కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎవరైనా అసలెందుకు చెడ్డ పనులు చేస్తారు?

ఎవరైనా అసలెందుకు చెడ్డ పనులు చేస్తారు?

ఎవరైనా అసలెందుకు చెడ్డ పనులు చేస్తారు?

మనందరం అపరిపూర్ణులం కాబట్టి తప్పులు చేసి, ఆ తర్వాత దాని గురించి బాధపడతామన్న విషయాన్ని మనలో చాలామంది ఒప్పుకుంటారు. చాలా చెడ్డ పనులు, అవి చిన్నవిగానీ పెద్దవిగానీ జరగడం గురించి మనం దాదాపు ప్రతీరోజు వార్తల్లో వింటుంటాం, చూస్తుంటాం. కొన్నిసార్లు అవి ప్రత్యక్షంగా మన కళ్లముందే జరుగుతుంటాయి. అయితే, అలాంటి పనులు జరగడానికి అపరిపూర్ణతే కారణమా?

మనం అపరిపూర్ణులమే అయినా, మనం ఉల్లంఘించకూడని నైతిక ప్రమాణాలు ఉన్నాయనీ మనం చెడ్డ పనులు చేయకుండా ఉండడం సాధ్యమేననీ ఎవరైనా సాధారణంగా ఒప్పుకుంటారు. పొరపాటున అబద్ధం చెప్పడానికి, కావాలనే పచ్చి అబద్ధాలు చెప్పడానికి అలాగే అనుకోకుండా హాని చేయడానికి, పథకం ప్రకారం హత్య చేయడానికి మధ్య చాలా తేడా ఉందని కూడా ఎంతోమంది వెంటనే అంగీకరిస్తారు. అయితే, ఘోరమైన అకృత్యాలు చేసేది మన చుట్టూవున్న మామూలు మనుషుల్లా కనిపించేవాళ్లే. మరి ఎవరైనా అసలెందుకు చెడ్డ పనులు చేస్తారు?

దీని గురించి బైబిలు వివరిస్తోంది. చెడ్డ పనులని తెలిసి కూడా ఎవరైనా వాటిని ఎందుకు చేస్తారనే దానికి ముఖ్యమైన కారణాలను బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. వాటిని పరిశీలించండి.

▪ ‘అన్యాయం వల్ల జ్ఞానవంతులు తమ బుద్ధిని కోల్పోతారు.’ప్రసంగి 7:7.

కొన్నిసార్లు ప్రజలు మామూలుగా అయితే చేయని పనులను పరిస్థితులకు లొంగిపోయి చేస్తారని బైబిలు ఒప్పుకుంటోంది. కొంతమంది కష్టాలకు, అన్యాయాలకు పరిష్కారమని తాము అనుకున్నదాన్ని సాధించడానికి ఘోరమైన నేరాలు కూడా చేస్తారు. అర్బన్‌ టెర్రరిజమ్‌ అనే పుస్తకం ఇలా చెప్తోంది, “రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా మార్పు రాదేమోనని నిజంగా బాధపడడం వల్లే ఒక వ్యక్తి ఉగ్రవాది అవుతాడు.”

▪ ‘ధనం మీద అపేక్ష సమస్త కీడులకు మూలం.’1 తిమోతి 6:10.

డబ్బుకు లోకం దాసోహం అనే సామెత చెప్తున్నట్టు, డబ్బు వచ్చేలావుంటే మంచివాళ్లు కూడా నీతినియమాలు వదిలేయడానికి సిద్ధమౌతారు. సాధారణ పరిస్థితుల్లో చాలా స్నేహపూర్వకంగా, దయగా ఉన్నట్టు కనిపించేవాళ్లు డబ్బుకు సంబంధించిన విషయాలు వచ్చేసరికి మంచీమర్యాద మర్చిపోయి క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. బ్లాక్‌మెయిల్‌, మోసం, అపహరణ వంటి ఎన్నో నేరాలు అత్యాశ వల్లే జరుగుతున్నాయి.

▪ ‘దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగకపోవడం చూసి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్‌క్రియలు చేస్తారు.’ప్రసంగి 8:11.

ఈ లేఖనం తెలియజేస్తున్నట్టు, చట్టం అమలు జరిగేలా చూసే అధికారులు కళ్లెదుట లేకపోతే ప్రజలు ఏమి చేయడానికైనా వెనుకాడరు. అందుకే, వేగంగా వాహనాలు నడుపుతుంటారు, పరీక్షల్లో కాపీ కొడుతుంటారు, ప్రజాధనాన్ని దోచుకుంటారు, ఇంకా ఘోరమైన పనులు కూడా చేస్తుంటారు. సాధారణంగా చట్టానికి కట్టుబడి ఉండే ప్రజలు, చట్టం సరిగ్గా అమలు కాకుండా ఉంటే లేదా దొరికిపోతామనే భయం లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడరు. ఆర్గ్యుమెంట్స్‌ అండ్‌ ఫ్యాక్ట్స్‌ అనే పత్రిక ఇలా చెప్తోంది, “నేరస్థులు ఎంతో సులువుగా శిక్ష తప్పించుకోవడం చూసి, సామాన్య పౌరులు కూడా చాలా క్రూరమైన నేరాలు చేస్తారనిపిస్తోంది.”

▪ ‘ప్రతీ ఒక్కరు తమ సొంత దురాశ వల్ల మరలుకొల్పబడి శోధింపబడతారు. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది.’యాకోబు 1:14, 15.

అందరికీ చెడ్డ ఆలోచనలు వస్తాయి. చెడ్డ పనులను ప్రోత్సహించే ఎన్నో సలహాలు, ఎన్నో శోధనలు కుప్పలు తెప్పలుగా మనకు ప్రతీరోజు ఎదురవుతుంటాయి. ‘సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు’ అని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు చెప్పబడింది. (1 కొరింథీయులు 10:13) అయినా సరే, ఏది చేయడానికి నిర్ణయించుకుంటామనే దానిపైనే అంటే ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే దాన్ని వెంటనే కొట్టిపారేస్తామా లేక దాని గురించే ఆలోచిస్తూ ఉంటామా అనే దానిపైనే మనం చెడ్డ పనులు చేస్తామా లేదా అనేది ఆధారపడివుంటుంది. చెడు కోరిక ‘గర్భం ధరించడానికి’ అవకాశమిస్తే అది తప్పకుండా చెడ్డ పనులకు దారితీస్తుందని యాకోబు రాసిన ప్రేరేపిత పత్రికలోని పై లేఖనం హెచ్చరిస్తోంది.

▪ ‘జ్ఞానులతో సహవాసం చేసేవాళ్లు జ్ఞానం గలవాళ్లు అవుతారు. మూర్ఖులతో సహవాసం చేసేవాళ్లు చెడిపోతారు.’సామెతలు 13:20.

మన సహవాసులు మనమీద ఎంతో ప్రభావం చూపిస్తారు. వాళ్ల వల్ల మనం మంచి పనులైనా చేస్తాం లేదా చెడ్డ పనులైనా చేస్తాం. అందుకే ప్రజలు మామూలుగా చేయాలనుకోని పనులను, తోటివారి ఒత్తిడివల్ల లేదా చెడు సహవాసం వల్ల చేసి ఘోరమైన పరిణామాలు ఎదుర్కొంటుంటారు. బైబిలు వాడుక ప్రకారం, “మూర్ఖులు” అంటే తెలివి తక్కువవాళ్లని కాదు కానీ, దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానవంతమైన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్లు. యౌవనస్థులైనా, పెద్దవాళ్లయినా సహవాసుల్ని సరిగ్గా అంటే బైబిలు ప్రమాణాల ప్రకారం ఎంపికచేసుకోకపోతే ‘చెడిపోవడం’ ఖాయం.

మామూలు ప్రజలు చెడ్డ పనులే కాదు చివరికి ఘోరమైన నేరాలు కూడా ఎందుకు చేస్తారో ఈ లేఖనాలు, అలాగే బైబిల్లోవున్న వేరే లేఖనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ప్రజలు చెడ్డ పనులు చేసేలా వాళ్లను ఏవి ప్రేరేపిస్తాయో తెలుసుకోవడం సహాయకరంగానే ఉంటుంది, అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఉందా? ఉంది, ప్రజలు ఎందుకు చెడ్డ పనులు చేస్తున్నారో బైబిలు వివరిస్తోంది. అంతేకాదు, అలాంటి పనులు ఇకముందు ఎప్పుడూ జరగవని కూడా అది వాగ్దానం చేస్తోంది. ఏమిటా వాగ్దానం? నిజంగా లోకంలో చెడు అనేదే లేకుండా పోతుందా? తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది. (w10-E 09/01)