కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ అధ్యాయం

ఆమె జ్ఞానయుక్తంగా, ధైర్యంగా, నిస్వార్థంగా ప్రవర్తించింది

ఆమె జ్ఞానయుక్తంగా, ధైర్యంగా, నిస్వార్థంగా ప్రవర్తించింది

1-3. (ఎ) భర్త సింహాసనం దగ్గరకు వెళ్తున్నప్పుడు ఎస్తేరుకు ఎలా అనిపించివుంటుంది? (బి) ఎస్తేరు రాకకు రాజు ఎలా స్పందించాడు?

 ఎస్తేరు సింహాసనం దగ్గరకు మెల్లగా అడుగులు వేస్తుండగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. పారసీక దేశంలోని షూషను కోటలోవున్న రాజు ఆస్థానం అంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఎంతగా అంటే, ఎస్తేరు వేస్తున్న మృదువైన అడుగుల శబ్దం, ఆమె రాచవస్త్రాల నుండి వస్తున్న సవ్వడి కూడా ఆమె వినగలుగుతోంది. అయితే ఆస్థాన వైభవం, దాని అందమైన మూల స్తంభాలు, సుదూర ప్రాంతమైన లెబానోను నుండి దిగుమతి చేసిన దేవదారు మ్రానుతో అందంగా చెక్కిన దాని పైకప్పు అవన్నీ చూస్తూ ఉండిపోయే సమయం కాదది. ఆమె ధ్యాసంతా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి పైనే ఉంది, ఆమె ప్రాణాలు ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నాయి.

2 రాజు తన దగ్గరకు వస్తున్న ఎస్తేరును తదేకంగా చూస్తూ ఆమె వైపు తన బంగారు దండాన్ని చూపించాడు. అది చాలా చిన్న పనే, కానీ అది ఎస్తేరు ప్రాణాలను కాపాడింది. ఎందుకంటే, అనుమతి లేకుండా తన ముందుకు వచ్చిన ఎస్తేరును రాజు మన్నించాడని అది చూపించింది. ఎస్తేరు సింహాసనం దగ్గరకు వెళ్లి, రాజు తనవైపు చాపిన బంగారు దండం కొనను కృతజ్ఞతతో ముట్టుకుంది.—ఎస్తే. 5:1, 2.

రాజు చూపించిన కనికరానికి ఎస్తేరు సవినయంగా కృతజ్ఞతలు తెలిపింది

3 అహష్వేరోషు రాజుకు సంబంధించిన ప్రతీది ఆయన అపార సిరిసంపదలకు, అత్యున్నత అధికారానికి అద్దంపడుతోంది. అప్పట్లో పారసీక చక్రవర్తుల రాచవస్త్రం ఖరీదు వందల కోట్ల రూపాయలు ఉండేదని ప్రతీతి. అయినా, ఎస్తేరు తన భర్త కళ్లలో కాస్త ఆప్యాయత గమనించగలిగింది. తనదైన తరహాలో ఆయన ఆమెపై ప్రేమను వ్యక్తం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదను.”—ఎస్తే. 5:3.

4. ఎస్తేరు ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?

4 ఎస్తేరు ఇప్పటికే ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించింది. తన ప్రజలను అంతమొందించేందుకు పన్నిన కుట్ర నుండి వాళ్లను కాపాడడానికి రాజు ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ అంతా సవ్యంగానే జరిగింది, కానీ అసలు సవాళ్లు ముందున్నాయి. రాజు అత్యంత నమ్మకమైన సలహాదారుడు, తన ప్రజలను చంపేలా రాజును మోసగించిన దుష్టుడని గర్విష్ఠియైన ఆ చక్రవర్తిని ఆమె ఒప్పించాలి. ఇంతకీ ఆయనను ఎలా ఒప్పిస్తుంది? ఆమె విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

జ్ఞానంతో ఆమె, ‘మాట్లాడేందుకు సమయాన్ని’ ఎంచుకుంది

5, 6. (ఎ) ప్రసంగి 3:1, 7⁠లోని సూత్రాన్ని ఎస్తేరు ఎలా పాటించింది? (బి) భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఎస్తేరు ఎలా జ్ఞానం చూపించింది?

5 అక్కడున్న వాళ్లందరి ముందు ఎస్తేరు తన సమస్యను రాజుకు చెప్పుకొని ఉండాల్సిందా? ఒకవేళ ఆమె అలా చేసివుంటే, రాజుకు ఎంతో అవమానం కలిగించివుండేది. పైగా, తన అభియోగాలను ఖండించేందుకు రాజు సలహాదారుడైన హామానుకు సమయం దొరికివుండేది. మరి ఎస్తేరు ఏమి చేసింది? శతాబ్దాల క్రితం, జ్ఞానవంతుడైన సొలొమోను రాజు దైవ ప్రేరణతో ఇలా రాశాడు: ‘ప్రతి దానికీ సమయం కలదు. మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి సమయం కలదు.’ (ప్రసం. 3:1, 7) ఆమె పెంపుడు తండ్రీ, నమ్మకస్థుడూ అయిన మొర్దెకై తన పెంపకంలో ఆ యువతికి అలాంటి సూత్రాలను నేర్పించివుంటాడు. ‘మాట్లాడేందుకు సమయాన్ని’ జాగ్రత్తగా ఎంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఎస్తేరు తప్పక గ్రహించివుంటుంది.

6 ఎస్తేరు ఇలా అంది: “రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధముచేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నాను.” (ఎస్తే. 5:4) అందుకు రాజు ఒప్పుకొని, విందుకు రమ్మని హామానును ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడిందో మీరు గ్రహించారా? ఆమె భర్త గౌరవాన్ని కాపాడింది, తన గోడు వెల్లబుచ్చుకోవడానికి మరింత అనువైన సమయాన్ని ఎంచుకుంది.—సామెతలు 10:19 చదవండి.

7, 8. ఎస్తేరు ఏర్పాటు చేసిన మొదటి విందు ఎలా ముగిసింది? ఈసారి కూడా ఆమె ఎందుకు రాజుకు విషయం చెప్పలేదు?

7 భర్తకు నచ్చిన వంటకాలన్నీ ఉండేలా చూసుకుంటూ ఎస్తేరు ఆ విందును ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేసివుంటుంది. వాళ్ల మనసులకు ఉల్లాసం కలిగించడానికి విందులో ద్రాక్షారసం కూడా ఉంది. (కీర్త. 104:15) అహష్వేరోషు విందును ఆరగించిన సంతోషంలో, తన విన్నపం ఏమిటో చెప్పమని మళ్లీ ఎస్తేరును అడిగాడు. ఇప్పుడు ఎస్తేరు ఆ విషయం గురించి మాట్లాడేందుకు సమయం వచ్చిందా?

8 దానికి సమయం ఇంకా రాలేదని ఎస్తేరుకు అనిపించింది. మరుసటి రోజు కూడా రాజును, హామానును విందుకు రమ్మని ఆహ్వానించింది. (ఎస్తే. 5:7, 8) ఈసారి కూడా ఆమె ఎందుకు విషయం చెప్పలేదు? యూదులందర్నీ చంపేలా శాసనం చేయడానికి రాజు నుండి హామాను అధికారం పొందాడని గుర్తుంచుకోండి. అంతమంది ప్రాణాలు అపాయంలో ఉన్నాయి కాబట్టి, ఎస్తేరు మాట్లాడేందుకు అత్యంత అనువైన సమయం ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆమె తొందరపడకుండా, భర్తపట్ల తనకు ఎంత గౌరవం ఉందో చూపించడానికి ఇంకో అవకాశాన్ని కల్పించుకుంది.

9. ఓర్పు ఎంత విలువైనది? ఈ విషయంలో ఎస్తేరును మనం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

9 ఓర్పు అనేది ఎంతో అమూల్యమైన, అరుదైన లక్షణం. ఎస్తేరు ఎంతో ఆందోళనగా ఉన్నా, జరుగుతున్న దాని గురించి రాజుకు చెప్పాలని ఎంతో ఆత్రంగా ఉన్నా ఆమె ఓపికగా సరైన సమయం కోసం వేచివుంది. కొన్ని విషయాలు సవ్యంగా జరగడం లేదని అప్పుడప్పుడూ మనందరికీ అనిపిస్తుంటుంది. కాబట్టి, ఈ విషయంలో ఆమె నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒకానొక సమస్య గురించి చర్య తీసుకునేలా అధికారంలో ఉన్నవాళ్లను ఒప్పించాలంటే, ఎస్తేరులాగే మనం కూడా ఓపిక చూపించాల్సి రావచ్చు. సామెతలు 25:15 ఇలా చెబుతోంది: “దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.” మనం సరైన సమయం కోసం ఓపిగ్గా కనిపెట్టుకొని ఉంటూ ఎస్తేరులాగే మృదువుగా మాట్లాడితే తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లను కూడా ఒప్పించవచ్చు. ఎస్తేరు చూపించిన ఓర్పును, జ్ఞానాన్ని ఆమె దేవుడు యెహోవా ఆశీర్వదించాడా?

ఓర్పు న్యాయానికి బాట వేస్తుంది

10, 11. మొదటి విందు ముగించుకొని వెళ్తున్నప్పుడు హామాను సంతోషం ఎందుకు ఆవిరైపోయింది? ఆయన భార్య, మిత్రులు ఏమి చేయమని ఆయనను త్వరపెట్టారు?

10 ఎస్తేరు ఓపిక చూపించడం వల్ల, కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మొదటి విందు ముగిశాక, రాజూ రాణీ తనను అంతగా అభిమానిస్తున్నందుకు హామాను “సంతోషించి మనోల్లాసము గలవాడై” గాల్లో తేలిపోయాడు. కోట గుమ్మం గుండా వెళ్తుండగా యూదుడైన మొర్దెకై ఆయన కంటపడ్డాడు. కానీ మొర్దెకై ఇప్పటికీ తనకు వంగి నమస్కరించడం లేదు. మనం ముందటి అధ్యాయంలో చూసినట్లు, మొర్దెకై అలా చేయకపోవడానికి కారణం హామాను మీద గౌరవం లేక కాదు. తన మనస్సాక్షిని బట్టి, యెహోవా దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టే ఆయన అలా చేయలేదు. అయినా, హామాను “బహుగా కోపగించెను.”—ఎస్తే. 5:9.

11 ఈ అవమానం గురించి హామాను తన భార్యకు, మిత్రులకు చెప్పుకున్నాడు. వాళ్లు, 22 మీటర్ల పొడవున్న ఒక పెద్ద ఉరికొయ్య చేయించి, దాని మీద మొర్దెకైని ఉరితీయించేలా రాజు అనుమతి కోరమని ఆయనను త్వరపెట్టారు. హామానుకు ఆ సలహా నచ్చడంతో వెంటనే ఆ పనికి పూనుకున్నాడు.—ఎస్తే. 5:12-14.

12. రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి తనకు చదివి వినిపించమని రాజు ఎందుకు ఆజ్ఞాపించాడు? దానివల్ల ఆయనకు ఏమి తెలిసింది?

12 అయితే, రాజుకు ఆ రాత్రి ఎప్పటిలా గడవలేదు. ఆయనకు ‘నిద్ర పట్టలేదు’ అని బైబిలు చెబుతోంది. దాంతో, రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి తనకు చదివి వినిపించమని ఆజ్ఞాపించాడు. అహష్వేరోషును చంపడానికి జరిగిన ఒక కుట్ర గురించి కూడా అందులో ఉంది. ఆ కుట్ర ఆయనకు ఇంకా గుర్తుంది. అప్పట్లో ఆ కుట్రదారులను పట్టుకొని సంహరించారు. కానీ ఆ కుట్రను బయటపెట్టిన మొర్దెకై విషయమేమిటి? రాజు వింటున్నవాడల్లా ఒక్కసారిగా, మొర్దెకైని ఎలా సత్కరించారని అడిగాడు. ఏ రకంగానూ ఆయనను సత్కరించలేదని వాళ్లు జవాబిచ్చారు.—ఎస్తేరు 6:1-3 చదవండి.

13, 14. (ఎ) హామాను ఊహించని విధంగా పరిస్థితులు ఎలా మలుపుతిరిగాయి? (బి) హామాను భార్య, మిత్రులు ఆయనతో ఏమన్నారు?

13 కలతతో నిండిన రాజు ఆ తప్పును సరిచేయాలనుకున్నాడు. ఆ పని చేయడానికి ఎవరు అందుబాటులో ఉన్నారని అడిగాడు. ఎవరో కాదు స్వయంగా హామానే రాజు ఆవరణలోకి వచ్చాడు. మొర్దెకైని చంపించడానికి అనుమతి తీసుకోవాలనే ఆత్రంలో బహుశా పొద్దుపొద్దున్నే అక్కడకు వచ్చివుంటాడు. కానీ హామాను ఏమీ అడగకముందే, తన అనుగ్రహం పొందిన వ్యక్తిని గొప్పగా సత్కరించడానికి ఏమి చేయాలని రాజు ఆయనను అడిగాడు. రాజు తనను మనసులో ఉంచుకొనే అలా అడుగుతున్నాడని హామాను అనుకున్నాడు. కాబట్టి ఒక అట్టహాసమైన పద్ధతిని సూచిస్తూ, ఆ వ్యక్తికి రాచవస్త్రాలు ధరింపజేసి, ఘనులైన రాజు అధిపతులలో ఒకరు ఆయనను షూషను కోట చుట్టూ రాజు గుర్రం మీద ఊరేగిస్తూ అందరి ముందూ ఆయన గొప్పతనం చాటించాలని చెప్పాడు. అలా సత్కరించాల్సింది మొర్దెకైనని తెలుసుకున్నప్పుడు హామాను ముఖం ఎంతగా వాడిపోయి ఉంటుందో కదా! ఇంతకీ మొర్దెకై గొప్పతనాన్ని చాటించే పనిని రాజు ఎవరికి అప్పగించాడు? ఇంకెవరికి, హామానుకే!—ఎస్తే. 6:4-10.

14 హామాను తనకు ఏమాత్రం మింగుడుపడని ఆ బాధ్యతను అయిష్టంగానే పూర్తిచేసి, ఎంతో దుఃఖంతో త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. పరిస్థితులు ఇలా మలుపు తిరగడం అశుభ సూచకమని, యూదుడైన మొర్దెకైతో చేసే పోరాటంలో తను తప్పక విఫలమౌతాడని ఆయన భార్య, మిత్రులు అన్నారు.—ఎస్తే. 6:12, 13.

15. (ఎ) ఎస్తేరు ఓర్పు చూపించడం వల్ల ఏ మేలు జరిగింది? (బి) మనం ‘కనిపెట్టుకొని’ ఉండే వైఖరి పెంపొందించుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం?

15 ఎస్తేరు తన విన్నపాన్ని రాజుకు తెలియజేయకుండా ఓర్పుతో ఇంకో రోజు వేచివుండడం వల్ల, హామాను తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. బహుశా యెహోవాయే ఆ రాత్రి రాజుకు నిద్రపట్టకుండా చేసివుంటాడు. (సామె. 21:1) దేవుని వాక్యం ‘కనిపెట్టుకొని’ ఉండే వైఖరి పెంపొందించుకోమని మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు మనం ఆశ్చర్యపోకూడదు. (మీకా 7:7 చదవండి.) మనం దేవుని మీద నమ్మకం ఉంచి, ఆయన కోసం కనిపెట్టుకొనివుంటే, మన సమస్యలకు ఆయన చూపించే పరిష్కారాలు మనం సొంతగా కనుగొనగలిగే ఎలాంటి పరిష్కారాల కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయని గుర్తించగలుగుతాం.

ఆమె ధైర్యంగా మాట్లాడింది

16, 17. (ఎ) ఎస్తేరు ‘మాట్లాడేందుకు సమయం’ ఎప్పుడు వచ్చింది? (బి) ఎస్తేరుకు, వష్తికి మధ్య ఎలాంటి తేడా ఉంది?

16 ఎస్తేరు ఇక ఏమాత్రం రాజు సహనాన్ని పరీక్షించే సాహసం చేయలేదు. తాను ఏర్పాటు చేసిన రెండవ విందులో రాజుకు అంతా చెప్పాలి. కానీ ఎలా? తన విన్నపం ఏమిటో తెలియజేయమని మళ్లీ అడుగుతూ రాజు ఆమె పనిని తేలిక చేశాడు. (ఎస్తే. 7:2) ఎస్తేరు ‘మాట్లాడేందుకు సమయం’ రానేవచ్చింది.

17 బహుశా ఎస్తేరు తన మనసులో దేవునికి ప్రార్థించుకొని, రాజుతో ఇలా అంది: “రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైన యెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్రహింపబడుదురు గాక.” (ఎస్తే. 7:3) ఆయనకు సమ్మతియైతేనే అంటూ రాజు నిర్ణయం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఎస్తేరు ఆయనకు చూపించిందని గమనించండి. ఎస్తేరుకూ, కావాలని తన భర్తను అవమానించిన వష్తికీ ఎంత తేడానో కదా! (ఎస్తే. 1:10-12) పైగా, హామానును నమ్మి రాజు చేసిన తెలివితక్కువ పనికి ఎస్తేరు ఆయనను విమర్శించలేదు. ప్రాణాపాయం నుండి తనను కాపాడమని మాత్రమే రాజును వేడుకుంది.

18. ఎస్తేరు తన సమస్యను రాజుకు ఎలా తెలిపింది?

18 ఆ విన్నపానికి రాజు తప్పక చలించిపోయివుంటాడు, ఆశ్చర్యపోయివుంటాడు కూడా. తన రాణికి అపాయం తలపెట్టే దుస్సాహసానికి ఎవరు ఒడిగట్టగలరు? ఎస్తేరు ఇంకా ఇలా చెప్పింది: “సంహరింబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా నుందును.” అంతేకాదు, రాజుకు నష్టం కలిగించేలా ఉన్నప్పుడు అది “యుక్తము కాదు” అని కూడా ఆమె ఉంది. (ఎస్తే. 7:4) ఎస్తేరు నిర్మొహమాటంగా సమస్య ఏంటో చెప్పిందని గమనించండి. తాము దాసులుగా అమ్ముడుపోవడమే సమస్య అయ్యుంటే తాను మౌనంగా ఉండేదాన్నని కూడా అంది. అయితే, ఆ జాతి నిర్మూలన వల్ల రాజుకు కూడా అపార నష్టం కలుగుతుంది కాబట్టే ఆమె నోరు విప్పాల్సి వచ్చింది.

19. ఒప్పించే కళ గురించి ఎస్తేరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

19 ఒప్పించే కళ గురించి ఎస్తేరు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఏదైనా గంభీర సమస్యను మన ప్రియమైన వాళ్ల దృష్టికైనా, చివరకు అధికారంలో ఉన్నవాళ్ల దృష్టికైనా తీసుకురావాల్సి వస్తే ఓర్పు, గౌరవం, నిజాయితీ వంటి లక్షణాలు మనకు ఎంతో దోహదపడతాయి.—సామె. 16:21, 23.

20, 21. (ఎ) హామాను కుట్రను ఎస్తేరు ఎలా బయటపెట్టింది? దానికి రాజు ఎలా స్పందించాడు? (బి) హామాను పిరికివాడైన కుట్రదారుడనే విషయం బయటపడినప్పుడు ఆయన ఏమి చేశాడు?

20 అహష్వేరోషు ఇలా గర్జించాడు: “ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి?” ఎస్తేరు తన వేలు హామాను వైపు చూపిస్తూ, “మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే” అంది. ఈ తీవ్ర నేరారోపణకు హామాను ఎలా స్పందించాడు? ఆయన భయంతో గజగజ వణికిపోయాడు. తన నమ్మకమైన సలహాదారుడు, తన ప్రియమైన భార్యనే చంపించే తాకీదు మీద సంతకం చేసేలా తనను వంచించాడని తెలుసుకున్న చపలచిత్తుడైన ఆ చక్రవర్తి ముఖం కోపంతో ఎర్రబడివుంటుంది! కోపం చల్లబర్చుకోవడానికి రాజు ఉన్నపళంగా ఉద్యానవనంలోకి వెళ్లిపోయాడు.—ఎస్తే. 7:5-7.

హామాను దుష్టత్వాన్ని ఎస్తేరు ధైర్యంగా వేలెత్తి చూపించింది

21 హామాను పిరికివాడైన కుట్రదారుడనే విషయం బయటపడేసరికి ఆయన భయంతో వెళ్లి రాణి కాళ్లమీదపడ్డాడు. రాజు తిరిగివచ్చేసరికి హామాను రాణి పరుపు మీద పడి ఆమెను బ్రతిమాలుకోవడం చూశాడు. తన ఇంట్లో, తన కళ్లముందే రాణిని బలవంతం చేయబోయాడని కోపంగా హామాను మీద నేరం మోపాడు. ఆ మాటతో హామానుకు చావు ఖాయమని తేలిపోయింది. సేవకులు, ఆయన ముఖానికి ముసుగువేసి అక్కడినుండి తీసుకెళ్లిపోయారు. రాజు అధికారులలో ఒకతను, మొర్దెకై కోసం హామాను తయారు చేయించిన పెద్ద ఉరికొయ్య గురించి చెప్పాడు. వెంటనే రాజు, దానిమీద హామానునే ఉరితీయమని ఆజ్ఞాపించాడు.—ఎస్తే. 7:8-10.

22. మనం ఎన్నడూ ఆశలు వదులుకోకూడదని, విశ్వాసం కోల్పోకూడదని ఎస్తేరు ఉదాహరణ ఎలా నేర్పిస్తుంది?

22 అన్యాయంతో నిండిన నేటి లోకంలో, న్యాయం జరగడం మనం ఎప్పటికీ చూడలేమని అనిపించడం మామూలే. మీకెప్పుడైనా అలా అనిపించిందా? కానీ ఎస్తేరు ఎన్నడూ ఆశలు వదులుకోలేదు, విశ్వాసం కోల్పోలేదు. సమయం వచ్చినప్పుడు, సరైన దాని గురించి ధైర్యంగా మాట్లాడింది, మిగతాదంతా యెహోవాయే చూసుకుంటాడని నమ్మింది. మనమూ అలాగే చేద్దాం! యెహోవా ఎస్తేరు కాలంలో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. యెహోవా హామాను విషయంలో చేసినట్లే ఇప్పుడు కూడా దుష్టులు, వంచకులు తాము తవ్వుకున్న గుంటలో తామే పడేలా చేయగలడు.—కీర్తన 7:11-16 చదవండి.

ఆమె యెహోవా కోసం, ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా చర్య తీసుకుంది

23. (ఎ) మొర్దెకైకి, ఎస్తేరుకు రాజు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు? (బి) యాకోబు మరణ శయ్య మీద ఉన్నప్పుడు, బెన్యామీను గురించి చెప్పిన ఏ ప్రవచనం నెరవేరింది? (“ ఒక ప్రవచనం నెరవేరింది” అనే బాక్సు చూడండి.)

23 చివరకు, మొర్దెకై తన ప్రాణాలు కాపాడిన నమ్మకస్థుడు మాత్రమే కాదు ఎస్తేరుకు స్వయాన పెంపుడు తండ్రి కూడా అని రాజుకు తెలిసింది. అహష్వేరోషు, హామాను స్థానంలో మొర్దెకైని అధిపతులందరిలో ప్రధానునిగా నియమించాడు. హామాను ఇంటిని, విస్తారమైన ఆస్తిపాస్తులను రాజు ఎస్తేరుకు ఇచ్చాడు. వాటిని చూసుకునే బాధ్యతను ఎస్తేరు మొర్దెకైకి అప్పగించింది.—ఎస్తే. 8:1, 2.

24, 25. (ఎ) హామాను కుట్రను బయటపెట్టిన తర్వాత, తాను చేయాల్సిన పని పూర్తయిపోయిందని ఎస్తేరు ఎందుకు అనుకోలేదు? (బి) ఎస్తేరు ఎలా మళ్లీ తన ప్రాణాలకు తెగించింది?

24 తాను, మొర్దెకై ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు కాబట్టి చేయాల్సిన పని పూర్తయిపోయిందని రాణి అనుకుందా? ఆమె స్వార్థపరురాలైతే అలాగే అనుకొనివుండేది. ఆ సమయంలో, యూదులందర్నీ చంపాలని హామాను చేయించిన శాసనం ఆ సామ్రాజ్య నలుమూలలకూ చేరుకుంటోంది. ఆ మారణకాండ మొదలుపెట్టడానికి అనువైన సమయమేదో చూడడానికి హామాను పూరు (చీటీ) వేయించాడు. అంటే, శకునం చూడడానికి దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుని ఉంటాడు. (ఎస్తే. 9:24-26) ఆ రోజుకు ఇంకా కొన్ని నెలలు ఉంది, కానీ రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మరి ఆ ప్రళయాన్ని తప్పించడం సాధ్యమేనా?

25 ఎస్తేరు తన స్వార్థం చూసుకోకుండా మళ్లీ తన ప్రాణాలకు తెగించింది, రాజు అనుమతి లేకుండా ఇంకోసారి ఆయన ముందుకు వెళ్లింది. ఈసారి ఆమె తన ప్రజల కోసం ఏడుస్తూ, ఆ ఘోరమైన శాసనాన్ని రద్దు చేయించమని తన భర్తను వేడుకుంది. కానీ ఒక్కసారి పారసీక చక్రవర్తి పేరున ఏదైనా శాసనం జారీ అయితే దాన్ని ఎవరూ రద్దు చేయలేరు. (దాని. 6:12, 15) కాబట్టి రాజు, ఒక కొత్త శాసనం రూపొందించేలా ఎస్తేరుకు, మొర్దెకైకి అధికారం ఇచ్చాడు. దాంతో ఇప్పుడు రెండవ శాసనం జారీ అయింది. తమను తాము కాపాడుకోవడానికి పోరాడే హక్కు అది యూదులకు కల్పించింది. సైనికులు గుర్రాల మీద వేగంగా బయల్దేరి, ఆ శుభవార్తను సామ్రాజ్య నలుమూలలా ఉన్న యూదులకు చేరవేశారు. ఎందరో యూదుల హృదయాల్లో అది ఆశను చిగురింపజేసింది. (ఎస్తే. 8:3-16) ఆ సువిశాల సామ్రాజ్యంలోని యూదులందరూ ఆయుధాలు ధరించి, పోరాటానికి సిద్ధపడడం మనం ఊహించుకోవచ్చు. ఆ కొత్త శాసనం లేకపోతే వాళ్లు అలా ఎప్పటికీ చేయగలిగి ఉండేవాళ్లు కాదు. ఇంతకీ, “సైన్యములకధిపతియగు యెహోవా” తన ప్రజలకు తోడుగా ఉంటాడా?—1 సమూ. 17:45.

పారసీక సామ్రాజ్యంలోని యూదులకు ఎస్తేరు, మొర్దెకైలు శాసనాన్ని పంపించారు

26, 27. (ఎ) శత్రువులపై యెహోవా తన ప్రజలకు ఇచ్చిన విజయం ఎంత గొప్పది, ఎంత సంపూర్ణమైంది? (బి) హామాను కుమారుల నాశనంతో ఏ ప్రవచనం నెరవేరింది?

26 చివరకు ఆ రోజు రానేవచ్చింది. అప్పుడు దేవుని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. యూదుడైన మొర్దెకై కొత్తగా ప్రధానమంత్రి అయ్యాడనే వార్త అంతటా వ్యాపించడంతో, చాలామంది పారసీక అధికారులు కూడా ఇప్పుడు యూదుల పక్షాన నిలబడ్డారు. యెహోవా తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. శత్రువులు తన ప్రజలకు మళ్లీ హాని తలపెట్టకుండా, చిత్తుచిత్తుగా ఓడిపోయేలా యెహోవా చూశాడు. aఎస్తే. 9:1-6.

27 అంతేకాదు, దుష్టుడైన హామాను పది మంది కుమారులు బ్రతికివున్నంత కాలం, వాళ్ల ఇంటి మీద అధికారిగా ఉండడం మొర్దెకైకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే యూదులు వాళ్లను కూడా చంపేశారు. (ఎస్తే. 9:7-10) అలా ఒక బైబిలు ప్రవచనం నెరవేరింది, దేవుని ప్రజలకు బద్దశత్రువులుగా తయారైన అమాలేకీయులు పూర్తిగా నాశనమౌతారని దేవుడు ముందెప్పుడో చెప్పాడు. (ద్వితీ. 25:17-19) దేవుడు తీర్పుతీర్చిన ఆ జనాంగంలోని చిట్టచివరి వాళ్లలో హామాను కుమారులు ఉండివుంటారు.

28, 29. (ఎ) ఎస్తేరు, ఆమె ప్రజలు యుద్ధంలో పాల్గొనడం దేవుని చిత్తమని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఎస్తేరు చక్కని ఆదర్శం, మనకు ఎందుకు ఓ గొప్ప ఆశీర్వాదం?

28 వయసులో చిన్నదైన ఎస్తేరు కూడా యుద్ధం, సంహరణ గురించిన రాజ శాసనాలకు సంబంధించిన బరువైన బాధ్యతలు చూసుకోవాల్సి ఉంది. అదంత తేలికైన పనేమీ కాదు. కానీ తన ప్రజలను నాశనం నుండి కాపాడాలనేది యెహోవా చిత్తం. ఎందుకంటే, మానవాళి ఏకైక ఆశాకిరణమైన వాగ్దత్త మెస్సీయ ఇశ్రాయేలు జనాంగం నుండే రావాలి! (ఆది. 22:18) ఆ మెస్సీయ అంటే యేసు భూమ్మీదకు వచ్చినప్పుడు, తన అనుచరులు ఇక మీదట యుద్ధం చేయకూడదని చెప్పాడు, నేటి దేవుని సేవకులకు ఆ విషయం ఎంతో ఆనందాన్నిస్తుంది.—మత్త. 26:52.

29 అయితే క్రైస్తవులు ఆధ్యాత్మిక యుద్ధం చేస్తారు. యెహోవా దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని నాశనం చేయడానికి సాతాను ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. (2 కొరింథీయులు 10:3, 4 చదవండి.) ఎస్తేరు చక్కని ఆదర్శం, మనకు ఓ గొప్ప ఆశీర్వాదం! జ్ఞానయుక్తంగా, ఓపికగా ఒప్పించేకళను పెంపొందించుకుంటూ ధైర్యాన్నీ, నిస్వార్థంగా దేవుని ప్రజల పక్షాన నిలబడే విషయంలో సుముఖతనూ కనబరుస్తూ ఆమెలా విశ్వాసం చూపిద్దాం.

a తమ శత్రువులను పూర్తిగా ఓడించేలా, యూదులు రెండవ రోజు కూడా యుద్ధం చేసేందుకు రాజు అనుమతించాడు. (ఎస్తే. 9:12-14) నేటికీ ప్రతీ సంవత్సరం అదారు నెలలో యూదులు ఆ విజయాన్ని పండుగలా జరుపుకుంటారు. మన క్యాలెండరులో ఆ నెల, ఫిబ్రవరి మధ్యలో మొదలై, మార్చిలో కొన్ని రోజుల వరకు కొనసాగుతుంది. దాన్నే పూరీము పండుగ అంటారు. ఇశ్రాయేలీయులను నాశనం చేయాలనే ప్రయత్నంలో హామాను వేసిన పూరు (దీని బహువచనం పూరీము) వల్ల దానికి ఆ పేరు వచ్చింది.