బైబిలు జీవితాలను మారుస్తుంది
ఒకప్పుడు నేను క్రూరంగా ఉండేవాడిని
పుట్టిన సంవత్సరం: 1952
దేశం: అమెరికా
ఒకప్పుడు: చాలా కోపిష్ఠి
నా గతం:
నేను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న లాస్ ఏంజెల్స్‌లో పెరిగాను. మా చుట్టుపక్కల ప్రాంతాలు రౌడీ మూకలకు, డ్రగ్స్‌కు పేరుగాంచాయి. మా అమ్మానాన్నలకు మేము ఆరుగురు పిల్లలం, నేను రెండోవాణ్ణి.
మా అమ్మ మమ్మల్ని ఇవాంజెలికల్ చర్చీ సభ్యులుగా పెంచింది. అయితే నేను టీనేజీకి వచ్చాక, ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉండేవాణ్ణి. ఆదివారాలు చర్చీలో పాటలు పాడేవాణ్ణి, మిగతా రోజుల్లో పార్టీలకు వెళ్లడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో తిరగడం చేసేవాణ్ణి.
నాకు చాలా త్వరగా విపరీతమైన కోపం వచ్చేది. చేతికి ఏది దొరికితే దాంతో దాడి చేసేవాణ్ణి. చర్చీలో నేర్చుకునే విషయాలు నన్ను మార్చలేకపోయాయి. “ప్రతీకారం ప్రభువుది—నేను ఆయన పనిముట్టును!” అనేవాణ్ణి. 1960ల చివర్లో నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, బ్లాక్ ఫాంథర్స్ అనే రాజకీయ గుంపు ప్రభావం నామీద పడింది. వాళ్లు పౌర హక్కులకు సంబంధించిన సమస్యల్ని పోరాటాల ద్వారా పరిష్కరించాలని ప్రయత్నించేవాళ్లు. నేను పౌర హక్కుల విద్యార్థి యూనియన్‌లో చేరాను. చాలాసార్లు మేము, స్కూల్‌ను తాత్కాలికంగా మూయించి నిరసనలు చేశాం.
ఆ నిరసనలు నన్ను తృప్తిపర్చలేకపోయాయి. దాంతో నేను వేరే జాతి వాళ్లమీద దౌర్జన్యం చేయడం మొదలుపెట్టాను. ఉదాహరణకు, నేనూ మా స్నేహితులు అమెరికాలో నల్లజాతి వాళ్లు బానిసలుగా ఉన్నప్పుడు పడ్డ కష్టాల్ని చూపించే సినిమాలకు వెళ్లాం. ఆ అన్యాయాల్ని చూసి చాలా కోపంతో, అక్కడే సినిమా హాలులో ఉన్న తెల్లజాతి యువకుల మీద దాడిచేశాం. అప్పటికీ కోపం చల్లారక, ఇంకా ఎక్కువమందిని కొట్టడానికి వాళ్లుండే ప్రాంతాలకు వెళ్లాం.
నాకు దాదాపు 18 ఏళ్లు వచ్చేసరికి, మా అన్నదమ్ములం ఎన్నో ఘోరమైన నేరాలు చేశాం. మాకు అధికారులతో సమస్యలు తలెత్తాయి. మా తమ్ముడు క్రూరమైన గ్యాంగ్‌లో చేరాడు, నేను కూడా వాళ్లతో కలిశాను. అప్పట్లో నేను చాలా క్రూరంగా ఉండేవాడిని.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...
నా ఫ్రెండ్ వాళ్ల అమ్మానాన్నలు యెహోవాసాక్షులు. వాళ్లు తమ సంఘంలో కూటాలకు రమ్మని నన్ను ఆహ్వానించారు, నేను వెళ్లాను. మొదటిసారి కలిసినప్పటి నుండే యెహోవాసాక్షులు అందరిలా లేరని గమనించాను. ప్రతి ఒక్కరి చేతిలో బైబిలు ఉండేది, వాళ్లు కూటం జరుగుతున్నప్పుడు దాన్ని తీసి చూసేవాళ్లు. యౌవనులు ప్రసంగాలు కూడా ఇచ్చేవాళ్లు! దేవునికి ఒక పేరు ఉందని, ఆ పేరు యెహోవా అని తెలుసుకోవడం, దాన్ని ఇతరులు ఉపయోగిస్తుంటే వినడం నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. (కీర్తన 83:18) సంఘంలో చాలా జాతులవాళ్లు ఉండేవాళ్లు, కానీ వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు.
మొదట్లో నాకు యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవాలని అనిపించలేదు, కానీ కూటాలకు వెళ్లడానికి ఇష్టపడేవాణ్ణి. ఒకరోజు రాత్రి నేను కూటంలో ఉన్నప్పుడు మా స్నేహితులు కొంతమంది ఒక పార్టీకి వెళ్లారు. అక్కడ ఒక టీనేజర్ తన లెదర్ జాకెట్ ఇవ్వలేదని బాగా కొట్టారు, దాంతో అతను చనిపోయాడు. తర్వాతి రోజు వాళ్లు ఆ హత్య గురించి గొప్పగా చెప్పుకున్నారు. కోర్టులో దాని గురించి విచారణ జరుగుతున్నప్పుడు, అదేం పెద్ద నేరం కాదన్నట్టు నవ్వుకున్నారు. వాళ్లలో ఎక్కువమందికి జీవిత ఖైదు విధించారు. ఆ రాత్రి నేను వాళ్లతో లేనందుకు చాలా సంతోషించాను. ఇక నా జీవితంలో మార్పులు చేసుకోవాలని, బైబిలు స్టడీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఎంతో జాతి వివక్ష చూసిన నాకు, యెహోవాసాక్షుల మధ్య గమనించిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఉదాహరణకు, తెల్లజాతికి చెందిన ఒక యెహోవాసాక్షి వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, వాళ్ల పిల్లల్ని నల్లజాతికి చెందిన యెహోవాసాక్షి కుటుంబం దగ్గర పెట్టి వెళ్లాడు. అలాగే, తెల్లజాతికి చెందిన ఒక యెహోవాసాక్షుల కుటుంబం నల్లజాతికి చెందిన ఒక యువకుణ్ణి తమ ఇంట్లో ఉంచుకున్నారు. యేసు యోహాను 13:35 లో, “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది” అని చెప్పిన మాటల ప్రకారం యెహోవాసాక్షులు జీవిస్తున్నారని నాకు నమ్మకం కుదిరింది. వాళ్లే నిజమైన సహోదరసహోదరీలు అని నాకు తెలుసు.
బైబిలు స్టడీ చేయడం వల్ల, నా ఆలోచనాతీరును మార్చుకోవాలని నాకర్థమైంది. నేను శాంతిగా నడుచుకోవడమే కాదు, అది అన్నిటికన్నా ఉత్తమమైన జీవన విధానమని గ్రహించాలి. (రోమీయులు 12:2) నేను మెల్లమెల్లగా ప్రగతి సాధించాను. 1974 జనవరిలో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాను.
నా ఆలోచనాతీరును మార్చుకోవాలని నాకర్థమైంది, నేను శాంతిగా నడుచుకోవడమే కాదు అది అన్నిటికన్నా ఉత్తమమైన జీవన విధానమని గ్రహించాలి
బాప్తిస్మం తర్వాత కూడా నేను నా కోపాన్ని తగ్గించుకోవడానికి కృషిచేయాల్సి వచ్చింది. ఒకసారి నేను ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక దొంగ నా కారులో నుండి రేడియో దొంగిలించాడని అతన్ని తరుముకుంటూ వెళ్లాను. నేను దగ్గరికి వచ్చేసరికి అతను రేడియో అక్కడే పడేసి పారిపోయాడు. జరిగినదాని గురించి నాతో ఉన్నవాళ్లకు చెప్పినప్పుడు, ఒక పెద్ద ఇలా అడిగాడు: “స్టీవెన్, ఆ దొంగ నీ చేతికి చిక్కితే ఏం చేసేవాడివి?” ఆ ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది, శాంతిగా ఉండడానికి కృషి చేస్తూనే ఉండేలా కదిలించింది.
1974 అక్టోబరులో నేను పూర్తికాల సేవ మొదలుపెట్టాను. ప్రతీ నెల 100 గంటల పాటు సేవచేస్తూ ఇతరులకు బైబిలు నేర్పించేవాణ్ణి. తర్వాత, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛంద సేవచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. 1978 లో మా అమ్మ జబ్బుపడడంతో ఆమెను చూసుకోవడానికి లాస్ ఏంజెల్స్‌కి తిరిగొచ్చాను. రెండేళ్ల తర్వాత ప్రియమైన అరాండను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ చనిపోయేంత వరకు ఆమె బాగోగులు చూసుకోవడానికి అరాండ నాకు ఎంతో సహాయం చేసింది. ఆ తర్వాత నేను, నా భార్య వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు వెళ్లాం. మమ్మల్ని పనామాకు పంపించారు. ఇప్పటికీ మేము అక్కడే మిషనరీలుగా సేవ చేస్తున్నాం.
బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి, నాకు దౌర్జన్యంగా నడుచుకునే ఎన్నో సందర్భాలు ఎదురయ్యాయి. అలాంటి సందర్భాల్లో నన్ను రెచ్చగొట్టే వాళ్ల నుండి దూరంగా వెళ్లిపోయేవాణ్ణి లేదా పరిస్థితి సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. అలా చేసినప్పుడు నా భార్యతోపాటు చాలామంది నన్ను మెచ్చుకునేవాళ్లు. నా తీరు చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి! నా వ్యక్తిత్వంలో వచ్చిన ఈ మంచి మార్పుకు కారణం నేను కాదు. బైబిలుకు ఉన్న మార్చే శక్తికి అదొక రుజువని నేను నమ్ముతున్నాను.—హెబ్రీయులు 4:12.
నేనెలా ప్రయోజనం పొందానంటే ...
బైబిలు వల్ల నా జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, అది నిజంగా శాంతిగా ఎలా మెలగాలో నేర్పించింది. ఇప్పుడు నేను ప్రజల్ని కొట్టను; బదులుగా ఆధ్యాత్మికంగా బాగవ్వడానికి సహాయం చేస్తాను. హైస్కూల్లో నాకు అస్సలు పడని ఒకతనితో బైబిలు స్టడీ చేశాను! అతను బాప్తిస్మం తీసుకున్నాక ఇద్దరం కొంతకాలం రూమ్మేట్స్గా ఉన్నాం. ఈ రోజు వరకూ మేము మంచి స్నేహితులం. ఇప్పటివరకు నేను, నా భార్య కలిసి 80 కన్నా ఎక్కువమందికి బైబిలు స్టడీ చేసి యెహోవాసాక్షులు అయ్యేలా సహాయం చేశాం.
ఎంతో అర్థవంతమైన, సంతోషంతో నిండిన జీవితాన్ని, నిజమైన సహోదరసహోదరీల్ని ఇచ్చినందుకు యెహోవా పట్ల లోతైన కృతజ్ఞతతో ఉన్నాను.