కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?

బైబిలు చదవడం నేను ఎలా మొదలుపెట్టవచ్చు?

బైబిలు చదవడం నేను ఎలా మొదలుపెట్టవచ్చు?

బైబిల్ని ఏ పద్ధతిలో చదివితే బాగుంటుంది? పూర్తిగా ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి? చాలామందికి ఉపయోగపడిన ఐదు సలహాలను గమనించండి.

సరైన పరిసరాల్లో చదవండి. ప్రశాంతమైన స్థలాన్ని చూసుకోండి. మీ అవధానం పక్కకు మళ్లించే విషయాలు తగ్గించుకోండి, అప్పుడు మీరు చదివే వాటిమీద మనసు పెట్టగలుగుతారు. మంచి వెలుతురు, గాలి ఉంటే మీరు చదువుతున్న దాన్నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

మంచి అభిప్రాయంతో ఉండండి. బైబిలు మన పరలోక తండ్రి నుండి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు చెప్పింది చక్కగా విని నేర్చుకునే పిల్లవాడిలా ఉంటే మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. బైబిలు గురించి లేనిపోని అపోహలను, అభిప్రాయాలను పక్కన పెట్టేస్తే, దేవుడు బోధించే విషయాలు నేర్చుకుంటారు.—కీర్తన 25:4.

చదివే ముందు ప్రార్థన చేసుకోండి. బైబిల్లో దేవుని ఆలోచనలు ఉంటాయి కాబట్టి, వాటిని అర్థం చేసుకోవడానికి మనకు ఆయన సహాయం కావాలి. “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను” ఇస్తానని దేవుడు మాటిస్తున్నాడు. (లూకా 11:13) పరిశుద్ధాత్మ లేదా పవిత్రశక్తి దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మెల్లమెల్లగా దేవుని లోతైన విషయాల్ని అర్థం చేసుకోవడానికి అది మీ మనసులను తెరుస్తుంది.—1 కొరింథీయులు 2:10.

అర్థంచేసుకుంటూ చదవండి. పూర్తి చేయాలనే ఉద్దేశంతో గబగబ చదవకండి. మీరు చదివే దాని గురించి బాగా ఆలోచించండి. ఈ ప్రశ్నలు పరిశీలించండి: ‘బైబిల్లో నేను ఎవరి గురించి చదువుతున్నానో వాళ్లలో ఏ లక్షణాలను చూస్తున్నాను? వాటిని నా జీవితంలో ఎలా పాటించాలి?’

కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి. బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందాలంటే, మీ జీవితానికి నిజంగా ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చదవండి. చదువుతున్నప్పుడు ఈ లక్ష్యాలు పెట్టుకోండి: ‘నేను దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి,’ ‘నేను మంచి వ్యక్తిగా, మంచి భర్తగా/మంచి భార్యగా అవ్వాలి.’ తర్వాత బైబిల్లో అలాంటి భాగాలు ఉన్న సమాచారాన్ని తీసుకుని, వాటిని చదివితే మీ లక్ష్యాలను చేరుకుంటారు. a

బైబిలు చదవడం మొదలుపెట్టడానికి ఈ ఐదు సలహాలు మీకు ఉపయోగపడతాయి. కానీ బైబిలు చదివే విషయంలో ఇంకా ఆసక్తి పెరగాలంటే ఏమి చేయాలి? తర్వాత ఆర్టికల్‌ ఇంకొన్ని సలహాలు ఇస్తుంది.

a బైబిల్లో ఉన్న ఏ భాగం చదవాలనే విషయంలో సందేహం ఉంటే మీకు యెహోవాసాక్షులు సహాయం చేస్తారు.