తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—పశ్చిమాఫ్రికాలో
కోటె డి ఐవరీ దేశంలోని ఒక నిరుపేద ప్రాంతంలో నివసించిన పాస్కల్ మరింత మెరుగైన జీవితం కోసం చిన్నప్పటి నుండే పరితపించేవాడు. అప్పుడప్పుడే బాక్సింగ్ నేర్చుకుంటున్న ఆయన, ‘ఈ క్రీడలో ఓ వెలుగు వెలగాలంటే, బాగా డబ్బు సంపాదించాలంటే నేను ఎక్కడికి వెళ్లాలి’ అని తరచూ ఆలోచించేవాడు. అందుకు ఐరోపా ఖండమే సరైన స్థలమని సుమారు 25 ఏళ్లప్పుడు ఆయన అనుకున్నాడు. అయితే అక్కడికి వెళ్లడానికి ఆయనకు సరైన పత్రాలు లేకపోవడంతో, దొంగచాటుగా ఐరోపాకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
పాస్కల్‌కు 27 ఏళ్లు ఉన్నప్పుడు, అంటే 1998లో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన దేశ సరిహద్దులు దాటి ఘానా దేశంలోకి ప్రవేశించి, అక్కడినుండి టోగో, బెనిన్ దేశాల గుండా ప్రయాణిస్తూ చివరికి నైజర్ దేశంలోని బీర్నీ ఎన్కొన్నీ పట్టణం చేరుకున్నాడు. అయితే ప్రయాణంలోని ప్రమాదకర ఘట్టం ఇక్కడే మొదలైంది. ఉత్తర దిశకు ప్రయాణించాలంటే ఆయన ఏదైనా ఒక వాహనాన్ని పట్టుకుని సహారా ఎడారి దాటాలి. ఆ తర్వాత మధ్యధరా సముద్రం చేరుకున్నాక, పడవ ఎక్కి ఐరోపాకు ప్రయాణించాలి. ఇదీ పాస్కల్ మనసులోని ఆలోచన, అయితే నైజర్ చేరుకున్న తర్వాత రెండు విషయాలు ఆయన పథకాన్ని తారుమారు చేశాయి.
మొదటిది, ఆయన తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇక రెండవ విషయం, అతన్ని కలిసుకున్న నోయే అనే పయినీరుతో బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టాడు. అధ్యయనంలో నేర్చుకున్న విషయాలు ఆయనను ఎంతగా కదిలించాయంటే ఆయన జీవితాన్ని మరో కోణం నుండి చూడడం మొదలుపెట్టాడు. డబ్బు సంపాదించాలని అప్పటివరకూ కోరుకున్న ఆయన ఆధ్యాత్మిక విషయాలపై మనసు పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన 1999, డిసెంబరులో బాప్తిస్మం తీసుకున్నాడు. యెహోవా మీద కృతజ్ఞతతో ఆయన, తాను సత్యం నేర్చుకున్న నైజర్‌లోని అదే పట్టణంలో 2001లో పయినీరు సేవ ప్రారంభించాడు. తన సేవ గురించి పాస్కల్ ఎలా భావిస్తున్నాడు? “నేను ఇప్పుడు శ్రేష్ఠమైన జీవితం గడుపుతున్నాను” అని ఆయన సంతోషంగా చెబుతున్నాడు.
ఆఫ్రికాలో జీవితాన్ని మరింతగా ఆస్వాదించడం
ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం పాటుపడడం వల్లే జీవితం మరింత సంతృప్తిగా ఉంటుందని పాస్కల్‌లానే చాలామంది గుర్తించారు. అలాంటి లక్ష్యాలను చేరుకోవడానికి కొంతమంది ఐరోపా ఖండం నుండి ఆఫ్రికాలో రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి తరలివెళ్లారు. నిజానికి 17 నుండి 70 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 65 మంది, అవసరం ఎక్కువ ఉన్న పశ్చిమాఫ్రికా దేశాలైన టోగో, నైజర్, బుర్కీన ఫాసో, బెనిన్‌కు తరలివెళ్లారు. a అంత దూరం వెళ్లేలా వాళ్లను ఏది కదిలించింది? దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రతిఫలం పొందారు?
డెన్మార్క్‌కు చెందిన అన్నారాకల్ ఇలా చెబుతోంది: “మా అమ్మానాన్నలు సెనెగల్ దేశంలో మిషనరీలుగా సేవచేశారు. వాళ్లు మిషనరీ జీవితం గురించి ఎంత ఉత్సాహంగా మాట్లాడేవాళ్లంటే నా జీవితం కూడా అలాగే ఉండాలని కోరుకున్నాను.” సుమారు 15 ఏళ్ల క్రితం అంటే, అన్నారాకల్ తన 20వ పడిలో ఉన్నప్పుడు టోగో దేశానికి వెళ్లి అక్కడ సంజ్ఞా-భాషా సంఘంలో సేవచేయడం మొదలుపెట్టింది. ఆమె అలా వెళ్లడం వల్ల ఇతరులు
ఏమైనా ప్రోత్సాహం పొందారా? ఆమె ఇలా అంటోంది: “తర్వాత మా చెల్లెలు, తమ్ముడు కూడా టోగోకు వచ్చి సేవచేయడం ప్రారంభించారు.”ఫ్రాన్స్‌కు చెందిన 70 ఏళ్ల ఆరెల్ ఇలా అంటున్నాడు: “ఐదేళ్ల క్రితం నేను రిటైర్ అయినప్పుడు, నా ముందు రెండు మార్గాలు ఉన్నాయి, అవి: ఫ్రాన్స్‌లోనే ఉండి పరదైసు కోసం ఎదురుచూస్తూ ఏ చీకూచింతా లేకుండా కాలాన్ని వెళ్లదీయడం; లేదా నా పరిచర్యను మరింత విస్తృతపర్చుకోవడం.” ఆరెల్ రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. సుమారు మూడేళ్ల క్రితం ఆయన తన భార్య ఆల్బర్ ఫైట్‌తో కలిసి బెనిన్ వెళ్లాడు. ఆయన చిరునవ్వుతో ఇలా చెబుతున్నాడు: “ఇక్కడ యెహోవాను సేవించేలా మమ్మల్ని మేము అందుబాటులో ఉంచుకోవడమే మేము జీవితంలో చేసిన అన్నిటికన్నా మంచి పని. తీరం వెంబడి మేము ప్రకటించే కొన్ని ప్రాంతాలు నిజంగానే పరదైసును గుర్తు చేస్తుంటాయి.”
క్లొడొమీర్ ఆయన భార్య లీస్యన్ 16 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ నుండి బెనిన్ వెళ్లి సేవ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో వాళ్లు, ఫ్రాన్స్‌లోని బంధువులు, స్నేహితులు గుర్తుకొచ్చి ఎంతో బాధపడేవాళ్లు, అలాగే కొత్త ప్రాంతంలోని జీవితానికి అలవాటు పడలేమేమోనని భయపడేవాళ్లు. అయితే ఆ భయాలు కొద్దికాలంలోనే పటాపంచలయ్యాయి. వాళ్లు ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకున్నారు. క్లొడొమీర్ ఇలా అంటున్నాడు: “ఈ 16 ఏళ్లలో సత్యం అంగీకరించేలా మేము సగటున సంవత్సరానికి ఒకరికి సహాయం చేశాం.”
దంపతులైన సేబస్ట్యన్, జోవన్నా 2010లో ఫ్రాన్స్ నుండి బెనిన్ వెళ్లారు.సేబస్ట్యన్ ఇలా చెబుతున్నాడు: “ఇక్కడి సంఘంలో ఎంతో పని ఉంది. ఇక్కడ సేవ చేయడం, త్వరితగతిలో సాగుతున్న ఓ దైవిక విద్యా కోర్సుకు హాజరైనట్లుంది!” మరి సువార్తకు ప్రజల స్పందన ఎలా ఉంది? జోవన్నా ఇలా అంటోంది: “ఇక్కడి ప్రజలు సత్యం కోసం పరితపించిపోతున్నారు. కొన్నిసార్లు మేము మా సొంత పని మీద బయటకు వెళ్తున్నా, వీళ్లు మమ్మల్ని రోడ్డుమీదే ఆపి బైబిలు ప్రశ్నలు అడుగుతుంటారు లేదా మన ప్రచురణలు కావాలని అడుగుతుంటారు.” అలా వెళ్లి సేవచేయడం వాళ్ల కుటుంబ జీవితంపై ఎలా ప్రభావం చూపించింది? సేబస్ట్యన్ ఇలా చెబుతున్నాడు: “దానివల్ల మా వివాహ బంధం ఎంతో బలపడింది. నా భార్యతో కలిసి రోజంతా పరిచర్యలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.”
ఎరిక్ ఆయన భార్య కాటీ, బెనిన్‌లో జనసాంద్రత తక్కువున్న ఓ ప్రాంతంలో పయినీర్లుగా సేవచేస్తున్నారు. సుమారు పదేళ్ల క్రితం వాళ్లు ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు, వాళ్లిద్దరూ అవసరం ఎక్కువ ఉన్నచోట సేవకు సంబంధించిన ఆర్టికల్స్ చదవడం, పూర్తికాల సేవకులతో చర్చించడం మొదలుపెట్టారు. అందువల్ల వాళ్లు విదేశాల్లో సేవ చేయాలనే ప్రేరణ పొందారు, దాంతో 2005లో బెనిన్‌కు వచ్చారు. తమ కళ్లెదుటే ఎంతో అభివృద్ధి జరగడం వాళ్లు చూశారు. ఎరిక్ ఇలా అంటున్నాడు: “రెండు సంవత్సరాల క్రితం టాన్గియెటాలోని మా గ్రూపులో 9 మంది ప్రచారకులు ఉండేవాళ్లు, ఇప్పుడు 30 మంది ఉన్నారు. ఆదివారం హాజరు 50-80 మధ్య ఉంటోంది. అలాంటి అభివృద్ధిని చూడడం ఎంత సంతోషాన్నిస్తుందో!”
సవాళ్లు గుర్తించారు, పరిష్కరించుకున్నారు
కొంతమంది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ప్రస్తుతం 33 ఏళ్లున్న బెన్యామీన్ అన్నారాకల్‌కి తమ్ముడు. టోగో దేశంలో సేవచేసిన ఓ మిషనరీని ఆయన డెన్మార్క్‌లో 2000 సంవత్సరంలో కలిశాడు. అప్పుడు జరిగిన దాన్ని గుర్తుచేసుకుంటూ బెన్యామీన్ ఇలా అన్నాడు: “నాకు పయినీరు అవ్వాలనుందని ఆ మిషనరీతో అన్నప్పుడు ఆయన, ‘నువ్వు టోగోలో పయినీరు సేవ చేయవచ్చు’ అని అన్నాడు.” బెన్యామీన్ దాని గురించి ఆలోచించాడు. ఆయనిలా అంటున్నాడు: “నాకప్పుడు నిండా 20 ఏళ్లు కూడా లేవు, అయితే మా అక్కలిద్దరూ టోగోలో సేవ చేస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లడం నాకు పెద్ద కష్టం కాదనిపించింది.” దాంతో ఆయన అక్కడకు వెళ్లాడు. అయితే ఆయనకు మరో సమస్య ఉంది. బెన్యామీన్ ఇలా వివరిస్తున్నాడు: “నాకు ఫ్రెంచ్ ఒక్క ముక్క కూడా రాదు. అక్కడి వాళ్లతో సరిగ్గా మాట్లాడలేక మొదటి ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి.” అయితే కొంతకాలానికి ఆయన ప్రగతి సాధించాడు. ఆయనిప్పుడు బెనిన్ బ్రాంచి కార్యాలయంలోని సాహిత్య పంపిణీ, కంప్యూటర్ విభాగాల్లో సేవ చేస్తున్నాడు.
పైన చూసిన ఎరిక్, కాటీలు బెనిన్‌కు వెళ్లడానికి ముందు ఫ్రాన్స్‌లోని విదేశీ భాషా క్షేత్రంలో సేవ చేశారు. అయితే దానితో పోలిస్తే పశ్చిమాఫ్రికాలో సేవ ఎలా భిన్నంగా ఉంది? కాటీ ఇలా అంటోంది: “ఇక్కడ సరైన ఇల్లు దొరకడం కష్టం. మేము కొన్ని నెలలపాటు కరెంటు, నీటి కుళాయిలు లేని ఇంట్లో ఉన్నాం.” ఎరిక్ కూడా ఇలా అంటున్నాడు: “ఇంటి చుట్టుపక్కల వాళ్లు చెవులు చిల్లులు పడేంత సౌండ్‌తో అర్ధరాత్రి దాకా సంగీతం పెట్టేవాళ్లు. అలాంటివాటిని సహిస్తూ, అలవాటు చేసుకోవడానికి ఇష్టపడాలి.” అయితే, “సువార్త దాదాపుగా తెలియని ప్రాంతంలో ప్రకటించడం వల్ల వచ్చే ఆనందాలు ఎలాంటి కష్టాలనైనా మరిపిస్తాయి” అని ఇద్దరూ ఒప్పుకుంటున్నారు.
యాభై ఏళ్లు పైబడిన మీషెల్, మారీ అన్యన్ దంపతులు సుమారు ఐదేళ్ల క్రితం ఫ్రాన్స్ నుండి బెనిన్ వెళ్లారు. మొదట్లో వాళ్లు ఆందోళన పడ్డారు. అలా వెళ్లడం ప్రమాదకరమని కొందరు అనుకున్నట్లు మీషెల్ చెప్పాడు, ఆయనింకా ఇలా అన్నాడు: “యెహోవా తోడుంటాడని తెలియకపోతే చాలా భయమేస్తుంది. అందుకే మేము యెహోవా కోసం ఆయన అండతో అక్కడికి వెళ్లాం.”
ఎలా సిద్ధపడాలి?
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయాలనుకునేవాళ్లు దానికోసం సిద్ధపడడానికి కొన్ని పనులు చాలా ప్రాముఖ్యమని చెప్తారు. అవి: ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి, అలవాటుపడడం నేర్చుకోవాలి, బడ్జెట్‌కు కట్టుబడివుండాలి, యెహోవాపై ఆధారపడాలి.—లూకా 14:28-30.
పైన పేర్కొన్న సేబస్ట్యన్ ఇలా అంటున్నాడు: “అక్కడికి వెళ్లడానికి ముందు నేనూ నా భార్యా రెండు సంవత్సరాలపాటు మా సరదాల్ని తగ్గించుకుని, అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు ఆదా చేశాం.” వాళ్లు కొన్ని నెలలు ఐరోపాలో పనిచేసి, ఆ వచ్చే డబ్బుతో మిగతా నెలలు బెనిన్‌లో పయినీరు సేవ చేస్తున్నారు. అలా వాళ్లు ఆ సేవలో కొనసాగుతున్నారు.
పశ్చిమాఫ్రికాలో అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేస్తున్న 20 మంది ఒంటరి విదేశీ సహోదరీల్లో మారీ టేరెజ్ ఒకరు. ఆమె ఫ్రాన్స్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేసేది, అయితే 2006లో ఆమె ఒక సంవత్సరం పాటు సెలవు తీసుకుని నైజర్‌లో పయినీరు సేవ చేసింది. తాను నిజంగా కోరుకున్నది అలాంటి జీవితమేనని అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆమె ఇలా అంటోంది: “ఫ్రాన్స్‌కు తిరిగొచ్చాక నేను నా పని సమయాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని అనుకుంటున్నట్లు మా యజమానితో చెప్పాను, ఆయన దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను మే నెల నుండి ఆగస్టు దాకా ఫ్రాన్స్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తాను, సెప్టెంబరు నుండి ఏప్రిల్ వరకూ నైజర్‌లో పయినీరు సేవ చేస్తాను.”
‘రాజ్యాన్ని మొదట వెదికేవాళ్లు’ యెహోవా తమకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (మత్త. 6:33) సఫీరా అనే ఒంటరి సహోదరి విషయంలో ఏమి జరిగిందో పరిశీలించండి. తన 20 మలినాళ్లలో ఉన్న ఈ సహోదరి పయినీరు సేవ చేయడానికి ఫ్రాన్స్ నుండి బెనిన్ వెళ్లింది. ఆమె అక్కడ ఐదు సంవత్సరాలు సేవ చేసింది. మరో సంవత్సరం పాటు ఆఫ్రికాలో ఉండి సేవచేసేందుకు కావాల్సిన డబ్బును సంపాదించుకోవడానికి 2011లో ఫ్రాన్స్‌కు వచ్చింది. ఆమె ఇలా అంటోంది: “ఆ రోజు శుక్రవారం, నా ఉద్యోగంలోని చివరిరోజు. అయితే సంవత్సరం మొత్తానికి సరిపడా డబ్బు సంపాదించాలంటే నేను మరో పది రోజులు పనిచేయాలి. నేను ఫ్రాన్స్‌లో ఉండేది ఇంకా రెండు వారాలే. నా పరిస్థితిని వివరిస్తూ యెహోవాకు ప్రార్థించాను. కాసేపటికి, ఉద్యోగాలు చూపించే ఒక కంపెనీవాళ్లు ఫోన్ చేసి, రెండు వారాలపాటు వేరే ఉద్యోగి స్థానంలో పనిచేయడం నాకు కుదురుతుందేమో అడిగారు.” సోమవారం సఫీరా తను చేయాల్సిన పని గురించి తెలుసుకోవడానికి ఉద్యోగ స్థలానికి వెళ్లి ఆ ఉద్యోగిని కలిసింది. ఆమె ఇలా అంటోంది: “ఆ ఉద్యోగి మరెవరో కాదు, పయినీరు సేవా పాఠశాలకు హాజరవ్వడం కోసం పది రోజులు సెలవు అవసరమైన మన సహోదరే! తన స్థానంలో ఎవరైనా వస్తే తప్ప తనకు సెలవు ఇవ్వనని వాళ్ల యజమాని చెప్పాడు. దాంతో ఆమె కూడా నాలాగే యెహోవా సహాయాన్ని అర్థించింది.”
నిజమైన సంతృప్తినిస్తుంది
పశ్చిమాఫ్రికాలో ఎన్నో సంవత్సరాలపాటు సేవ చేసిన కొంతమంది సహోదరసహోదరీలు అక్కడే స్థిరపడిపోయారు. మరికొంతమంది కొన్ని ఏళ్లపాటు సేవచేసి మళ్లీ తమ సొంత దేశాలకు తిరిగెళ్లారు. అయితే అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో ఒకప్పుడు సేవచేసిన చాలామంది, సంవత్సరాలుగా అక్కడ చేసిన సేవవల్ల ఇప్పటికీ ప్రయోజనం పొందుతున్నారు. యెహోవాను సేవించడం వల్ల మాత్రమే జీవితంలో నిజమైన సంతృప్తి దొరుకుతుందని వాళ్లు నేర్చుకున్నారు.
a ఫ్రెంచ్ భాష మాట్లాడే ఈ నాలుగు దేశాల్లోని పనిని బెనిన్ బ్రాంచి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.