కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసును అనుకరిస్తూ, ఆయనలా . . .

యేసును అనుకరిస్తూ, ఆయనలా . . .

కనికరం చూపించండి

యేసు ఒక పరిపూర్ణ మనిషి కాబట్టి మిగతా మనుషులకు ఉండే చాలా బాధల్ని, ఆందోళనల్ని ఆయన రుచిచూడలేదు. అయినప్పటికీ వాళ్లను బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్లకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవాడు, నిజానికి ఆయన వాళ్ల అవసరాలు తీర్చడం కంటే ఎక్కువే చేశాడు. వాళ్లకు సహాయం చేసేలా కనికరమే ఆయన్ని పురికొల్పింది. కొన్ని ఉదాహరణలు ఈ అధ్యాయాల్లో పరిశీలించండి: 32, 37, 57, 99.

స్నేహపూర్వకంగా ఉండండి

యేసు బిజీగా ఉన్నట్లు లేదా తానే గొప్పవాణ్ణి అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించలేదు. అందుకే వృద్ధులు, పిల్లలు, అన్ని వయసులవాళ్లు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడేవాళ్లు. యేసుకు తమపట్ల శ్రద్ధ ఉందని వాళ్లు గుర్తించారు కాబట్టి, ఎలాంటి సంకోచం లేకుండా ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు. ఈ అధ్యాయాల్లో దాని గురించి పరిశీలించండి: 25, 27, 95.

క్రమంగా ప్రార్థించండి

యేసు తన తండ్రికి క్రమంగా, హృదయపూర్వకంగా ప్రార్థించేవాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు, తోటి ఆరాధకులతో ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇంకా చాలా సందర్భాల్లో ఆయన ప్రార్థించేవాడు. ప్రార్థనలో తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పేవాడు, ఆయన్ని స్తుతించేవాడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిర్దేశం కోసం వేడుకునేవాడు. యేసు చేసిన ప్రార్థనల గురించి ఈ అధ్యాయాల్లో చదివి తెలుసుకోండి: 24, 34, 91, 122, 123.

నిస్వార్థంగా ఉండండి

కొన్నిసార్లు, యేసు విశ్రాంతి తీసుకునే సమయాన్ని కూడా ఇతరుల కోసం వెచ్చించాడు. తన అవసరాలే తనకు ప్రాముఖ్యం అన్నట్లు ఆయన ప్రవర్తించలేదు. నిస్వార్థంగా ఉండే విషయంలో ఆయన మనకు ఎలా చక్కని ఆదర్శం ఉంచాడో ఈ అధ్యాయాల్లో చూడండి: 19, 41, 52.

ఇతరుల్ని క్షమించండి

ఇతరుల్ని క్షమించడం ప్రాముఖ్యమని యేసు బోధించాడు. బోధించడమే కాదు, ఆయన తన శిష్యుల్ని, ఇతరుల్ని క్షమించాడు. ఈ అధ్యాయాలు చదివి దాని గురించి ధ్యానించండి: 26, 40, 64, 85, 131.

ఉత్సాహం చూపించండి

చాలామంది యూదులు యేసును మెస్సీయగా ఒప్పుకోరని, శత్రువులు ఆయన్ని చంపుతారని లేఖనాలు ముందే చెప్పాయి. కాబట్టి ప్రజలకు ఎంతోకొంత సహాయం చేసి సరిపెట్టుకుందామని యేసు అనుకోలేదు. బదులుగా ఆయన సత్యారాధనను ఉత్సాహంగా ప్రోత్సహించాడు. ఉదాసీనత లేదా వ్యతిరేకత ఎదుర్కొనే తన అనుచరులందరికీ, ఉత్సాహం చూపించే విషయంలో యేసు చక్కని ఆదర్శం ఉంచాడు. ఈ అధ్యాయాలు చూడండి: 16, 72, 103.

వినయంగా ఉండండి

జ్ఞానంలో, తెలివిలో, ప్రతీ విషయంలో యేసు అపరిపూర్ణ మనుషులందరి కంటే గొప్పవాడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి, మనుషులెవ్వరికీ లేని భౌతిక, మానసిక సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అయినా ఆయన వినయంగా ఇతరులకు సేవ చేశాడు. దానికి సంబంధించిన పాఠాల్ని ఈ అధ్యాయాల్లో చూడండి: 10, 62, 66, 94, 116.

ఓపిగ్గా ఉండండి

అపొస్తలులు, మరితరులు తనను అనుకరించడంలో, తాను చెప్పినవాటిని పాటించడంలో పదేపదే విఫలమైనా యేసు ఓపిక చూపించాడు. వాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేసే పాఠాల్ని ఓపిగ్గా నేర్పిస్తూ వచ్చాడు. యేసు ఏయే సందర్భాల్లో ఓపిక చూపించాడో ఈ అధ్యాయాల్లో చూడండి: 74, 98, 118, 135.