అధ్యాయం 11
“ఆయన చర్యలన్నియు న్యాయములు”
1, 2.(ఎ)యోసేపు ఎలాంటి ఘోరమైన అన్యాయాలు అనుభవించాడు? (బి) ఆ అన్యాయాలను యెహోవా ఎలా సరిదిద్దాడు?
అది ఘోరమైన అన్యాయం. అందమైన ఆ కుర్రవాడు ఎలాంటి నేరమూ చేయలేదు, అయినా అత్యాచార ప్రయత్నం చేశాడనే అబద్ధారోపణపై అతడు చెరసాలలో వేయబడ్డాడు. అయితే ఆయనకు అన్యాయం జరగడం అదే మొదటిసారి కాదు. చాలా సంవత్సరాల క్రితం, యోసేపు అనే ఈ 17 సంవత్సరాల కుర్రవాణ్ణి అతని అన్నలు ద్రోహబుద్ధితో దాదాపు చంపినంత పనిజేశారు. ఆ తర్వాత ఆయన పరాయి దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడాయన తన యజమాని భార్య ప్రలోభాలకు లొంగకపోయేసరికి, ఆమె ద్వేషంతో అతనిపై చేసిన అబద్ధారోపణ కారణంగా అతను చెరసాల పాలయ్యాడు. విషాదకరంగా, యోసేపు పక్షాన అడ్డుపడే వారే కరవైనట్లు అనిపించింది.
యోసేపు అన్యాయంగా “చెరసాలలో” బాధ అనుభవించాడు
2 అయితే, ‘నీతిని, న్యాయమును ప్రేమించే’ దేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. (కీర్తన 33:5) ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి యెహోవా తగిన చర్యతీసుకొని చివరకు యోసేపు విడుదలయ్యే పరిస్థితులు కల్పించాడు. అంతకంటే ఎక్కువగా, “చెరసాలలో” వేయబడిన యోసేపు చివరకు గొప్ప బాధ్యతగల, అత్యంత గౌరవంగల స్థానానికి చేర్చబడ్డాడు. (ఆదికాండము 40:15; 41:41-43; కీర్తన 105:17, 18) చివరకు, యోసేపు సత్యవంతుడని నిరూపించబడ్డాడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆయన తన ఉన్నత స్థానాన్ని ఉపయోగించాడు.—ఆదికాండము 45:5-8.
3.ఇతరులు మనతో న్యాయంగా వ్యవహరించాలని మనమందరం కోరుకోవడం ఎందుకు ఆశ్చర్యపోవలసిన విషయం కాదు?
3 అలాంటి వృత్తాంతాలు మన హృదయాలను కదిలించవా? అన్యాయం చూడనివారు లేదా దానికి బలికానివారు మనలో ఎవరున్నారు? అవును, మనమందరం మనకు న్యాయం జరగాలని, మనతో ఇతరులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుంటాం. ఇందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు, ఎందుకంటే యెహోవా తన సొంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాలను మనకు అనుగ్రహించాడు, అంతేగాక న్యాయం ఆయన ప్రధాన లక్షణాల్లో ఒకటి. (ఆదికాండము 1:27) యెహోవాను మరింతగా తెలుసుకోవడానికి, న్యాయాన్ని ఆయన ఎంత విలువైనదిగా ఎంచుతాడో మనం అర్థంచేసుకోవాలి. ఆ విధంగా మనం ఆయన అద్భుత విధానాలను ఎంతో విలువైనవిగా ఎంచుతూ ఆయనకు సన్నిహితమయ్యేందుకు పురికొల్పబడతాం.
న్యాయమంటే ఏమిటి?
4.మానవ దృక్కోణం నుండి చూస్తే, న్యాయం తరచూ ఎలా అర్థంచేసుకోబడుతోంది?
4 మానవ దృక్కోణం నుండి చూస్తే, న్యాయమంటే శాసన నియమాలను అందరికీ సమానంగా అన్వయించడం మాత్రమేనని తరచూ అర్థంచేసుకోబడుతోంది. రైట్ అండ్ రీసన్—ఎథిక్స్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే పుస్తకమిలా చెబుతోంది: “చట్టం, కర్తవ్యం, హక్కులు, విధులతో న్యాయం ముడిపెట్టబడివుంది, సమానత్వాన్ని లేదా యోగ్యతను బట్టి అది తీర్పునిస్తుంది.” అయితే యెహోవా న్యాయంలో తమ కర్తవ్యం లేదా విధి అనే భావంతో యాంత్రికంగా నియమాలను అమలుచేయడంకంటే ఇంకా ఎక్కువే ఇమిడివుంది.
5, 6.(ఎ)“న్యాయము” అని అనువదించబడిన ఆదిమ భాషా పదాల భావమేమిటి? (బి) దేవుడు న్యాయవంతుడు అంటే అర్థమేమిటి?
5 బైబిల్లో ఉపయోగించబడిన ఆదిమ భాషాపదాలను పరిశీలించడం ద్వారా యెహోవా న్యాయపు లోతుపాతులను ఇంకా ఎక్కువగా అర్థంచేసుకోవచ్చు. హీబ్రూ లేఖనాల్లో మూడు ముఖ్యమైన పదాలు ఉపయోగించబడ్డాయి. “న్యాయము” అని అత్యంత తరచుగా అనువదించబడిన పదాన్ని “సరైనది” అని కూడా అనువదించవచ్చు. (ఆదికాండము 18:25, NW) మిగతా రెండు పదాలు సాధారణంగా “నీతి” అని అనువదించబడ్డాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “నీతి” అని అనువదించబడిన పదం “సరిగ్గా లేక న్యాయంగా ఉండడమనే లక్షణం” అని నిర్వచింపబడింది. అందువల్ల నీతికీ, న్యాయానికీ ఎలాంటి ప్రాథమిక భేదమూ లేదు.—ఆమోసు 5:24.
6 కాబట్టి, దేవుడు న్యాయవంతుడని బైబిలు చెబుతోందంటే, అది ఆయన సరైనదీ, సబబైనదీ చేస్తాడని, అదికూడా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంతో చేస్తాడని తెలియజేస్తోంది. (రోమీయులు 2:11) అలాకాకుండా ఆయన మరోవిధంగా ప్రవర్తిస్తాడనేది ఊహకందని విషయం. నమ్మకస్థుడైన ఎలీహు ఇలాచెప్పాడు: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) అవును, “అన్యాయము చేయుట” యెహోవాకు అసంభవం. ఎందుకు? దానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలున్నాయి.
7, 8.(ఎ)అన్యాయంగా ప్రవర్తించడం ఎందుకు యెహోవాకు అసాధ్యం? (బి) తన వ్యవహారాల్లో నీతిగా లేదా న్యాయంగా ఉండడానికి యెహోవాను ఏది ప్రేరేపిస్తుంది?
7 మొదటిది, ఆయన పరిశుద్ధుడు. మనం 3వ అధ్యాయంలో గమనించినట్లు యెహోవా అపారమైన స్వచ్ఛత, యథార్థత గలవాడు. అందువల్ల, అనీతిగా లేదా అన్యాయంగా ప్రవర్తించడం ఆయనకు అసాధ్యం. దీనర్థమేమిటో ఆలోచించండి. మన పరలోకపు తండ్రి పరిశుద్ధతే, ఆయన తన పిల్లలను ఆదరించకుండా ఉండడని నమ్మడానికి మనకు బలమైన ఆధారమిస్తోంది. యేసుకు అలాంటి నమ్మకముంది. తన భూజీవితపు చివరిరాత్రి ఆయనిలా ప్రార్థించాడు: ‘పరిశుద్ధుడవైన తండ్రీ, నీ నామమందు వారిని [శిష్యులను] కాపాడుము.’ (యోహాను 17:11) “పరిశుద్ధుడవైన తండ్రీ” అనే మాట లేఖనాల్లో ఒక్క యెహోవాకు మాత్రమే వర్తిస్తుంది. అది సముచితం, ఎందుకంటే ఆయన పరిశుద్ధతకు ఏ మానవ తండ్రీ సాటిరాలేడు. సంపూర్ణ స్వచ్ఛత, శుద్ధతకలిగి సమస్త పాపానికి పూర్తిగా దూరంగా ఉన్న తన తండ్రి చేతుల్లో తన శిష్యులు సురక్షితంగా ఉంటారని యేసుకు పూర్తి విశ్వాసముంది.—మత్తయి 23:9.
8 రెండవది, నిస్వార్థ ప్రేమ దేవుని నైజంలో ఒక భాగం. అలాంటి ప్రేమ ఇతరులతో ఆయన నీతిగా లేదా న్యాయంగా వ్యవహరించేలా ఆయనను పురికొల్పుతుంది. అయితే జాతివాదం, వివక్ష, పక్షపాతం వంటి అనేక రూపాల్లో ఉండే అన్యాయం తరచూ ప్రేమకు వ్యతిరేకమైనవైన దురాశ, స్వార్థాల నుండి ఉద్భవిస్తుంది. ప్రేమగల దేవుని గురించి, బైబిలు మనకిలా హామీ ఇస్తోంది: “యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు.” (కీర్తన 11:7) యెహోవా తన గురించి స్వయంగా ఇలా చెబుతున్నాడు: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము.” (యెషయా 61:8) సరైనది లేదా న్యాయమైనది చేయడంలో మన దేవుడు సంతోషిస్తాడని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా?—యిర్మీయా 9:24.
కనికరం మరియు యెహోవా పరిపూర్ణ న్యాయం
9-11.(ఎ)యెహోవా న్యాయానికి, ఆయన కనికరానికి మధ్య ఎలాంటి సంబంధముంది? (బి) యెహోవా పాపులైన మానవులతో వ్యవహరించే విధానంలో న్యాయం, అలాగే ఆయన కనికరం ఎలా రుజువవుతున్నాయి?
9 యెహోవా సాటిలేని వ్యక్తిత్వపు ప్రతీ ఇతర ముఖరూపంలాగే ఆయన న్యాయం కూడా ఏ కొదువాలేని ఒక పరిపూర్ణ లక్షణం. యెహోవాను కొనియాడుతూ మోషే ఇలా వ్రాశాడు: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:3, 4) యెహోవా న్యాయపు ప్రతీ వ్యక్తీకరణ నిష్కళంకమైనది. అదెన్నడు కూడా మరీ మృదువుగాను, మరీ కఠోరంగాను ఉండదు.
10 యెహోవా న్యాయానికీ, ఆయన కనికరానికీ మధ్య సన్నిహిత సంబంధముంది. కీర్తన 116:5 ఇలా చెబుతోంది: “యెహోవా దయాళుడు నీతిమంతుడు [“న్యాయవంతుడు,” ద న్యూ అమెరికన్ బైబిల్]; మన దేవుడు వాత్సల్యతగలవాడు.” అవును యెహోవా న్యాయవంతుడు, కనికరంగలవాడు. ఆ రెండు లక్షణాలు భిన్న ధృవాలు కావు. ఆయన కనికరం చూపించడమంటే, ఆయన న్యాయమేదో కఠోరంగా ఉంటుందన్నట్లు, దాన్ని నీరుగార్చడమని దాని భావం కాదు. బదులుగా, ఆయన తరచూ ఒకే సమయంలో, చివరికి ఒకే చర్యలో ఆ రెండు లక్షణాలను కలిపి వ్యక్తంచేస్తాడు. ఒక ఉదాహరణ పరిశీలించండి.
11 వారసత్వాన్ని బట్టి మానవులందరూ పాపులే, కాబట్టి పాపానికి శిక్షగా వారు మరణించాల్సిందే. (రోమీయులు 5:12) అయితే పాపులు మరణించడం యెహోవాకు సుతరామూ ఇష్టంలేదు. ఆయన ‘క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యతలు గలవాడు.’ (నెహెమ్యా 9:17) అయినప్పటికీ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన అనీతిని మన్నించలేడు. అలాంటప్పుడు, జన్మతః పాపులైన మానవులపట్ల ఆయన కనికరమెలా చూపగలడు? దేవుని వాక్యంలోని అత్యంత అమూల్య సత్యాల్లో ఒకదాని నుండి దానికి జవాబు దొరుకుతుంది, అదే మానవాళి రక్షణార్థం యెహోవా ఏర్పాటుచేసిన విమోచన క్రయధనం. ఈ ప్రేమపూర్వక ఏర్పాటు గురించి మనం 14వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. ఇది ఏకకాలంలో చూపించబడిన గొప్ప న్యాయం, సంపూర్ణ కనికరం. దానిమూలంగా, యెహోవా తన పరిపూర్ణ న్యాయ కట్టడలు పాటిస్తూనే, పశ్చాత్తాపపడే పాపులపట్ల వాత్సల్యపూరిత కనికరం వ్యక్తపరచడానికి వీలవుతుంది.—రోమీయులు 3:21-26.
యెహోవా న్యాయం హృదయోత్తేజకరమైనది
12, 13.(ఎ)యెహోవా న్యాయం మనల్ని ఆయనకు ఎందుకు సన్నిహితం చేస్తుంది? (బి) యెహోవా న్యాయం గురించి దావీదు చివరకు ఏ ముగింపుకు వచ్చాడు, ఇది మనల్నెలా ఓదార్చగలదు?
12 యెహోవా న్యాయం మనల్ని తరిమి కొట్టే కఠినమైన లక్షణం కాదుగాని అది మనల్ని ఆయనవైపు ఆకర్షించే ఒక ప్రియమైన లక్షణం. యెహోవా న్యాయానికి లేదా నీతికి సంబంధించిన దయార్ధ్ర స్వభావాన్ని బైబిలు స్పష్టంగా వర్ణిస్తోంది. యెహోవా తన న్యాయాన్ని అమలుపరిచే హృదయోత్తేజకరమైన విధానాలను కొన్నింటిని మనం పరిశీలిద్దాం.
13 యెహోవా పరిపూర్ణ న్యాయం, తన సేవకులపట్ల నమ్మకత్వాన్ని, యథార్థతను చూపేలా ఆయనను పురికొల్పుతుంది. యెహోవాయొక్క న్యాయానికున్న ఈ కోణాన్ని కీర్తనకర్త దావీదు అనుభవపూర్వకంగా అర్థంచేసుకున్నాడు. దావీదు తన అనుభవం నుండి దేవుని మార్గాల అధ్యయనం నుండి చివరకు ఎలాంటి ముగింపుకు వచ్చాడు? ఆయనిలా ప్రకటించాడు: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు.” (కీర్తన 37:28) ఇదెంతో ఓదార్పునిచ్చే హామీ! మన దేవుడు తనపట్ల యథార్థంగా ఉన్నవారిని ఒక్క క్షణంకూడా విడిచిపెట్టడు. అందువల్ల ఆయన సాన్నిహిత్యంపై, ఆయనచూపే శ్రద్ధపై మనం ఆధారపడవచ్చు. దానికి ఆయన న్యాయం హామీయిస్తోంది!—సామెతలు 2:7, 8.
14.దుర్భలులపట్ల యెహోవాకున్న చింత ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ధర్మశాస్త్రంలో ఎలా స్పష్టమవుతోంది?
14 దేవుని న్యాయం బాధల్లో ఉన్న వారి అవసరాలను గమనిస్తుంది. దుర్భలులపట్ల యెహోవాకున్న చింత ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ధర్మశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, అనాధల పట్ల, విధవరాండ్ర పట్ల శ్రద్ధచూపబడేలా నిశ్చయపరచుకోవడానికి ఆ ధర్మశాస్త్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. (ద్వితీయోపదేశకాండము 24:17-21) అలాంటి కుటుంబాలకు జీవితమెంత కష్టంగా ఉంటుందో గుర్తిస్తూ, యెహోవా తానే స్వయంగా వారి తండ్రిలాంటి న్యాయకర్తగా, సంరక్షకునిగా, ‘తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చువానిగా’ అయ్యాడు. a (ద్వితీయోపదేశకాండము 10:18; కీర్తన 68:5) దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు హానిచేస్తే వారి మొఱ తాను తప్పక వింటానని యెహోవా ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: ‘నా కోపాగ్ని రవులుకొంటుంది.’ (నిర్గమకాండము 22:22-24) యెహోవా ప్రధాన లక్షణాల్లో కోపం ఒక లక్షణం కాకపోయినా, ప్రత్యేకించి దుర్భల స్థితిలో, నిస్సహాయ స్థితిలోవున్న వారికి ఎవరైనా బుద్ధిపూర్వకంగా అన్యాయం చేస్తుంటే ఆయనలో నీతియుక్తమైన కోపాగ్ని రవులుకొంటుంది.—కీర్తన 103:6.
15, 16.యెహోవా నిష్పక్షపాతానికి ఏది నిజంగా గమనార్హమైన రుజువైవుంది?
15 తాను ‘నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడననీ, లంచము పుచ్చుకొననివాడననీ’ కూడా యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 10:17) అధికారం లేదా పలుకుబడిగల చాలామంది మానవుల్లా యెహోవా వస్తుసంపదలను లేదా పైరూపాన్నిబట్టి ప్రభావితుడు కాడు. ఆయనలో వివక్ష లేదా ఆశ్రిత పక్షపాతం ఏ మాత్రం లేవు. యెహోవా నిష్పక్షపాత వైఖరికి నిజంగా గమనార్హమైనదైన ఈ రుజువును పరిశీలించండి. నిత్యజీవ నిరీక్షణతో తన సత్యారాధకులయ్యే అవకాశం ఎంపిక చేయబడిన ఏ కొందరికో పరిమితం చేయబడలేదు. బదులుగా, “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) వారి సామాజిక స్థితి, శరీరఛాయ, లేదా వారు నివసించే దేశమేదైనా ప్రజలందరికీ ఈ అద్భుత ఉత్తరాపేక్ష అందుబాటులో ఉంది. అది సర్వశ్రేష్ఠమైన నిజమైన న్యాయం కాదా?
16 యెహోవా పరిపూర్ణ న్యాయానికి సంబంధించి మన పరిశీలనకు, గౌరవానికి అర్హమైన మరో అంశం కూడా ఉంది. అదే తన నీతియుక్తమైన కట్టడలను ఉల్లంఘించిన వారితో ఆయన వ్యవహరించే విధానం.
శిక్షకు మినహాయింపులేదు
17.ఈ లోకంలోని అన్యాయాలు యెహోవా న్యాయాన్ని ఎందుకు ఏ విధంగానూ అడ్డగించలేవో వివరించండి.
17 ‘యెహోవా అనీతిని క్షమించడు కాబట్టి నేటి లోకంలో సర్వసాధారణమైన అన్యాయానికి అవినీతికరమైన పనులకు కారణమేమిటని మనం చెప్పవచ్చు?’ అని కొందరు ఆలోచిస్తుండవచ్చు. అలాంటి అన్యాయాలు యెహోవా న్యాయాన్ని ఏ విధంగానూ అడ్డగించవు. ఈ దుష్టలోకంలోని అనేక అన్యాయాలు ఆదాము నుండి మానవులందరికీ వారసత్వంగా లభించిన పాపం ఫలితంగానే జరుగుతున్నాయి. అపరిపూర్ణ మానవులు తమ సొంత పాపపు మార్గాలనెంచుకున్న లోకంలో అన్యాయాలు కోకొల్లలుగా జరుగుతాయి, అయితే అవి ఎంతోకాలం కొనసాగవు.—ద్వితీయోపదేశకాండము 32:5.
18, 19.యెహోవా తన నీతియుక్త నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించేవారిని ఎల్లకాలం సహించడని ఏది చూపిస్తోంది?
18 నిష్కపటంగా తనవద్దకు వచ్చేవారిపట్ల యెహోవా గొప్ప కనికరం చూపిస్తాడు, అయితే అంతమాత్రాన తన పరిశుద్ధ నామంపై నింద తీసుకొచ్చే పరిస్థితిని ఆయన ఎల్లకాలం సహించడు. (కీర్తన 74:10, 22, 23) న్యాయవంతుడైన దేవుడు వెక్కిరించబడడు; ఉద్దేశపూర్వకంగా పాపములు చేసే వారిపైకి వారి చర్యల మూలంగా వచ్చే ప్రతికూల తీర్పునుండి ఆయన వారిని కాపాడడు. యెహోవా ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు.’ (నిర్గమకాండము 34:6, 7) ఈ మాటలకు తగిన విధంగానే, యెహోవా కొన్ని సందర్భాల్లో, తన నీతియుక్త నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే వారిని దండించడం అవసరమని భావించాడు.
19 ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలనే తీసుకోండి. వాగ్దాన దేశంలో స్థిరపడ్డ తర్వాత కూడా, ఇశ్రాయేలీయులు పదేపదే అవిశ్వాస్యతలో పడిపోయారు. వారి అవినీతి క్రియలు యెహోవాను ‘దుఃఖపెట్టినా’ ఆయన తక్షణమే వారిని ఎడబాయలేదు. (కీర్తన 78:38-41) బదులుగా, తమ విధానాలు మార్చుకునేందుకు వారికి కనికరంతో ఆయన అవకాశాలిచ్చాడు. ఆయన వారినిలా అర్థించాడు: “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు?” (యెహెజ్కేలు 33:11) జీవాన్ని అమూల్యంగా దృష్టిస్తూ, ఇశ్రాయేలీయులను వారి చెడు మార్గాలనుండి మళ్ళించడానికి యెహోవా పదేపదే వారివద్దకు తన ప్రవక్తలను పంపాడు. కానీ కఠిన హృదయులైన ఆ ప్రజలు వినడానికీ, పశ్చాత్తాపం చెందడానికీ పూర్తిగా నిరాకరించారు. చివరకు, తన పరిశుద్ధ నామము నిమిత్తం, అది ప్రాతినిధ్యం వహించే దానంతటి నిమిత్తం యెహోవా వారిని వారి శత్రువులకు అప్పగించాడు.—నెహెమ్యా 9:26-30.
20.(ఎ)ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహారాలు ఆయన గురించి మనకేమి బోధిస్తాయి? (బి) యెహోవా న్యాయానికి సింహం ఎందుకు సరైన చిహ్నం?
20 ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహారాలు, ఆయన గురించి మనకు ఎంతో బోధిస్తాయి. సర్వం చూడగల ఆయన కన్నులు అవినీతిని గమనిస్తాయనీ, అలా ఆయన గమనించినది ఆయనపై ప్రభావం చూపుతుందనీ మనం తెలుసుకుంటాం. (సామెతలు 15:3) కనికరం చూపడానికి ఆధారముంటే ఆయన కనికరం చూపడానికే ప్రయత్నిస్తాడని తెలుసుకోవడం కూడా ఓదార్పునిస్తుంది. దానికితోడు, ఆయన ఎన్నడూ తొందరపాటుగా న్యాయం చేయడనీ మనం తెలుసుకుంటాం. యెహోవా సహనం, దీర్ఘశాంతం చూపుతున్న కారణంగా చాలామంది ఆయన దుష్టులకు ఎప్పటికీ తీర్పుతీర్చడని తప్పుగా అనుకుంటున్నారు. అయితే, అది సత్యదూరం, ఎందుకంటే ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారాలు దేవుని సహనానికి హద్దులున్నాయని కూడా మనకు బోధిస్తోంది. నీతి విషయంలో యెహోవా స్థిరంగా ఉంటాడు. న్యాయం చేయడానికి తరచూ వెనుదీసే మానవుల్లా ఆయన న్యాయం పక్షాన నిలబడడానికి ఎన్నటికీ వెరువడు. తగినట్లుగానే, సాహసవంతమైన న్యాయానికి చిహ్నమైన సింహం దేవుని సన్నిధికి, సింహాసనానికి ముడిపెట్టబడింది. b (యెహెజ్కేలు 1:10; ప్రకటన 4:7) అందువల్ల ఈ భూమిపై అన్యాయం లేకుండా తొలగిస్తానని తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని మనం నమ్మవచ్చు. అవును, ఆయన తీర్పు తీర్చే విధానాన్ని క్లుప్తంగా ఈ క్రింది విధంగా చెప్పవచ్చు: అవసరమైనచోట స్థిరత్వం, సాధ్యమైనచోట కనికరం.—2 పేతురు 3:9.
న్యాయవంతుడైన దేవునికి సన్నిహితం కావడం
21.యెహోవా న్యాయం జరిగించే విధానం గురించి మనం ధ్యానించేటప్పుడు, ఆయన గురించి మనమే విధంగా ఆలోచించాలి, ఎందుకు?
21 యెహోవా ఎలా న్యాయం జరిగిస్తాడనే దాని గురించి మనం ధ్యానించేటప్పుడు, కేవలం దోషులపై తీర్పులు ప్రకటించడం మీదే శ్రద్ధగల నిర్దాక్షిణ్యమైన, కఠినమైన న్యాయాధిపతిగా మనమాయన గురించి తలంచకూడదు. బదులుగా, అన్ని సందర్భాల్లో తన పిల్లలతో సాధ్యమైనంత శ్రేష్ఠంగా అయితే స్థిరంగా వ్యవహరించే తండ్రిగా ఆయన గురించి ఆలోచించాలి. న్యాయం లేదా నీతి గల తండ్రిగా యెహోవా సరైనదాని కొరకైన తన స్థిరత్వాన్ని తన సహాయం, క్షమాపణ అవసరమైన తన భూసంబంధ పిల్లలపట్ల తనకున్న వాత్సల్యపూరిత కనికరంతో సమతుల్యం చేస్తాడు.—కీర్తన 103:10, 13.
22.తన న్యాయంచేత నిర్దేశించబడి, యెహోవా మనం ఏ ఉత్తరాపేక్షతో ఉండడాన్ని సాధ్యం చేశాడు, ఆయన మనతో ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు?
22 దేవుని న్యాయంలో దోషులపై కేవలం శిక్ష విధించడంకంటే ఇంకా ఎక్కువే ఇమిడివున్నందుకు మనమెంత కృతజ్ఞత కలిగివుండవచ్చో గదా! యెహోవా తన న్యాయంతో నిర్దేశించబడి, “నీతి నివసించు” లోకంలో మనం పరిపూర్ణ నిత్యజీవమనే ఉత్కంఠభరితమైన ఉత్తరాపేక్షతో ఉండడాన్ని సాధ్యం చేశాడు. (2 పేతురు 3:13) మన దేవుని న్యాయం ఖండించడానికి బదులు రక్షించడానికే ప్రయత్నిస్తుంది కాబట్టే ఆయన మనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. అవును, యెహోవా న్యాయ పరిధిని ఎక్కువగా అర్థంచేసుకోవడం మనల్ని ఆయనకు సన్నిహితం చేస్తుంది!. తర్వాతి అధ్యాయాల్లో, ఈ ప్రశస్త లక్షణాన్ని యెహోవా ఎలా వ్యక్తంచేస్తాడో మనం మరింత సునిశితంగా చూస్తాం.
a ‘తలిదండ్రులు లేనివాడు’ అని అనువదించబడిన హీబ్రూ పదం మగపిల్లవాడిని ఉద్దేశించి చెప్పబడుతున్నప్పటికీ అది ఆడపిల్లలపట్ల నిర్లక్ష్య భావాన్ని ఎంతమాత్రమూ సూచించడంలేదు. తండ్రిలేని సెలోపెహాదు కుమార్తెలకు స్వాస్థ్యాన్ని హామీ ఇచ్చే న్యాయతీర్పుకు సంబంధించిన ఒక వృత్తాంతం తన ధర్మశాస్త్రంలో వ్రాయబడేలా యెహోవా చూశాడు. ఆ నిర్ణయం ఒక ప్రమాణాన్ని స్థాపించి, తద్వారా తండ్రిలేని ఆడపిల్లల హక్కులను సమర్థించింది.—సంఖ్యాకాండము 27:1-8.
b ఆసక్తికరంగా, యెహోవా అవిశ్వాస ఇశ్రాయేలుపై తీర్పుతీర్చినప్పుడు తనను సింహంతో పోల్చుకున్నాడు.—యిర్మీయా 25:38; హోషేయ 5:14.