కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా నిర్ణయించుకునే అవకాశాన్నిస్తాడు

యెహోవా నిర్ణయించుకునే అవకాశాన్నిస్తాడు

దేవునికి దగ్గరవ్వండి

యెహోవా నిర్ణయించుకునే అవకాశాన్నిస్తాడు

ద్వితీయోపదేశకాండము 30:11-20

యె హోవాకు నమ్మకంగా ఉండలేనని చాలాసార్లు అనవసరంగా భయపడుతుంటాను” అని చిన్నప్పుడు తనకెదురైన చేదు అనుభవాల్నిబట్టి నమ్మకంగా ఉండలేనని అనుకుంటున్న ఒక క్రైస్తవురాలు అంటోంది. నమ్మకంగా ఉండలేమన్నది నిజమేనా? పరిస్థితుల చేతిలో మనం కీలుబొమ్మలమేనా? కాదు. యెహోవా దేవుడు మనకు స్వంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనమెలా జీవించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఈ విషయంలో ఆయన వాక్యమైన బైబిలు మనకు సహాయం చేస్తుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలోవున్న మోషే మాటలను పరిశీలించండి.

మనమేమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసుకోవడం, దాని ప్రకారం చేయడం కష్టమా? a ‘నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ ధర్మం గ్రహించడం నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు’ అని మోషే అన్నాడు. (11వ వచనం) మనకు అసాధ్యమైనది చేయమని యెహోవా మనల్ని అడగడు. ఆయన మనం చేయగలిగినవాటిని, చేయగలిగినన్ని మాత్రమే చేయమని అడుగుతాడు. ఆయన మనల్ని ఏమి చేయమంటున్నాడో తెలుసుకోవడం సాధ్యమే. వాటి గురించి తెలుసుకోవడానికి మనం ‘ఆకాశానికి’ ఎక్కిపోవాల్సిన అవసరం లేదు, ‘సముద్రాన్ని దాటి’ వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. (12, 13 వచనాలు) మనమెలా జీవించాలో బైబిలు స్పష్టంగా చెబుతోంది.—మీకా 6:8.

అయితే, తనకు లోబడాలని యెహోవా మనల్ని బలవంతం చేయడు. ‘నేడు నేను జీవాన్ని మేలును, మరణాన్ని కీడును నీ యెదుట ఉంచాను’ అని మోషే అన్నాడు. (15వ వచనం) మనకు జీవం కావాలో మరణం కావాలో, మేలు కావాలో కీడు కావాలో మనమే నిర్ణయించుకోవచ్చు. దేవుణ్ణి ఆరాధించి, ఆయనకు లోబడి దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు పొందాలనో, ఆయనకు లోబడకుండా దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎదుర్కోవాలనో మనమే నిర్ణయించుకోవచ్చు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.—16-18 వచనాలు; గలతీయులు 6:7, 8.

మనం తీసుకునే నిర్ణయాలను యెహోవా పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు! ఎందుకంటే దేవుని నడిపింపుతో మోషే ఇలా అన్నాడు, ‘జీవాన్ని కోరుకోండి.’ (20వ వచనం) అయితే మనం జీవాన్ని కోరుకున్నామని ఎలా చూపించవచ్చు? ‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన వాక్యాన్ని విని, ఆయన్ని హత్తుకోవాలి’ అని మోషే వివరించాడు. (20వ వచనం) మనం యెహోవాను ప్రేమిస్తే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన చెప్పింది విని, ఆయనకు నమ్మకంగా ఉంటాము. అలా చేస్తే మనం జీవాన్ని కోరుకున్నట్లే. దానివల్ల మనం ఇప్పుడు శ్రేష్ఠమైన జీవితాన్ని గడపవచ్చు, రాబోయే దేవుని నూతన లోకంలో ఎప్పటికీ జీవించే అవకాశం మనకుంటుంది.—2 పేతురు 3:11-13; 1 యోహాను 5:3.

మోషే మాటల్లో హామీనిచ్చే ఒక సత్యముంది. ఈ చెడ్డ లోకంలో మీకెలాంటి అనుభవాలు ఎదురైనా పరిస్థితుల చేతుల్లో మీరు కీలుబొమ్మలు కాదు, మీరు నమ్మకంగా ఉండడం సాధ్యమే. యెహోవా మనకు స్వంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చి, మనకంటూ ఒక గౌరవాన్నిచ్చాడు. అవును, మీరు యెహోవాను ప్రేమించాలని, ఆయన చెప్పింది వినాలని, ఆయనకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. మీరలా చేయాలనుకుంటే యెహోవా మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు.

యెహోవాను ప్రేమించి, ఆయన సేవ చేయాలని స్వంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకుందనే ఈ సత్యం తెలుసుకోవడంవల్లే మనం మొదట్లో చెప్పుకున్న స్త్రీ ఓదార్పు పొందింది. ఆమె ఇలా అంటోంది, “యెహోవాను ప్రేమించడమే అన్నిటికన్నా ముఖ్యమైనదని కొన్నిసార్లు నేను మర్చిపోయాను. కానీ నేను యెహోవాను ప్రేమిస్తున్నాను కాబట్టి, నమ్మకంగా ఉండగలను.” యెహోవా సహాయంతో మీరు కూడా అలాగే నమ్మకంగా ఉండవచ్చు. (w09-E 11/01)

[అధస్సూచి]