సర్వోత్తమ జీవన మార్గానికి స్వాగతం!
సర్వోత్తమ జీవన మార్గానికి స్వాగతం!
‘మనము బ్రతికినను చనిపోయినను యెహోవావారమై ఉన్నాము.’—రోమా. 14:8.
1. సర్వోత్తమ జీవన మార్గం గురించి యేసు ఏమి బోధించాడు?
మనం సర్వోత్తమమైన విధంగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ప్రజలు వివిధ రకాలుగా జీవించినా, సర్వోత్తమ జీవన మార్గమనేది మాత్రం ఒక్కటే. మన జీవితంలో దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాదిరి నుండి నేర్చుకోవడం కన్నా మేలైనది మరొకటి లేదు. దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధించమని యేసు తన అనుచరులకు బోధించడమే కాక, శిష్యులను చేయమని కూడా వారికి ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20; యోహా. 4:24) మన జీవితంలో యేసు ఉపదేశాలను అనుసరిస్తే, మనం యెహోవాను సంతోషపెట్టి ఆయన ఆశీర్వాదాలు పొందుతాం.
2. మొదటి శతాబ్దంలో చాలామంది రాజ్య సందేశానికి ఎలా స్పందించారు? క్రైస్తవ ‘మార్గానికి’ చెందినవారు ఎలా జీవించాలి?
2 ‘నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరిగల’ ప్రజలు విశ్వాసులై, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, “సర్వోత్తమ జీవన మార్గానికి స్వాగతం” అని వారిని ఆహ్వానించేందుకు మనకెన్నో కారణాలున్నాయి. (అపొ. 13:48, NW) సా.శ. మొదటి శతాబ్దంలో వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది సత్యాన్ని అంగీకరించి, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుని పట్ల తమకున్న భక్తిని బహిరంగంగా చాటారు. (అపొ. 2:41) ఆ తొలి శిష్యులు క్రైస్తవ ‘మార్గానికి’ చెందినవారిగా గుర్తించబడ్డారు. (అపొ. 9:2; 19:23) వారు తమ జీవితమంతా యేసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని కనబరుస్తూ, ఆయన మాదిరిని అనుసరించారు కాబట్టి వారిని అలా పిలవడంలో తప్పులేదు.—1 పేతు. 2:21.
3. యెహోవా ప్రజలు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు? గత పది సంవత్సరాల్లో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు?
3 శిష్యులను చేసే పని ఈ అంత్యదినాల్లో వేగంగా ముందుకెళ్తూ, 230కన్నా ఎక్కువ దేశాలకు విస్తరించింది. గత పది సంవత్సరాల్లో, 27 లక్షలకన్నా ఎక్కువమంది యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకొని తమ సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ప్రతీవారం సగటున 5,000కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకున్నారు! దేవుని పట్ల ప్రేమతో, బైబిలు జ్ఞానంతో, తాము బోధించే విషయాల మీద తమకున్న విశ్వాసంతో వారు బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనకు యెహోవాతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది కాబట్టి, అది ఒక మైలురాయి లాంటిదే. అంతేకాక, తన మార్గంలో నడుచుకునేలా గతంలో తన సేవకులకు సహాయం చేసినట్లే, నమ్మకంగా నడుచుకునేందుకు మనకూ సహాయం చేస్తాడనే ధైర్యం మనకుందని బాప్తిస్మం తీసుకోవడం ద్వారా చూపిస్తాం.—యెష. 30:21.
బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి?
4, 5. బాప్తిస్మం తీసుకోవడంవల్ల మనకు లభించే కొన్ని ప్రయోజనాలు, ఆశీర్వాదాలు ఏమిటి?
4 మీరు ఇప్పటికే దేవుని గురించి తెలుసుకొని, అవసరమైన మార్పులు చేసుకొనివుంటారు. అంతేకాక, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా ప్రగతి సాధించివుంటారు. దానికి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. అయితే, మీరు ప్రార్థనలో దేవునికి సమర్పించుకున్నారా? బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ జీవితంలో కేవలం మీ సంతోషానికి లేదా వస్తుసంపాదనకు కాక యెహోవాను స్తుతించడానికే ప్రాధాన్యతనివ్వాలని బైబిలు అధ్యయనం ద్వారా ఇప్పటికే గ్రహించివుంటారు. (కీర్తన 148:11-13 చదవండి; లూకా 12:15) అలాగైతే, బాప్తిస్మం తీసుకోవడంవల్ల మనకు లభించే కొన్ని ప్రయోజనాలు, ఆశీర్వాదాలు ఏమిటి?
5 సమర్పించుకున్న క్రైస్తవునిగా, మీకు ఇప్పుడు జీవితంలో ఓ ఉత్తమ లక్ష్యముంది. మీరు దేవుడు ఇష్టపడే విధంగా నడుచుకుంటున్నారు కాబట్టి, సంతోషంగా ఉంటారు. (రోమా. 12:1, 2) మీరు సమాధానం, విశ్వాసం వంటి దైవిక లక్షణాలు అలవర్చుకునేలా యెహోవా పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుంది. (గల. 5:22, 23) దేవుడు మీ ప్రార్థనలకు జవాబిచ్చి, ఆయన వాక్య ప్రకారం జీవించేందుకు మీరు చేస్తున్న కృషిని ఆశీర్వదిస్తాడు. మీరు మీ పరిచర్యలో ఆనందిస్తారు, దేవుడు ఇష్టపడే విధంగా జీవించడం ద్వారా నిత్యజీవం పట్ల మీకున్న నమ్మకం బలపడుతుంది. అంతేకాక, సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు యెహోవాసాక్షుల్లో ఒకరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చూపిస్తారు.—యెష. 43:10-12.
6. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం ఏమి తెలియజేస్తాం?
6 దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం యెహోవా ప్రజలమని బహిరంగంగా చాటుతాం. “మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 14:7, 8) స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని ఘనపర్చాడు. దేవునిపట్ల ప్రేమతో ఈ జీవన మార్గంలో నడవాలని మనం గట్టిగా నిర్ణయించుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. (సామె. 27:11) బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం దేవునికి సమర్పించుకున్నామని చూపిస్తాం. అంతేకాక, యెహోవాయే మన పరిపాలకుడు అని బహిరంగంగా చాటుతాం. అలా విశ్వసర్వాధిపత్యం అనే వివాదాంశంలో మనం దేవుని పక్షాన ఉన్నామని అది చూపిస్తుంది. (అపొ. 5:29, 32) అంతేకాక, అలా చేసినప్పుడు యెహోవా మనకు అండగా ఉంటాడు. (కీర్తన 118:6 చదవండి.) బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఇప్పుడూ, ఎల్లప్పుడూ దేవుని సేవలో అనేక ఆశీర్వాదాలు పొందే అవకాశం లభిస్తుంది.
ప్రేమగల సహోదరసహోదరీల సహవాసం లభిస్తుంది
7-9. (ఎ) సమస్తం విడిచిపెట్టి తనను వెంబడించిన వారికి యేసు ఏ హామీ ఇచ్చాడు? (బి) మార్కు 10:29, 30లో యేసు ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరుతోంది?
7 అపొస్తలుడైన పేతురు, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకును?” అని యేసును అడిగాడు. (మత్త. 19:27) తన భవిష్యత్తు, యేసు ఇతర శిష్యుల భవిష్యత్తు ఎలా ఉంటుందో పేతురు తెలుసుకోవాలనుకున్నాడు. రాజ్య ప్రకటనా పనికే పూర్తిగా అంకితమవ్వడానికి వారెన్నో ప్రాముఖ్యమైన త్యాగాలు చేశారు. (మత్త. 4:18-22) యేసు వారికి ఏ హామీ ఇచ్చాడు?
8 మార్కు సువార్త ప్రకారం యేసు ఈ విషయాన్ని వివరిస్తున్నప్పుడు, వారు ఆధ్యాత్మిక సహోదర సహోదరీల్లో భాగమౌతారని తన శిష్యులకు సూచించాడు. ఆయన ఇలా అన్నాడు: “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను ఆక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మార్కు 10:29, 30) లూదియ, అకుల, ప్రిస్కిల్ల, గాయు వంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు తోటి విశ్వాసులకు తమ ‘ఇళ్లలో’ ఆశ్రయమిచ్చి, యేసు వాగ్దానం చేసినట్లు వారికి ‘అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు, తల్లులు’ అయ్యారు.—అపొ. 16:14, 15; 18:1-4; 3 యోహా. 1, 5-8.
9 యేసు చెప్పిన మాటలు మన కాలంలో ఇంకా ఎక్కువ స్థాయిలో నెరవేరుతున్నాయి. వివిధ దేశాల్లో దేవుని రాజ్య సంబంధ పనులు ఇంకా ఎక్కువ చేయడానికి మన కాలంలో కూడా మిషనరీలు, బెతెల్ కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ సేవకులు, మరితరులు తమ ‘భూములను’ అంటే తమ జీవనోపాధిని కూడా ఇష్టపూర్వకంగా త్యాగం చేసి వస్తున్నారు. నిరాడంబరంగా జీవిస్తూ దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది సహోదర సహోదరీలు తమ సొంత గృహాలను వదిలివెళ్లారు. యెహోవా వారినెలా చూసుకున్నాడో, దేవుని సేవచేయడం వల్ల వారెంత ఆనందించారో తెలియజేసే వారి అనుభవాలు విన్నప్పుడు మనమెంతో సంతోషిస్తాం. (అపొ. 20:35) అంతేకాక, బాప్తిస్మం తీసుకొని ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంలో భాగమైన యెహోవా సేవకులందరికీ ‘దేవుని రాజ్యమును నీతిని మొదట వెదికే’ గొప్ప అవకాశం లభిస్తుంది.—మత్త. 6:33.
“మహోన్నతుని చాటున” సురక్షితంగా ఉంటాం
10, 11. “మహోన్నతుని చాటు” అంటే ఏమిటి? మనం ఎలా దానిలో ఉండవచ్చు?
10 సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడంవల్ల “మహోన్నతుని చాటున నివసించే” గొప్ప ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. (కీర్తన 91:1 చదవండి.) మహోన్నతుని చాటు, ఆధ్యాత్మిక హాని కలగకుండా మనల్ని భద్రంగా కాపాడే సురక్షితమైన పరిస్థితిని లేదా స్థలాన్ని సూచిస్తుంది. దేవుని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, ఆయనమీద నమ్మకముంచేవారు మాత్రమే ఇలాంటి భద్రతను అనుభవిస్తారు కాబట్టి అది ‘చాటైన’ స్థలమని చెప్పవచ్చు. మన సమర్పణకు అనుగుణంగా జీవిస్తూ, యెహోవా పట్ల సంపూర్ణ నమ్మకాన్ని కనబరచినప్పుడు, మనం ఆయనతో ‘నువ్వు నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడవు’ అని చెప్పగలుగుతాం. (కీర్త. 91:2) అలాగే యెహోవా మన సురక్షితమైన నివాసస్థలమౌతాడు. (కీర్త. 91:9) ఇంతకన్నా మనకు మరింకేమి కావాలి?
11 యెహోవా ‘చాటైన స్థలంలో’ ఉన్నామంటే, మనం ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని వృద్ధిచేసుకునే అవకాశం కూడా మనకు ఇవ్వబడిందని అర్థం. ఆ తర్వాత బైబిలు అధ్యయనం చేస్తూ, హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, సంపూర్ణ విధేయత చూపిస్తే మనం దేవునికి దగ్గరవుతాం. అంతేకాక, ఆయనతో మన సంబంధాన్ని మరింత బలపర్చుకుంటాం. (యాకో. 4:8) యెహోవాతో యేసు కన్నా సన్నిహితంగా మెలిగినవారు ఎవరూ లేరు. ఆయన అన్ని సందర్భాల్లోనూ సృష్టికర్తపై నమ్మకముంచాడు. (యోహా. 8:29) కాబట్టి యెహోవాను గానీ, మనం మన సమర్పణకు తగ్గట్టు జీవించేలా సహాయం చేసే విషయంలో ఆయనకున్న కోరికను, సామర్థ్యాన్ని గానీ ఎన్నడూ సందేహించకుండా ఉందాం. (ప్రసం. 5:4) ఆయన మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని, మనం యథార్థంగా సేవించాలనే కోరిక ఆయనకు ఉందని చెప్పడానికి దేవుడు తన ప్రజల కోసం చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లే తిరుగులేని రుజువులు.
మనం అనుభవించే సమాధానాన్ని విలువైనదిగా ఎంచండి
12, 13. (ఎ) మన మధ్య ఎలాంటి సమాధానకర పరిస్థితి ఉంది? (బి) కొత్త వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?
12 సమర్పణ, బాప్తిస్మం వల్ల మనం దేవునితో సమాధానకరమైన సంబంధం కూడా కలిగివుండగలం. దేవునితోనేకాక, ఒకరితో ఒకరు శాంతియుత సంబంధం కలిగివున్న తోటి విశ్వాసులతోనూ ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని చవిచూస్తాం. (కీర్త. 29:11; యెష. 54:13) మన మధ్యవున్న సమాధానకర పరిస్థితిని లోకంలో మరెక్కడా మనం చూడలేం. ప్రాముఖ్యంగా, అంతర్జాతీయ సమావేశాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆయా జాతుల, భాషల, సంస్కృతుల నుండి వచ్చిన మన సహోదర సహోదరీలు ఐకమత్యంతో, శాంతితో, సహోదర ప్రేమతో మెలగుతారు.
13 మన సమాధానకర పరిస్థితికి పూర్తి భిన్నంగా లోకంలో ప్రజలు ఆధ్యాత్మికంగా ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. (యెషయా 65:13, 14 చదవండి.) మనం రాజ్య సందేశాన్ని ప్రకటించడం ద్వారా మనలాగే సమాధానంతో జీవించమని ఇతరులను ప్రోత్సహించగలుగుతాం. సంఘంతో సహవసిస్తూ, పరిచర్యకు సంబంధించి లభించే శిక్షణను సద్వినియోగం చేసుకోగల కొత్తవారికి సహాయం చేయడం కూడా ఒక ఆశీర్వాదమే. అకుల, ప్రిస్కిల్లాలు ‘దేవునిమార్గమును’ అపొల్లోకు ‘మరి పూర్తిగా విశదపరచినట్లే,’ పెద్దల సూచనమేరకు కొత్తవారికి సహాయం చేసే మంచి అవకాశం మనకూ లభించవచ్చు.—అపొ. 18:24-26.
యేసు మాదిరి నుండి నేర్చుకుంటూ ఉండండి
14, 15. యేసు మాదిరి నుండి నేర్చుకుంటూ ఉండేందుకు మనకు ఎలాంటి మంచి కారణాలున్నాయి?
14 యేసు మాదిరి నుండి నేర్చుకుంటూ ఉండడానికి మనకెన్నో మంచి కారణాలు ఉన్నాయి. భూమ్మీదకు రాకముందు ఆయన తన తండ్రితో కోటానుకోట్ల సంవత్సరాలు కలిసి పనిచేశాడు. (సామె. 8:22, 30) సర్వోత్తమమైన విధంగా జీవించాలంటే దేవుణ్ణి సేవిస్తూ, సత్యం గురించి సాక్ష్యమివ్వడానికే ప్రాధాన్యతనివ్వాలని యేసుకు తెలుసు. (యోహా. 18:37) మరేవిధంగా జీవించినా అది కేవలం స్వార్థపూరితమైనదని, నిష్ప్రయోజనకరమని యేసుకు బాగా తెలుసు. తాను తీవ్రంగా శోధించబడి చివరకు చంపబడతానని యేసుకు తెలుసు. (మత్త. 20:18, 19; హెబ్రీ. 4:15) మనకు మంచి మాదిరిని ఉంచుతూ మనం ఎలా యథార్థతను కాపాడుకోవాలో ఆయన నేర్పించాడు.
15 యేసు బాప్తిస్మం తీసుకున్న కొన్నిరోజులకే, సర్వోత్తమమైన జీవన మార్గాన్ని విడిచిపెట్టేలా శోధించేందుకు సాతాను ప్రయత్నించాడు. కానీ అతడు విజయం సాధించలేకపోయాడు. (మత్త. 4:1-11) సాతాను ఎన్ని శోధనలు తీసుకొచ్చినా మనం యథార్థతను నిలుపుకోవచ్చని దీన్నిబట్టి అర్థమౌతోంది. బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నవారినే కాకుండా, కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారిని కూడా వాడు తన లక్ష్యంగా చేసుకోవచ్చు. (1 పేతు. 5:8) యెహోవాసాక్షులను తప్పుగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు మనకేదో మేలు చేస్తున్నామనుకుంటూ మనల్ని వ్యతిరేకించవచ్చు. అయితే, అలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు చక్కని క్రైస్తవ లక్షణాలను కనబరిచే అవకాశం మనకు లభిస్తుంది. ఉదాహరణకు, వారు అడిగే ప్రశ్నలకు యుక్తితో, గౌరవంతో జవాబు చెప్పి సాక్ష్యమివ్వగలుగుతాం. (1 పేతు. 3:15) అప్పుడు మనం చెప్పిన విషయాలు విన్నవారు సానుకూలంగా స్పందించవచ్చు.—1 తిమో. 4:16.
సర్వోత్తమ జీవన మార్గంలో నడుస్తూ ఉండండి!
16, 17. (ఎ) జీవితానికి ఎంతో అవసరమైన ఏ మూడు విషయాలు ద్వితీయోపదేశకాండము 30:19, 20లో ఉన్నాయి? (బి) మోషే రాసినదాన్ని యేసు, యోహాను, పౌలు ఎలా సమర్థించారు?
16 యేసు భూమ్మీదకు రావడానికి దాదాపు 1,500 సంవత్సరాల ముందు, సర్వోత్తమమైన జీవన మార్గాన్ని ఎంచుకోమని మోషే ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు. ఆయన ఇలా అన్నాడు: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను . . . కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.” (ద్వితీ. 30:19, 20) ఇశ్రాయేలీయులైతే దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో తప్పిపోయారుగానీ జీవితానికి ఎంతో అవసరమని మోషే పేర్కొన్న మూడు విషయాలు మాత్రం మారలేదు. వాటినే యేసు, మరితరులు మళ్లీ ప్రస్తావించారు.
17 మొదట, ‘దేవుడైన యెహోవాను ప్రేమించాలి.’ ఆ ప్రేమను దేవుని నీతి ప్రమాణాలను అనుసరించడం ద్వారా చూపించాలి. (మత్త. 22:37) రెండవది, బైబిలును అధ్యయనం చేస్తూ ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ‘ఆయన వాక్యాన్ని వినాలి.’ (1 యోహా. 5:3) అలా వినేందుకు మనం, బైబిలు విషయాలు చర్చించబడే క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావాలి. (హెబ్రీ. 10:23-25) మూడవది, ‘మనం యెహోవాను హత్తుకొనివుండాలి.’ కాబట్టి, ఎలాంటి శ్రమలొచ్చినా దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన కుమారుణ్ణి అనుసరిద్దాం.—2 కొరిం. 4:16-18.
18. (ఎ) 1914లో వచ్చిన కావలికోట (ఆంగ్లం) సంచిక సత్యాన్ని ఎలా వర్ణించింది? (బి) సత్యమనే వెలుగు పట్ల మన భావన ఎలా ఉండాలి?
18 బైబిలు సత్యాన్ని జీవితంలో పాటించడంవల్ల మనమెన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తామో కదా! 1914లో వచ్చిన కావలికోట (ఆంగ్లం) సంచికలో ఈ ప్రాముఖ్యమైన మాటలున్నాయి: “మనమెన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తూ సంతోషంగా జీవించట్లేదా? మన దేవుడు నమ్మకమైనవాడు కాడా? ఇంతకన్నా ఉత్తమ విషయాలు ఎవరికైనా తెలిస్తే వాళ్లు వాటినే పాటించవచ్చు. ఒకవేళ మీకు ఇంతకన్నా మంచి విషయాలు తెలిస్తే మాతో పంచుకోండి. బైబిల్లో మనం తెలుసుకున్న విషయాలకన్నా శ్రేష్ఠమైన విషయాలు మరెక్కడా లేవు. అంతెందుకు ఓ మోస్తారుగా మెరుగైన విషయాలు కూడా కనబడవు. . . . దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానంవల్ల మనం అనుభవిస్తున్న సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాలను వర్ణించడం అసాధ్యం. దేవుడు తన జ్ఞానాన్ని, న్యాయాన్ని, శక్తిని, ప్రేమను ఎలా ప్రదర్శించాడో చదవడం మన హృదయాలకు, మనసులకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఇంతకన్నా మనకు ఇంకేమి కావాలి! దేవుని గురించిన జ్ఞానాన్ని మరింత సంపాదించుకోవడం కన్నా ప్రాముఖ్యమైనది మరొకటి లేదు.” (కావలికోట [ఆంగ్లం], డిసెంబరు 15, 1914 సంచికలోని 377-78 పేజీలు) ఆధ్యాత్మిక వెలుగు, సత్యం పట్ల మనకున్న కృతజ్ఞత చెక్కుచెదరలేదు. ‘యెహోవా వెలుగులో నడుస్తున్నామని’ సంతోషించడానికి మనకు ఇప్పుడు మరెన్నో కారణాలున్నాయి.—యెష. 2:5; కీర్త. 43:3; సామె. 4:18.
19. బాప్తిస్మానికి అర్హులయ్యేవారు ఎందుకు ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవాలి?
19 మీరు ‘యెహోవా వెలుగులో నడవాలని’ కోరుకుంటుండవచ్చు, అయితే, మీరు ఇంకా సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే చర్య తీసుకోండి. బాప్తిస్మం తీసుకోవడానికి కావాల్సిన లేఖనార్హతలను సంపాదించుకోవడానికి శాయశక్తులా కృషి చేయండి. దేవుని పట్ల, క్రీస్తు పట్ల మనకున్న కృతజ్ఞతను చూపించేందుకు అదొక ప్రత్యేకమైన విధానం. మీ దగ్గరున్న అత్యంత అమూల్యమైనదాన్ని అంటే మీ జీవితాన్ని యెహోవా దేవునికి అర్పించండి. తన కుమారుని మాదిరిని అనుసరించడం ద్వారా దేవుడు ఇష్టపడే విధంగా జీవించాలనుకుంటున్నారని చూపించండి. (2 కొరిం. 5:14, 15) నిస్సందేహంగా అదే సర్వోత్తమమైన జీవన విధానం!
మీరెలా జవాబిస్తారు?
• మన బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది?
• దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాం?
• యేసు మాదిరినుండి నేర్చుకోవడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
• సర్వోత్తమమైన జీవన మార్గంలో నడుస్తూ ఉండాలంటే మనం ఏమి చేయాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[25వ పేజీలోని చిత్రం]
మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా సర్వోత్తమ జీవన మార్గాన్ని ఎన్నుకున్నారని చూపిస్తారు
[26వ పేజీలోని చిత్రం]
మీరు “మహోన్నతుని చాటున” సురక్షితంగా ఉన్నారా?