13వ అధ్యాయం
ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
1, 2. (ఎ) యోనా తన మీదకు, ఓడలోని నావికుల మీదకు ఎలాంటి అపాయం తీసుకొచ్చాడు? (బి) యోనా కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
యోనాకు, భీకరమైన ఆ శబ్దాలన్నీ ఒక్కసారి ఆగిపోతే ఎంత బావుంటుందో అనిపించింది. జోరుగా వీస్తున్న గాలుల తాకిడికి తెరచాపలు, వాటి తాళ్లు, తెరచాప స్తంభం విపరీతంగా ఊగిపోతున్నాయి. పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ ధాటికి ఓడ కిర్రుకిర్రుమంటూ శబ్దాలు చేస్తోంది. కానీ వీటన్నిటికన్నా, ఓడలోనివాళ్లు భయంతో పెడుతున్న ఆర్తనాదాలే ఆయనను ఎక్కువగా భయపెట్టాయి. ఓడ సిబ్బంది, నావికులు భయంతో కేకలు పెడుతూ ఓడను కాపాడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనవల్లే వాళ్లందరి ప్రాణాలు ప్రమాదంలోపడ్డాయని యోనా బాధపడుతున్నాడు.
2 యోనాకు ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఆయన యెహోవాకు అవిధేయత చూపించి పెద్ద తప్పు చేశాడు. ఇంతకీ ఆయన చేసిందేమిటి? పరిస్థితి చేయిదాటిపోయిందా? వీటికి జవాబులు తెలుసుకుంటే మనం కూడా ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, దేవుని మీద నిజమైన విశ్వాసం చూపించేవాళ్లు కూడా కొన్నికొన్నిసార్లు తప్పులు చేస్తారని యోనా కథ నుండి మనం తెలుసుకుంటాం. అంతేకాదు, వాళ్లు వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో కూడా నేర్చుకుంటాం.
గలిలయలో పుట్టిన ప్రవక్త
3-5. (ఎ) యోనా పేరు వినగానే కొందరికి ఏమి గుర్తొస్తాయి? (బి) యోనా నేపథ్యం గురించి మనకేమి తెలుసు? (అధస్సూచి కూడా చూడండి.) (సి) ప్రవక్తగా పనిచేయడం యోనాకు సంతోషంగా కాక కష్టంగా ఎందుకు ఉండివుంటుంది?
3 యోనా పేరు వినగానే, బైబిలు గురించి తెలిసినవాళ్లెవరికైనా సాధారణంగా ఆయనలోని లోపాలే గుర్తొస్తాయి, అంటే ఆయన దేవుని మాట వినలేదనీ, మొండిగా ప్రవర్తించాడనీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆయన యెహోవా దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్తని మీకు తెలుసా? ఒకవేళ యోనా విశ్వాసం లేనివాడూ, అవినీతిపరుడూ అయ్యుంటే యెహోవా అంత పెద్ద బాధ్యతను ఆయనకు అప్పగించేవాడే కాదు.
యోనాలోని లోపాల్ని పక్కనపెడితే ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది
4 యోనా నేపథ్యం గురించి బైబిల్లో కొన్ని వివరాలే ఉన్నాయి. (2 రాజులు 14:25 చదవండి.) యోనా గత్హేపెరు అనే ఊరిలో పుట్టాడు. అది, దాదాపు 800 ఏళ్ల తర్వాత యేసు పెరిగిన నజరేతు పట్టణానికి సుమారు 4 కి.మీ. దూరంలో ఉంది. a రెండవ యరొబాము రాజు పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యోనా దేవుని ప్రవక్తగా పనిచేశాడు. అప్పటికి ఏలీయా చనిపోయి చాలా కాలమైంది. ఆయన తర్వాతి ప్రవక్త ఎలీషా కూడా యరొబాము తండ్రి పరిపాలించిన కాలంలోనే చనిపోయాడు. యెహోవా వాళ్లిద్దర్నీ ఉపయోగించి బయలు ఆరాధనను రూపుమాపినా ఇశ్రాయేలీయులు మళ్లీ అదే తప్పు చేయడం మొదలుపెట్టారు. యోనా కాలం నాటికి ఆ దేశాన్ని, ‘యెహోవా దృష్టిలో చెడుగా’ ప్రవర్తిస్తున్న రాజు పరిపాలిస్తున్నాడు. (2 రాజు. 14:24) ప్రవక్తగా ఉన్నందుకు సంతోషించడం మాట అటుంచితే, అలాంటి పరిస్థితుల్లో సేవచేయడం యోనాకు చాలా కష్టమైవుంటుంది. అయినా ఆయన తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు.
5 అనుకోకుండా ఒక రోజు యోనా జీవితం గొప్ప మలుపు తిరిగింది. యెహోవా ఆయనకు ఒక పనిని అప్పగించాడు. కానీ ఆయనకు అదెంతో కష్టంగా అనిపించింది. ఇంతకీ యెహోవా ఆయనకు ఏ పని అప్పగించాడు?
‘లేచి నీనెవెకు వెళ్లు’
6. యెహోవా యోనాకు ఏ పని అప్పగించాడు? అది ఆయనకు ఎందుకు కష్టంగా అనిపించివుంటుంది?
6 యెహోవా యోనాకు ఇలా చెప్పాడు: “నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.” (యోనా 1:2) ఆ పని ఆయనకు ఎందుకంత కష్టంగా అనిపించిందో మనం అర్థంచేసుకోవచ్చు. నీనెవె పట్టణం ఆయన ఊరికి పశ్చిమాన సుమారు 800 కి.మీ. దూరంలో ఉంది. కాలినడకన వెళ్లాలంటే దాదాపు ఒక నెల పడుతుంది. అయితే, ఆయన చేయాల్సిన పనితో పోలిస్తే ఈ ప్రయాణంలో ఎదురయ్యే పాట్లు ఏమంత కష్టమైనవి కావు. ఆయన నీనెవెలో అష్షూరీయులకు దేవుని తీర్పు సందేశాన్ని ప్రకటించాల్సివుంది. వాళ్లేమో దౌర్జన్యానికి, క్రూరత్వానికి పేరుగాంచారు. ఆ తర్వాత కొంతకాలానికి, “నరహత్య చేసిన పట్టణం” అనే పేరు కూడా దానికి వచ్చింది. దేవుని సొంత ప్రజలే యోనా మాటను పట్టించుకోనప్పుడు ఇక ఆ అన్యజనులేం వింటారు? ఒంటరివాడైన ఈ యెహోవా సేవకుడు నీనెవెలాంటి పట్టణంలో ఎలా మనగలడు?—నహూ. 3:1, 7.
7, 8. (ఎ) యెహోవా అప్పగించిన పనిని తప్పించుకోవడానికి యోనా ఎంత పట్టుదలతో ఉన్నాడు? (బి) యోనా పిరికివాడనే నిర్ణయానికి మనం ఎందుకు రాకూడదు?
7 యోనా కూడా అలాగే ఆలోచించివుంటాడా? మనకు తెలీదు. కానీ ఆయన పారిపోయాడనైతే మనకు తెలుసు. యెహోవా తూర్పుకు వెళ్లమంటే ఆయనేమో పశ్చిమానికి బయలుదేరాడు. అదీ, వీలైనంత దూరం వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఆయన యొప్పే అనే రేవు పట్టణానికి వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. తర్షీషు స్పెయిన్‌లో ఉండేదని కొందరు విద్వాంసులు అంటారు. అదే నిజమైతే యోనా నీనెవెకు దాదాపు 3,500 కి.మీ. దూరం వెళ్లిపోతున్నాడు. అప్పట్లో, మహాసముద్రానికి అవతలి వైపున్న తర్షీషుకు ఓడలో వెళ్లాలంటే కనీసం ఒక సంవత్సరం పట్టేది! యోనా ఏడాదిపాటు ప్రయాణించడానికైనా సిద్ధపడ్డాడంటే యెహోవా అప్పగించిన పనిని తప్పించుకోవడానికి ఆయన ఎంత పట్టుదలతో ఉన్నాడో తెలుస్తోంది.—యోనా 1:3 చదవండి.
8 మరి యోనా పిరికివాడా? ఈ ఒక్క సంఘటననుబట్టి ఆయన గురించి మనమా నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే, ఆయన ఆ తర్వాత ఎంతో ధైర్యాన్ని చూపించాడని మనం తెలుసుకుంటాం. అయితే, మనందరిలాగే ఆయనలో కూడా చాలా లోపాలున్నాయి. ఎంతైనా ఆయన కూడా అపరిపూర్ణుడే. (కీర్త. 51:5) ఒక్కసారి కూడా భయపడనివాళ్లు మనలో ఎవరైనా ఉన్నారా?
9. కొన్ని సందర్భాల్లో, దేవుడు చెప్పింది చేయడం గురించి మనకు ఎలా అనిపిస్తుంది? అలాంటి సమయాల్లో మనం ఏ నిజాన్ని గుర్తుంచుకోవాలి?
9 దేవుడు చెప్పింది చేయడం కొన్నిసార్లు మనకు కష్టంగా అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లయితే అసలు చేయలేం అనిపిస్తుంది. క్రైస్తవులుగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మన బాధ్యతే అయినా కొన్నిసార్లు దాన్ని చేయడానికి మనం భయపడతాం. (మత్త. 24:14) కానీ ‘దేవునికి సమస్తం సాధ్యమే’ అని యేసు చెప్పిన తిరుగులేని నిజాన్ని మనం ఇట్టే మర్చిపోతుంటాం. (మార్కు 10:27) కొన్ని సందర్భాల్లో, దేవుడు చెప్పింది చేయడం అసాధ్యమని మనకు కూడా అనిపించే అవకాశం ఉంది కాబట్టి, యోనా పరిస్థితిని మనం అర్థంచేసుకోవచ్చు. ఇంతకీ తప్పించుకుని పారిపోవాలనుకున్న యోనాకు ఏమి జరిగింది?
దారితప్పిన తన ప్రవక్తను యెహోవా సరిదిద్దాడు
10, 11. (ఎ) ఓడ తీరానికి దూరమౌతుండగా యోనా ఏమి అనుకొనివుంటాడు? (బి) ఓడ మీదికి, దాని సిబ్బంది మీదికి ఎలాంటి ప్రమాదం ముంచుకొచ్చింది?
10 ఇదంతా మీ కళ్లముందు జరుగుతున్నట్లు ఊహించుకోండి. యోనా బహుశా సరుకులను తీసుకెళ్లే ఫేనీకేయుల ఓడ ఎక్కి, తన సామాను సర్దుకొని కూర్చున్నాడు. ఓడ సిబ్బంది హడావిడిగా అటూఇటూ తిరుగుతూ, ఓడను బయలుదేరదీయడానికి సిద్ధపాట్లు చేయడం ఆయన గమనిస్తున్నాడు. ఓడ బయలుదేరి మెల్లమెల్లగా తీరానికి దూరమౌతోంది. ‘హమ్మయ్య! గొప్ప ప్రమాదం తప్పించుకున్నాను’ అని యోనా అనుకునివుంటాడు. కానీ, ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
11 కలలో కూడా ఊహించనంత భయంకరంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పుడున్న పెద్దపెద్ద నౌకల్ని కూడా ఇట్టే ముంచేసేంత పెద్ద కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. నడిసముద్రంలో విసిరికొడుతున్న గాలులు, ఎగసిపడుతున్న కెరటాల మధ్య ఆ ఓడ చిన్న బొమ్మలా కొట్టుకుపోతూ ఉంది. ఆ ధాటికి అది ఎంతసేపని తట్టుకుంటుంది? ఆ తర్వాత ఆయన తన పుస్తకంలో, ‘యెహోవాయే సముద్రముమీద పెద్దగాలి పుట్టించాడు’ అని రాశాడు. కానీ ఓడలో ఉన్నప్పుడు ఆయనకు ఆ విషయం తెలుసా? ఏమో చెప్పలేం. నావికులందరూ ఎవరి దేవుళ్లకు వాళ్లు మొరపెట్టుకుంటున్నారు. వాళ్లకు ఎలాంటి సహాయమూ అందదని ఆయనకు తెలుసు. (లేవీ. 19:4) ‘ఓడ బద్దలైపోయే’ పరిస్థితి వచ్చిందని ఆయన తన పుస్తకంలో రాశాడు. (యోనా 1:4) మరి యోనా, ఏ దేవుని దగ్గరనుండైతే పారిపోతున్నాడో ఆయన్నే సహాయం చేయమని ఎలా అడగగలడు?
12. (ఎ) తుఫాను తీవ్రతరమౌతున్నప్పుడు యోనా నిద్రపోవడం గురించి మనం ఎందుకు తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు? (అధస్సూచి కూడా చూడండి.) (బి) సమస్యకు కారణమెవరో యెహోవా ఎలా బయటపెట్టాడు?
12 వాళ్లకేమీ సహాయం చేయలేక యోనా ఓడ లోపలికి వెళ్లి పడుకోవడానికి ఒక చోటు వెతుక్కున్నాడు. అక్కడే గాఢనిద్రలోకి జారుకున్నాడు. b ఓడ నాయకుడు యోనాను లేపి మిగతావాళ్లలాగే ఆయనను కూడా తన దేవునికి ప్రార్థించమని చెప్పాడు. ఈ తుఫాను వెనుక మానవాతీత శక్తి ఏదో ఉందని ఊహించి, అసలు సమస్యకు కారణమెవరో తెలుసుకోవడానికి నావికులు చీట్లు వేశారు. ఒక్కొక్కరూ కాదని తేలిపోతుంటే యోనా గుండె నీరుగారిపోయింది. కొద్దిసేపట్లోనే విషయం బయటపడింది. తుఫాను సృష్టించింది యెహోవానే, చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చేలా చేసింది కూడా ఆయనే.—యోనా 1:5-7 చదవండి.
13. (ఎ) నావికుల ముందు యోనా ఏమి ఒప్పుకున్నాడు? (బి) నావికులను ఏమి చేయమని యోనా వేడుకున్నాడు? ఎందుకు?
13 యోనా నావికులకు విషయమంతా వివరించాడు. తాను సర్వశక్తిగల దేవుడైన యెహోవా సేవకుణ్ణనీ, ఆయన చెప్పిన పని చేయకుండా ఆయనను బాధపెట్టి పారిపోతున్నాననీ, అందుకే వాళ్లమీదకు ఆ విపత్తు వచ్చిపడిందనీ చెప్పాడు. అది విని వాళ్లంతా నిర్ఘాంతపోయారు, యోనాకు వాళ్ల కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. తమ ఓడనూ, ప్రాణాల్నీ కాపాడుకోవాలంటే ఏమి చేయాలని ఆయనను అడిగారు. దానికి ఆయన ఏమన్నాడు? అల్లకల్లోలంగా ఉన్న ఆ చల్లటి నీళ్లలో మునిగిపోవడం ఎలా ఉంటుందో ఊహించుకుని యోనా ఒళ్లు జలదరించివుంటుంది. కానీ, రక్షించగలనని తెలిసితెలిసి ఆయన వాళ్లనెలా నట్టేట ముంచగలడు? అందుకే ఆయన వాళ్లను ఇలా వేడుకున్నాడు: “నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించును.”—యోనా 1:12.
14, 15. (ఎ) ఏ విధంగా మనం యోనాలా బలమైన విశ్వాసం చూపించవచ్చు? (బి) యోనా అడిగిన దానికి నావికులు ఎలా స్పందించారు?
14 యోనా నిజంగా పిరికివాడే అయితే అలా అనివుండేవాడా? ఆ క్లిష్ట సమయంలో యోనా ధైర్యాన్ని, త్యాగస్ఫూర్తిని చూసి యెహోవా హృదయం ఆనందంతో నిండిపోయివుంటుంది. యోనాకు ఎంత బలమైన విశ్వాసం ఉందో ఇక్కడే అర్థమౌతోంది. మన అవసరాల కన్నా ఎదుటివాళ్ల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ మనం ఆయనలా విశ్వాసం చూపించవచ్చు. (యోహా. 13:34, 35) అవసరంలో ఉన్నవాళ్లు, కృంగిపోయినవాళ్లు, ఆధ్యాత్మిక ప్రోత్సాహం అవసరమైనవాళ్లు మన కంటబడితే వాళ్లకు సాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామా? అలా చేస్తే యెహోవా ఎంత ఆనందిస్తాడో కదా!
15 యోనా త్యాగస్ఫూర్తి ఓడలోని వాళ్లను కూడా ఎంతో కదిలించింది, అందుకే మొదట్లో వాళ్లు ఆయన చెప్పింది చేయడానికి ఒప్పుకోలేదు. తుఫాను నుండి బయటపడడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు, కానీ ఫలితం శూన్యం. పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది! చివరకు గత్యంతరం లేక, యోనా దేవుడైన యెహోవా తమను కరుణించాలని ప్రార్థిస్తూ వాళ్లు ఆయనను ఎత్తి సముద్రంలో పడేశారు.—యోనా 1:13-15.
దేవుడు యోనాను కరుణించి, రక్షించాడు
16, 17. ఓడ నుండి సముద్రంలో పడినప్పుడు యోనాకు ఏమి జరిగిందో వివరించండి. (చిత్రాలు కూడా చూడండి.)
16 అంత ఎత్తునుండి ఎగసిపడుతున్న నీళ్లలో యోనా పడ్డాడు. పైకి తేలడానికి నీళ్లలో గిలగిల కొట్టుకుంటూ, ఓడ తనకు దూరంగా వెళ్లిపోవడం చూశాడు. అంతలోనే అలలు విజృంభించి ఆయనను ముంచేశాయి. యోనా మునిగిపోతూ ఇక అంతా అయిపోయిందని అనుకున్నాడు.
17 అప్పుడు తనకు ఎలా అనిపించిందో యోనా ఆ తర్వాత రాశాడు. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. తాను యెహోవా మాట విననందుకు ఆయన అనుగ్రహాన్ని కోల్పోతానేమోనని భయపడ్డాడు. సముద్రగర్భంలోకి దిగిపోతున్నట్టూ, కొండల పునాదుల దగ్గరకు చేరుతున్నట్టూ, సముద్రపు నాచు తనను చుట్టేస్తున్నట్టూ ఆయనకు తెలుస్తోంది. ఇక సముద్రమే తన సమాధి అవుతుందని ఆయనకు అనిపిస్తోంది.—యోనా 2:2-6 చదవండి.
18, 19. సముద్ర గర్భంలో యోనాకు ఏమి జరిగింది? ఆయనను ఏది మింగేసింది? (అధస్సూచి కూడా చూడండి.) ఆ సంఘటనల వెనుక ఎవరు ఉన్నారు?
18 అయితే అక్కడేదో కదులుతున్నట్లుంది! ఏదో నల్లని అస్పష్టమైన ఆకారం తనవైపే వస్తోంది! అది ఒక్కసారిగా ఆయనమీదికి దూసుకువచ్చి, పెద్దగా నోరు తెరిచి ఆయనను అమాంతం మింగేసింది.
19 ఇక తన పనైపోయిందని యోనా అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం! తానింకా బ్రతికే ఉన్నాడు! తాను నలిగిపోలేదు, తనకేం కాలేదు. చేప కడుపులో సమాధి కావాల్సిన తనకు ఇంకా ఊపిరాడుతూనే ఉంది! జరుగుతున్నదాన్ని యోనా నమ్మలేకపోతున్నాడు. ‘గొప్ప మత్స్యం ఒకటి యోనాను మ్రింగేసేలా’ చేసింది నిస్సందేహంగా ఆయన దేవుడైన యెహోవాయే. c—యోనా 1:17.
20. పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు యోనా చేసిన ప్రార్థన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
20 నిమిషాలు, గంటలు అలా గడిచిపోతూ ఉన్నాయి. కనీవినీ ఎరుగని ఆ కటిక చీకటిలో యోనా బాగా ఆలోచించి యెహోవా దేవునికి ప్రార్థించాడు. తన పుస్తకంలోని రెండవ అధ్యాయంలో ఆ ప్రార్థననంతా యోనా రాసిపెట్టాడు. అది చదివినప్పుడు మనకెన్నో విషయాలు తెలుస్తాయి. తన ప్రార్థనలో కీర్తనల పుస్తకం నుండి ఎన్నో లేఖనాలను గుర్తుచేసుకున్నాడు కాబట్టి, ఆయనకు లేఖనాలు బాగా తెలుసని అర్థమౌతోంది. అంతేకాదు, యోనా తన ప్రార్థన చివరలో ఇలా అన్నాడు: “కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరుకును.” దీన్నిబట్టి ఆయనకు ఒక చక్కని లక్షణం ఉందని తెలుస్తోంది, అదే కృతజ్ఞత.—యోనా 2:9.
21. యెహోవా రక్షించే సామర్థ్యం గురించి యోనా ఏమి తెలుసుకున్నాడు? మనం ఏమి గుర్తుంచుకోవాలి?
21 ఆ అసాధారణమైన చోట అంటే, “మత్స్యము కడుపులో” ఉన్న యోనా, యెహోవా దేవుడు ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా రక్షించగల సమర్థుడని తెలుసుకున్నాడు. అక్కడ కూడా, బాధపడుతున్న తన సేవకుణ్ణి యెహోవా రక్షించాడు. (యోనా 1:17) ఓ పెద్ద చేప కడుపులో మూడురోజులపాటు ఒక వ్యక్తిని సజీవంగా ఉంచడం యెహోవాకు మాత్రమే సాధ్యం. ‘మన ప్రాణం’ యెహోవా ‘వశంలో’ ఉందని గుర్తుంచుకోవడం మంచిది. (దాని. 5:22, 23) మనం శ్వాస తీసుకుంటున్నాము, జీవిస్తున్నాము అంటే అదంతా ఆయన చలవే. మరి ఆయన పట్ల మనకు కృతజ్ఞత ఉందా? అలాగైతే, మనం యెహోవా చెప్పింది చేయాలి కదా?
22, 23. (ఎ) తనకు నిజంగా కృతజ్ఞత ఉందో లేదో చూపించే అవకాశం యోనాకు ఎలా దొరికింది? (బి) మనం తప్పులు చేసినప్పుడు యోనా నుండి ఏమి నేర్చుకోవచ్చు?
22 మరి యోనా ఏంచేశాడు? యెహోవా చెప్పింది చేసి తనకు ఆయనపట్ల కృతజ్ఞత ఉందని చూపించడం నేర్చుకున్నాడా? అవును నేర్చుకున్నాడు. మూడురోజుల తర్వాత చేప ఒడ్డుకు వచ్చి ‘యోనాను నేలమీద కక్కివేసింది.’ (యోనా 2:10) ఒక్కసారి ఆలోచించండి, యోనాకు ఈదాల్సిన అవసరం కూడా రాలేదు! అయితే సముద్రతీరం నుండి మాత్రం ఆయనే స్వయంగా దారి కనుక్కోవాలి. కానీ ఎంతో సమయం గడవకముందే తనకు నిజంగా కృతజ్ఞత ఉందో లేదో చూపించే అవకాశం ఆయనకు దొరికింది. యోనా 3:1, 2 ఇలా చెబుతోంది: “అంతట యెహోవావాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా—నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.” యోనా ఇప్పుడు ఏమి చేస్తాడు?
23 యోనా ఇంకేమీ ఆలోచించకుండా, “లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను.” (యోనా 3:3) అవును, దేవుడు చెప్పిందే యోనా చేశాడు. తాను చేసిన తప్పుల నుండి ఆయన నేర్చుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో కూడా మనం యోనాలా విశ్వాసం చూపించాలి. మనందరం పాపులమే, మనమూ తప్పులు చేస్తుంటాం. (రోమా. 3:23) అప్పుడు, దేవుని సేవ చేయడం ఇక మనవల్ల కాదని చేతులెత్తేస్తామా? లేక చేసిన తప్పుల నుండి నేర్చుకుని దేవునికి మళ్లీ విధేయత చూపిస్తామా?
24, 25. (ఎ) ఆ తర్వాత యోనా ఏ ఆశీర్వాదం పొందాడు? (బి) భవిష్యత్తులో యోనా కోసం ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయి?
24 యోనా విధేయత చూపించినందుకు యెహోవా ఆయనను ఆశీర్వదించాడా? అవును. ఒక ఆశీర్వాదం ఏమిటంటే, తనతో ప్రయాణించినవాళ్లు బ్రతికి బయటపడ్డారని ఆయనకు ఆ తర్వాత తెలిసివుంటుంది. ఓడలో ఉన్నవాళ్లను కాపాడడానికి యోనా ప్రాణాలకు తెగించిన వెంటనే తుఫాను నిమ్మళించింది. అది చూసి వాళ్లు తమ అబద్ధ దేవుళ్లకు కాకుండా యెహోవాకు బలులు అర్పించారు.—యోనా 1:15, 16.
25 చాలాకాలం తర్వాత యోనాకు ఇంకా గొప్ప ఆశీర్వాదం దక్కింది. అదేమిటంటే, యేసుకు జరగబోయేదాన్ని యోనా జీవితంలోని సంఘటన ముందే చూపించింది. యోనా పెద్దచేప కడుపులో ఉన్నట్టే తాను కూడా సమాధిలో ఉంటానని యేసు చెప్పాడు. (మత్తయి 12:38-40 చదవండి.) యోనాను దేవుడు పునరుత్థానం చేసినప్పుడు ఆ విషయం తెలుసుకుని ఆయన ఎంత పులకించిపోతాడో ఊహించుకోండి! (యోహా. 5:28, 29) యెహోవా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. యోనాలాగే మీరు కూడా మీ తప్పుల నుండి నేర్చుకుని దేవుడు చెప్పింది చేస్తూ నిస్వార్థంగా జీవిస్తారా?
a యోనా గలిలయలోని ఒక పట్టణంలో పుట్టాడనే విషయం ఆసక్తికరం. ఎందుకంటే పరిసయ్యులు యేసు గురించి పొగరుగా మాట్లాడుతూ, ‘విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తా పుట్టడు’ అని అన్నారు. (యోహా. 7:52) చిన్న పట్టణమైన గలిలయలో ఏ ప్రవక్తా పుట్టలేదు, పుట్టబోడు అంటూ పరిసయ్యులు తీసిపడేసినట్లు మాట్లాడారని చాలామంది అనువాదకులు, పరిశోధకులు అంటున్నారు. అదే నిజమైతే వాళ్లు చరిత్రనే కాదు బైబిల్లోని ప్రవచనాలను కూడా నిర్లక్ష్యం చేసినవాళ్లౌతారు.—యెష. 9:1, 2.
b యోనా బాగా నిద్రపోయాడని చెప్పడానికి, ఆయన గురక పెట్టాడని ప్రాచీన గ్రీకు సెప్టువజింటు ప్రతులు చెబుతున్నాయి. అయితే, ఎవరికేమైనా ఫర్వాలేదనుకుంటూ యోనా నిద్రపోయాడని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దుఃఖంతో గుండె బరువెక్కినవాళ్లకు బాగా నిద్రపోవాలనిపిస్తుందనే విషయం మనం మరచిపోకూడదు. గెత్సేమనే తోటలో యేసు వేదనపడుతున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను ‘దుఃఖం చేత నిద్రించారు.’—లూకా 22:45.
c ‘గొప్ప మత్స్యము’ అనే పదాన్ని గ్రీకులో “పెద్ద సముద్ర జీవి” లేదా “పెద్ద చేప” అని అనువదించారు. అది ఏ జలచరమో ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలేం లేవు. అయితే మధ్యధరా సముద్రంలో మనిషిని మింగేసేంత పెద్ద షార్క్‌చేపలను (ఒక జాతి సొరచేపలను) కనుగొన్నారు. వేరే సముద్రాల్లో ఇంకా పెద్దపెద్ద షార్క్‌లే ఉన్నాయి. వేల్‌షార్క్‌ల పొడవు దాదాపు 45 అడుగుల వరకూ ఉంటుంది, కొన్నైతే అంతకన్నా ఎక్కువ పొడవే ఉంటాయి!