కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎన్నడూ ఆశ వదులుకోకండి!

ఎన్నడూ ఆశ వదులుకోకండి!

మీరు ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సేవచేస్తూ, మీ జీవిత భాగస్వామి కూడా మీతో కలిసి యెహోవా ఆరాధనలో పాల్గొనాలని కోరుకుంటున్నారా?

మొదట్లో చాలా ఆసక్తి చూపించిన మీ బైబిలు విద్యార్థి ఆ తర్వాత సత్యంలోకి రానందుకు నిరాశపడుతున్నారా?

బ్రిటన్‌కు చెందిన కొంతమంది అనుభవాలు పరిశీలిస్తే, మీరెందుకు ఆశ వదులుకోకూడదో తెలుస్తుంది. అంతేకాక, ఇంకా సత్యాన్ని అంగీకరించని వ్యక్తులకు సహాయం చేసేందుకు వీలుగా మీరు ‘మీ ఆహారాన్ని’ ఎలా ‘నీళ్ల మీద వేయవచ్చో’ కూడా తెలుస్తుంది.—ప్రసం. 11:1.

పట్టుదల చాలా అవసరం

ఈ విషయంలో మీరు పట్టుదల చూపించడం చాలా ప్రాముఖ్యం. మీరు సత్యంలో స్థిరంగా ఉంటూ యెహోవాను హత్తుకొని ఉండాలి. (ద్వితీ. 10:20) ఘెయోర్ఘీనా సరిగ్గా అదే చేసింది. ఆమె 1970లో యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆమె భర్త కీర్యాకోస్‌కు చాలా కోపమొచ్చింది. ఆమెతో బైబిలు అధ్యయనం ఆపుజేయించడానికి విపరీతంగా ప్రయత్నించాడు. యెహోవాసాక్షుల్ని ఇంటికి రానిచ్చేవాడు కాదు, చేతికి దొరికిన మన ప్రతీ ప్రచురణను బయట పడేసేవాడు.

ఘెయోర్ఘీనా కూటాలకు వెళ్లడం మొదలుపెట్టినప్పుడు కీర్యాకోస్‌కు ఇంకా కోపమొచ్చింది. సాక్షులతో వాదించడానికి ఆయన ఒకరోజు రాజ్యమందిరానికి వెళ్లాడు. ఆయన ఇంగ్లీషు కన్నా గ్రీకు బాగా మాట్లాడతాడని గ్రహించిన ఓ సహోదరి, సహాయం కోసం వేరే సంఘంలోని గ్రీకు భాషా సహోదరునికి ఫోను చేసింది. ఆ సహోదరుడు వచ్చి తనతో మాట్లాడిన తీరు కీర్యాకోస్‌కు నచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఆ సహోదరునితో కలిసి బైబిలు అధ్యయనం కూడా చేశాడు. కానీ, కొంతకాలానికి కీర్యాకోస్‌ అధ్యయనం ఆపేశాడు.

తర్వాతి మూడు సంవత్సరాలు ఘెయోర్ఘీనాకు వ్యతిరేకత తప్పలేదు. ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే ఆమెను వదిలేస్తానని కీర్యాకోస్‌ బెదిరించాడు. అయితే, తన భర్త తనను వదిలిపెట్టకుండా చూడమని ఘెయోర్ఘీనా తన బాప్తిస్మం రోజున యెహోవాను ఎంతో బ్రతిమిలాడింది. ఆ రోజు ఆమెను సమావేశానికి తీసుకెళ్లడానికి తమ ఇంటికి వచ్చిన సాక్షులతో, “మీరు ముందు వెళ్తూ ఉండండి, మేము ఇద్దరం కలిసి మా కారులో మీ వెనకాలే వస్తాం” అని కీర్యాకోస్‌ అన్నాడు. ఆయన ఆ రోజు ఉదయం కార్యక్రమానికి హాజరై, తన భార్య బాప్తిస్మం తీసుకోవడాన్ని కళ్లారా చూశాడు!

యెహోవాసాక్షులు తనను మొట్టమొదటిసారిగా కలిసిన దాదాపు 40 సంవత్సరాలకు తన భర్త బాప్తిస్మం తీసుకోవడం ఘెయోర్ఘీనా చూడగలిగింది

ఆ తర్వాత ఆయన తన భార్యను వ్యతిరేకించడం తగ్గించాడు, మెల్లమెల్లగా తన జీవితంలో పెద్ద మార్పులు చేసుకోసాగాడు. యెహోవాసాక్షులు తనను మొట్టమొదటిసారిగా కలిసిన దాదాపు 40 సంవత్సరాలకు తన భర్త బాప్తిస్మం తీసుకోవడం ఘెయోర్ఘీనా చూడగలిగింది! ఇంతకీ కీర్యాకోస్‌ ఎలా మారాడు? స్వయంగా ఆయన మాటల్లోనే చూడండి: “ఘెయోర్ఘీనా చూపించిన పట్టుదల నాకు చాలా నచ్చింది.” ఘెయోర్ఘీనా ఇలా అంది: “నా భర్త ఎంత వ్యతిరేకించినా నేను నా దేవుణ్ణి ఆరాధించడం మానుకోలేదు. ఆ సంవత్సరాలన్నిటిలో నేను యెహోవాకు ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను ఎన్నడూ ఆశ వదులుకోలేదు.”

కొత్త వ్యక్తిత్వానికున్న విలువ

మీ జీవిత భాగస్వామిని సత్యంలోకి తీసుకురావాలంటే మీరు క్రైస్తవ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం కూడా ప్రాముఖ్యం. క్రైస్తవ భార్యలకు అపొస్తలుడైన పేతురు ఈ ఉపదేశమిచ్చాడు: ‘మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు వాక్యము లేకుండానే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.’ (1 పేతు. 3:1, 2) తన భర్త జాన్‌ను సత్యంలోకి తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టినప్పటికీ, క్రిస్టీన్‌ ఆ సలహాను పాటిస్తూనే వచ్చింది. ఆమె యెహోవాసాక్షిగా మారి 20 ఏళ్లు దాటినా ఆమె భర్త అసలు దేవుణ్ణి నమ్మలేదు. ఆయన మత సంబంధ విషయాలకు దూరంగా ఉండాలనుకున్నాడు. అయినా, క్రిస్టీన్‌ తన కొత్త మతాన్ని ఎంతగా అభిమానిస్తుందో గమనించాడు. ఆయన ఇప్పుడు ఇలా అంటున్నాడు: “ఆమె తన కొత్త మతం వల్ల ఎంత సంతోషంగా ఉండేదో నేను చూశాను. ఆ కొత్త విశ్వాసం ఆమె మనోధైర్యాన్ని పెంచింది, ఆమెను మరింత మెరుగైన వ్యక్తిగా తయారు చేసింది. నా జీవితంలో ఎదురైన ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె నాకు అండగా నిలిచింది.”

క్రిస్టీన్‌ తన మత నమ్మకాల్ని తన భర్తపై రుద్దడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయన ఇలా అంటున్నాడు: “మతం గురించి నాతో చర్చించకపోవడమే మంచిదని క్రిస్టీన్‌ ముందునుంచే అర్థంచేసుకుంది. అంతేకాక, నెమ్మదిగా నా పద్ధతిలో నేను సత్యాన్ని నేర్చుకునేంతవరకూ ఆమె ఓపిక పట్టింది.” విజ్ఞానానికి, ప్రకృతికి సంబంధించిన అంశాలు అంటే జాన్‌కు కాస్త మక్కువ. అందుకే కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో అలాంటి ఆర్టికల్స్‌ వచ్చినప్పుడు క్రిస్టీన్‌, “బహుశా ఈ ఆర్టికల్స్‌ మీకు నచ్చుతాయి” అంటూ జాన్‌కు చూపించేది.

జాన్‌ రిటైర్‌ అయ్యాక ఓ వ్యాపకంగా తోటపని మొదలుపెట్టాడు. అప్పుడు ఆలోచించడానికి ఆయనకు ఎక్కువ సమయం దొరికేది. ‘అనుకోని సంఘటనలు చోటు చేసుకొని మనిషి ఆవిర్భవించాడా లేక ఓ ఉద్దేశంతో దేవుడు సృష్టించాడా?’ వంటి ప్రాముఖ్యమైన ప్రశ్నల గురించి ఆలోచించసాగాడు. ఒకరోజు మాటల మధ్యలో ఓ సహోదరుడు జాన్‌ను “మీరు బైబిలు అధ్యయనం చేయవచ్చు కదా?” అని అడిగాడు. “అప్పటికే దేవుని మీద నాకు కాస్త నమ్మకం కుదిరింది కాబట్టి, నేను ఆయన అడిగిన దానికి సరే అన్నాను” అని జాన్‌ చెప్పాడు.

ఆశ వదులుకోనందుకు క్రిస్టీన్‌కు ఎంత మంచి ఫలితం వచ్చిందో గమనించారా? జాన్‌ సత్యాన్ని అంగీకరించాలని క్రిస్టీన్‌ 20 ఏళ్ల పాటు ప్రార్థిస్తూనే ఉంది. చివరకు జాన్‌ బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉత్సాహంగా యెహోవా సేవ చేస్తున్నారు. జాన్‌ ఇలా అన్నాడు: “ప్రత్యేకించి రెండు విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. సాక్షులు చూపించిన దయ, స్నేహపూరిత స్వభావం నాకు చాలా నచ్చాయి. పైగా, మీ జీవిత భాగస్వామి యెహోవాసాక్షి అయితే మీకు ఓ నమ్మకమైన, ఆధారపడదగిన, నిస్వార్థమైన తోడు ఉన్నట్లే.” నిశ్చయంగా, క్రిస్టీన్‌ 1 పేతురు 3:1, 2లోని సలహాను పాటించి మంచి ఫలితాన్ని పొందింది.

కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తడానికి ఎన్నో ఏళ్లు పట్టవచ్చు

ఏవో కారణాల వల్ల మొదట్లో ఉన్న ఆసక్తిని కోల్పోయిన బైబిలు విద్యార్థుల విషయమేమిటి? సొలొమోను రాజు ఇలా రాశాడు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసం. 11:6) కొన్నిసార్లు సత్య విత్తనాలు మొలకెత్తడానికి ఎన్నో ఏళ్లు పట్టవచ్చు. అయినా, దేవునికి దగ్గరవ్వడం ఎంత ప్రాముఖ్యమో ఒక వ్యక్తి నెమ్మదిగా గ్రహించవచ్చు. (యాకో. 4:8) నిశ్చయంగా అది జరిగిన రోజు మీ ఆనందానికి అవధులుండవు!

ఇండియా నుండి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిన ఆలస్‌ ఉదాహరణ పరిశీలించండి. 1974లో ఆమె బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆమె మాట్లాడేది హిందీ అయినా ఆంగ్లం బాగా నేర్చుకోవాలనుకుంది. ఏళ్ల తరబడి బైబిలు అధ్యయనం సాగింది, అప్పుడప్పుడు ఆంగ్ల భాషా కూటాలకు కూడా హాజరైంది. తాను నేర్చుకుంటున్నది సత్యమని గ్రహించినా ఆమె బైబిలు అధ్యయనాన్ని ఓ వ్యాపకంలా చూసింది. దానికితోడు ఆమెకు డబ్బు సంపాదించాలనే తపన, పార్టీల మీద మక్కువ ఉండేది. అలా కొంతకాలానికి ఆమె బైబిలు అధ్యయనం ఆపేసింది.

సుమారు 30 ఏళ్ల తర్వాత, ఆలస్‌ తనతో బైబిలు అధ్యయనం చేసిన స్టెల్లాకు ఓ ఉత్తరం రాసింది. అందులో ఆమె ఇలా అంది: “ఎప్పుడో 1974లోని నీ బైబిలు విద్యార్థి ఈ మధ్య జరిగిన జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకుందని వింటే నువ్వు ఆనందం పట్టలేవని నాకు తెలుసు. నువ్వు నా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించావు. నాలో సత్య విత్తనాన్ని నాటింది నువ్వే. అప్పట్లో నేను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా లేకపోయినా నా మనసులో, హృదయంలో సత్య విత్తనాన్ని అలాగే దాచుకున్నాను.”

స్టెల్లాకు రాసిన ఉత్తరంలో ఆలస్‌ ఇలా అంది: “ఎప్పుడో 1974లోని నీ బైబిలు విద్యార్థి ఈ మధ్య జరిగిన జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకుందని వింటే నువ్వు ఆనందం పట్టలేవని నాకు తెలుసు”

ఇదంతా ఎలా జరిగింది? 1997లో తన భర్త చనిపోయినప్పుడు ఎంతో కృంగిపోయానని ఆలస్‌ వివరించింది. ఆ సమయంలో ఆమె దేవునికి ప్రార్థించింది. ఆమె ప్రార్థన చేసిన పది నిమిషాలకే, ఇద్దరు పంజాబీ భాషా సాక్షులు ఆమె ఇంటికి వచ్చి మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? అనే కరపత్రాన్ని ఇచ్చి వెళ్లారు. వాళ్ల రాకతో తన ప్రార్థనకు జవాబు వచ్చిందని ఆలస్‌ భావించి యెహోవాసాక్షులతో సహవసించాలని నిర్ణయించుకుంది. కానీ, ఆమె వాళ్లను ఎలా కలవాలి? అప్పుడు ఆమెకు ఓ పాత డైరీ దొరికింది. అందులో స్టెల్లా ఇచ్చిన పంజాబీ సంఘం అడ్రస్సు ఉంది. ఆలస్‌ రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు పంజాబీ భాషా సహోదర సహోదరీలు ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించారు. “ఆ ఆప్యాయత నా మనసులో చెరగని ముద్రవేసింది. అప్పటికే కృంగివున్న నాకు అది ఊరటను ఇచ్చింది” అని ఆలస్‌ అంది.

ఆమె క్రమంగా కూటాలకు వెళ్లడం మొదలుపెట్టి, తన బైబిలు అధ్యయనాన్ని కొనసాగించింది. అదే సమయంలో ఆమె పంజాబీ భాషను అనర్గళంగా మాట్లాడడం, చదవడం నేర్చుకుంది. 2003లో బాప్తిస్మం తీసుకుంది. స్టెల్లాకు రాసిన ఉత్తరాన్ని ఇలా ముగించింది: “29 ఏళ్ల క్రితం నాలో సత్య విత్తనాలను నాటినందుకు, నాకు చక్కని ఆదర్శంగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్‌.”

“29 ఏళ్ల క్రితం నాలో సత్య విత్తనాలను నాటినందుకు, నాకు చక్కని ఆదర్శంగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్‌.”—ఆలస్‌

ఆ అనుభవాలు ఏమి చూపిస్తున్నాయి? కొన్నిసార్లు ఒక వ్యక్తి మీరు అనుకున్నంత త్వరగా సత్యంలోకి రాకపోవచ్చు. అయితే, అతనికి దేవుని గురించి నేర్చుకోవాలనే తపన, నిజాయితీ, వినయం ఉంటే యెహోవా అతనిలో సత్య విత్తనం మొలకెత్తేలా చేస్తాడు. యేసు చెప్పిన ఉపమానంలోని ఈ మాటను ఒకసారి గుర్తుచేసుకోండి: “అతనికి [విత్తువానికి] తెలియని విధంగానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి. భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొక్కను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదిరిన గింజలను పుట్టిస్తుంది.” (మార్కు 4:27,28, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.) అది మెల్లమెల్లగా “దానంతట అదే” పెరుగుతుంది. నిజంగా, దాని ఎదుగుదల ఏ ఒక్క రాజ్య ప్రచారకునికీ తెలియదు. కాబట్టి విస్తారంగా విత్తండి, అప్పుడు మీరు మరింత విస్తారంగా కోస్తారు.

ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కూడా మర్చిపోకండి. ఘెయోర్ఘీనా, క్రిస్టీన్‌ పట్టువదలకుండా యెహోవాకు ప్రార్థించారు. మీరు “ప్రార్థనయందు పట్టుదల” కలిగివుండి ఆశ వదులుకోకుండా ఉంటే, మీరు ‘నీళ్ల మీద వేసిన ఆహారము చాలా దినములైన తరువాత’ మళ్లీ మీకు కనబడవచ్చు.—రోమా. 12:12; ప్రసం. 11:1.