కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ అధ్యాయం

ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు

ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు

1. యోనా ప్రయాణం గురించి వివరించండి. తన గమ్యం గురించి ఆయనకు ఏమి అనిపించింది?

 యోనాకు ఆలోచించడానికి చాలా సమయం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన దాదాపు 800 కి.మీ. ప్రయాణించాలి. దానికి నెల రోజులపైనే పడుతుంది. ఆయన దగ్గరి దారులను, సురక్షితమైన దారులను కనుక్కొని, ఎన్నో కొండలు, గుట్టలు దాటుకుంటూ లోయలగుండా వెళ్లాలి. బహుశా విశాలమైన సిరియా ఎడారి చుట్టూ తిరిగి యూఫ్రటీసులాంటి పెద్ద నదులను దాటుకుంటూ సిరియా, మెసొపొతమియ, అష్షూరు దేశాల్లోని పట్టణాల్లో, గ్రామాల్లో పరదేశుల మధ్య ఆశ్రయం పొందాలి. రోజులు గడుస్తుండగా, ఆయన తన గమ్యం నీనెవె గురించి ఆలోచించసాగాడు. అది దగ్గరౌతున్న కొద్దీ ఆయనలో భయం ఇంకా పెరిగింది.

2. తాను అప్పగించిన పనిని చేయడం గురించి యెహోవా యోనాకు ఎలా బోధించాడు?

2 ఒక్క విషయం మాత్రం యోనాకు బాగా తెలుసు: ఆయన ఈ నియామకం నుండి తప్పించుకుని ఎక్కడికీ పారిపోలేడు. అంతకుముందు ఆయన అదే చేయాలని చూశాడు. మనం ముందు అధ్యాయంలో చూసినట్టు, ముందు ఓ పెనుతుఫాను రప్పించి, ఆ తర్వాత ఓ పెద్ద చేప ద్వారా యోనాను అద్భుతంగా కాపాడి యెహోవా ఆయనకు ఓపిగ్గా బోధించాడు. మూడు రోజుల తర్వాత చేప ఒడ్డుకు వచ్చి యోనాను కక్కివేసింది, అప్పటికి ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు! ఇదంతా యోనాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. దేవుడు చెప్పింది చేయడానికి ముందుకన్నా ఆయన ఇప్పుడు ఇంకెంతో సన్నద్ధంగా ఉన్నాడు.—యోనా 1, 2 అధ్యా.

3. యోనాతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా ఏ లక్షణం చూపించాడు? అయినా ఏ ప్రశ్న తలెత్తుతుంది?

3 నీనెవెకు వెళ్లమని యెహోవా రెండవసారి చెప్పినప్పుడు యోనా ఇంకేమీ ఆలోచించకుండా సిద్ధమయ్యాడు, తూర్పు దిశగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. (యోనా 3:1-3 చదవండి.) యెహోవా ఇచ్చిన క్రమశిక్షణను స్వీకరించి యోనా మారాడా? ఉదాహరణకు, యెహోవా కనికరంతో యోనాను మునిగిపోకుండా కాపాడాడు, చేసిన తప్పుకు ఆయనను శిక్షించకుండా వదిలేశాడు, తన పని చేయడానికి ఆయనకు ఇంకో అవకాశమిచ్చాడు. ఇంత జరిగిన తర్వాతైనా యోనా ఇతరులపట్ల కనికరం చూపించడం నేర్చుకున్నాడా? కనికరం అనే ఈ లక్షణం చూపించడాన్ని నేర్చుకోవడం అపరిపూర్ణ మనుషులకు చాలా కష్టం. యోనా పడిన ప్రయాస నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాం.

తీర్పు సందేశం, ఆశ్చర్యకరమైన స్పందన

4, 5. యెహోవా నీనెవెను “మహాపురము” అని ఎందుకు అన్నాడు? ఇది మనకు ఆయన గురించి ఏమి తెలియజేస్తోంది?

4 యోనా నీనెవెను యెహోవా చూసినట్లు చూడలేదు. ‘నీనెవె పట్టణం దేవుని దృష్టిలో గొప్ప పట్టణం’ అని బైబిలు చెబుతోంది. (యోనా 3:3) యెహోవా నీనెవె పట్టణాన్ని “మహాపురము” అని మూడుసార్లు సంబోధించినట్లు యోనా పుస్తకంలో ఉంది. (యోనా 1:2; 3:2; 4:11) యెహోవా దృష్టిలో ఈ పట్టణం ఎందుకంత గొప్పది లేదా ప్రాముఖ్యమైనది?

5 నీనెవె పట్టణం చాలా ప్రాచీనమైనది. జలప్రళయం తర్వాత నిమ్రోదు కట్టించిన పట్టణాల్లో ఇదొకటి. అది ఓ ముఖ్యపట్టణం, విశాలమైన ఆ పట్టణంలో అనేక నగరాలు ఉండేవి. ఆ పట్టణంలో కాలినడకన ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలంటే మూడురోజులు పడుతుంది. (ఆది. 10:11, 12; యోనా 3:3) నీనెవె పట్టణం చాలా ఆకర్షణీయమైనది. ఎందుకంటే దానిలో వైభవోపేతమైన గుళ్లు, పెద్ద ప్రహరి గోడలు, ఇతర భవనాలు ఉండేవి. అయితే వీటన్నిటిని బట్టి కాదుగానీ, ఆ పట్టణంలో ఉన్న ప్రజలనుబట్టే నీనెవె యెహోవా దృష్టిలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ కాలంలో నీనెవె పట్టణ జనాభా చాలా ఎక్కువ. వాళ్లెంత చెడ్డపనులు చేసినా యెహోవా వాళ్ల విషయంలో శ్రద్ధ చూపించాడు. ఆయన ప్రతీ మనిషిని ప్రేమిస్తాడు, ప్రతీ ఒక్కరు పశ్చాత్తాపం చూపించి, తమ తప్పుల నుండి నేర్చుకోవాలనేదే ఆయన కోరిక.

నీనెవె మహాపట్టణం చెడుతనంతో నిండివుందని యోనా గమనించాడు

6. (ఎ) నీనెవె పట్టణం యోనాను ఎందుకు మరింతగా భయపెట్టివుంటుంది? (అధస్సూచి కూడా చూడండి.) (బి) యోనా చేసిన ప్రకటనాపని నుండి మనం ఏమి నేర్చుకుంటాం?

6 చివరకు యోనా నీనెవె పట్టణానికి చేరుకున్నప్పుడు ఆ పట్టణంలో 1,20,000 కంటే ఎక్కువ జనాభా ఉందనే విషయం ఆయనను ఇంకెంతో భయపెట్టివుంటుంది. a తన సందేశాన్ని ప్రకటించడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఆయన ఒక రోజంతా నడిచి, జనంతో కిటకిటలాడుతున్న పట్టణంలోకి ప్రవేశించాడు. ఆ ప్రజలతో ఆయనెలా మాట్లాడాడు? అష్షూరీయుల భాషను నేర్చుకుని ఉంటాడా? లేక ఓ అద్భుతం చేసి ఆ భాష మాట్లాడే సామర్థ్యాన్ని యెహోవా ఆయనకు ఇచ్చివుంటాడా? మనకు తెలీదు. బహుశా ఆయన ఒక అనువాదకుణ్ణి పెట్టుకుని తన సొంత భాష హెబ్రీలో నీనెవె ప్రజలకు ప్రకటించివుంటాడు. ఆయన ఎలా చెప్పినాసరే, “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును” అనే సూటైన సందేశం ఆయనకు ప్రజాదరణేమీ తీసుకురాదు. (యోనా 3:4) ఆయన అదే విషయాన్ని ధైర్యంగా అందరికీ ప్రకటిస్తూ వెళ్లాడు. అలా ఎంతో ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూపించాడు. యోనా చూపించిన ఈ లక్షణాలు క్రైస్తవులకు ముందెన్నటికన్నా ఇప్పుడు ఎంతో అవసరం.

యోనా సందేశం సూటైనది, ఆయనకు ప్రజాదరణ తీసుకొచ్చేదేమీ కాదు

7, 8. (ఎ) యోనా సందేశానికి నీనెవె వాసులు ఎలా స్పందించారు? (బి) యోనా సందేశానికి స్పందిస్తూ నీనెవె రాజు ఏమి చేశాడు?

7 నీనెవె ప్రజలు యోనా సందేశాన్ని వినడానికి గుమికూడారు. అయితే వాళ్లు కోపోద్రేకులై, తన మీద దాడి చేస్తారని బహుశా యోనా అనుకునివుంటాడు. కానీ ఆశ్చర్యం, ప్రజలు చక్కగా స్పందించారు! తమ పాపాలకు పశ్చాత్తాపపడ్డారు. ఆయన ప్రకటించిన నాశన సందేశం కార్చిచ్చులా పాకిపోయింది. ప్రజలంతా దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. (యోనా 3:5 చదవండి.) గొప్పా బీదా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పశ్చాత్తాపపడ్డారు. అందరూ ఉపవాసమున్నారు. ఈ వార్త రాజుదాకా చేరింది.

నీనెవెలో ప్రకటించడానికి యోనాకు ధైర్యం, విశ్వాసం అవసరమయ్యాయి

8 యోనా సందేశాన్ని విని రాజు కూడా పశ్చాత్తాపపడ్డాడు. దైవభయంతో రాజు తన సింహాసనం మీద నుండి దిగివచ్చి, రాజవస్త్రాలను తీసేసి, తన దేశ ప్రజలందరిలాగే గోనెపట్ట కట్టుకుని “బూడిదెలో కూర్చుండెను.” అప్పటివరకు ప్రజలు సొంతగా చేస్తున్న ఉపవాసం, రాజు తన ‘మంత్రులతో’ కలిసి ఆజ్ఞ జారీ చేయడంతో అధికారిక చర్యగా మారింది. పెంపుడు జంతువులతో సహా అందరూ గోనెపట్ట కట్టుకోవాలని రాజు ఆజ్ఞాపించాడు. b తన ప్రజలు తప్పు చేశారని, హింసకు పాల్పడ్డారని రాజు వినయంగా అంగీకరించాడు. తన ప్రజలు పశ్చాత్తాపపడడం చూసి దేవుడు వాళ్ల మీద కనికరం చూపిస్తాడనే ఆశను వ్యక్తంచేస్తూ రాజు ఇలా అన్నాడు: ‘మనము లయము కాకుండ దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకొనును.’—యోనా 3:6-9.

9. నీనెవె వాసుల గురించి విమర్శకులు ఎలాంటి సందేహం వ్యక్తంచేస్తున్నారు? కానీ ఆ విమర్శకులు చెప్పేది తప్పని మనకు ఎలా తెలుసు?

9 నీనెవె వాసుల్లో ఆ గొప్ప మార్పు అంత త్వరగా రావడం గురించి కొందరు విమర్శకులు సందేహం వెలిబుచ్చుతున్నారు. అయితే, ప్రాచీన కాలాల్లో అలాంటి సంస్కృతులకు చెందిన ప్రజలకు చాలా మూఢనమ్మకాలు ఉండేవని, వాళ్లలో మార్పు చాలా త్వరగా వచ్చేదని, కాబట్టి ప్రజల్లో ఆ విధమైన స్పందన అసాధారణమైనదేమీ కాదని బైబిలు పండితులు చెబుతున్నారు. పైగా, నీనెవె వాసుల పశ్చాత్తాపం గురించి, ఈ భూమిపై ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రస్తావించాడు కాబట్టి, విమర్శకులు చెప్పేది తప్పని మనకు తెలుసు. (మత్తయి 12:41 చదవండి.) తానేమి మాట్లాడుతున్నాడో యేసుకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు పరలోకం నుండి ఆయన ప్రత్యక్షంగా చూశాడు. (యోహా. 8:57, 58) నిజానికి విషయమేమిటంటే, ప్రజలు మనకు ఎంత క్రూరులుగా అనిపించినా వాళ్లు పశ్చాత్తాపపడడం అసాధ్యమనే ముగింపుకు మనం రాకూడదు. మనుషుల హృదయాల్లో ఏమి ఉందో యెహోవా మాత్రమే చూడగలడు.

దేవుని కనికరం, మనిషి కఠినత్వం

10, 11. (ఎ) నీనెవె వాసులు పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? (బి) యెహోవా తీర్పు తప్పుకాదని మనం ఎందుకు నమ్మకం కలిగి ఉండవచ్చు?

10 నీనెవె వాసులు పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? యోనా ఆ తర్వాత ఇలా రాశాడు: “నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.”—యోనా 3:10.

11 నీనెవె వాసుల విషయంలో తన తీర్పు తప్పని యెహోవా అనుకున్నాడని దాని అర్థమా? కాదు. యెహోవా న్యాయం పరిపూర్ణమైనదని బైబిలు వివరిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 32:4 చదవండి.) నీనెవె వాసుల మీద యెహోవాకు కలిగిన నీతియుక్తమైన ఆగ్రహం తగ్గింది. ఆ ప్రజల్లో వచ్చిన మార్పును యెహోవా గమనించి, వాళ్లపైకి తాను తీసుకువస్తానన్న శిక్ష ఇప్పుడు తీసుకురావడం న్యాయం కాదని అనుకున్నాడు. అది దేవుడు కనికరం చూపించాల్సిన సందర్భం.

12, 13. (ఎ) తాను పరిస్థితుల్ని అర్థంచేసుకుంటానని, వాటికి తగ్గట్లు మారతానని, కనికరం చూపిస్తానని యెహోవా ఎలా నిరూపించుకుంటాడు? (బి) యోనా ప్రవచనం ఎందుకు వ్యర్థం కాలేదు?

12 మతగురువులు తరచూ వర్ణించినట్లు యెహోవా కఠినుడు, కనికరంలేనివాడు, క్రూరుడు కాదు. నిజానికి ఆయన పరిస్థితుల్ని అర్థంచేసుకుంటాడు, వాటికి తగ్గట్లు మారతాడు, కనికరం చూపిస్తాడు. యెహోవా దుష్టులను శిక్షించాలనుకున్నప్పుడు మొదట భూమ్మీదున్న తన ప్రతినిధుల ద్వారా హెచ్చరిస్తాడు. ఎందుకంటే, దుష్టులు నీనెవె ప్రజల్లాగే పశ్చాత్తాపపడి తమ పద్ధతి మార్చుకోవాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడు. (యెహె. 33:11) యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు ఇలా చెప్పాడు: “దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పియుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.”—యిర్మీ. 18:7, 8.

నీనెవె ప్రజల్లాగే, దుష్టులు తమ పాపాలకు పశ్చాత్తాపపడి మారాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు

13 యోనా ప్రవచనం వ్యర్థమైపోయిందా? కాలేదు. ఎందుకంటే అది ప్రజల్ని హెచ్చరించింది. నీనెవె వాసులు చెడుగా ప్రవర్తించినందుకే వాళ్లకు ఆ హెచ్చరిక. అది విని వాళ్లు తమ ప్రవర్తన మార్చుకున్నారు. ఒకవేళ వాళ్లు మళ్లీ చెడుగా ప్రవర్తిస్తే, యెహోవా వాళ్లపై అదే తీర్పును అమలు చేస్తాడు. ఆ తర్వాత సరిగ్గా అలాగే జరిగింది.—జెఫ. 2:13-15.

14. యెహోవా నీనెవె మీద కనికరం చూపించినందుకు యోనా ఎలా స్పందించాడు?

14 యోనా తాననుకున్న సమయంలో నాశనం రానప్పుడు ఎలా స్పందించాడు? బైబిలు ఇలా చెబుతోంది: ‘యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు.’ (యోనా 4:1) ఆఖరికి, యోనా యెహోవానే సరిదిద్దుతున్నట్లు ప్రార్థించాడు. తాను ఇంటిదగ్గరే ఉండిపోతే బాగుండేదని అన్నాడు. యెహోవా నీనెవె వాసులను నాశనం చేయడనే విషయం తనకు తెలుసనీ, అందుకే తాను తర్షీషుకు పారిపోయాననీ చెప్పాడు. ఇక బ్రతకడం కంటే చావడమే మేలని అంటూ తనను చంపమని యెహోవాతో అన్నాడు.—యోనా 4:2, 3 చదవండి.

15. (ఎ) యోనా బాధకు, కోపానికి కారణం ఏమైవుంటుంది? (బి) నిరుత్సాహపడిన తన ప్రవక్తతో యెహోవా ఎలా వ్యవహరించాడు?

15 యోనాను బాధించింది ఏమిటి? ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు మెదిలాయో మనకు తెలియదు. కానీ, మనకు తెలిసిందేమిటంటే, యోనా ఆ ప్రజలందరి ముందు నీనెవె నాశనం గురించి ప్రకటించాడు. అది వాళ్లు నమ్మారు. తీరా చూస్తే ఏ నాశనమూ ముంచుకు రాలేదు. ప్రజలు తనను ఎగతాళి చేస్తారనో అబద్ధ ప్రవక్త అంటారనో ఆయన భయపడ్డాడా? ఏదేమైనా, ప్రజలు పశ్చాత్తాపపడినందుకు, యెహోవా కనికరం చూపించినందుకు యోనా సంతోషించలేదు. దానికి బదులు, ఆయన ఎంతో బాధపడివుంటాడు, తనపై తానే జాలిపడివుంటాడు, తన పరువు పోయిందని కుమిలిపోయివుంటాడు. అయినా, నిరుత్సాహపడుతున్న ప్రవక్తలో కనికరంగల దేవుడైన యెహోవా మంచినే చూశాడు. యోనా అమర్యాదగా ప్రవర్తించినందుకు యెహోవా ఆయనను శిక్షించలేదు కానీ, “నీవు కోపించుట న్యాయమా?” అని ఆలోచింపజేసేలా సౌమ్యంగా అడిగాడు. (యోనా 4:4) దానికి యోనా కనీసం జవాబైనా ఇచ్చాడా? దీని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు.

16. కొందరికి దేవుని చర్యలు ఎందుకు తప్పు అనిపించే అవకాశముంది? యోనా ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 యోనా ప్రవర్తనను తప్పుబట్టడం చాలా సులువు, కానీ దేవుని చర్యలు అపరిపూర్ణ మానవులకు తప్పు అనిపించడం అసాధారణ విషయమేమీ కాదని గుర్తుంచుకోండి. యెహోవా, ఫలానా విషాద సంఘటన జరగకుండా చూసివుండాల్సిందనో, దుష్టులపై తక్షణ చర్య తీసుకొనివుండాల్సిందనో, అసలు ఈ ప్రపంచ వ్యవస్థకు ఎప్పుడో చరమగీతం పాడివుండాల్సిందనో కొందరు అనుకుంటారు. యెహోవా చర్యలు తప్పని మనకు ఎప్పుడైనా అనిపిస్తే, నిజానికి అవి ఎన్నడూ తప్పు అవ్వవని, ఎప్పుడైనా సరిచేసుకోవాల్సింది మన ఆలోచనా తీరునేనని యోనా ఉదాహరణ మనకు గుర్తుచేస్తోంది.

యెహోవా యోనాకు ఒక పాఠం నేర్పించాడు

17, 18. (ఎ) నీనెవె పట్టణం నుండి వెళ్లిన తర్వాత యోనా ఏమి చేశాడు? (బి) సొర చెట్టుకు సంబంధించి యెహోవా చేసిన అద్భుతాలు యోనా మీద ఎలాంటి ప్రభావం చూపించాయి?

17 నిరాశతోవున్న ప్రవక్త నీనెవె నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోకుండా, తూర్పున ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుండి చూస్తే నీనెవె పట్టణమంతా చక్కగా కనిపిస్తుంది. యోనా అక్కడ ఓ చిన్న గుడారం వేసుకొని నీనెవెకు ఏమి జరుగుతుందో చూద్దామని వేచివున్నాడు. ఆయన అప్పటికీ, నీనెవె నాశనమౌతుందనే అనుకుంటున్నాడు. క్షమించడానికి సిద్ధంగాలేని యోనాకు కనికరం గురించిన పాఠాన్ని యెహోవా ఎలా నేర్పించాడు?

18 రాత్రికిరాత్రే యెహోవా ఒక సొర చెట్టును మొలిపించాడు. యోనా నిద్రలేచి, పెద్దపెద్ద ఆకులతో గుబురుగా పెరిగిన ఆ చెట్టును చూశాడు. తన చిన్న గుడారం కన్నా అది ఎక్కువ నీడనే ఇచ్చింది. దాన్ని చూడగానే యోనాకు ప్రాణం లేచివచ్చింది. దేవుడు తన ఆశీర్వాదం, ఆమోదం యోనాకు ఉన్నాయని చూపించడానికి ఆ సొర చెట్టును మొలిపించి ఉంటాడనుకొని యోనా ‘బహుగా సంతోషించాడు.’ అయితే, ఎండ తగలకుండా యోనాను కాపాడాలని, ఆయనకు వచ్చిన కోపాన్ని తగ్గించాలని మాత్రమే యెహోవా ఆ చెట్టును మొలిపించలేదు. యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. దానికోసం యెహోవా ఇంకొన్ని అద్భుతాలు చేశాడు. ఆ చెట్టును తొలిచేలా ఒక పురుగును పంపించాడు, దాంతో ఆ చెట్టు చచ్చిపోయింది. ఆ తర్వాత, దేవుడు “వేడిమిగల తూర్పుగాలిని” రప్పించాడు, ఆ ఎండదెబ్బకు యోనా ‘సొమ్మసిల్లే’ పరిస్థితి వచ్చింది. యోనా ఎంతో కృంగిపోయి, తాను చనిపోతే మేలని దేవునితో అన్నాడు. యోనా ఆ మాట అనడం ఇది రెండోసారి.—యోనా 4:6-8.

19, 20. సొర చెట్టు గురించి యోనాను ఆలోచింపజేసేలా యెహోవా ఎలా మాట్లాడాడు?

19 ‘సొర చెట్టు గురించి నువ్వు కోపపడడం న్యాయమేనా?’ అని యెహోవా ఆయనను మళ్లీ అడిగాడు. యోనా పశ్చాత్తాపపడాల్సిందిపోయి, “ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే” అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. యెహోవా ఆయనకు విషయాన్ని స్పష్టంగా వివరించాలనుకున్నాడు.—యోనా 4:9.

యోనాకు కనికరం గురించిన పాఠం నేర్పించడానికి దేవుడు సొర చెట్టును ఉపయోగించాడు

20 యెహోవా యోనాను ఆలోచింపజేసేలా మాట్లాడాడు. ఒక్క రాత్రిలో పుట్టుకొచ్చి, వాడిపోయిన ఒక సొరచెట్టు గురించి బాధపడడం ఎంతవరకు న్యాయమని అడిగాడు. నిజానికి యోనా దాన్ని నాటలేదు, కనీసం పెంచనూ లేదు. ఆ తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?”—యోనా 4:10, 11. c

21. (ఎ) యోనాకు నేర్పించడానికి యెహోవా ఏ ఉదాహరణ ఉపయోగించాడు? (బి) మనం నిజాయితీగా స్వీయపరిశీలన చేసుకోవడానికి యోనా కథ మనకు ఎలా సహాయం చేస్తుంది?

21 యెహోవా సొర చెట్టును ఉపయోగించి నేర్పిన పాఠంలో ముఖ్యమైన విషయం మీకు అర్థమైందా? యోనా ఆ చెట్టు కోసం ఏమీ చేయలేదు. కానీ, యెహోవా నీనెవె ప్రజలకు జీవాన్ని ఇచ్చాడు, సమస్త జీవకోటిని సంరక్షిస్తున్నట్లే నీనెవె వాసులను కూడా సంరక్షించాడు. 1,20,000 మంది ప్రాణాల గురించి, వాళ్ల పశువుల గురించి ఆలోచించకుండా యోనా కేవలం ఒక సొర చెట్టు గురించి బాధపడడం సరైనదేనా? యోనా తన గురించి మాత్రమే ఆలోచించుకున్నాడు కాబట్టి అలా ప్రవర్తించాడు, కాదంటారా? తనకు నీడను ఇచ్చినందుకే ఆయన ఆ చెట్టు గురించి బాధపడ్డాడు. తన పరువు ఎక్కడ పోతుందో, ప్రజలు తనను ఎక్కడ అబద్ధ ప్రవక్త అనుకుంటారో అని ఆలోచించినందువల్లే ఆయనకు నీనెవె మీద కోపమొచ్చింది, కాదంటారా? నిజాయితీగా స్వీయపరిశీలన చేసుకోవడానికి యోనా కథ మనందరికీ సహాయం చేస్తుంది. అలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనలో ఎవరికి మాత్రం రావు చెప్పండి? నిస్వార్థంగా ఉండే విషయంలో, దయాకనికరాలు చూపించే విషయంలో అంతకంతకూ ఎలా మెరుగవ్వాలో యెహోవా మనకు ఓపిగ్గా నేర్పిస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా!

22. (ఎ) కనికరం గురించి యెహోవా ఇచ్చిన జ్ఞానవంతమైన ఉపదేశం యోనా మీద తప్పకుండా ఎలాంటి ప్రభావం చూపించివుంటుంది? (బి) మనందరం ఏ పాఠం నేర్చుకోవాలి?

22 మరి, యోనా ఈ అనుభవం నుండి పాఠమేమైనా నేర్చుకున్నాడా? యోనా పుస్తకం యెహోవా అడిగిన ప్రశ్నతో ముగుస్తుంది, అది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. యోనా ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వనేలేదని కొంతమంది విమర్శకులు అంటారేమో. కానీ, ఆయన జవాబిచ్చాడు. యోనా రాసిన పుస్తకమే ఆ జవాబు. ఎందుకంటే, యోనా పుస్తకాన్ని రాసింది యోనానే అని ఆధారాలు చూపిస్తున్నాయి. యోనా తన సొంత ఊరికి సురక్షితంగా చేరుకొని ఆ వృత్తాంతాన్ని రాయడం ఒక్కసారి ఊహించుకోండి. అప్పటికి ఆయన వయసులో, జ్ఞానంలో ఎదిగివుంటాడు, వినయం చూపించే విషయంలో మెరుగైవుంటాడు. ఒకప్పుడు తాను చేసిన పొరపాట్ల గురించి, దేవుడు చెప్పింది చేయకుండా తాను పారిపోవడం గురించి, కనికరం చూపించకుండా కఠినంగా ఉన్న తీరు గురించి ఆయన నిట్టూరుస్తూ రాయడం మనం ఊహించుకోవచ్చు. యెహోవా ఇచ్చిన జ్ఞానవంతమైన ఉపదేశం నుండి యోనా ఖచ్చితంగా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కనికరం చూపించడం నేర్చుకున్నాడు. మరి మన విషయమేమిటి?—మత్తయి 5:7 చదవండి.

a యోనా కాలంలో, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి రాజధానియైన సమరయ జనాభా దాదాపు ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ఉండివుండవచ్చని ఒక అంచనా. నీనెవె పట్టణ జనాభాతో పోలిస్తే అది నాలుగోవంతు కూడా ఉండదు. నీనెవె పట్టణం సుభిక్షంగా ఉన్న కాలంలో, అది ప్రపంచంలోనే అతి పెద్ద పట్టణమై ఉండవచ్చు.

b ఈ విషయం వింతగా అనిపించవచ్చు. కానీ ప్రాచీన కాలాల్లో అలా జరిగేది. అప్పట్లో పారసీకులు, ప్రజాదరణ పొందిన ఒక అధికారి చనిపోయినందుకు దుఃఖిస్తున్నప్పుడు వాళ్ల సంతాప కార్యక్రమాల్లో పాడి పశువులు కూడా ఉండేవని గ్రీకు చరిత్రకారుడైన హెరొడోటస్‌ చెప్పాడు.

c యెహోవా వాళ్లను కుడియెడమలు ఎరుగని ప్రజలని అనడం, వాళ్లు ఆయన ప్రమాణాల విషయంలో పసిపిల్లల్లా ఏమీ తెలియకుండా ఉన్నారని సూచిస్తుంది.