మా పిల్లల హృదయాలలో యెహోవాపై ప్రేమను నాటడం
జీ వి త క థ
మా పిల్లల హృదయాలలో యెహోవాపై ప్రేమను నాటడం
వెర్నర్ మాట్సన్ చెప్పినది
కొన్ని సంవత్సరాల క్రితం మా పెద్ద అబ్బాయి, హాన్స్ వెర్నర్ నాకు ఒక బైబిలును కానుకగా ఇచ్చాడు. దాని లోపలి అట్టమీద ఇలా వ్రాశాడు: “ప్రియమైన నాన్నగారికి, జీవిత మార్గంలో దేవుని వాక్యం మనలను ఒక కుటుంబంగా నడిపిస్తూనే ఉండును గాక. కృతజ్ఞతతో, మీ పెద్ద కుమారుడు.” ఆ మాటలు నా హృదయాన్ని కృతజ్ఞతతో మరియు ఆనందంతో ఎలా నింపాయో తల్లిదండ్రులైనవారు బాగా అర్థం చేసుకోగలరు. ఒక కుటుంబంగా మేము ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తుందో నాకు అప్పటికింకా తెలియదు.
నేను 1924 లో, జర్మనీలో ఉన్న హామ్‌బర్గ్ నౌకాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాల్స్‌టెన్‌బెక్‌లో జన్మించాను, నన్ను మా అమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. యుద్ధ ఉపకరణాలను తయారుచేసే స్థలంలో పనిచేస్తూ ఆ వృత్తిలో శిక్షణ పొందాను కాబట్టి, 1942 లో వెర్‌మాక్ సాయుధ దళంలోకి నన్ను చేర్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా శివార్లలో పోరాడేటప్పుడు నేను మాటల్లో చెప్పలేనంత భయంకరమైన పరిస్థితిని అనుభవించాను. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కానీ చికిత్స పూర్తైన తరువాత మళ్ళీ శివార్లకే పంపించబడ్డాను. జనవరి 1945 లో నేను పోలాండ్‌లోని లాడ్స్‌లో ఉన్నాను. అక్కడ నేను తీవ్రంగా గాయపడినందువల్ల నన్ను మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు. యుద్ధం ముగిసే సరికి నేను ఇంకా అక్కడే ఉన్నాను. కొంతకాలం ఆసుపత్రిలో, ఆ తర్వాత న్యోయెన్‌గామెలోని నిర్బంధ శిబిరంలో ఉన్నప్పుడు, విషయాలను ధ్యానించడానికి నాకు సమయం లభించింది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, అయన ఇంత క్రూరత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు? అన్న ప్రశ్నలు నన్ను కలవరపెట్టేవి.
నిర్బంధ శిబిరంనుంచి విడుదల చేయబడ్డ తర్వాత కొద్ది కాలానికే, 1947 సెప్టెంబరులో నేను కార్లాని పెళ్ళి చేసుకున్నాను. మేము ఇద్దరం ఒకే ఊర్లో పెరిగాము, కాకపోతే కార్లా ఒక క్యాథలిక్, కానీ నా పెంపకంలో మత ప్రమేయం
ఎంతమాత్రం లేదు. ప్రతి సాయంత్రం ఇద్దరూ కలిసి కనీసం ప్రభువు ప్రార్థనైనా చేసుకోండని మా పెళ్ళి జరిపించిన ప్రీస్టు సలహా ఇచ్చాడు. మేము దేని కొరకు ప్రార్థిస్తున్నామో మాకు నిజంగా తెలియకపోయినప్పటికీ, అయన చెప్పినట్టే మేము చేశాము.ఒక సంవత్సరం తర్వాత హాన్స్ వెర్నర్ జన్మించాడు. దాదాపు అదే సమయంలో, నా సహోద్యోగి అయిన విల్‌హెల్మ్ ఆరెన్స్ నన్ను యెహోవాసాక్షులకు పరిచయం చేశాడు. త్వరలోనే ఏదోకరోజు యుద్ధాలు ఉండకుండా పోతాయని అతను నాకు బైబిలులోనుంచి చూపించాడు. (కీర్తన 46:9) 1950 శరదృతువులో నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాను. ఒక సంవత్సరం తరువాత నా ప్రియమైన భార్య కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను ఎంత పులకరించిపోయానో!
యెహోవా మార్గాలలో పిల్లలను పెంచడం
వివాహాన్ని యెహోవా ఆరంభించాడని నేను బైబిలులో చదివాను. (ఆదికాండము 1:26-28; 2:22-24) మా పిల్లలైన హాన్స్ వార్నర్, కార్ల్ హిన్స్, మైఖెల్, గెబ్రియెల్లా, థామస్‌లకు కార్లా జన్మనిస్తున్నప్పుడు నేను ఆమె దగ్గరే ఉండడం వల్ల, మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండాల్సిన నా నిబద్ధత మరింత బలపడింది. మా పిల్లలలో ఒక్కొక్కరు జన్మించిన ప్రతిసారీ కార్లా నేను పులకరించిపోయేవాళ్ళం.
1953 లో న్యూరెంబర్గ్‌లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశం మా కుటుంబానికి ఒక ముఖ్యమైన తరుణంగా ఉండింది. శుక్రవారం మధ్యాహ్నం, “నూతనలోక సమాజంలో పిల్లలను పెంచడం” అనే ప్రసంగంలో ప్రసంగీకుడు చెప్పిన ఈ విషయాన్ని మేము ఇప్పటికీ మరచిపోలేదు: “మనం మన పిల్లలకు ఇవ్వగల అత్యంత గొప్ప వారసత్వం, దేవుని సేవకులుగా ఉండాలన్న కోరికే.” యెహోవా సహాయంతో కార్లా, నేను సరిగ్గా అదే చేయాలనుకున్నాం. కానీ ఎలా?
అలా చేయడం ప్రారంభించడానికి, ప్రతిరోజు కుటుంబసమేతంగా ప్రార్థించడం అలవాటుగా చేసుకున్నాము. అలా చేయడం వల్ల పిల్లలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థంచేసుకున్నారు. పిల్లలలో ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న వయసునుంచే, భోజనం చేసే ముందు ప్రతిసారీ మేము ప్రార్థన చేస్తామని తెలుసుకున్నారు. వారు శిశువులుగా ఉన్నప్పుడు కూడా, తమ పాలసీసాను చూసిన వెంటనే, తమ చిన్న తలలను వంచి చిన్నారి చేతులను జోడించేవారు. ఒక సందర్భంలో, నా భార్య బంధువుల వివాహానికి మేము ఆహ్వానించబడ్డాము, వారు సాక్షులు కాదు. వివాహ వేడుక తర్వాత, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు, ఫలహారాలు సేవించడానికి అతిథులందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. అందరూ వెంటనే తినడం ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఐదేళ్ళ మా అబ్బాయి కార్ల్ హిన్స్‌కి ఇది సరికాదు అనిపించింది. “దయచేసి ముందు ప్రార్థన చేయండి” అని వాడు అన్నాడు. అతిథులందరూ వాడివైపు, ఆ తర్వాత మా వైపు, చివరకు అతిథేయుని వైపు చూశారు. ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, భోజనం కొరకు ధన్యవాదాలు చెబుతూ నేను ప్రార్థన చేస్తానని ముందుకు వెళ్ళాను, దానికి అతిథేయుడు అంగీకరించాడు.
ఈ సంఘటన నాకు యేసు మాటలను గుర్తుచేసింది: “బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి.” (మత్తయి 21:16) హృదయపూర్వకంగా, క్రమంగా మేము చేసిన ప్రార్థనలు, మా పిల్లలు యెహోవాను తమ ప్రేమపూర్వకమైన పరలోక తండ్రిగా దృష్టించడానికి నిశ్చయంగా సహాయపడ్డాయని మేము భావిస్తున్నాము.
యెహోవాపట్ల మా బాధ్యత
దేవుణ్ణి ప్రేమించమని పిల్లలకు బోధించాలంటే, క్రమంగా దేవుని వాక్యాన్ని చదివి, దాన్ని అధ్యయనం చేయడం అవసరం. ఈ విషయం గుర్తుంచుకొని, ప్రతివారం, సాధారణంగా సోమవారం సాయంత్రాలు మేము కుటుంబ అధ్యయనం చేసుకొనేవాళ్ళం. మా మొదటి అబ్బాయికి, ఆఖరి అబ్బాయికి మధ్య తొమ్మిది సంవత్సరాల తేడా ఉంది కాబట్టి, పిల్లలందరి అవసరాలు వేరువేరుగా ఉండేవి, కాబట్టి ఎల్లప్పుడూ అందరితో ఒకే విషయాన్ని చర్చించడం వీలయ్యేది కాదు.
ఉదాహరణకు, స్కూలుకు వెళ్ళడం ప్రారంభించని పిల్లలకు, మేము సరళమైన ఉపదేశాన్ని మాత్రమే ఇచ్చేవాళ్ళం. కార్లా వారితో కేవలం ఒక్క లేఖనాన్ని మాత్రమే చర్చించేది, లేదా బైబిలు ఆధారిత ప్రచురణల్లోని చిత్రాలను ఉపయోగించి వివరించేది. నూతనలోకం * పుస్తకంలో తమకు చాలా ఇష్టమైన చిత్రాలను చూపించడానికి తెల్లవారుఝామునే అందరికంటే చిన్న పిల్లలు మా మంచం మీదకు ఎక్కినప్పుడు నిద్ర లేచిన సమయాల తియ్యని జ్ఞాపకాలు ఇంకా నా మదిలో ఉన్నాయి.
యెహోవాను ప్రేమించడానికి మనందరికీ ఉన్న అనేక కారణాలను ఓర్పుగా పిల్లలకు నేర్పించడంలో కార్లా ప్రత్యేకమైన నేర్పును పెంపొందించుకుంది. అది సులభంగా, ఖచ్చితంగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ, నిజానికి, శారీరకంగా, భావోద్రేకంగా కార్లాకు, నాకు అది దాదాపు ఒక పూర్తికాల ఉద్యోగంలా అయ్యింది. అయినప్పటికీ, మేము ఆశ వదలుకోలేదు. యెహోవా ఎవరో తెలియని ఇతరులు మా పిల్లలను ప్రభావితం చేయకముందే మేము వారి లేత హృదయాలలో ఈ విషయాలను ప్రగాఢంగా నాటాలనుకున్నాము. ఆ కారణం వల్లనే, మా పిల్లలు కూర్చోగలిగేంతగా ఎదిగిన వెంటనే వారు కూడా కుటుంబ పఠనంలో కూర్చోవాలని చెప్పేవాళ్ళం.
తల్లిదండ్రులుగా కార్లా నేను, మా పిల్లలకు ఆరాధన విషయంలో సరైన మాదిరిని ఉంచవలసిన అవసరతను గుర్తించాము. మేము భోజనం చేస్తున్నా, తోటలో పనిచేస్తున్నా, లేదా బైట నడవడానికి వెళ్ళినా, మా పిల్లలలో ప్రతి ఒక్కరికి యెహోవాతో ఉన్న సంబంధం బలపడేటట్లు చేయడానికి ప్రయత్నించేవాళ్ళము. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) మా పిల్లలలో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే తమ సొంత బైబిలు ఉండేటట్లు చూశాము. అంతేకాకుండా, పత్రికలు అందిన వెంటనే, కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేరును వాళ్ళ వాళ్ళ సొంత ప్రతుల మీద వ్రాసేవాడిని. తద్వారా, పిల్లలు తమ వ్యక్తిగత పుస్తకాలను గుర్తుపట్టడం నేర్చుకున్నారు. పిల్లలకు తేజరిల్లు!లోని నిర్దిష్టమైన ఆర్టికల్‌లు చదవడానికి నియమించాలన్న ఆలోచన మాకు వచ్చింది. ఆదివారాలు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత, వారు ఆ సమాచారాన్ని ఎలా అర్థంచేసుకున్నారో మాకు వివరించేవారు.
పిల్లలకు అవసరమైన శ్రద్ధ చూపించడం
కానీ, ఎల్లప్పుడు అన్ని విషయాలు సాఫీగా సాగిపోలేదు. పిల్లలు పెరిగే కొద్ది, వారి హృదయాలలో ప్రేమను ప్రగాఢంగా ముద్రించాలంటే, వారి హృదయాలలో అప్పటికే ఏమి ఉందో తెలుసుకోవాలని మేము గ్రహించాం. అంటే వారు చెప్పేది వినడం అవసరం అన్నమాట. వారు ఫిర్యాదు చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని మా పిల్లలు కొన్నిసార్లు భావించేవారు, కాబట్టి కార్లా, నేను కూర్చొని వారితో విషయాలను చర్చించేవాళ్ళం. కుటుంబ అధ్యయనం తర్వాత ప్రత్యేకంగా ఒక అరగంట కేటాయించడాన్ని మొదలుపెట్టాము. తాము ఎలా భావిస్తున్నామనేది నిర్మొహమాటంగా చెప్పడానికి ఎవరైనా అనుమతించబడేవారు.
ఉదాహరణకు, తల్లిదండ్రులుగా మేము వారి పెద్ద అన్నయ్యపై విశేషప్రీతి చూపిస్తున్నామని, అందరికంటే చిన్నవారైన థామస్ మరియు గెబ్రియెల్లా భావించారు. ఒకరోజు వారు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ ఇలా అన్నారు: “నాన్నగారు, మీరూ అమ్మా ఎల్లప్పుడూ హాన్స్ వెర్నర్ ఏమి చేయాలనుకుంటే అది చేయడానికి అనుమతిస్తున్నారని మేము అనుకుంటున్నాము.” వారలా అన్నప్పుడు, నేను నిర్ఘాంతపోయాను. అయినప్పటికీ, ఆ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించిన తర్వాత, పిల్లలు చెప్పినదాంట్లో నిజం లేకపోలేదని కార్లా నేను అంగీకరించవలసి వచ్చింది. కాబట్టి, పిల్లలందరితో ఒకే విధంగా వ్యవహరించడానికి మేము బాగా కృషి చేశాము.
కొన్నిసార్లు, నేను పిల్లలను తొందరపాటుతో లేదా అన్యాయంగా శిక్షించేవాడిని. అలాంటి సందర్భాల్లో, తల్లిదండ్రులుగా మేము వారికి క్షమాపణ చెప్పడం నేర్చుకోవలసి వచ్చింది. ఆ తర్వాత మేము యెహోవాకు ప్రార్థించేవాళ్ళము. యెహోవాకు క్షమాపణ చెప్పడానికి, తన పిల్లలకు కూడా క్షమాపణ చెప్పడానికి తమ తండ్రి సిద్ధంగా ఉన్నాడని మా పిల్లలు గుర్తించడం చాలా ప్రాముఖ్యము. దాని ఫలితంగా, మేము వారితో ప్రేమగల స్నేహపూర్వకమైన సంబంధం కలిగి ఉండేవాళ్ళం. వారు తరచూ, “మీరు మా ప్రియమైన స్నేహితులు” అని మాతో అనేవారు. అది మమ్మల్ని చాలా సంతోషపరిచేది.
ఒక కుటుంబంగా కలిసి పనిచేయడం, ఐక్యతను పెంపొందిస్తుంది. అందుకే ఇంట్లో అందరికీ వారు వారు క్రమంగా చేయవలసిన పనులు ఉండేవి. హాన్స్ వెర్నర్ ప్రతివారం బజారుకు వెళ్ళి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురావడానికి నియమించబడ్డాడు, సాధారణంగా కొనాల్సిన సరుకుల లిస్టుతోపాటు అతనికి కొంత డబ్బు ఇచ్చేవాళ్ళం. ఒక వారం మేము వాడికి లిస్టుగానీ డబ్బుగానీ ఇవ్వలేదు. వాడు, దాని గురించి తన తల్లిని అడిగినప్పుడు, మనకు ఇంకా డబ్బు రాలేదని ఆమె చెప్పింది. పిల్లలందరు తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు, తర్వాత అందరూ కూడా వాళ్ళు డబ్బులు పోగుచేసుకునే డిబ్బీలను తెచ్చి, వాటిని తెరచి డబ్బును బల్లపై కుమ్మరించారు. “అమ్మా, ఇప్పుడు మనం సరుకులు కొనడానికి వెళ్ళొచ్చు!” అని వారందరూ గట్టిగా అరిచారు. అవును, మా పిల్లలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయపడడం నేర్చుకున్నారు, అది మా కుటుంబాన్ని మరింత సన్నిహితం చేసింది.
వయస్సు పెరుగుతుండగా, మా అబ్బాయిలు, అమ్మాయిలపై శ్రద్ధ చూపించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, థామస్, తోటి సాక్షియైన 16 సంవత్సరాల అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. ఒకవేళ తాను ఆ అమ్మాయి గురించి గంభీరంగా ఆలోచిస్తుంటే, ఆమెను పెళ్ళి చేసుకోవడానికీ, భార్య పిల్లల బాధ్యత తీసుకోవడానికీ సిద్ధంగా ఉండాలని నేను వాడికి వివరించాను. తన వయస్సు కేవలం 18 సంవత్సరాలే కాబట్టి వివాహానికి తనింకా సిద్ధంగా లేనని థామస్ గ్రహించాడు.
ఒక కుటుంబంగా అభివృద్ధి సాధించడం
మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే, ఒకరి తర్వాత ఒకరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరారు. మేము వారిచ్చే ప్రసంగాలను శ్రద్ధగా వినేవాళ్ళము, పిల్లలకు దేవునిపై ఉన్న వ్యక్తిగతమైన హృదయపూర్వక ప్రేమను చూసినప్పుడు మాకెంతో ప్రోత్సాహం కలిగేది. అప్పుడప్పుడు మా ఇంట్లో బస చేసిన ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్తలు తమ జీవితాల్లోని అనుభవాలను మాకు చెప్పేవారు, లేదా బైబిలు నుంచి చదివి వినిపించేవారు. వారు, వారి భార్యలు మా కుటుంబంలోని అందరి హృదయాల్లో పూర్తికాల సేవపై ప్రేమను పెంపొందించుకోడానికి సహాయపడ్డారు.
మేము సమావేశాల కోసం ఆశతో ఎదురుచూసేవాళ్ళం. మా పిల్లల్లో దేవుని సేవకులుగా ఉండాలన్న కోరికను ప్రగాఢంగా ముద్రించడానికి మేము చేసే కృషిలో సమావేశాలు కీలకమైన సాధనంగా ఉండేవి. సమావేశ స్థలానికి వెళ్ళేముందు బ్యాడ్జీ కార్టులను పెట్టుకోవడమనేది పిల్లలకు ప్రత్యేకమైన సందర్భంగా ఉండేది. హాన్స్ వెర్నర్ పదేళ్ళ వయసులో బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మేము ఉప్పొంగిపోయాము. చాలామంది, వాడు యెహోవాకు సమర్పించుకోవడానికి చాలా చిన్నవాడని భావించారు, కానీ వాడు తన 50వ ఏట, తాను 40 సంవత్సరాలనుంచి యెహోవాను సేవిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉందో నాకు చెప్పాడు.
యెహోవాతో వ్యక్తిగత సంబంధం చాలా ప్రాముఖ్యమని మేము మా పిల్లలకు చూపించాము, కానీ వారు సమర్పించుకోవాలని మేము వారిని బలవంతం చేయలేదు. అయినప్పటికీ, మా పిల్లలలో మిగతావారు కూడా తమకు ఇష్టమైనప్పుడే బాప్తిస్మం తీసుకోవడానికి తగిన విధంగా అభివృద్ధి సాధించినప్పుడు మేము సంతోషించాము.
మా భారాన్ని యెహోవాపై వేయడాన్ని నేర్చుకోవడం
1971 లో హాన్స్ వెర్నర్ వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 51వ తరగతి నుంచి పట్టభద్రుడై, స్పెయిన్‌లో మిషనరీగా సేవచేయడానికి నియమించబడినప్పుడు మా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరి తర్వాత ఒకరు మిగతా పిల్లలు కూడా పూర్తికాల సేవకులుగా కొంత సమయాన్ని గడిపారు, అది తల్లిదండ్రులుగా మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆర్టికల్ మొదట్లో తెలిపినట్లు హాన్స్ వెర్నర్ నాకు బైబిలు
ఇచ్చింది ఈ సమయంలోనే. ఒక కుటుంబంగా మా సంతోషం సంపూర్ణమైనట్టు అనిపించింది.అప్పుడు, యెహోవాకు మరింత సన్నిహితంగా హత్తుకొని ఉండవలసిన అవసరముందని మేము తెలుసుకున్నాము. ఎందుకు? ఎందుకంటే, పెరిగి పెద్దవారైన మా పిల్లల్లో కొందరు వారి విశ్వాసాన్ని తీవ్రంగా పరీక్షించే సమస్యలను ఎదుర్కోవడాన్ని మేము చూశాము. ఉదాహరణకు, మా ప్రియమైన కుమార్తె గెబ్రియెల్లాకు శ్రమలు లేకుండా పోలేదు. ఆమె 1976 లో లోథార్‌ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొద్దికాలానికే అతను అనారోగ్యానికి గురయ్యాడు. అతను రోజు రోజుకు బలహీనమవుతున్న కొద్ది, చనిపోయేవరకు గెబ్రియెల్లా అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. కుటుంబంలోని ఆరోగ్యవంతమైన సభ్యుడు అనారోగ్యం వల్ల చనిపోవడం, మాకు యెహోవా ప్రేమగల హస్తం ఎంత అవసరమో గుర్తుచేసింది.
యెహోవా సంస్థలో సేవాధిక్యతలు
1955 లో నేను సంఘ సేవకుడిగా (నేడు సంఘ పైవిచారణకర్త అని పిలువబడుతున్నారు) నియమించబడినప్పుడు, నేను ఆ బాధ్యతకు యోగ్యుడిని కాదని నాకు అనిపించింది. చేయవలసిన పని చాలా ఉంది, సంఘ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చడానికి నాకు మిగిలిన ఒకే ఒక్క మార్గం కొన్నిసార్లు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి పనిచేయడమే. నా భార్యా పిల్లలు నాకు ఎంతో సహకరించారు, పూర్తి చేయవలసిన పనులు ఉన్న సాయంత్రాలు నాకు ఇబ్బంది కలుగకుండా చూసేవారు.
అయినప్పటికీ, ఒక కుటుంబంగా సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని కలిసి గడిపేవాళ్ళం. కొన్నిసార్లు, నా యజమాని, నేను కుటుంబాన్ని బైటికి తీసుకువెళ్ళేందుకు తన కారును నేను ఉపయోగించుకోవడానికి అనుమతించేవాడు. మేము అడవిలో కూర్చొని కావలికోటను అధ్యయనం చేసిన సందర్భాలను పిల్లలు బాగా ఆనందించేవారు. కొన్నిసార్లు మేము అందరం కలిసి సుదీర్ఘ పాదయాత్రలకు కూడా వెళ్ళేవాళ్ళం, అడవిలో నడుస్తున్నప్పుడు నేను నా హార్మోనియం వాయిస్తుండగా పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం.
1978 లో నేను ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా (ప్రయాణ పైవిచారణకర్త) నియమించబడ్డాను. దానికి ఉక్కిరిబిక్కిరైన నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, అది నేను చేయగలనని నాకు అనిపించడంలేదు. కానీ, నేను ప్రయత్నించాలని నువ్వు ఆశిస్తే, నేను నాకు సాధ్యమైనంత చక్కగా చేస్తాను.” రెండు సంవత్సరాల తర్వాత, నాకు 54 సంవత్సరాల వయసున్నప్పుడు, నా చిన్న వ్యాపారాన్ని నేను మా చిన్న అబ్బాయి థామస్‌కు అప్పజెప్పాను.
మా పిల్లలందరు పెద్దవారైపోయారు, కాబట్టి, కార్లా నేను యెహోవా కొరకు మరెక్కువ చేయడానికి వీలయ్యింది. అదే సంవత్సరంలో, హామ్‌బర్గ్‌లోని కొంత భాగం మరియు షెల్స్విగ్-హాల్స్‌స్టీన్ అంతటికీ ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించబడ్డాను. కుటుంబాన్ని చూసుకోవడంలో మాకున్న అనుభావాన్ని బట్టి, ఆ సంఘాల్లోని తల్లిదండ్రులను, వారి పిల్లలను మేము ప్రత్యేకంగా అర్థం చేసుకోగలిగాము. చాలామంది సహోదరులు మమ్మల్ని తమ ప్రాంతీయ తల్లిదండ్రులు అని పిలిచేవారు.
ప్రాంతీయ పనిలో నాతోపాటు కార్లా పది సంవత్సరాలపాటు కలిసి పనిచేసింది, ఆ తర్వాత ఆమె ఒక ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది. అదే సంవత్సరంలో, నాకు మెదడుకి ట్యూమర్ ఉందని వైద్యులు కనుగొన్నారు. కాబట్టి, నేను ప్రాంతీయ పైవిచారణకర్తగా నా సేవను విడిచిపెట్టి మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నాను. మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాతే నేను ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవ చేయడం ఆరంభించగలిగాను. ప్రస్తుతం కార్లా, నేను 70వ పడిలో ఉన్నాము, మేము ఇప్పుడు ప్రయాణ పనిలో లేము. నేను ఇకపై చేపట్టలేని సేవాధిక్యతను అంటిపెట్టుకొని ఉండటంలో అర్థం లేదని గ్రహించడానికి యెహోవా సహాయం చేశాడు.
వెనక్కి తిరిగి చూసినప్పుడు, మా పిల్లల హృదయాల్లో సత్యంపై ప్రేమను ప్రగాఢంగా నాటడానికి మాకు సహాయం చేసినందుకు, కార్లా నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞతగా వున్నాం. (సామెతలు 22:6) ఇన్ని సంవత్సరాలలోనూ, యెహోవా మేము మా బాధ్యతలను నెరవేర్చడానికి కావల్సిన నడిపింపును శిక్షణను ఇచ్చాడు. ఇప్పుడు మేము వృద్ధులము, అశక్తులము అయినప్పటికీ, యెహోవాపై మా ప్రేమ ఎప్పటిలాగే నవయౌవ్వనంతో సజీవంగా ఉంది.—రోమీయులు 12:10, 11.
[అధస్సూచి]
^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు అందుబాటులో లేదు.
[26వ పేజీలోని చిత్రం]
1965 లో హామ్‌బర్గ్‌లోని ఎల్బీ నది ప్రక్కగా నడుస్తున్న మా కుటుంబం
[28వ పేజీలోని చిత్రం]
1998 లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మా కుంటుంబంలోని కొందరు సభ్యులు
[29వ పేజీలోని చిత్రం]
నా భార్య కార్లాతో