తల్లిదండ్రులారా, పిల్లలారా—ప్రేమగా సంభాషించుకోండి
“ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.”—యాకో. 1:19.
1, 2. సాధారణంగా అమ్మానాన్నలు, పిల్లలు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటారు? అయినా, కొన్నిసార్లు వాళ్లకు ఏది కష్టమౌతుంది?
“మీ అమ్మానాన్నలు రేపు చనిపోతారని తెలిస్తే, మీరు వాళ్లకు చెప్పాలనుకునే ముఖ్యమైన మాటేమిటి?” అని అమెరికాలోని వందలమంది పిల్లల్ని అడిగారు. దానికి 95 శాతం పిల్లలు, ప్రస్తుతం తమను ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించో, భేదాభిప్రాయాల గురించో మాట్లాడతామనలేదు. బదులుగా, “నన్ను క్షమించండి,” “మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను” అని వాళ్ల అమ్మానాన్నలతో చెబుతామని అన్నారు.—షాంటీ ఫెల్డ్హాన్ మరియు లీసా రైస్ రాసిన ఫర్ పేరెంట్స్ ఓన్లీ పుస్తకం.
2 సాధారణంగా అమ్మానాన్నలు అంటే పిల్లలకు, పిల్లలు అంటే అమ్మానాన్నలకు ప్రేమ ఉంటుంది. ప్రత్యేకించి క్రైస్తవ కుటుంబాల్లో అది కనిపిస్తుంది. వాళ్లంతా ఒకరికొకరు బాగా దగ్గరగా ఉండాలని కోరుకున్నా, కొన్నిసార్లు వాళ్ల మధ్య సంభాషణ అంతగా ఉండదు. దాపరికం లేకుండా మాట్లాడుకునే అవకాశమున్నా, కొన్ని విషయాల గురించి వాళ్లు ఎందుకు మాట్లాడుకోరు? చక్కని సంభాషణకు కొన్ని అవాంతరాలు ఏమిటి? వాటిని ఎలా తొలగించుకోవచ్చు?
సంభాషించుకోవడానికి సమయాన్ని ‘సద్వినియోగం చేసుకోండి’
3. (ఎ) చాలా కుటుంబాలకు చక్కగా సంభాషించుకోవడం ఎందుకు ఓ సవాలైపోయింది? (బి) ప్రాచీన ఇశ్రాయేలులో అమ్మానాన్నలు, పిల్లలు కలిసి సమయం గడపడం ఎందుకు అంత సులభంగా ఉండేది?
3 ఒకరినొకరు బాగా అర్థంచేసుకునేలా మాట్లాడుకోవడానికి సరిపడా సమయం తమకు లేదని చాలా కుటుంబాలు అనుకుంటున్నాయి. అయితే, అన్ని సందర్భాల్లోనూ అది నిజం కాకపోవచ్చు. ఇశ్రాయేలీయుల్లోని తండ్రులకు మోషే ఈ ఉపదేశాన్ని ఇచ్చాడు: “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని [దేవుని వాక్కుల] గూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.” (ద్వితీ. 6:6, 7) ఆ కాలంలో పిల్లలు ఇంట్లో వాళ్ల అమ్మతో లేదా పొలాల్లో, పనిస్థలాల్లో వాళ్ల నాన్నతో సమయం గడిపేవాళ్లు. దానివల్ల అమ్మానాన్నలూ పిల్లలూ కలిసి గడపడానికి, మాట్లాడుకోవడానికి చాలా సమయం దొరికేది. అలా తమ పిల్లల అవసరాల్ని, కోరికల్ని, వ్యక్తిత్వాల్ని అర్థంచేసుకోవడం తల్లిదండ్రులకు వీలయ్యేది. అలాగే, పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల్ని బాగా అర్థంచేసుకోగలిగేవాళ్లు.
4. నేడు, చాలా కుటుంబాల్లో సంభాషణ ఎందుకు కష్టమౌతోంది?
4 అయితే ఇప్పటి పరిస్థితి ఎంత మారిపోయింది! కొన్ని దేశాల్లో, పిల్లల్ని చాలా చిన్న వయసులోనే ప్లే-స్కూళ్లలో వేసేస్తున్నారు, కొందరినైతే రెండేళ్లకే అలా పంపించేస్తున్నారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ బయట ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి గడపడానికి దొరికే కాస్త సమయాన్ని కూడా కంప్యూటర్, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా వంటివి హరించి వేస్తున్నాయి. చాలా సందర్భాల్లో అమ్మానాన్నలు, పిల్లలు వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తూ, ఒకే ఇంట్లో అపరిచితుల్లా గడుపుతున్నారు. ఇక ఒకరినొకరు అర్థంచేసుకునేలా మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడిది?
5, 6. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి గడిపేందుకు సమయాన్ని ఎలా ‘సద్వినియోగం చేసుకుంటున్నారు’?
5 మీరు ఇతర పనుల కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించి, కుటుంబంతో గడిపేందుకు ఆ సమయాన్ని ‘సద్వినియోగం’ చేసుకోగలరా? (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) కొన్ని కుటుంబాల్లో టీవీ, కంప్యూటర్ వంటివాటి మీద వెచ్చించే సమయానికి హద్దులు విధించుకుంటారు. ఇంకొందరు, రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబమంతా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక కుటుంబ ఆరాధన గురించి ఆలోచించండి. తల్లిదండ్రులూ పిల్లలూ ఒకరికొకరు సన్నిహితం కావడానికి, ఆధ్యాత్మిక విషయాలు ప్రశాంతంగా చర్చించుకోవడానికి అది ఎంత చక్కని తరుణం! దానికోసం వారానికి ఓ గంటపాటు కేటాయించడం మంచిది. అయితే, చక్కని సంభాషణకు అది తొలిమెట్టు మాత్రమే. దానికోసం క్రమంగా, తరచుగా మాట్లాడుకోవడం తప్పనిసరి. మీ పిల్లలు ప్రతీరోజు స్కూలుకు వెళ్లేముందు వాళ్లతో ఓ ప్రోత్సాహకరమైన విషయం మాట్లాడండి, దినవచనం చర్చించండి, లేక వాళ్లతో కలిసి ప్రార్థించండి. ఆ రోజు వాళ్లకు అది ఎంతో సహాయకరంగా ఉంటుంది.
6 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సమయం గడిపేలా కొన్ని సర్దుబాట్లు చేసుకున్నారు. ఉదాహరణకు, ఇద్దరు పిల్లలున్న లిడియా a విషయమే తీసుకోండి. పిల్లలతో సమయం గడపడం కోసమని ఆమె తనకున్న పూర్తికాల ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. ఆమె ఇలా అంటోంది: “ఉదయాన్నే పిల్లల్ని స్కూలుకు పంపి, ఆఫీసుకు వెళ్లేవరకు ఉరుకులుపరుగులే. సాయంకాలం నేను తిరిగి వచ్చేసరికి పిల్లల్ని మా ఆయా నిద్రపుచ్చేది. అయితే, నా ఉద్యోగానికి రాజీనామా చేశాక తక్కువ ఆదాయంతోనే సర్దుకుపోవాల్సి వస్తున్నా, నేను నా పిల్లల ఆలోచనల్ని, సమస్యల్ని తెలుసుకోగలుగుతున్నాను. వాళ్లు ప్రార్థిస్తున్నప్పుడు వినగలుగుతున్నాను, వాళ్లకు దిశానిర్దేశాలు ఇవ్వగలుగుతున్నాను, బోధించగలుగుతున్నాను, వాళ్లను ప్రోత్సహించగలుగుతున్నాను.”
‘వినడానికి వేగిరపడండి’
7. పిల్లలు, తల్లిదండ్రులు తరచుగా చేసే ఓ ఫిర్యాదు ఏమిటి?
7 ఫర్ పేరెంట్స్ ఓన్లీ పుస్తక రచయితలు చాలామంది యౌవనుల్ని ఇంటర్వ్యూ చేశాక, సంభాషణకున్న మరో అవాంతరాన్ని కనుగొన్నారు. ఆ రచయితలు ఇలా అంటున్నారు: “‘వాళ్లు మేము చెప్పేది వినరు!’ చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల మీద చేసిన ఫిర్యాదుల్లో మొదటిది ఇదే.” అయితే, ఆ ఫిర్యాదు చేసేది పిల్లలు మాత్రమే కాదు. నిజానికి, పిల్లలు తాము చెప్పేది వినడం లేదని తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. తమ మధ్య చక్కని సంభాషణ ఉండాలంటే, కుటుంబ సభ్యులు ఒకరు చెప్పేది ఒకరు వినాలి, శ్రద్ధగా వినాలి.—యాకోబు 1:19 చదవండి.
8. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినాలంటే తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
8 తల్లిదండ్రులారా, మీరు నిజంగా మీ పిల్లలు చెప్పేది వింటున్నారా? మీరు అలసిపోయినప్పుడో లేదా మీ పిల్లలు చెబుతున్న విషయాలకు అంత ప్రాముఖ్యత లేదనిపించినప్పుడో వినడం కష్టం కావచ్చు. కానీ, మీ దృష్టిలో ప్రాముఖ్యంకానివి మీ పిల్లల దృష్టిలో చాలా ప్రాముఖ్యం కావచ్చు. ‘వినడానికి వేగిరపడడమంటే’ మీ పిల్లలు ఏమి చెబుతున్నారో వినడం మాత్రమే కాదు, వాళ్లు ఎలా చెబుతున్నారో కూడా శ్రద్ధగా గమనించాలి. మీ పిల్లల స్వరాన్ని బట్టి, వాళ్ల శరీర భాషను బట్టి వాళ్ల మనోభావాల్ని మీరు తెలుసుకోవచ్చు. ప్రశ్నలు అడగడం కూడా ప్రాముఖ్యమే. “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” (సామె. 20:5) ప్రత్యేకించి, సున్నితమైన విషయాలపై మీ పిల్లల అభిప్రాయం తెలుసుకోవాలంటే వివేచన, మంచి అవగాహన చాలా అవసరం.
9. పిల్లలు ఎందుకు తల్లిదండ్రుల మాట వినాలి?
9 పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామె. 1:8) మీ అమ్మానాన్నలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీ శ్రేయస్సునే కోరుకుంటున్నారని గుర్తుంచుకొని వాళ్లు చెప్పేది విని, వాళ్లకు లోబడండి. (ఎఫె. 6:1) చక్కని సంభాషణ ఉన్నప్పుడు, మీ అమ్మానాన్నలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గుర్తించినప్పుడు వాళ్లకు విధేయత చూపించడం సుళువౌతుంది. ఆయా విషయాల గురించి మీకేమి అనిపిస్తుందో మీ అమ్మానాన్నలకు చెప్పండి. అప్పుడు వాళ్లు మిమ్మల్ని అర్థంచేసుకుంటారు. అయితే మీరు కూడా వాళ్లను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి.
10. రెహబాము ప్రవర్తించిన తీరులో మనకు ఏ పాఠం ఉంది?
10 తోటి యౌవనులు ఇచ్చే సలహాల్ని వినేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు మీకు వినసొంపుగా ఉండే విషయాల్నే చెప్పవచ్చు కానీ, అవి మీకు ఏ మాత్రం ఉపయోగపడకపోవచ్చు. నిజానికి, అవి మీకు ప్రమాదకరం కూడా. పెద్దవాళ్లకు ఉండే జ్ఞానం, అనుభవం ఉండవు కాబట్టి ఎక్కువమంది యౌవనులు దూరదృష్టితో ఆలోచించలేరు, కొన్ని పనులవల్ల వచ్చే దుష్ఫలితాలను అంచనా వేయలేరు. సొలొమోను రాజుకు కుమారుడైన రెహబాము ఉదాహరణను జ్ఞాపకముంచుకోండి. ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు, ఆయన పెద్దవాళ్ల మాట వింటే బాగుండేది. కానీ, ఆయన తన వయసువాళ్లు ఇచ్చిన మూర్ఖపు సలహాలను అనుసరించాడు. దానివల్ల ఆయన ఇశ్రాయేలు రాజ్యంలోని చాలామంది మద్దతును కోల్పోయాడు. (1 రాజు. 12:1-17) తెలివి తక్కువగా ప్రవర్తించిన రెహబాములా కాకుండా, మీ తల్లిదండ్రులతో ఎల్లప్పుడూ చక్కగా సంభాషించడానికి కృషిచేయండి. మీ ఆలోచనల్ని వాళ్లతో పంచుకోండి. వాళ్ల సలహాలను పాటించండి, వాళ్ల జ్ఞానం నుండి ప్రయోజనం పొందండి.—సామె. 13:20.
11. తల్లిదండ్రులు స్నేహపూరితంగా మెలగకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?
11 తల్లిదండ్రులారా, సలహాల కోసం మీ పిల్లలు వాళ్ల తోటివాళ్లను సంప్రదించకూడదంటే, వాళ్లు అన్నీ మీతో చెప్పుకునేంత స్నేహపూరితంగా మీరు మెలగాలి. టీనేజీలో ఉన్న ఓ సహోదరి ఇలా రాసింది: “నేను ఎవరైనా ఓ అబ్బాయి పేరు ఎత్తానంటే చాలు, మా అమ్మానాన్నల ముఖకవళికలన్నీ మారిపోతాయి. దాంతో, నాకు ఇబ్బందిగా అనిపించి, సంభాషణను ఇక కొనసాగించాలనిపించదు.” మరో యౌవన సహోదరి ఇలా అంది: “టీనేజీలో ఉన్న చాలామంది పిల్లలకు తమ అమ్మానాన్నల సలహా తీసుకోవాలనే ఉంటుంది. కానీ అమ్మానాన్నలు వాళ్లను పట్టించుకోకపోతే పిల్లలు సలహా కోసం తమను పట్టించుకునే ఇతరుల దగ్గరికి, ఆఖరికి అంతగా అనుభవంలేని వాళ్ల దగ్గరికి కూడా వెళ్తారు.” ఎలాంటి విషయమైనా సరే, దాని గురించి మీ పిల్లలు చెబుతున్నప్పుడు మీరు వాత్సల్యంతో వింటే, వాళ్లు మీతో మనసువిప్పి మాట్లాడతారు, మీరిచ్చే మార్గనిర్దేశాన్ని స్వాగతిస్తారు.
‘మాట్లాడడానికి నిదానించండి’
12. తల్లిదండ్రులు ప్రతిస్పందించే తీరు సంభాషణకు ఎలా ఓ అవాంతరం కావచ్చు?
12 పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు అమ్మానాన్నలు చిరాగ్గా, కోపంగా ప్రతిస్పందించడం వల్ల కూడా సంభాషణకు అవాంతరం ఏర్పడుతుంది. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలనుకోవడం అర్థంచేసుకోదగినదే. ఈ ‘అంత్యదినాల్లో’ ఆధ్యాత్మిక విషయాలతో సహా అన్ని విషయాల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచివున్నాయి. (2 తిమో. 3:1-5) అయితే, అమ్మానాన్నలు తమను కాపాడడానికి చేసే ప్రయత్నాలు పిల్లలకు చాదస్తంగా కనిపించవచ్చు.
13. తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎందుకు తొందరపడకూడదు?
13 తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి తొందరపడకూడదు. నిజమే, మీ పిల్లలు మిమ్మల్ని నిరాశపర్చే విషయాలు చెప్పినప్పుడు మౌనంగా ఉండడం అంత సులభం కాదు. మీరు మాట్లాడే ముందు విషయాన్ని జాగ్రత్తగా వినడం ప్రాముఖ్యం. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా రాశాడు: “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” (సామె. 18:13) మీరు ప్రశాంతంగా వింటే మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి, మీ పిల్లలు కూడా నిరాటంకంగా మాట్లాడతారు. మీరు సహాయం చేయాలంటే, ముందు మీకు విషయం పూర్తిగా తెలియాలి. కొన్నిసార్లు ‘నిరర్థకపు మాటలకు’ కలత చెందిన హృదయమే కారణం కావచ్చు. (యోబు 6:1-3) కాబట్టి, తల్లిదండ్రులైన మీరు విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకోవడానికి వినండి, పరిస్థితిని చక్కదిద్దేలా ప్రోత్సాహకరంగా మాట్లాడండి.
14. పిల్లలు ఎందుకు ‘మాట్లాడడానికి నిదానించాలి’?
14 పిల్లలారా, మీకు శిక్షణ ఇచ్చే బాధ్యతను దేవుడు మీ అమ్మానాన్నలకు ఇచ్చాడు కాబట్టి, వాళ్లు ఏదైనా చెబుతున్నప్పుడు, వెంటనే అడ్డుచెప్పకుండా ‘మాట్లాడడానికి నిదానించండి.’ (సామె. 22:6) ప్రస్తుతం మీకు ఎదురౌతున్న పరిస్థితులే ఒకప్పుడు వాళ్లకు కూడా ఎదురైవుంటాయి. అంతేకాక, ఒకప్పుడు తాము చేసిన పొరపాట్లను బట్టి వాళ్లు బాధపడుతున్నారు. ఆ బాధ మీరు పడకూడదన్నదే వాళ్ల తాపత్రయం. కాబట్టి, మీ అమ్మానాన్నల్ని మిత్రులుగా, మంచి సలహాదారులుగా ఎంచండి; అంతేగానీ బద్దశత్రువులుగా, ప్రతిఘటించేవాళ్లుగా కాదు. (సామెతలు 1:5 చదవండి.) ‘మీ తండ్రిని, తల్లిని సన్మానించండి.’ వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే మీరూ వాళ్లను ప్రేమిస్తున్నట్లు చూపించండి. అలాచేస్తే, మిమ్మల్ని ‘యెహోవా శిక్షలో, బోధలో పెంచడం’ వాళ్లకు సులభమౌతుంది.—ఎఫె. 6:2-4.
‘కోపించుటకు నిదానించండి’
15. మన ప్రియమైనవాళ్ల మీద కోపగించుకోకుండా ఓర్పుగా వ్యవహరించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
15 మన ప్రియమైనవాళ్లతో అన్నివేళలా ఓర్పుగా వ్యవహరించలేం. “కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు” అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొ. 1:1, 2; 3:19, 21) పౌలు ఎఫెసీయులకు ఇలా రాశాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫె. 4:31) ఆత్మఫలంలో భాగమైన దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని అలవర్చుకుంటే మనం ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం.—గల. 5:22, 23.
16. యేసు తన శిష్యుల్ని ఎలా సరిదిద్దాడు? అందులో ఉన్న గొప్పతనం ఏమిటి?
16 యేసు ఉదాహరణను పరిశీలించండి. తన అపొస్తలులతో చేసిన చివరి సాయంకాల భోజనమప్పుడు ఆయన ఎంతటి ఒత్తిడికి లోనైవుంటాడో ఊహించండి. ఇక కొన్ని గంటల్లో, తాను సుదీర్ఘ వేదన అనుభవించి చనిపోతానని యేసుకు తెలుసు. తన తండ్రి నామం పరిశుద్ధపర్చబడాలన్నా, మానవులు రక్షణ పొందాలన్నా తాను చివరివరకు నమ్మకంగా ఉండాలి. అలాంటి సమయంలో, ‘ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము [అపొస్తలుల్లో] పుట్టింది.’ యేసు అప్పుడు వాళ్లమీద అరవలేదు లేదా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కానీ, ప్రశాంతంగా వాళ్లతో తర్కించాడు. వాళ్లు తన శ్రమల్లో తనకు తోడుగా నిలిచారని యేసు వాళ్లకు గుర్తుచేశాడు. సాతాను వాళ్లను గోధుమల్లా చెదరగొట్టడానికి చూస్తున్నా, వాళ్లు విశ్వాసంలో తప్పిపోరనే నమ్మకాన్ని యేసు వ్యక్తం చేశాడు. ఆయన వాళ్లతో ఓ నిబంధన కూడా చేశాడు.—లూకా 22:24-32.
17. పిల్లలు ప్రశాంతంగా ఉండేందుకు ఏది సహాయం చేస్తుంది?
17 పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా, పిల్లలు కౌమారదశకు చేరుకున్నప్పుడు, తల్లిదండ్రులు తమకు నిర్దేశాలివ్వడానికి అపనమ్మకమే కారణమని భావిస్తారు. కొన్నిసార్లు అలా అనిపించినా, వాళ్లు మీమీద ఉన్న ప్రేమను బట్టే మీకు మార్గనిర్దేశమిస్తారని గ్రహించండి. వాళ్లు చెప్పేది ప్రశాంతంగా విని వాళ్లతో సహకరిస్తే, మీరు వాళ్ల గౌరవాన్ని చూరగొంటారు, బాధ్యతాయుత వ్యక్తులుగా పేరు సంపాదించుకుంటారు. దానివల్ల, మీకు కొన్ని విషయాల్లో మరింత స్వేచ్ఛ లభించవచ్చు. మీరు ఆశానిగ్రహం చూపించడమే తెలివైన పని. ఓ జ్ఞానవంతమైన సామెత ఇలా చెబుతోంది: “బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును, జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.”—సామె. 29:11.
18. చక్కని సంభాషణకు ప్రేమ ఎలా తోడ్పడుతుంది?
18 తల్లిదండ్రులారా, పిల్లలారా మీ కుటుంబంలో మీరు కోరుకున్నంత స్థాయిలో దాపరికంలేని సంభాషణ జరగకపోతుంటే నిరాశపడకండి. దానికోసం ప్రయత్నిస్తూనే ఉండండి, సత్యమార్గంలో నడుస్తూ ఉండండి. (3 యోహా. 4) పరిపూర్ణ మనుష్యులు ఉండే నూతనలోకంలో అపార్థాలకు, వాదనలకు చోటులేని పరిపూర్ణమైన సంభాషణ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మనం పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి, సంకోచించకుండా క్షమాపణ కోరండి, మనస్ఫూర్తిగా క్షమించండి. “ప్రేమయందు అతుకబడి” ఉండండి. (కొలొ. 2:1, 2) ప్రేమ బలమైనది. ‘ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.’ (1 కొరిం. 13:4-7) కాబట్టి, ప్రేమను అలవర్చుకుంటూ ఉండండి. దానివల్ల మీ సంభాషణ మెరుగౌతుంది, మీ కుటుంబానికి సంతోషం చేకూరుతుంది, యెహోవాకు స్తుతి కలుగుతుంది.
a అసలు పేరు కాదు.