1
నా గురించి నాకు పూర్తిగా తెలుసా?
మీరు ఏం చేస్తారు?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: కరేన్ ఓ పార్టీకి వెళ్లింది. వెళ్లిన పది నిమిషాలకు, తనకు బాగా తెలిసిన ఒక గొంతు వినబడింది.
“హాయ్! ఏంటి ఊరికే నిలబడ్డావ్?”
ఎవరా అని తిరిగి చూస్తే, తన ఫ్రెండ్ జెస్సిక. అప్పుడే ఓపెన్ చేసిన రెండు బాటిల్స్ చేతిలో పట్టుకొని కనిపించింది. అది బీర్ అని కరేన్‌కు ఖచ్చితంగా తెలుసు. జెస్సిక ఒక బాటిల్‌ని కరేన్‌కి ఇస్తూ ఇలా అంది, “కాస్త సరదాగా ఉండడంలో తప్పేముంది? నువ్వింకా చిన్నపిల్లవేం కాదు కదా, తీస్కో.”
కరేన్ వద్దని చెప్పాలనుకుంది. కానీ జెస్సిక తన ఫ్రెండ్ కాబట్టి, వద్దంటే ఏమనుకుంటుందో అని ఆమె భయపడింది. పైగా జెస్సిక మంచి అమ్మాయి. ఆమే తాగుతుందంటే, అది అంత తప్పు కాదేమో. ‘అయినా అది జస్ట్ బీరే కదా, డ్రగ్స్ కాదు కదా’ అని కరేన్ తనలో తాను అనుకుంది.
కరేన్ స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?
ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!
అలాంటి పరిస్థితుల్లో తెలివిగా నిర్ణయం తీసుకోవాలంటే, మీరేంటో, మీ విలువలేంటో మీకు బాగా తెలిసుండాలి. అలా తెలిసుంటే, మీరు వేరేవాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు అవ్వకుండా, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలుగుతారు.—1 కొరింథీయులు 9:26, 27.
మీ గురించి మీరు ఎలా తెలుసుకోవచ్చు? ఈ నాలుగు ప్రశ్నల గురించి ఆలోచించండి.
1 నా సామర్థ్యాలు ఏంటి?
మీలో ఏ సామర్థ్యాలు, మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే, మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది.
బైబిలు ఉదాహరణ: అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది.” (2 కొరింథీయులు 11:6, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) పౌలుకు లేఖనాలు బాగా తెలుసు కాబట్టి, వేరేవాళ్లు తనను విమర్శించినా నిరుత్సాహపడలేదు. వాళ్లు ఎన్ని మాటలు అన్నా ఆయన ధైర్యం మాత్రం తగ్గలేదు. —2 కొరింథీయులు 10:10; 11:5.
మీ గురించి మీరు తెలుసుకోండి.
మీకున్న ఒక టాలెంట్ లేదా నైపుణ్యం గురించి ఇక్కడ రాసుకోండి.
మీకున్న ఒక మంచి లక్షణం గురించి రాసుకోండి. (అంటే, మీరు వేరేవాళ్లను బాగా చూసుకుంటారా? వాళ్లకు సహాయం చేస్తారా? నమ్మదగిన వ్యక్తిగా ఉంటారా? సమయాన్ని పాటిస్తారా?)
2 నా బలహీనతలు ఏంటి?
బలంగా ఉన్న చైన్‌లో ఒక్క బలహీనమైన లింకు ఉన్నా, అది ఇట్టే తెగిపోతుంది. అలాగే, మీ బలహీనతల వల్ల మీకున్న మంచి పేరు పాడయ్యే అవకాశం ఉంది.
బైబిలు ఉదాహరణ: తనలో ఏ బలహీనతలు ఉన్నాయో పౌలుకు తెలుసు. ఆయనిలా రాశాడు, ‘దేవుని ధర్మశాస్త్రం అంటే నాకు ఆనందమే. అయినా నా శరీరంలో మరో నియమం ఉందని నేను గ్రహిస్తున్నాను. అది నా మనసులో ఉన్న నియమంతో యుద్ధం చేస్తుంది, పాప నియమానికి నన్ను ఖైదీగా చేస్తుంది.’—రోమీయులు 7:22, 23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
మీ గురించి మీరు తెలుసుకోండి.
మీరు ఏ బలహీనతల్ని మార్చుకోవాలనుకుంటున్నారు?
3 నా లక్ష్యాలు ఏంటి?
మీరు ఎటు వెళ్లాలో తెలీకుండా, ఓ ఆటో ఎక్కి, ఒకే వీధిలో పదేపదే తిరుగుతారా? అది తెలివితక్కువ పని, పైగా డబ్బులు దండగ!
దీంట్లో ఉన్న పాఠం ఏంటి? మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటే, జీవితంలో గమ్యం లేకుండా తిరిగేబదులు, ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో మీకు తెలుస్తుంది.
బైబిలు ఉదాహరణ: పౌలు ఇలా రాశాడు: “నేను గమ్యం లేకుండా పరుగెత్తను.” (1 కొరింథీయులు 9:26, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) గాలి ఎటు వీస్తే అటు వెళ్లే బదులు, పౌలు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు, వాటికి తగ్గట్లు జీవించాడు.—ఫిలిప్పీయులు 3:12-14.
మీ గురించి మీరు తెలుసుకోండి.
వచ్చే సంవత్సరం లోపు మీరు చేరుకోవాలనుకుంటున్న మూడు లక్ష్యాల్ని ఇక్కడ రాసుకోండి.
4 నా నమ్మకాలు ఏంటి?
మీకంటూ కొన్ని అభిప్రాయాలు లేకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అంతేకాదు, మీరేంటో, మీ విలువలేంటో మీకు తెలీకపోతే, పరిసరాల్ని బట్టి ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లుగా, తోటివాళ్లను బట్టి మీ నిర్ణయాలు మార్చుకుంటారు.
మీరు మీ అభిప్రాయాలకు లేదా నమ్మకాలకు తగ్గట్లు ప్రవర్తించినప్పుడు, తోటివాళ్లు ఎంత ఒత్తిడిచేసినా మీరు మీలా ఉంటారు.
బైబిలు ఉదాహరణ: దానియేలు ప్రవక్త, తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా, దేవుని నియమాల్ని పాటించాలని “నిశ్చయించుకొన్నాడు.” అప్పుడు బహుశా ఆయన టీనేజీలో ఉండివుండవచ్చు. (దానియేలు 1:8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అలా నిశ్చయించుకోవడం వల్ల, దానియేలు సరైనవాటికి కట్టుబడి ఉన్నాడు, వాటి ప్రకారం జీవించాడు.
మీ గురించి మీరు తెలుసుకోండి.
మీ నమ్మకాలేంటి? ఉదాహరణకు: మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే, ఎందుకు నమ్ముతున్నారు? ఆయన ఉన్నాడని మీకు ఎందుకు నమ్మకం కుదిరింది?
దేవుని ప్రమాణాలు మీ మంచి కోసమే అని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే, ఎందుకు నమ్ముతున్నారు?
మీరు, గాలి ఎటు వీస్తే అటు కొట్టుకెళ్లే ఓ రాలిన ఆకులా ఉంటారా, లేక ఎంత పెద్ద తుఫాను వచ్చినా స్థిరంగా ఉండే చెట్టులా ఉంటారా? మీరేంటో, మీ విలువలేంటో తెలుసుకోండి, అప్పుడు ఆ చెట్టులా స్థిరంగా ఉంటారు.