పేషంట్ని చేర్చుకునేటప్పుడు హాస్పిటల్ వాళ్లు అడిగే వివరాలను సరిగ్గా రాసేలా చూసుకోండి. ఏ చికిత్స తీసుకోవాలి అని నిర్ణయించుకునే హక్కు రోగులకు ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు గౌరవించండి. అయితే రోగి దాని గురించి ఏమీ చెప్పలేని స్థితిలో ఉంటే, ఈ విషయంలో ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని, రోగి తరఫున నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న కుటుంబ సభ్యుని లేదా ఆరోగ్య ప్రతినిధి నిర్ణయాన్ని గౌరవించండి. a
మాట్లాడడానికి ముందుకు రండి. అనారోగ్యంతో ఉన్న మీవాళ్ల తరఫున మాట్లాడడానికి భయపడకండి. మీరు గౌరవంగా కనిపిస్తూ, మర్యాదగా ఉంటే వైద్యం చేసేవాళ్లు రోగిని బాగా పట్టించుకొని, ఇంకా మంచి చికిత్స చేసే అవకాశం ఉంది. చాలా హాస్పిటల్స్‌లో ఒక పేషంట్ని వేర్వేరు డాక్టర్లు చూస్తుంటారు. కాబట్టి రోగిని చూడడానికి వచ్చిన డాక్టర్‌తో ఇతర డాక్టర్లు ఏమన్నారో చెప్పడం ద్వారా మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు. మీవాళ్ల గురించి మీకు బాగా తెలుసు కాబట్టి వాళ్ల శరీరంలో, మానసిక స్థితిలో ఏమైనా మార్పులు గమనిస్తే వాటిని కూడా మీరు డాక్టర్‌కు చెప్పవచ్చు.
వైద్యం చేసేవాళ్ల పట్ల గౌరవం, కృతజ్ఞత చూపించండి. హాస్పిటల్లో పని చేసే వాళ్లందరూ ఎప్పుడూ చాలా ఒత్తిడిలో పని చేస్తుంటారు. వాళ్లు మీతో ఎలా ఉండాలని కోరుకుంటారో మీరు కూడా వాళ్లతో అలాగే ఉండండి. (మత్తయి 7:12) వాళ్లు పొందిన శిక్షణని, వాళ్లకున్న అనుభవాన్ని గౌరవించండి. వాళ్లు ఆ పనిని సమర్థవంతంగా చేస్తారని నమ్మండి. వాళ్ల కష్టాన్ని మెచ్చుకోండి. మనం చూపించే కృతజ్ఞతను బట్టి వాళ్లు చేయగలిగినదంతా చేస్తారు.
మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ ముందుచూపుతో మీరు సాధ్యమైనంత సహాయం చేస్తే అనారోగ్యంతో ఉన్న మీ స్నేహితుడు లేదా బంధువు అలాంటి కష్టమైన పరిస్థితిని బాగా తట్టుకోగలరు.—సామెతలు 17:17. ◼ (g15-E 10)
a రోగులకు ఉండే హక్కులు, బాధ్యతలకు సంబంధించిన చట్టాలు, పద్ధతులు ప్రపంచంలో అన్ని చోట్లా ఒకేలా ఉండవు. రోగి తీసుకోవాలనుకుంటున్న చికిత్సలకు సంబంధించిన వివరాలు పూర్తిగా, ఖచ్ఛితంగా ఉండేలా చూసుకోండి.