కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మనల్ని ఏమి చేయమని అడుగుతున్నాడు?

యెహోవా మనల్ని ఏమి చేయమని అడుగుతున్నాడు?

దేవునికి దగ్గరవ్వండి

యెహోవా మనల్ని ఏమి చేయమని అడుగుతున్నాడు?

ద్వితీయోపదేశకాండము 10:12, 13

లో బడాలా వద్దా అని నిర్ణయించుకోవడం అన్ని సందర్భాల్లో అంత సులభం కాదు. కఠినుడైన లేదా పీడించే యజమానికి ఆయన కింద పనిచేసేవారు సణుగుకుంటూ మాత్రమే లోబడతారు. కానీ యెహోవా దేవుని ఆరాధకులు మాత్రం ఆయనకు ఇష్టపూర్వకంగానే లోబడతారు. ఎందుకు? ఎందుకో అర్థం చేసుకోవడానికి మనం ద్వితీయోపదేశకాండము 10:12, 13 వచనాల్లో ఉన్న మోషే మాటలను పరిశీలిద్దాం. a

దేవుడు కోరేవాటిని సంక్షిప్తంగా చెబుతూ, మోషే ఈ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు: ‘నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నాడు?’ (13వ వచనం) దేవుడు మనమేమి చేయాలని కోరుకుంటున్నాడో అది చేయమని అడిగే హక్కు ఆయనకుంది. ఎంతైనా ఆయన సర్వాధిపతి. అంతేకాదు, ఆయన జీవానికి ఊట, మన ప్రాణ రక్షకుడు. (కీర్తన 36:9; యెషయా 33:22) కాబట్టి తనకు లోబడమని మనల్ని అడిగే హక్కు ఆయనకుంది. అయినా, మనం బలవంతంగా తనకు లోబడాలని ఆయనేమీ కోరడు. మరి ఆయన మనల్ని ఏమి అడుగుతున్నాడు? మనం ‘హృదయపూర్వకంగా లోబడాలనే’ ఆయన కోరుతున్నాడు.—రోమీయులు 6:17.

ఇష్టపూర్వకంగా దేవునికి లోబడడానికి మనల్ని ఏవి పురికొల్పుతాయి? మోషే వాటిలో ఒకదాని గురించి ప్రస్తావిస్తూ, ‘మీ దేవుడైన యెహోవాకు భయపడండి’ అని చెప్పాడు. b (12వ వచనం) అంటే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో కాదుగానీ దేవుని పట్ల, ఆయన మార్గాల పట్ల గౌరవంతో, పూజ్యభావంతో లోబడాలి. మనకు దేవుని పట్ల ప్రగాఢమైన భక్తిపూర్వక భయముంటే, ఆయనకు ఇష్టంలేని పనులేవీ చేయము.

కాబట్టి దేవునికి లోబడేందుకు ముఖ్యంగా ఏది మనల్ని ప్రేరేపించాలి? మోషే ఇలా చెబుతున్నాడు: ‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో సేవించుము.’ (12వ వచనం) దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం ప్రేమిస్తున్నామని అనుకోవడం మాత్రమే కాదు. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా వివరిస్తోంది: “అనుకోవడానికి సంబంధించిన హెబ్రీ క్రియాపదాలు కొన్నిసార్లు అలా అనుకోవడం వల్ల చేసే క్రియలను కూడా సూచిస్తాయి.” దేవుణ్ణి ప్రేమించడమంటే, ఆయన కోసం “ప్రేమతో పనిచేయడం” అని కూడా ఆ పుస్తకం చెబుతోంది. ఇంకో విధంగా చెప్పాలంటే, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనకు సంతోషం కలిగించే పనులే చేస్తాం.—సామెతలు 27:11.

మనం ఎంతమేరకు దేవునికి లోబడాలి? ‘దేవుని మార్గాలన్నిటిలో నడవాలని’ మోషే చెబుతున్నాడు. (12వ వచనం) యెహోవా తను చేయమని అడిగే ప్రతీ పనిని మనం చేయాలని కోరుతున్నాడు. అలా పూర్తి విధేయత చూపించడంవల్ల మనమేమైనా నష్టపోతామా? అలా జరిగే అవకాశమే లేదు.

ఇష్టపూర్వకంగా లోబడితే మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ‘మీ మేలు కోసం నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి’ అని మోషే రాశాడు. (13వ వచనం) యెహోవా ఇచ్చే ప్రతీ ఆజ్ఞ అంటే ఆయన మనల్ని చేయమని అడిగే ప్రతీదీ మన మేలు కోసమే. అలా ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:8) అందుకే, ఆయన మన నిత్య సంక్షేమానికి తోడ్పడే ఆజ్ఞల్ని మాత్రమే ఇచ్చాడు. (యెషయా 48:17) యెహోవా మనల్ని చేయమని అడిగే ప్రతీదానిని చేస్తే, ఇప్పుడు చికాకుపెట్టే ఎన్నో విషయాల నుండి తప్పించుకోవడమే కాక భవిష్యత్తులో ఆయన రాజ్యపాలనలో అంతులేని ఆశీర్వాదాలు అందుకుంటాం. c

లోబడాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సి వస్తే, యెహోవా అడిగే వాటిని చేయాలనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అదే సరైనది. ఎల్లప్పుడూ ఇష్టపూర్వకంగా, పూర్తిగా లోబడడమే అత్యుత్తమం. నమ్మకంగా అలా లోబడితే, మన క్షేమాన్నే ఎల్లప్పుడూ కోరుకునే ప్రేమగల దేవుడైన యెహోవాకు మనం మరింత దగ్గరౌతాం. (w09-E 10/01)

[అధస్సూచీలు]

a మోషే ఆ మాటలు పూర్వకాల ఇశ్రాయేలీయులను ఉద్దేశించే చెప్పినా, వాటిలోని సూత్రాలు నేడు దేవునికి ఇష్టమైన విధంగా నడుచుకోవాలనుకునే వారందరికీ వర్తిస్తాయి.—రోమీయులు 15:4.

b యెహోవాకు భయపడడమనే సూత్రం దేవుని సేవకులను నడిపించాలని ద్వితీయోపదేశకాండము పుస్తకమంతటిలో మోషే నొక్కిచెప్పాడు.—ద్వితీయోపదేశకాండము 4:10; 6:13, 24; 8:6; 13:4; 31:12, 13.

c మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో “భూమి పట్ల దేవుని సంకల్పం ఏమిటి?” అనే 3వ అధ్యాయం చూడండి.