కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

దేవుడు మనల్ని ప్రార్థించమని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు?

దేవుడు మనల్ని ప్రార్థించమని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు?

దేవుడు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు.

స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, అలా వాళ్ల మధ్య బంధం బలంగా ఉంటుంది. అదే విధంగా దేవుడు తనతో మాట్లాడమని ఆహ్వానించి ఆయనతో స్నేహం చేసే మార్గం తెరిచాడు. ఆయనిలా అంటున్నాడు: “మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.” (యిర్మీయా 29:12) మీరు దేవునితో మాట్లాడుతూ ఆయనకు దగ్గరైతే “అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి ... యెహోవా సమీపముగా ఉన్నాడు” అనే హామీ బైబిల్లో ఉంది. (కీర్తన 145:18) మనం దేవునితో ఎంత ఎక్కువగా మాట్లాడితే ఆయనతో స్నేహం అంత ఎక్కువగా బలపడుతుంది.

“తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి ... యెహోవా సమీపముగా ఉన్నాడు.” —కీర్తన 145:18

దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు.

యేసు ఇలా అన్నాడు: “మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు ... మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.” (మత్తయి 7:9-11) “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు,” మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ప్రార్థించమంటున్నాడు. (1 పేతురు 5:7) మీ సమస్యల గురించి కూడా ఆయనతో చెప్పమని అడుగుతున్నాడు. బైబిల్లో ఇలా ఉంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”—ఫిలిప్పీయులు 4:6.

మనుషులందరికీ దేవునితో సంబంధం అవసరం.

మనుషుల స్వభావాన్ని పరిశోధించడంలో నిపుణులైనవాళ్లు గమనించింది ఏంటంటే కోట్లమందికి ప్రార్థన చేయాలనిపిస్తుంది. నాస్తికులు అంటే దేవుడు లేడని నమ్మేవాళ్లకు, అజ్ఞేయతావాదులు అంటే దేవుని గురించి తెలుసుకోవడం అసాధ్యం అని నమ్మేవాళ్లకు కూడా ప్రార్థన చేయాలని అనిపిస్తుందని చెప్పారు. a ఇదంతా గమనించినప్పుడు, దేవుని మీద ఆధారపడే స్వభావం మనుషులకు పుట్టుకతో వస్తుందని చెప్పవచ్చు. దేవునితో సంబంధం అవసరమని అర్థం చేసుకున్నవాళ్లు సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు. (మత్తయి 5:3) దేవునితో ఎప్పుడూ మాట్లాడితేనే ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు.

ప్రార్థన చేయమనే దేవుని మాట వింటే, ఎలాంటి ప్రయోజనాలుంటాయి? (w15-E 10/01)

a అమెరికాలో 11 శాతం నాస్తికులు, అజ్ఞేయతావాదులు నెలలో ఒక్కసారైన ప్రార్థన చేస్తారని ప్యూ రిసర్చ్‌ సెంటర్‌ 2012⁠లో చేసిన సర్వేలో తేలింది.