వయసుపైబడిన వాళ్ల బాగోగులు చూసుకోండి
“చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.”—1 యోహా. 3:18.
1, 2. (ఎ) చాలా కుటుంబాలకు ఏ సమస్యలు వస్తాయి? అందువల్ల ఏ ప్రశ్నలు తలెత్తుతాయి? (బి) మారుతున్న పరిస్థితులను తట్టుకోవడానికి తల్లిదండ్రులు, పిల్లలు ఏమి చేయవచ్చు?
ఒకప్పుడు ఆరోగ్యంగా, ఎవ్వరిమీదా ఆధారపడకుండా బ్రతికిన మీ అమ్మానాన్నలకు ఇప్పుడు తప్పకుండా వేరొకరి సహాయం అవసరమని తెలుసుకున్నప్పుడు మీలో కలిగే బాధను మాటల్లో వర్ణించలేం. బహుశా వాళ్లలో ఒకరు, జారిపడడం వల్ల కాలు విరిగి బాధపడుతుండవచ్చు, అయోమయానికి గురై అటూఇటూ తిరుగుతుండవచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైవుండవచ్చు. మీ తల్లిదండ్రులవైపు నుండి ఆలోచిస్తే తమ శరీరంలో, ఇతర పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వల్ల మునుపటిలా స్వేచ్ఛగా ఉండలేకపోతున్నందుకు వాళ్లు మదనపడుతుండవచ్చు. (యోబు 14:1) వాళ్లకు మనం ఎలాంటి సహాయం చేయవచ్చు? వాళ్ల బాగోగులు ఎలా చూసుకోవచ్చు?
2 వయసుమళ్లిన వాళ్లపై శ్రద్ధ తీసుకోవడం గురించి ఒక ఆర్టికల్ ఇలా చెబుతుంది: “వృద్ధాప్యంలో వచ్చే ఇబ్బందులను చర్చించుకోవడం కుటుంబ సభ్యులకు కష్టమే అయినా, వాటి గురించి చర్చించుకొని, ఏమి చేయాలో ముందే ఆలోచించుకుంటే, ఎలాంటి పరిస్థితి తలెత్తినా చక్కగా వ్యవహరించగలుగుతారు.” వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యల్ని నివారించడం సాధ్యం కాదనే వాస్తవాన్ని అర్థంచేసుకున్నప్పుడు, అలా ముందుగానే చర్చించుకోవడం మంచిదని గ్రహిస్తాం. అందుకే మనం వాటికోసం ముందుగానే సిద్ధపడి, తగిన ప్రణాళికలు వేసుకోవాలి. ఆ ప్రణాళికలు సరిగ్గా అమలయ్యేలా కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఎలా సహకరించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
“దుర్దినముల” కోసం సిద్ధపడండి
3. వయసుమళ్లిన తల్లిదండ్రులకు సహాయం అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 వయసు పైబడినప్పుడు చాలామంది తమ పనులు సొంతగా చేసుకోలేని స్థితికి వస్తారు, అప్పుడు వాళ్లకు సహాయం అవసరం. (ప్రసంగి 12:1-7 చదవండి.) ఆ పరిస్థితుల్లో వాళ్లకు ఎలాంటి సహాయం అవసరమో, వాళ్లూ వాళ్ల ఎదిగిన పిల్లలూ కూర్చొని మాట్లాడుకుని, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. తల్లిదండ్రుల అవసరాలేమిటో, వాటిని తీర్చడానికి ఏమి చేయాలో, అందుకోసం కుటుంబమంతా ఎలా సహకరించుకోవాలో అందరూ కలిసి మాట్లాడుకుంటే మంచిది. ఆ సమయంలో అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, వాస్తవాలను దాపరికం లేకుండా చెప్పాలి. వృద్ధులైన తల్లిదండ్రులు కొద్దిపాటి సహాయంతో బహుశా తమ ఇంట్లోనే సురక్షితంగా ఉండడం వీలౌతుందేమో కూడా వాళ్లు చర్చించుకోవచ్చు. a లేదా తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్లలో ప్రతీ ఒక్కరు ఏమి చేయగలరో కూడా ఆలోచించవచ్చు. (సామె. 24:6) ఉదాహరణకు, వాళ్లలో ఒకరు రోజువారీ పనుల్లో సహాయ పడవచ్చు, మరొకరికి డబ్బు విషయంలో సహాయం చేసే శక్తి ఉండవచ్చు. ఏదేమైనా ప్రతీ ఒక్కరికి బాధ్యత ఉందని గుర్తుపెట్టుకోవాలి; అయితే సమయం గడుస్తుండగా బాధ్యతలు మారవచ్చు, లేదా బాధ్యతలను వంతులవారీగా చేయడం గురించి కూడా ఆలోచించాల్సిరావచ్చు.
4. కుటుంబ సభ్యులు సహాయం కోసం ఎవరిపై ఆధారపడాలి?
4 మీ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం మొదలుపెట్టిన వెంటనే, వాళ్ల పరిస్థితి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి కృషి చేయండి. వాళ్లలో ఎవరికైనా జబ్బు వల్ల అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తుంటే, దానివల్ల ముందుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చో తెలుసుకోండి. (సామె. 1:5) వృద్ధులకు సేవలు అందించే ప్రభుత్వ సంస్థలను సంప్రదించండి. మీ పనిని తేలికపరిచే, మీ తల్లిదండ్రులకు మరింతగా సహాయం చేసేందుకు తోడ్పడే స్థానిక సదుపాయాల గురించి కనుక్కోండి. మీ కుటుంబంలో వస్తున్న ఈ మార్పు వల్ల తీవ్రమైన బాధ, దిగ్భ్రాంతి లేదా అయోమయం లాంటివి మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. నమ్మకస్థుడైన స్నేహితునితో వాటిని పంచుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా, మీ హృదయాన్ని యెహోవా ముందు కుమ్మరించండి. ఏ పరిస్థితితోనైనా వ్యవహరించగల మనశ్శాంతిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు.—కీర్త. 55:22; సామె. 24:10; ఫిలి. 4:6, 7.
5. వృద్ధుల సహాయానికి సంబంధించిన వివరాల్ని ముందే సేకరించడం ఎందుకు మంచిది?
5 కొంతమంది వృద్ధులూ వాళ్ల కుటుంబ సభ్యులూ వివేచనతో, గడ్డుకాలం రాకముందే సహాయానికి సంబంధించిన వివరాలు సేకరించి పెట్టుకుంటారు. ఉదాహరణకు, ‘వయసుమళ్లిన తల్లిదండ్రులు తమ కొడుకు లేదా కూతురు దగ్గర ఉండడం కుదురుతుందా? లేదా స్థానికంగా ఉండే మరో సదుపాయాన్ని ఉపయోగించుకోవడం వీలౌతుందా?’ అని వాళ్లు ఆలోచించవచ్చు. వాళ్లు రాబోయే కష్టాల్ని, ఇబ్బందుల్ని ముందే ఊహించి వాటికోసం సిద్ధపడతారు. (కీర్త. 90:10) అయితే అలా ముందే ఆలోచించుకోని కుటుంబాలు, ఏదైనా అనుకోనిది జరిగితే ఏమి చేయాలో పాలుపోక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాయి. “నిర్ణయాలు తీసుకోవడానికి అంతకన్నా ఘోరమైన సమయం ఇంకొకటి ఉండదు” అని ఓ నిపుణుడు అంటున్నాడు. అలాంటి సమయాల్లో కుటుంబ సభ్యులు కంగారుపడొచ్చు, వాళ్లలో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ముందే ఆలోచించుకుని సిద్ధపడితే, భవిష్యత్తులో వచ్చే మార్పులకు సర్దుకుపోవడం అంత కష్టంగా ఉండదు.—సామె. 20:18.
6. వయసుపైబడిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలనే విషయంలో అందరూ కలిసి చర్చించుకోవడం ఎందుకు మంచిది?
6 వృద్ధులైన మీ తల్లిదండ్రులు వాళ్ల ఇంట్లోనే ఉండొచ్చా లేదా వేరే చోటుకు మారాలా వంటి విషయాల్ని వాళ్లతో చర్చించడం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, అలా చర్చించడం వల్ల మేలే జరిగిందని చాలామంది చెప్పారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు స్నేహపూర్వక వాతావరణంలో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చర్చించుకోవడం వల్ల సరైన ప్రణాళికలు వేసుకోగలిగారు. అలా ముందే ఎదుటివాళ్ల అభిప్రాయాలను తెలుసుకుని, ప్రేమగా దయగా మాట్లాడుకోవడం వల్ల, నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంత కష్టంగా అనిపించలేదని వాళ్లు గ్రహించారు. వయసుపైబడిన వాళ్లు వీలైనంతకాలం ఎవరిమీదా ఆధారపడకుండా బ్రతకాలని కోరుకోవచ్చు. అప్పుడు కూడా వాళ్లు ఆ విషయంతోపాటు, అవసరం వచ్చినప్పుడు పిల్లల నుండి ఎలాంటి సహాయాన్ని ఆశిస్తున్నారో కూడా చర్చిస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
7, 8. కుటుంబాలు ఏయే విషయాలు చర్చిస్తే మంచిది? ఎందుకు?
7 తల్లిదండ్రులారా, అలా మాట్లాడే సమయంలో మీ అభిప్రాయాలేంటో, మీకు ఎలాంటి సహాయం అవసరమో, మీరు ఎంతవరకూ మీ ఖర్చులను భరించగలరో కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల, భవిష్యత్తులో మీ అంతట మీరు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తే, మీ పిల్లలు మీ అభిరుచికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్లు బహుశా మీ అభిప్రాయాలను గౌరవించాలని, మీ స్వేచ్ఛకు అనవసరంగా అడ్డు తగలకూడదని కోరుకోవచ్చు. (ఎఫె. 6:2-4) ఉదాహరణకు, మీ పిల్లల్లో ఒకరు మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లి, అక్కడే ఉంచుకోవాలని మీరు కోరుకుంటున్నారా? లేదా మీ మనసులో మరేదైనా ఆలోచన ఉందా? అయితే, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించండి, మీ పిల్లలకు కూడా సొంత అభిప్రాయాలు ఉండే అవకాశముందని గుర్తుపెట్టుకోండి. అందరూ కలిసి ఓ అభిప్రాయానికి రావడానికి సమయం పడుతుంది.
8 ముందుగానే చర్చించుకుని, ప్రణాళికలు వేసుకుంటే సమస్యల్ని తగ్గించుకోవచ్చని అందరూ అర్థంచేసుకోవాలి. (సామె. 15:22) వైద్యం గురించి, చికిత్సా విధానాల గురించి కూడా చర్చించుకోవాలి. యెహోవాసాక్షులు ఉపయోగించే “నో బ్లడ్” కార్డ్‌లో (అడ్వాన్స్ హెల్త్‌కేర్ డైరక్టివ్లో) ఉన్న అంశాలను తప్పకుండా చర్చించాలి. తనకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారో తెలుసుకునే హక్కుతోపాటు, దాన్ని అంగీకరించాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ప్రతీ వ్యక్తికి ఉంటుంది. ఆ కార్డ్‌లో ప్రతీ వ్యక్తికి సంబంధించిన ఇష్టాలు, ఎంపికలు ఉంటాయి. నమ్మకమైన వ్యక్తిని మీ ఆరోగ్య సంరక్షణ ప్రతినిధిగా నియమించుకుంటే, అత్యవసర పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. వృద్ధులు, వాళ్ల బాగోగులు చూసుకునేవాళ్లు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ప్రతినిధులు తమదగ్గర ఆ వృద్ధుల బ్లడ్కార్డ్ కాపీలను ఉంచుకోవాలి. కొంతమంది వృద్ధులు తమ “నో బ్లడ్” కార్డ్ కాపీలను వీలునామా, ఆస్తిపాస్తులు, భీమా సంబంధించిన మరితర ముఖ్యమైన పత్రాలతో పాటు ఉంచుతారు.
మారుతున్న పరిస్థితులకు సర్దుకుపోవడం
9, 10. తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లల సహాయం ఎక్కువ అవసరం కావచ్చు?
9 వృద్ధుల సామర్థ్యాలను, పరిస్థితులను బట్టి వాళ్లకు వీలైనంత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలని ఇంట్లోని వాళ్లందరూ చాలా సందర్భాల్లో కోరుకుంటారు. బహుశా వంట చేయడం, శుభ్రం చేయడం, మందులు వేసుకోవడం, స్పష్టంగా మాట్లాడడం వంటివి వాళ్లకు ఇబ్బంది కానంతకాలం పిల్లలు తమ తల్లిదండ్రుల దైనందిన వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కాలం గడుస్తుండగా, తల్లిదండ్రులు చురుగ్గా కదల్లేని, కావాల్సిన వాటిని బయటకెళ్లి తెచ్చుకోలేని పరిస్థితి రావచ్చు లేదా జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు పిల్లల సహాయం అవసరం కావచ్చు.
10 వయసుపైబడే కొద్దీ అయోమయం, కృంగుదల, మలమూత్రాలపై నియంత్రణ లేకపోవడం, చూపు-వినికిడి మందగించడం, గుర్తుపట్టలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు; అయితే అలాంటి కొన్ని అనారోగ్య సమస్యలకు చక్కని వైద్యం అందుబాటులో ఉండవచ్చు. కాబట్టి అలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ విషయంలో పిల్లలే చొరవ తీసుకుని తల్లిదండ్రులను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాలి. అయితే కాలం గడిచేకొద్దీ, ఒకప్పుడు పూర్తిగా తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలేసిన విషయాల్లో కూడా పిల్లలు నెమ్మదినెమ్మదిగా జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. తల్లిదండ్రులకు వీలైనంత అత్యుత్తమ సహాయాన్ని అందించేందుకు పిల్లలే కొన్నిసార్లు వాళ్ల లాయర్లుగా, సెక్రెటరీలుగా, డ్రైవర్లుగా పనిచేయాల్సి ఉంటుంది.—సామె. 3:27.
11. వయసుమళ్లిన తల్లిదండ్రులు మార్పులకు సులభంగా సర్దుకుపోవాలంటే పిల్లలు ఏమి చేయాలి?
11 ఒకవేళ మీ తల్లిదండ్రుల సమస్యలు పరిష్కారం లేనివైతే, వాళ్లకు చేసే సహాయంలో లేదా వసతి ఏర్పాట్లలో మార్పులు అవసరమవ్వచ్చు. మార్పులు ఎంత తక్కువగా ఉంటే, వాటికి అలవాటు పడడం అంత సులభం. మీరు ఒకవేళ కాస్త దూరంలో నివసిస్తున్నట్లయితే, ఒక సహోదరుడో లేదా పొరుగున ఉండే వ్యక్తో క్రమంగా వాళ్ల దగ్గరికి వెళ్లి పలకరిస్తూ, వాళ్ల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే అవకాశం ఉందా? వంట చేసుకునే, శుభ్రం చేసుకునే విషయంలో వాళ్లకేమైనా సహాయం అవసరమా? వాళ్లున్న ఇంట్లోనే చిన్నచిన్న మార్పులు చేస్తే, స్నానం చేయడానికి, అటూఇటూ తిరగడానికి, మిగతా పనులు చేసుకోవడానికి మరింత అనుకూలంగా, సురక్షితంగా ఉంటుందా? లేదా ఆ వయసులో వాళ్లు, కావాల్సినంత స్వేచ్ఛగా జీవించేందుకు వీలుగా వాళ్ల బాగోగులు చూసుకునే సహాయకుణ్ణి నియమిస్తే సరిపోతుందా? అయితే వాళ్లు ఒంటరిగా ఉండడం క్షేమం కానప్పుడు వాళ్లతో ఎప్పుడూ ఒకరు ఉండేలా చూసుకోవాలి. పరిస్థితి ఏదైనా, వాటికి సంబంధించి మీ ప్రాంతంలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయో కనుక్కోండి. b—సామెతలు 21:5 చదవండి.
కొంతమంది ఏమి చేస్తారంటే . . .
12, 13. దూరంలో ఉంటున్న తల్లిదండ్రులను ఘనపర్చడానికి, వాళ్ల అవసరాలు తీర్చడానికి కొంతమంది ఏమి చేశారు?
12 తమ తల్లిదండ్రులకు ఏ కష్టం ఉండకూడదని వాళ్లను ప్రేమించే పిల్లలు కోరుకుంటారు. వాళ్ల అవసరాలు తీరుతున్నాయనే నమ్మకం కుదిరినప్పుడు పిల్లలు మనశ్శాంతితో ఉంటారు. అయితే ఎదిగిన పిల్లల్లో చాలామంది వివిధ బాధ్యతలవల్ల తమ తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు. అలాంటి కొంతమంది సెలవులు పెట్టి తమ తల్లిదండ్రులను సందర్శించి, వాళ్లు చేసుకోలేకపోతున్న పనుల్లో సాయం చేసి వాళ్ల అవసరాలు తీర్చారు. క్రమం తప్పకుండా, వీలైతే ప్రతీ రోజు ఫోను చేయడం, ఉత్తరాలు రాయడం, ఈ-మెయిల్స్ పంపించడం వంటివి చేస్తుంటే, తమ పిల్లలు తమను ప్రేమిస్తున్నారనే భరోసాతో తల్లిదండ్రులు ఉంటారు.—సామె. 23:24, 25.
13 పరిస్థితి ఏదైనా, మీ తల్లిదండ్రులకు రోజువారీ పనుల్లో ఎలాంటి సహాయం అవసరమో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. యెహోవాసాక్షులైన మీ తల్లిదండ్రులకు మీరు దూరంగా నివసిస్తున్నట్లయితే, వాళ్ల సంఘంలోని పెద్దలతో మాట్లాడి సలహా తీసుకోండి. మీ చింత గురించి తప్పకుండా ప్రార్థించండి. (సామెతలు 11:14 చదవండి.) మీ తల్లిదండ్రులు సత్యంలో లేకపోయినా, మీ ‘తండ్రిని, తల్లిని సన్మానించాలి.’ (నిర్గ. 20:12; సామె. 23:22) అయితే, అన్ని కుటుంబాలు ఒకేవిధంగా నిర్ణయించుకోవడం సాధ్యం కాదు. కొంతమంది తమ తల్లిదండ్రులను తమతో లేదా తమకు దగ్గర్లో ఉంచుకుంటారు. అయితే అలా చేయడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు, తమ పిల్లల కుటుంబంతో ఉండడానికి ఇష్టపడరు. విడిగానే ఉండాలని, ఇతరులకు భారంగా ఉండకూడదని వాళ్లు కోరుకుంటారు. మరికొంతమందికి ఆర్థిక వనరులు ఉండడంతో, తమ బాగోగులు చూసుకునే సహాయకుణ్ణి పెట్టుకోవాలని కోరుకోవచ్చు.—ప్రసం. 7:12.
14. వృద్ధుల బాగోగులు చూసుకునేవాళ్లకు ఎలాంటి సమస్యలు రావచ్చు?
14 చాలా కుటుంబాల్లో, వృద్ధుల బాగోగులు చూసుకునే బాధ్యత చాలావరకు వాళ్లకు దగ్గర్లో నివసిస్తున్న ఒక్క కొడుకుమీదో కూతురుమీదో పడుతుంది. అయితే, వాళ్లు ఆ పనిలో పడి తమ సొంత కుటుంబ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడాలి. ప్రతీ ఒక్కరు వెచ్చించగల సమయానికి, శక్తికి పరిమితులు ఉంటాయి. అలా బాధ్యత తీసుకున్నవాళ్ల పరిస్థితిలో మార్పు వస్తే, కుటుంబ సభ్యులందరూ కలిసి దాని గురించి చర్చించుకోవాల్సిరావచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరిమీదే మరీ ఎక్కువ బాధ్యతలు పడుతున్నాయా? వాటిని వంతులవారీగా మిగతా పిల్లలు కూడా పంచుకునే అవకాశం ఉందా?
15. తల్లిదండ్రుల బాగోగులను ఎక్కువగా చూసుకునేవాళ్ల ఓపిక నశించిపోయే పరిస్థితి రాకుండా ఎలా జాగ్రత్త పడవచ్చు?
15 వయసుమళ్లిన తల్లిదండ్రులకు 24 గంటలూ సహాయం అవసరమైనప్పుడు, వాళ్లకు సేవలు చేసీచేసీ పిల్లల్లో కొన్నిసార్లు ఓపిక నశించిపోయే ప్రమాదం ఉంది. (ప్రసం. 4:6) తమ తల్లిదండ్రులకు చేయగలిగినదంతా చేయాలని ప్రేమగల పిల్లలు కోరుకుంటారు, కానీ వాళ్లు కోరే వాటన్నిటినీ తీర్చడం కొన్నిసార్లు పిల్లలకు కష్టం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలు వాస్తవికంగా ఆలోచిస్తూ, వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. అప్పుడప్పుడు అలాంటి సహాయం తీసుకుంటే, వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే పని తేలికవుతుంది.
16, 17. వృద్ధులౌతున్న తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? వాళ్లు వాటినెలా తట్టుకోవచ్చు? (“ప్రేమగా బాగోగులు చూసుకుంది” బాక్సు కూడా చూడండి.)
16 మనం ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వృద్ధాప్యంవల్ల బాధలు పడడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ల బాగోగులు చూసుకునే చాలామందిలో బాధ, ఆందోళన, అసహనం, చిరాకు, అపరాధ భావం చివరికి కోపం వంటివి రావచ్చు. వృద్ధులైన తల్లిదండ్రులు అప్పుడప్పుడు కటువుగా మాట్లాడవచ్చు లేదా కృతజ్ఞత లేనివారిగా ప్రవర్తించవచ్చు. అలాంటి సందర్భాల్లో తొందరపడి నొచ్చుకోకండి. ఒక మానసిక నిపుణుడు ఇలా చెబుతున్నాడు: “మీలోని భావాలతో, ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బందిపెట్టే భావాలతో వ్యవహరించడానికి అత్యుత్తమ మార్గం ఏమిటంటే, మీలో అలాంటి భావాలు ఉన్నాయని ఒప్పుకోవడమే. అవి మీలో లేవని అనుకోవడం లేదా అలాంటివి కలుగుతున్నందుకు నిందించుకోవడం చేయకండి.” వాటిని మీ భర్తతో/భార్యతో, తోబుట్టువుతో లేదా నమ్మకస్థుడైన స్నేహితునితో పంచుకోండి. అలా మాట్లాడడం వల్ల, మీరు మీ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుని, సమతూకాన్ని కాపాడుకోగలుగుతారు.
17 కొన్ని దేశాల్లో, వృద్ధులౌతున్న తల్లిదండ్రులను ఇంట్లోనే ఉంచుకుని చూసుకునేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు, నైపుణ్యాలు ఓ కుటుంబానికి కొరవడినప్పుడు, మెరుగైన సంరక్షణ దొరికే చోట వాళ్లను ఉంచాలని పిల్లలు అనుకోవచ్చు. అలాంటి సంరక్షణలో ఉన్న తన తల్లిని చూడడానికి ఓ సహోదరి దాదాపు ప్రతీరోజు వెళ్లేది. తమ కుటుంబం గురించి ఆమె ఇలా చెబుతుంది: “మా అమ్మకు అవసరమైన విధంగా 24 గంటల సంరక్షణ ఇవ్వడం మాకస్సలు సాధ్యం కాలేదు. దాంతో ఏమాత్రం ఇష్టం లేకపోయినా, అలాంటి సంరక్షణ ఇచ్చే చోట ఆమెను ఉంచాలని నిర్ణయించుకున్నాం. అలా ఉంచడం మనసుకు చాలా కష్టం అనిపించింది. అయినప్పటికీ, ఆ చివరి నెలల్లో తన సంరక్షణ చూసుకోవడానికి అంతకన్నా అత్యుత్తమ మార్గం కనిపించలేదు, ఆ విషయాన్ని మా అమ్మ కూడా ఒప్పుకుంది.”
18. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేవాళ్లు ఏ భరోసాతో ఉండవచ్చు?
18 అంతకంతకూ వయసుపైబడుతున్న మీ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవడం కొంచెం క్లిష్టంగా, మనసుకు అలసటగా ఉండవచ్చు. వృద్ధుల బాగోగులు ఫలాని విధంగానే చూసుకోవాలని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. అయినా, ముందే తెలివిగా ఆలోచించుకుని, అందరూ చక్కగా మాట్లాడుకుంటూ, సహకరించుకుంటూ, అన్నిటి కంటే ముఖ్యంగా యెహోవాకు ప్రార్థిస్తూ ఉంటే, మీ ప్రియమైన వాళ్లను ఘనపర్చే బాధ్యతను చక్కగా నిర్వర్తించగలుగుతారు. అలా చేయడం ద్వారా, మీ తల్లిదండ్రులు అవసరమైన శ్రద్ధను, అవధానాన్ని పొందుతున్నారనే సంతృప్తి మీ సొంతమవుతుంది. (1 కొరింథీయులు 13:4-8 చదవండి.) మరి ప్రాముఖ్యంగా, తల్లిదండ్రులను గౌరవించే వాళ్లకు యెహోవా అనుగ్రహించే మనశ్శాంతి మీకు ఉంటుందనే భరోసాతో ఉండవచ్చు.— ఫిలి. 4:7.
a తల్లిదండ్రుల, పిల్లల నిర్ణయాలు కొన్నిసార్లు స్థానిక సంస్కృతిని బట్టి కూడా మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, తల్లిదండ్రులు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ సాధారణంగా ఒకే ఇంట్లో నివసించడానికి లేదా క్రమంగా కలుసుకోవడానికి ఇష్టపడతారు.
b వయసుమళ్లిన మీ తల్లిదండ్రులు తమ ఇంట్లోనే నివసిస్తుంటే, అత్యవసర పరిస్థితిలో వాళ్లకు సహాయం చేసేందుకు వీలుగా, నమ్మకస్థులైన సహాయకుల దగ్గర ఆ ఇంటి తాళాలు ఉండేలా చూసుకోండి.