కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సర్వోత్తమమైన” ప్రేమను మీరు చూపిస్తున్నారా?

“సర్వోత్తమమైన” ప్రేమను మీరు చూపిస్తున్నారా?

“సర్వోత్తమమైన” ప్రేమను మీరు చూపిస్తున్నారా?

“దేవుడు ప్రేమాస్వరూపి.” దేవుని లక్షణాల్లో అన్నిటికన్నా ఏది ప్రాముఖ్యమో అపొస్తలుడైన యోహాను రాసిన ఈ మాటల్లో తెలుస్తుంది. (1 యోహా. 4:8) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం ఆయనకు దగ్గరై, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం సాధ్యమౌతుంది. దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనముంది? “మనం ప్రేమించేదాన్నిబట్టే మన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది” అనే మాట ఎంత నిజమో మనం ప్రేమించేవారినిబట్టి, మనల్ని ప్రేమించేవారినిబట్టి మన వ్యక్తిత్వం మలచబడుతుంది అనేది కూడా అంతే నిజం. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు కాబట్టి మనమూ మన జీవితాల్లో ఆయనలా ప్రేమను చూపించగలం. (ఆది. 1:27) దేవుడే ‘మొదట మనలను ప్రేమించాడు కాబట్టి’ మనమూ ఆయనను ప్రేమిస్తున్నామని అపొస్తలుడైన యోహాను రాశాడు.—1 యోహా. 4:19.

ప్రేమను వర్ణించే నాలుగు పదాలు

అపొస్తలుడైన పౌలు ప్రేమను, “సర్వోత్తమమైన మార్గము” అని వర్ణించాడు. (1 కొరిం. 12:31) ఆయన ప్రేమను ఎందుకలా వర్ణించాడు? అసలు ఆయన ఎలాంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే “ప్రేమ” అనే పదానికున్న భావాన్ని ఇంకా బాగా తెలుసుకోవాలి.

పూర్వకాలంలో ప్రేమను వర్ణించేందుకు గ్రీకులు నాలుగు మూల పదాలను వివిధ విధాలుగా వాడేవారు. అవి స్టోర్‌గె, ఎరోస్‌, ఫిలియా, అగాపె. అయితే వీటన్నిటిలోనూ “ప్రేమాస్వరూపి” అయిన దేవుణ్ణి వర్ణించే సందర్భాల్లోఅగాపెను ఉపయోగించారు. * న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ అనే తన పుస్తకంలో అధ్యాపకుడైన విలియమ్‌ బార్‌క్లె, “అగాపె ముఖ్యంగా మనసుకు సంబంధించినది. అది మనకు తెలియకుండానే మన హృదయంలో పుట్టుకొచ్చే భావోద్వేగం కాదు. మనం ఇష్టపడి పాటించే ఒక సూత్రం. ఇష్టంతో చూపించే ప్రేమే అగాపె” అని అన్నాడు. ఈ సందర్భంలో, సూత్రాన్ని అనుసరించి చూపించే ప్రేమే అగాపె ప్రేమ. అయితే, మనసు లోతుల్లో నుండి వచ్చే భావవేశాలు కూడా ఈ ప్రేమలో ఉంటాయి. సూత్రాలన్నాక మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. అయితే క్రైస్తవులు మాత్రం బైబిల్లో యెహోవా దేవుడు ఇచ్చిన మంచి సూత్రాలనే పాటించాలి. బైబిల్లో అగాపే గురించి వివరించారు, అలాగే ఇతర ప్రేమల గురించి కూడా వివరించారు, ఆ రెండింటినీ పోల్చి చూస్తే మనమెలాంటి ప్రేమను చూపించాలో చక్కగా అర్థమౌతుంది.

కుటుంబ సభ్యుల మధ్యవుండే ప్రేమ

మనం ప్రేమానురాగాలుగల కుటుంబంలో ఉన్నట్లయితే ఆ ఆనందం వేరే చెప్పనక్కర్లేదు! కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగాన్ని వర్ణించేందుకు తరచూ స్టోర్‌గె అనే గ్రీకు పదాన్ని వాడారు. క్రైస్తవులు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ చూపించడానికి కృషిచేస్తారు. అయితే అంత్యదినాల్లో “అనురాగరహితులు” ఉంటారని పౌలు ప్రవచించాడు. *2 తిమో. 3:1, 3.

విచారకరంగా, మన కాలంలో కుటుంబ సభ్యుల మధ్య అనురాగం కనిపించడం లేదు. చాలామంది ఎందుకు గర్భస్రావం చేయించుకుంటున్నారు? ఎందుకు ఎన్నో కుటుంబాలు వయసు మళ్లిన తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు? ఎందుకు విడాకులు తీసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది? మనుష్యుల మధ్య మమతానురాగాలు లేకపోవడమే వీటన్నిటికీ కారణం.

అంతేకాదు “హృదయము అన్నిటికంటె మోసకరమైనది” అని బైబిలు చెబుతోంది. (యిర్మీ. 17:9) కుటుంబంలో చూపించే ప్రేమ హృదయం నుండి పుడుతుంది. అయితే ఆసక్తికరంగా ఒక భర్త తన భార్యపట్ల చూపించాల్సిన ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అగాపె పదాన్ని ఉపయోగించాడు. పౌలు ఆ ప్రేమను క్రీస్తు సంఘంపట్ల చూపించే ప్రేమతో పోల్చాడు. (ఎఫె. 5:28, 29) ఈ ప్రేమ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన యెహోవా దేవుడు ఇచ్చిన సూత్రాల ప్రకారం ఉంటుంది.

కుటుంబ సభ్యులపట్ల మనకు నిజంగా అనురాగం ఉంటే వయసు మళ్లిన మన తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటాం, మన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటాం. అంతేకాకుండా అవసరమైనప్పుడు పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెడతాం. పిల్లలు కదా అని అతిగారాభం చేయం. ఎందుకంటే అలాచేస్తే పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చినట్లౌతుంది.—ఎఫె. 6:1-4.

స్త్రీపురుషుల మధ్యవుండే ప్రేమ, బైబిలు సూత్రాలు

వివాహితుల మధ్యవుండే ప్రేమ దేవుడిచ్చిన బహుమానం. (సామె. 5:15-17) అయితే ఇలాంటి ప్రేమను వర్ణించేందుకు ఉపయోగించే ఎరోస్‌ అనే పదాన్ని బైబిలు రచయితలు వాడలేదు. ఎందుకు? దానికి సమాధానం కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కావలికోటలో ఉంది. అది ఇలా చెబుతుంది, “ప్రాచీన కాలంలో గ్రీకులు చేసిన తప్పునే నేటి ప్రజలు కూడా చేస్తున్నారనిపిస్తుంది. వాళ్లు ఎరోస్‌ను దేవునిగా పూజించేవారు, వారు అతని బలిపీఠం ముందు నమస్కరించి, బలులు అర్పించేవారు.  . . . కానీ అలా లైంగిక వాంఛను ఆరాధించడం దిగజారుడుతనానికి, విచ్చలవిడితనానికి, చివరికి నాశనానికి దారితీస్తుందని చరిత్ర చూపిస్తుంది. బహుశా అందుకే బైబిలు రచయితలు ఆ పదాన్ని ఎక్కడా వాడుండరు.” మనం ఒక వ్యక్తి పైరూపాన్ని మాత్రమే చూసి వారి ప్రేమలో పడకుండా ఉండాలంటే బైబిలు సూత్రాలను పాటించాలి. అందుకే, ‘నాకు ఆమె/అతని పట్ల ఆకర్షణతోపాటు నిజమైన ప్రేమ కూడా ఉందా?’ అని ప్రశ్నించుకోవాలి.

లైంగిక కోరికలు ఎక్కువగా ఉండే “ఈడు”లో బైబిలు సూత్రాలు పాటించే యౌవనస్థులు నైతికంగా పరిశుభ్రంగా ఉంటారు. (1 కొరిం. 7:36; కొలొ. 3:5) వివాహాన్ని యెహోవా దేవుడు ఇచ్చిన పవిత్రమైన బహుమతిగా చూస్తాం. పెళ్లి చేసుకున్న వారి గురించి మాట్లాడుతూ యేసు, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అని అన్నాడు. (మత్త. 19:6) ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ ఉన్నంత వరకు మాత్రమే కలిసివుండడం కాదుగానీ వివాహ ప్రమాణానికి కట్టుబడి జీవితాంతం కలిసుండాలి. వివాహ జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు, వాటిని తప్పించుకు తిరగడానికి ప్రయత్నించే బదులు కుటుంబ జీవితం సంతోషంగా ఉండడం కోసం దైవిక లక్షణాలను చూపించడానికి కృషి చేయాలి. అలా కృషి చేస్తే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం.—ఎఫె. 5:33; హెబ్రీ. 13:4.

స్నేహితుల మధ్యవుండే ప్రేమ

స్నేహితులు లేకపోతే జీవితం బోరుకొడుతుంది. “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” అని బైబిల్లో ఓ సామెత ఉంది. (సామె. 18:24) మనకు మంచి స్నేహితులుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. దావీదు, యోనాతానులు ప్రాణస్నేహితులని మనం చాలాసార్లు విన్నాం. (1 సమూ. 18:1) యేసు “ప్రేమించిన” అపొస్తలుడు యోహాను అని బైబిలు చెబుతుంది. (యోహా. 20:2) గ్రీకు భాషలో స్నేహితులు పట్ల చూపించే ‘ప్రేమను’ ఫిలియా అంటారు. సంఘంలో ప్రాణ స్నేహితులుండడం తప్పేం కాదు. 2 పేతురు 1:7 నూతనలోక అనువాదం ప్రకారం, “సోదర అనురాగానికి” (ఫిలదెల్ఫియ అనే పదబంధం ‘స్నేహితుణ్ణి’ సూచించేందుకు గ్రీకులో ఉపయోగించే ఫిలోస్‌ అనే పదానికి, “సహోదరుడు” అనే అర్థంవచ్చే అడెల్ఫోస్‌ అనే గ్రీకు పదాన్ని కలిపితే వస్తుంది) తోడుగా ప్రేమను (అగాపెను) చూపించాలి. మన స్నేహం చిరకాలం ఉండాలంటే మనం ఈ సలహాను పాటించాలి. కాబట్టి, ‘స్నేహితులపట్ల నేను చూపించే ప్రేమ బైబిలు సూత్రాల ప్రకారం ఉందా?’ అని ఆలోచించాలి.

దేవుని వాక్యం చెప్పేదాన్ని పాటిస్తే స్నేహితుల విషయంలో పక్షపాతం చూపించం. స్నేహితులను ఒకలా ఇతరులను మరోలా చూడం. అంటే స్నేహితుల తప్పుల్ని చూసి చూడనట్లు వదిలేస్తూ స్నేహితులు కానివారి విషయంలోనైతే కఠినంగా వ్యవహరించం. అంతేకాక స్నేహితులను సంపాదించుకోవాలని ఇతరులను అనవసరంగా పొగడము. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, బైబిలు సలహాలు పాటిస్తే మంచి స్నేహితుల్ని వివేచనతో ఎంపికచేసుకోగలుగుతాం, ‘మంచి నడవడిని చెరిపే దుష్టసాంగత్యానికి’ దూరంగా ఉండగలుగుతాం.—1 కొరిం. 15:33.

సాటిలేని ప్రేమబంధం

క్రైస్తవులను ఐక్యపరిచే అనుబంధం నిజంగా సాటిలేనిది! ‘మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగముగలవారై ఉండండి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 12:9, 10) అందుకే క్రైస్తవులు ‘నిష్కపటమైన ప్రేమను’ (అగాపే) చూపిస్తారు. ఇది కేవలం మన హృదయంలో నుండి పొంగుకొచ్చే భావావేశం కాదు. ఈ ప్రేమ బైబిలు సూత్రాల ప్రకారం ఉంటుంది. అయితే పౌలు “సహోదర ప్రేమ” (ఫిలదెల్ఫియ), “అనురాగము” (ఫిలోస్టోర్‌గోస్‌ అనే పదబంధం, ఫిలోస్‌, స్టోర్‌గె అనే రెండు పదాలు కలిపితే వస్తుంది) గురించి కూడా మాట్లాడాడు. “సహోదర ప్రేమ” అంటే, “ప్రేమానురాగాలు, దయ, జాలి చూపించడం, సహాయం చేయడం” అని ఒక విద్వాంసుడు చెప్పాడు. సహోదర ప్రేమను అగాపెతో కలిపి చూపించినప్పుడు యెహోవా ఆరాధకులు ఒకరికొకరు దగ్గరౌతారు. (1 థెస్స. 4:9, 10) మరో పదాన్ని కూడా “అనురాగం” అని అనువదించారు. ఈ పదం బైబిల్లో ఒక్కసారే కనిపిస్తుంది. కుటుంబంలో ఎలాంటి దగ్గరి అనుబంధం ఉంటుందో అలాంటి అనుబంధాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడారు. *

కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య ఉండే ప్రేమానురాగాలు నిజక్రైస్తవులు చూపిస్తారు. అయితే వాటితోపాటు బైబిలు సూత్రాల ప్రకారం ఉండే ప్రేమను చూపిస్తారు కాబట్టే వారు ఐక్యంగా ఉంటారు. క్రైస్తవ సంఘమంటే నలుగురు వచ్చిపోయే క్లబ్‌ కాదు, అది యెహోవాను ఐక్యంగా ఆరాధించే ప్రేమానురాగాలుగల కుటుంబం. మనం తోటి విశ్వాసులను సహోదరసహోదరీలని పిలవడమే కాదు వారిని అలా చూస్తాం కూడా. యెహోవా కుటుంబంలో వారూ ఉన్నారు కాబట్టి మనం వారిని స్నేహితుల్లా ప్రేమించి, బైబిలు సూత్రాల ప్రకారం వారితో ఎల్లప్పుడు ప్రవర్తిస్తాం. నిజమైన క్రైస్తవ సంఘం ముఖ్యంగా ప్రేమ అనే లక్షణాన్ని చూపిస్తుంది. ఆ ప్రేమవల్ల దాని సభ్యులు ఐక్యంగావుంటారు. ఆ ప్రేమబంధాన్ని పటిష్ఠపర్చడానికి శాయశక్తులా కృషిచేస్తూవుందాం.

[అధస్సూచీలు]

^ పేరా 5 చెడు విషయాలపట్ల చూపించే ప్రేమను సూచించడానికి కూడా అగాపె ఉపయోగించారు.—యోహా. 3:19; 12:43; 2 తిమో. 4:10; 1 యోహా. 2:15-17.

^ పేరా 7 లేదు, కాదు అని అర్థం వచ్చే ‘a’ అనే గ్రీకు అక్షరాన్ని స్టోర్‌గె (stor·geʹ) ముందు చేరిస్తే ఒక పదబంధం వస్తుంది. దాన్నే “అనురాగరహితులు” అని అనువదించారు.—రోమీయులు 1:31 కూడా చూడండి.

^ పేరా 18 నూతనలోక అనువాదంలో వేరే గ్రీకు పదాలను కూడా “అనురాగం” అని అనువదించారు. అందువల్లే, ఆ అనువాదంలో “అనురాగం” అనే పదం రోమీయులకు 12:10లోనే కాకుండా ఫిలిప్పీయులకు 1:8, 1 థెస్సలొనీకయులకు 2:8లో కూడా చూస్తాం.

[12వ పేజీలోని బ్లర్బ్‌]

మనల్ని ఐక్యంగావుంచే ప్రేమ బంధాన్ని పటిష్ఠం చేయడానికి మీరు ఏమి చేస్తున్నారు?