“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు”
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు”
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు . . . దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”—ప్రక. 22:17.
1, 2. మన జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు ఏ స్థానమివ్వాలి? ఎందుకు?
మన జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు ఏ స్థానమివ్వాలి? “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. ఒకవేళ వారలా చేసినట్లయితే దేవుడు వారికి అవసరమైనవి అనుగ్రహిస్తాడనే హామీనిచ్చాడు. (మత్త. 6:25-33) ఆయన దేవుని రాజ్యాన్ని ఎంత విలువైన ముత్యంతో పోల్చాడంటే, దానిని కనుగొన్న వర్తకుడు ‘తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుక్కున్నాడు.’ (మత్త. 13:45, 46) మనం కూడా రాజ్య ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి అంతే ప్రాముఖ్యతనివ్వాలి.
2 మనం ముందరి రెండు ఆర్టికల్స్‌లో చూసినట్లు, పరిచర్యలో ధైర్యంగా మాట్లాడుతూ, దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించినప్పుడు మనకు దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశముందని చూపిస్తాం. ఆ పరిశుద్ధాత్మే రాజ్య ప్రకటనా పనిని క్రమంగా చేయడానికి కూడా మనకు ఎంతో సహాయం చేస్తుంది. అది ఎలాగో చూద్దాం.
అందరికీ ఆహ్వానం!
3. ఎలాంటి నీళ్లు తాగడానికి ‘రమ్మని’ మానవులందరూ ఆహ్వానించబడుతున్నారు?
3 పరిశుద్ధాత్మ ద్వారా మానవులందరికీ ఆహ్వానం ఇవ్వబడుతోంది. (ప్రకటన 22:17 చదవండి.) ఎంతో ప్రత్యేకమైన నీళ్లతో తమ దాహం తీర్చుకోవడానికి ‘రమ్మని’ అందరూ ఆహ్వానించబడుతున్నారు. ఇది హైడ్రోజన్ (ఉదజని) రెండుపాళ్లు, ఆక్సిజన్ (ఆమ్లజని) ఒక పాలుగల మామూలు నీళ్లు కాదు. నీళ్లు భూప్రాణులకు జీవాధారమైనప్పటికీ, బావి దగ్గర యేసు సమరయ స్త్రీతో ఆ నీళ్ల గురించి కాక మరో రకమైన నీళ్ల గురించి మాట్లాడాడు. ఆయన, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును” అని అన్నాడు. (యోహా. 4:14) ఆ విశేషమైన నీళ్లు తాగే మానవులందరూ నిత్యజీవం పొందుతారు.
4. జీవజలం ఎందుకు అవసరమైంది? ఆ జలం వేటిని సూచిస్తుంది?
4 మొదటి మానవుడైన ఆదాము తన భార్యతో చేతులు కలిపి తమ సృష్టికర్త అయిన యెహోవా దేవుని మీదే తిరుగుబాటు చేసినప్పుడు జీవమివ్వగల ఈ నీళ్ల అవసరం ఏర్పడింది. (ఆది. 2:16, 17; 3:1-6) ఆదాము ‘తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించే’ అవకాశం లేకుండా ఆ మొదటి దంపతులు తమ గృహమైన ఏదెను తోట నుండి వెళ్లగొట్టబడ్డారు. (ఆది. 3:22) మానవులకు ఆదామే మూలపురుషుడు కాబట్టి ఆయనవల్లే అందరికీ మరణం వచ్చింది. (రోమా. 5:12) విధేయత చూపించే మానవులందరినీ పాపమరణాల నుండి విడిపించడానికి, వారు పరదైసు భూమిపై పరిపూర్ణ శరీరాలతో నిరంతరం జీవించడానికి దేవుడు చేసిన ఏర్పాట్లన్నిటినీ ఆ జీవజలం సూచిస్తుంది. విమోచన క్రయధనముగా యేసు అర్పించిన బలి మూలంగానే ఆ ఏర్పాట్లన్నీ సాధ్యమయ్యాయి.—మత్త. 20:28; యోహా. 3:16; 1 యోహా. 4:9, 10.
5. ‘జీవజలము ఉచితముగా పుచ్చుకోవడానికి’ రమ్మని ఎవరు ఆహ్వానిస్తున్నారు? వివరించండి.
5 ‘జీవజలము ఉచితముగా పుచ్చుకోవడానికి’ రమ్మని ఎవరు ఆహ్వానిస్తున్నారు? (ప్రక. 22:17) యేసు ద్వారా మానవులందరూ నిత్యమూ జీవించడానికి చేయబడిన ఏర్పాట్లన్నీ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో సంపూర్ణంగా అందుబాటులోకి వస్తాయి. ఆ ఏర్పాట్లన్నీ “స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నదిగా” వర్ణించబడ్డాయి. ఆ నది “దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి” ప్రవహిస్తోంది. (ప్రక. 22:1) కాబట్టి జీవమివ్వగల ఆ నీళ్ల ఊట, జీవదాత అయిన యెహోవా దగ్గరే ఉంది. (కీర్త. 36:9) ఆయనే ‘గొర్రెపిల్ల’ అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ నీళ్లు అందేలా చేస్తాడు. (యోహా. 1:29) ఆదాము అవిధేయత వల్ల మానవులకు జరిగిన హానినంతా ఈ సూచనార్థక జీవజలముల నది ద్వారా యెహోవా తీసివేస్తాడు. వీటన్నిటినిబట్టి చూస్తే, యెహోవా దేవుడే స్వయంగా ‘రమ్మని’ ఆహ్వానిస్తున్నట్లు చెప్పవచ్చు.
6. “జీవజలముల నది” ఎప్పుడు ప్రవహించసాగింది?
6 క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో “జీవజలముల నది” పూర్తి స్థాయిలో ప్రవహించినా, నిజానికి అది 1914లో ‘గొర్రెపిల్ల’ పరలోక సింహాసనంపై కూర్చున్నప్పటి నుండి, అంటే ‘ప్రభువు దినం’ ఆరంభం నుండి ప్రవహించసాగింది. (ప్రక. 1:10) దానితో, జీవానికి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. అలా వచ్చినవాటిలో దేవుని వాక్యమైన బైబిలు ఒకటి. ఎందుకంటే దానిలోని సందేశం ‘ఉదకం’ లేదా నీళ్లు అని పేర్కొనబడింది. (ఎఫె. 5:25) రాజ్య సందేశాన్ని విని, దానికి స్పందించడం ద్వారా ‘జీవజలాన్ని పుచ్చుకోమనే’ ఆహ్వానం అందరికీ ఇవ్వబడుతోంది. అయితే, నిజానికి ప్రభువు దినంలో ఎవరు ఈ పనిలో పాల్గొంటున్నారు?
‘పెండ్లి కుమార్తె రమ్మని చెబుతోంది’
7. “ప్రభువు దినమందు” ఎవరు ‘రమ్మని’ మొదట ఆహ్వానించారు? ఎవరిని ఆహ్వానించారు?
7 పెండ్లి కుమార్తె తరగతి సభ్యులైన అభిషిక్త క్రైస్తవులు ‘రమ్మని’ మొదట ఆహ్వానించారు. ఎవరిని ఆహ్వానించారు? వారు ‘రమ్మని’ తమనుతాము ఆహ్వానించుకోలేదుగానీ, ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధాన్ని’ తప్పించుకొని భూమ్మీద నిత్యం జీవించే అవకాశమున్న వారిని ఆహ్వానించారు.—ప్రకటన 16:14, 16 చదవండి.
8. అభిషిక్త క్రైస్తవులు 1918 నుండే యెహోవా ఇచ్చిన ఆహ్వానాన్ని అందిస్తున్నారని ఏది చూపిస్తోంది?
8 క్రీస్తు అభిషిక్త అనుచరులు 1918 నుండే ఆ ఆహ్వానం అందిస్తున్నారు. ఆ సంవత్సరంలో ఇవ్వబడిన, ‘ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరణించకపోవచ్చు’ అనే ప్రసంగంలో హార్‌మెగిద్దోను యుద్ధాన్ని తప్పించుకునే అనేకులు పరదైసు భూమిపై జీవిస్తారని వివరించబడింది. అమెరికాలోని ఒహాయో, సీడార్ పాయింట్‌వద్ద 1922లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశంలో ఇవ్వబడిన ఓ ప్రసంగంలో ప్రేక్షకులు ‘రాజ్యాన్ని, రాజును గురించి ప్రకటించండి’ అని ప్రోత్సహించబడ్డారు. ఈ ప్రోత్సాహంతో పెండ్లి కుమార్తె తరగతిలోని మిగతా సభ్యులు ఇంకా అనేకులను ఆహ్వానించగలిగారు. కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1929 సంచికలో ప్రకటన 22:17 ఆధారంగా రూపొందించబడిన ‘కృపాసహితమైన ఆహ్వానం’ అనే ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్‌లో కొంతభాగం ఇలావుంది: “నమ్మకస్థులైన అభిషిక్తుల శేషము [మహోన్నతునితోపాటు] కృపాసహితంగా ఆహ్వానిస్తూ ‘రమ్మని’ చెబుతున్నారు. నీతి కోసం, సత్యం కోసం తపించేవారికి ఈ సందేశం ప్రకటించాలి. ఆ పనిని ఇప్పుడే చేయాలి.” మన కాలంలోనూ పెండ్లి కుమార్తె తరగతి సభ్యులు ఆ ఆహ్వానాన్ని అందిస్తూనే ఉన్నారు.
‘వినువాడు రమ్మని చెప్పాలి’
9, 10. విన్నవారు కూడా ఇతరులను ‘రమ్మని’ ఆహ్వానించేందుకు ఎలా ప్రోత్సహించబడ్డారు?
9 ‘రమ్మనే’ ఆహ్వానాన్ని విన్నవారు ఏమి చేయాలి? వారు కూడా ఇతరులను ‘రమ్మని’ ఆహ్వానించాలి. ఉదాహరణకు, కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 1, 1932 సంచికలోని 232వ పేజీలో ఇలావుంది: “ఆహ్వానానికి స్పందించిన వారందరినీ రాజ్యసువార్త ప్రకటించమని అభిషిక్తులు ప్రోత్సహించాలి. ప్రభువు సందేశాన్ని ప్రకటించేందుకు వారు అభిషిక్తులే కానవసరం లేదు. హార్‌మెగిద్దోను యుద్ధం తప్పించుకొని భూమిపై నిరంతరం జీవించే అవకాశమున్న ప్రజలకు ఈ జీవజలం ఇవ్వవచ్చని ఇప్పుడు తెలుసుకోవడం యెహోవాసాక్షులకు ఎంతో ఓదార్పునిస్తుంది.”
10 ‘రమ్మనే’ ఆహ్వానాన్ని విన్నవారు ఏమి చేయాలో కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1934 సంచికలోని 249వ పేజీలో ఇలా వివరించబడింది: ‘యెహోనాదాబు తరగతి వారు అభిషిక్త యెహోవాసాక్షులు కాకపోయినా, యెహూ తరగతి వారితో అంటే అభిషిక్తులతో కలిసి రాజ్యసువార్త ప్రకటించాలి.’ ప్రకటన 7:9-17లో ప్రస్తావించబడిన “గొప్పసమూహము” ఎవరిని సూచిస్తుందో 1935లో స్పష్టం చేయబడింది. దానితో దేవుని ఆహ్వానాన్ని ఇతరులకు అందించే పని వేగం పుంజుకుంది. అప్పటి నుండి రోజురోజుకీ పెరుగుతున్న గొప్పసమూహానికి చెందిన సత్యారాధకులు ఆ ఆహ్వానానికి స్పందిస్తున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 70 లక్షలకన్నా ఎక్కువేవుంది. కృతజ్ఞతాపూర్వకంగా ఆ సందేశాన్ని విన్న తర్వాత వారు దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోవడమే కాక, పెండ్లి కుమార్తె తరగతితో కలిసి ‘జీవజలమును ఉచితంగా పుచ్చుకోవడానికి రమ్మని’ ఉత్సాహంగా ఇతరులను ఆహ్వానిస్తున్నారు.
దేవుని ‘ఆత్మ రమ్మని చెబుతోంది’
11. సా.శ. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ ప్రకటనా పనికి ఎలా దోహదపడింది?
11 యేసు నజరేతులోని సమాజ మందిరములో ప్రకటిస్తూ యెషయా గ్రంథం విప్పి ఇలా చదివాడు: “ప్రభువు [యెహోవా] ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” ఆ తర్వాత యేసు ఆ మాటలను తనకు అన్వయించుకుంటూ, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది” అని వారితో అన్నాడు. (లూకా 4:17-21) పరలోకానికి ఎక్కిపోవడానికి ముందు యేసు తన శిష్యులతో, ‘పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు భూదిగంతముల వరకు, నాకు సాక్షులైయుందురు’ అని చెప్పాడు. (అపొ. 1:8) సా.శ. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ ప్రకటనా పనిలో ప్రముఖ పాత్ర పోషించింది.
12. మన కాలంలో ఆహ్వానం అందించే పనిలో పరిశుద్ధాత్మ ఎలా తోడ్పడుతోంది?
12 మరి మన కాలంలో ఇతరులకు ఆహ్వానం అందజేయడంలో దేవుని పరిశుద్ధాత్మ ఎలా దోహదపడుతోంది? ఆ పరిశుద్ధాత్మకు యెహోవాయే మూలం. పెండ్లి కుమార్తె తరగతి సభ్యులు తన వాక్యమైన బైబిలును అర్థం చేసుకునేలా వారి హృదయాలను, మనసులను తెరిచేందుకు యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడు. పరదైసు భూమ్మీద నిత్యం జీవించే అవకాశమున్న వారికి ఆహ్వానం అందించి, బైబిలు సత్యాలను వివరించేలా ఆ పరిశుద్ధాత్మ వారికి తోడ్పడుతోంది. ఆ ఆహ్వానం అందుకొని యేసుక్రీస్తు శిష్యులై ఇంకా ఇతరులకు ఆహ్వానం అందించేవారి విషయమేమిటి? వారికి కూడా పరిశుద్ధాత్మ తోడ్పడుతుంది. వారు ‘పరిశుద్ధాత్మ నామములో’ బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి, వారు పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం ప్రకారం నడుచుకుంటూ దాని సహాయం తీసుకుంటారు. (మత్త. 28:19) అటు అభిషిక్తులు, ఇటు పెరుగుతున్న గొప్పసమూహపువారు ప్రకటించే సందేశం గురించి కూడా ఆలోచించండి. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిల్లోని సందేశాన్ని వారు ప్రకటిస్తారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆహ్వానం అందించబడుతోంది. మనం నిజానికి ఆ పరిశుద్ధాత్మ నిర్దేశంలో నడుస్తున్నాం. మనకు ఈ విషయం తెలుసు కాబట్టి ఇతరులను ఆహ్వానించే పనిలో ఎంత సమయాన్ని వెచ్చించాలి?
వారు ‘రమ్మని చెప్పుచున్నారు’
13. “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు” అనే మాటలను బట్టి మనకేమి అర్థమౌతోంది?
13 “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు.” ఈ మాటలను బట్టి దేవుని ఆహ్వానాన్ని వారు ఎల్లప్పుడూ అందిస్తున్నారని అర్థమౌతోంది. మరి ఆ ఆహ్వానం అంగీకరించిన వారి విషయమేమిటి? వారు కూడా ‘రమ్మని’ అంటారు. గొప్ప సమూహానికి చెందిన సత్యారాధకులు ‘రాత్రింబగళ్లు యెహోవా ఆలయంలో సేవ చేస్తున్నారు’ అని బైబిలు చెబుతోంది. (ప్రక. 7:9, 15) వారు ఏ విధంగా ‘రాత్రింబగళ్లు సేవ చేస్తున్నారు?’ (లూకా 2:36, 37; అపొస్తలుల కార్యములు 20:31; 2 థెస్సలొనీకయులు 3:8 చదవండి.) వృద్ధ ప్రవక్త్రి అయిన అన్న ఉదాహరణను, అపొస్తలుడైన పౌలు ఉదాహరణను చూస్తే ‘రాత్రింబగళ్లు సేవ’ చేయడమంటే క్రమం తప్పకుండా, హృదయపూర్వకంగా పరిచర్యలో పాల్గొనడమని అర్థమౌతోంది.
14, 15. క్రమం తప్పకుండా ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో దానియేలు ఎలా చూపించాడు?
14 క్రమం తప్పకుండా ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో ప్రవక్తయైన దానియేలు జీవితాన్ని చూస్తే కూడా అర్థమౌతుంది. (దానియేలు 6:4-10, 16 చదవండి.) క్రమం తప్పకుండా ‘అనుదినం ముమ్మారు దేవునికి ప్రార్థించే’ అలవాటు ఆయనకుండేది. ఆయన ఆ అలవాటును మానుకోకుంటే సింహపు గుహలో పడవేయబడే ప్రమాదమున్నా ఆయన కనీసం ఒక నెలైనా ఆ అలవాటును మానుకోలేదు. యెహోవాను క్రమం తప్పకుండా ఆరాధించడంకన్నా ప్రాముఖ్యమైనది మరొకటి లేదు అని ఆయనను చూసినవారు స్పష్టంగా గ్రహించివుంటారు.—మత్త. 5:16.
15 దానియేలు సింహం గుహలో ఒక రాత్రి గడిపిన తర్వాత, రాజు స్వయంగా అక్కడికెళ్లి దుఃఖ స్వరముతో, “జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా?” అని అడిగాడు. అందుకు దానియేలు వెంటనే, “రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా” అని జవాబిచ్చాడు. క్రమం తప్పకుండా ‘నిత్యమూ’ తనను సేవించినందుకు యెహోవా దానియేలును ఆశీర్వదించాడు.—దాని. 6:19-22.
16. దానియేలు ఉదాహరణ పరిశీలించిన మనం, మన పరిచర్య గురించి ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
16 దానియేలు దేవునికి ప్రార్థించే తన అలవాటును మానుకునే బదులు మరణించడానికే సిద్ధపడ్డాడు. మరి మన విషయమేమిటి? క్రమం తప్పకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మనమే త్యాగాలు చేస్తున్నాం లేదా ఎలాంటి త్యాగాలు చేసేందుకు ఇష్టపడుతున్నాం? ఇతరులతో యెహోవా గురించి మాట్లాడని నెలంటూ ఏదీ ఉండకూడదు. వీలైతే, ప్రతీ వారం పరిచర్యలో పాల్గొనేందుకు మనమెందుకు కృషి చేయకూడదు? మనం అనారోగ్యం కారణంగా నెలలో కేవలం 15 నిమిషాలే సాక్ష్యమివ్వగలిగినా, మనం దానిని రిపోర్టు చేయాలి. ఎందుకు? ఎందుకంటే పరిశుద్ధాత్మతో, పెండ్లి కుమార్తెతో కలిసి మనం “రమ్ము” అనే ఆహ్వానాన్ని ఇస్తూ ఉండాలని ఇష్టపడతాం. అవును, మనం క్రమం తప్పని రాజ్య ప్రచారకులముగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేయాలని కోరుకుంటాం.
17. యెహోవా ఆహ్వానాన్ని అందించేందుకు దొరికే ఏ అవకాశాలను మనం జారవిడుచుకోకూడదు?
17 పరిచర్యకు మనం కేటాయించిన సమయంలోనే కాక అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ యెహోవా ఆహ్వానాన్ని ఇతరులకు అందించేందుకు మనం ప్రయత్నించాలి. ఇతర సమయాల్లో అంటే షాపింగ్ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, సెలవుల్లో ఉన్నప్పుడు, ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో ఉన్నప్పుడు దప్పిగొనిన వారిని ‘జీవజలములు ఉచితంగా పుచ్చుకోండి’ అని ఆహ్వానించడం ఎంత గొప్ప అవకాశమో కదా! ప్రభుత్వాలు మన ప్రకటనా పనిపై ఆంక్షలు విధించినప్పటికీ మనం జాగ్రత్తగా మన పరిచర్యను కొనసాగిస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఒకే రోజు వీధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ప్రకటించే బదులు, అక్కడక్కడ కొన్ని ఇళ్లలో మాత్రమే ప్రకటించి వేరే ప్రాంతానికి వెళ్తాం లేదా అవకాశం దొరికినప్పుడల్లా సాక్ష్యం ఇచ్చే పనిని మరింత ఎక్కువ చేస్తాం.
‘రమ్మని’ చెబుతూనే ఉండండి
18, 19. దేవుని జత పనివారిగా ఉండేందుకు మీకు లభించిన అవకాశాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారని మీరెలా చూపిస్తారు?
18 ఇప్పటికి దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా పరిశుద్ధాత్మ, పెండ్లి కుమార్తె దప్పిగొనిన వారిని ‘రమ్మని’ ఆహ్వానిస్తూనే ఉన్నారు. పులకరింపజేసే వారి ఆహ్వానాన్ని మీరు విన్నారా? అలాగైతే మీరు కూడా ఆ ఆహ్వానాన్ని ఇతరులకు అందించాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.
19 యెహోవా ఇంకెంత కాలం తన ఆహ్వానాన్ని అందిస్తాడో మనకు తెలియదు, అయితే ‘రమ్మనే’ ఆహ్వానాన్ని విని దానిని ఇతరులకు కూడా అందించినప్పుడు మనం దేవుని జత పనివారమౌతాం. (1 కొరిం. 3:6, 9) అదెంత గొప్ప అవకాశం! మనం దానికెంతో విలువిస్తున్నామని చూపిస్తూ, క్రమంగా ప్రకటించడం ద్వారా “దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము” చెల్లిద్దాం. (హెబ్రీ. 13:15) భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్న మనందరం పెండ్లి కుమార్తెతో కలిసి ‘రమ్మని’ ఇతరులను ఆహ్వానిస్తూ ఉందాం. ఇంకా అనేకులు ‘జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకొందురు’ గాక!
మీరేమి తెలుసుకున్నారు?
• ‘రమ్మనే’ ఆహ్వానం ఎవరికి అందించబడింది?
• యెహోవాయే ‘రమ్మని’ ఆహ్వానిస్తున్నాడని ఎందుకు చెప్పవచ్చు?
• ‘రమ్మనే’ ఆహ్వానం అందించడంలో పరిశుద్ధాత్మ ఎలా తోడ్పడుతోంది?
• పరిచర్యలో క్రమంగా పాల్గొనేందుకు మనమెందుకు కృషిచేయాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[16వ పేజీలోని చార్టు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
‘రమ్మని’ చెబుతూనే ఉండండి
1914
5,100 మంది ప్రచారకులు
1918
అనేకులు పరదైసు భూమ్మీద జీవిస్తారు
1922
‘రాజ్యాన్ని, రాజును గురించి ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి’
1929
నమ్మకమైన అభిషిక్త శేషం ‘రమ్మని’ చెబుతోంది
1932
“రమ్ము” అనే ఆహ్వానం అభిషిక్తులతో పాటు ఇతరులకూ అందించబడింది
1934
యెహోనాదాబు తరగతి ప్రకటనా పనిలో పాల్గొనేందుకు ఆహ్వానించబడింది
1935
“గొప్పసమూహము” గుర్తించబడింది
2009
73,13,173 ప్రచారకులు