కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 15

యేసు ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు’

యేసు ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు’

1, 2.యేసు ఏ సందర్భంలో కోపం తెచ్చుకున్నాడు, ఎందుకు?

 యేసు సరైన కారణంతోనే చాలా కోపంగా ఉన్నాడు. ఆయన ఎంతో సాత్వికుడు కాబట్టి, ఆయనలా ఉంటాడని ఊహించుకోవడం మీకు కష్టంగా ఉండవచ్చు. (మత్తయి 21:5) అయితే ఆయన సంపూర్ణ నిగ్రహంతో ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఆగ్రహం నీతియుక్తమైనది. a ఇంతకూ ఈ శాంతి ప్రియుణ్ణి అంతగా రెచ్చగొట్టినదేమిటి? జరుగుతున్న ఘోర అన్యాయమే.

2 యెరూషలేములోని దేవాలయమంటే యేసుకు ఎంతో ఇష్టం. ప్రపంచమంతటిలో తన పరలోకపు తండ్రి ఆరాధనకు ప్రతిష్ఠించబడిన పవిత్ర స్థలం ఇదొక్కటే. అనేక సుదూర దేశాలనుండి యూదులు ఆరాధించడానికి అక్కడికి వచ్చేవారు. దైవభక్తిగల అన్యజనులు సైతం వచ్చి, తమ కోసం ప్రత్యేకించబడిన ఆవరణలో ప్రవేశించేవారు. అయితే యేసు తన పరిచర్య ఆరంభంలో ఆ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆయన అక్కడ దిగ్భ్రాంతికరమైన దృశ్యాన్ని చూశాడు. ఆ ప్రదేశమంతా ఆరాధనా మందిరంలా కాకుండా ఒక సంతలా ఉంది. వ్యాపారులతో, రూకలు మార్చేవారితో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. అయితే అసలు అన్యాయం ఎక్కడ జరుగుతోంది? వీళ్లకు దేవుని ఆలయం కేవలం ప్రజలను మోసగించే ప్రదేశంగా, వారిని దోచుకునే స్థలముగా మాత్రమే ఉంది. అదెలా?—యోహాను 2:14.

3, 4.యెహోవా మందిరంలో ఎలాంటి దురాశాపూరిత మోసం జరుగుతోంది, పరిస్థితి చక్కదిద్దడానికి యేసు ఏ చర్య తీసుకున్నాడు?

3 దేవాలయపు పన్ను కట్టడానికి ఒక ప్రత్యేక తరహా నాణెం మాత్రమే చెల్లుబాటు కాగలదని మతనాయకులు నియమం పెట్టారు. అలాంటి నాణాలు పొందడానికి సందర్శకులు తమ రూకలు మార్చాల్సివచ్చేది. అందువల్ల రూకలు మార్చేవారు నేరుగా ఆలయంలోనే తమ బల్లలు పెట్టుకొని, రూకలు మార్చిన ప్రతీసారీ కొంత రుసుము వసూలు చేసేవారు. జంతువులు అమ్మే వ్యాపారం కూడా చాలా లాభసాటిగా ఉండేది. బలి అర్పించాలనుకునే సందర్శకులు పట్టణపు ఏ వ్యాపారి దగ్గరైనా వాటిని కొనుక్కోవచ్చు, కానీ అలాంటి అర్పణలు పనికిరావని ఆలయ అధికారులు సులభంగా తిరస్కరించే అవకాశముంది. అయితే ఆలయ ప్రాంగణంలోనే కొని తెచ్చిన అర్పణలు ఖచ్చితంగా అంగీకరించబడతాయి. ఆ విధంగా ప్రజల గత్యంతరంలేని పరిస్థితిని ఆసరా చేసుకొని వ్యాపారులు వారినుండి అత్యధిక సొమ్ము వసూలు చేసేవారు. b ఇది నీతిమాలిన వాణిజ్యం కంటే కూడా మరింత నీచమైనది. అది దోచుకోవడం కిందే లెక్క!

“వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి!”

4 అలాంటి అన్యాయాన్ని యేసు సహించలేకపోయాడు. అది స్వయాన ఆయన తండ్రి మందిరం. ఆయన త్రాళ్లతో కొరడాలు చేసి పశువుల, గొర్రెల మందలను ఆలయం నుండి బయటకు తోలివేశాడు. ఆ తర్వాత ఆయన గబగబా రూకలు మార్చేవారి దగ్గరకెళ్లి వారి బల్లలు పడద్రోశాడు. ఆ నాణాలన్నీ చలవరాతి నేలమీద చెల్లాచెదురుగా పడడాన్ని ఊహించండి! పావురాలు అమ్మేవారిని ఆయన తీవ్రస్వరంతో, “వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి” అని ఆదేశించాడు. (యోహాను 2:15, 16) ఈ ధైర్యశాలిని ఎదిరించడానికి ఎవరూ సాహసించినట్టు కనిపించడం లేదు.

కుమారుడు తండ్రినే అనుకరిస్తాడు

5-7.(ఎ)న్యాయం గురించి యేసుకున్న భావనను ఆయన మానవపూర్వ ఉనికి ఎలా ప్రభావితం చేసింది, ఆయన మాదిరిని అధ్యయనం చేయడం ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు? (బి) యెహోవా సర్వాధిపత్యం, నామం ఇమిడివున్న అన్యాయాలకు విరుద్ధంగా క్రీస్తు ఎలా పోరాడాడు?

5 కానీ ఆ తర్వాత వ్యాపారులు మళ్లీ వచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, యేసు అదే అన్యాయాన్ని నిరసిస్తూ, తన మందిరాన్ని “దొంగల గుహగా” మార్చారని ఖండిస్తూ యెహోవా స్వయంగా పలికిన ఆ మాటలనే ఎత్తి చెప్పాడు. (మత్తయి 21:13; యిర్మీయా 7:11) అవును, దురాశతో ప్రజలను మోసగిస్తూ దేవుని ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని యేసు చూసినప్పుడు ఆయన తన తండ్రివలెనే భావించాడు. దానికి ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు! ఎందుకంటే అసంఖ్యాక కోట్ల సంవత్సరాలు యేసు తన పరలోకపు తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. దాని ఫలితంగా, ఆయనలో న్యాయం గురించి యెహోవాకున్న భావనే పాతుకుపోయింది. కాబట్టి యెహోవా న్యాయ లక్షణపు స్పష్టమైన చిత్రం మనకు లభించాలని మనం కోరుకుంటే, యేసుక్రీస్తు మాదిరిని ధ్యానించడమే శ్రేష్ఠమైన మార్గం.—యోహాను 14:9, 10.

6 సాతాను యెహోవా దేవుణ్ణి అబద్ధికుడని అన్యాయంగా అంటూ ఆయన పరిపాలనా నీతిని ప్రశ్నించినప్పుడు ఆయన అద్వితీయకుమారుడు అక్కడే ఉన్నాడు. అదెంత ఘోరమైన అబద్ధమో కదా! ఎవ్వరూ నిస్వార్థంగా, ప్రేమతో యెహోవాను సేవించరని ఆ తర్వాత సాతాను విసిరిన సవాలుకూడా ఆ కుమారుడు విన్నాడు. ఈ అబద్ధ ఆరోపణలు నిశ్చయంగా కుమారుని నీతియుక్త హృదయాన్ని బాధపెట్టాయి. వాటన్నింటిని త్రిప్పికొట్టడంలో తాను కీలకపాత్ర పోషిస్తానని తెలుసుకొని ఆయనెంత పులకించి ఉంటాడో కదా! (2 కొరింథీయులు 1:20) ఆయన ఆ పాత్రను ఎలా పోషిస్తాడు?

7 మనం 14వ అధ్యాయంలో నేర్చుకున్నట్లుగా, యెహోవా సృష్టిప్రాణుల యథార్థతపై దాడిచేసిన సాతాను ఆరోపణకు యేసుక్రీస్తు తిరుగులేని నిర్ణయాత్మక జవాబిచ్చాడు. ఆ విధంగా యేసు యెహోవా సర్వాధిపత్య అంతిమ సత్యనిరూపణకు, ఆయన నామ పరిశుద్ధతకు పునాదివేశాడు. యెహోవా అధిపతిగా యేసు విశ్వమంతటా దేవుని న్యాయాన్ని స్థిరపరుస్తాడు. (అపొస్తలుల కార్యములు 5:31) భూమిపై ఆయన గడిపిన జీవితం కూడా అదే మాదిరిగా దేవుని న్యాయాన్ని ప్రతిబింబించింది. యెహోవా ఆయన గురించి ఇలా చెప్పాడు: “ఈయనమీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.” (మత్తయి 12:18) యేసు ఈ మాటలను ఎలా నెరవేర్చాడు?

యేసు “న్యాయవిధిని” స్పష్టపరచడం

8-10.(ఎ)యూదా మతనాయకుల మౌఖిక సంప్రదాయాలు యూదేతరులపట్ల, స్త్రీలపట్ల తిరస్కారాన్ని ఎలా ప్రోత్సహించాయి? (బి) మౌఖిక నియమాలు యెహోవా విశ్రాంతిదినపు నియమాన్ని ఎలా ఒక భారంగా తయారు చేశాయి?

8 యేసు యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించాడు. కానీ ఆయన కాలంనాటి మతనాయకులు ఆ ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి, తప్పుగా అన్వయించారు. యేసు వారితో ఇలా అన్నాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, . . . ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి.” (మత్తయి 23:23) ఖచ్చితంగా, ఆ ధర్మశాస్త్రోపదేశకులు దేవుని “న్యాయవిధిని” స్పష్టం చేయడంలేదు. బదులుగా, వారు దేవుని న్యాయాన్ని మరుగుచేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

9 తమచుట్టూవున్న అన్యజనాంగాలకు దూరంగా ఉండమని యెహోవా తన ప్రజలకు నిర్దేశించాడు. (1 రాజులు 11:1, 2) అయితే, మత ఛాందసులైన కొంతమంది మతనాయకులు యూదులు కాని వారందరినీ తిరస్కరించమని ప్రజలను ప్రోత్సహించారు. మిష్నాలో ఈ నియమం కూడా చేర్చబడింది: “అన్యులు పశుసంయోగం చేస్తారనే అనుమానం ఉంది కాబట్టి వారి ఇళ్లలో పశువులను విడిచిపెట్టకూడదు.” యూదులు కాని ప్రజలందరిపట్ల అలాంటి మూకుమ్మడి వివక్ష చూపడం అన్యాయం మరియు అది ధర్మశాస్త్ర స్ఫూర్తికే బద్ధవిరుద్ధం. (లేవీయకాండము 19:34) మానవ కల్పిత ఇతర నియమాలు స్త్రీలను కించపరిచాయి. భార్య భర్త ప్రక్కనకాదు వెనక నడవాలి అని మౌఖిక నియమం చెప్పింది. పురుషుడు బహిరంగంగా ఒక స్త్రీతో, చివరకు తన భార్యతోకూడా మాట్లాడకూడదని హెచ్చరించబడ్డాడు. బానిసలకు లేనట్లే, స్త్రీలకు కూడా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడానికి అనుమతిలేదు. పురుషులు తాము స్త్రీలు కానందుకు దేవునికి కృతజ్ఞత తెలిపే ఒక లాంఛనప్రాయమైన ప్రార్థన కూడా ఉంది.

10 మతనాయకులు దేవుని ధర్మశాస్త్రాన్ని విస్తారమైన మానవ కల్పిత నియమాల, విధుల క్రింద సమాధి చేశారు. ఉదాహరణకు, విశ్రాంతిదినపు నియమం విశ్రాంతి దినాన్ని ఆరాధనకు, ఆధ్యాత్మిక సేదదీర్పుకు, విశ్రాంతికి కేటాయిస్తూ ఆ దినాన పనిచేయడాన్ని నిషేధించింది. కానీ, పరిసయ్యులు ఆ నియమాన్ని ఒక భారంగా తయారు చేశారు. ఏది “పని” అనేది నిర్ణయించే బాధ్యతను వారు తమపై వేసుకున్నారు. పంట నూర్చడం లేదా వేటాడడం వంటి 39 కార్యకలాపాలకు వారు పని అని ముద్రవేశారు. ఈ వర్గీకరణలు అంతులేని ప్రశ్నలు తలెత్తడానికి కారణమయ్యాయి. విశ్రాంతి దినాన ఎవరైనా ఈగను చంపితే అతడు వేటాడుతున్నట్లా? నడిచివెళ్తూ వెళ్తూ నోట్లోవేసుకోవడానికి గుప్పెడు ధాన్యం కోస్తే అతడు పంట నూర్చినట్లేనా? రోగిని బాగుచేస్తే, అతను పనిచేసినట్లేనా? అలాంటి ప్రశ్నలకు కఠినమైన వివరణాత్మక నియమాలతో జవాబులు ఇచ్చేవారు.

11, 12.పరిసయ్యుల లేఖనరహిత ఆచారాలపట్ల యేసు తన విరుద్ధతను ఎలా వ్యక్తపరిచాడు?

11 అలాంటి వాతావరణంలో, న్యాయమంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి యేసు ప్రజలకెలా సహాయం చేశాడు? తన బోధల్లో, తన జీవన విధానంలో ఆయన ధైర్యంగా ఆ మతనాయకులకు విరుద్ధంగా నిలబడ్డాడు. మొదట ఆయన బోధల్లో కొన్నింటిని పరిశీలించండి. ఆయనిలా అంటూ వారి అసంఖ్యాక మానవ కల్పిత నియమాలను సూటిగా ఖండించాడు: “మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు.”—మార్కు 7:13.

12 పరిసయ్యులు విశ్రాంతిదినపు నియమాన్ని, నిజానికి ధర్మశాస్త్రపు మొత్తం సంకల్పాన్నే తప్పుగా అర్థంచేసుకున్నారని యేసు శక్తిమంతంగా బోధించాడు. మెస్సీయ “విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు” కాబట్టి విశ్రాంతి దినాన ప్రజలను బాగుచేసే హక్కు ఆయనకుందని వివరించాడు. (మత్తయి 12:8) ఆ విషయాన్ని నొక్కిచెప్పడానికి, ఆయన విశ్రాంతి దినాన బాహాటంగా అద్భుతరీతిలో స్వస్థతలు చేకూర్చాడు. (లూకా 6:7-10) ఆయన తన వెయ్యేండ్ల పాలనా కాలంలో భూవ్యాప్తంగా చేకూర్చే స్వస్థతకు ఆ స్వస్థతా కార్యాలు పూర్వఛాయగా ఉన్నాయి. ఆ వెయ్యేండ్ల కాలమే ఒక మహాగొప్ప విశ్రాంతి దినం, ఆ కాలంలో నమ్మకమైన యావత్‌ మానవాళి శతాబ్దాలుగా పాపమరణాల భారంతో పడుతున్న ప్రయాస నుండి విశ్రాంతి పొందుతుంది.

13.యేసు భూపరిచర్య ఫలితంగా ఏ నియమం వాడుకలోకి వచ్చింది, దానికిముందున్న నియమం నుండి ఇదెలా భిన్నంగా ఉంది?

13 యేసు న్యాయమంటే ఏమిటో కూడా స్పష్టం చేశాడు, ఎందుకంటే ఆయన తన భూపరిచర్య ముగించిన తర్వాత ఒక కొత్త నియమం వాడుకలోకి వచ్చింది అదే “క్రీస్తు నియమము.” (గలతీయులు 6:2) దానికి ముందున్న మోషే ధర్మశాస్త్రంలా ఈ కొత్త నియమం ఎక్కువగా వ్రాతపూర్వక ఆజ్ఞలపై కాదుగానీ సూత్రాలపైనే ఆధారపడింది. అయితే దానిలో సూటిగా తెలిపే ఆజ్ఞలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకదానిని యేసు “క్రొత్త ఆజ్ఞ” అని పిలిచాడు. తానెలా వారిని ప్రేమించాడో అలాగే వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు తన అనుచరులకు బోధించాడు. (యోహాను 13:34, 35) అవును, “క్రీస్తు నియమము” ప్రకారం జీవించేవారందరిలో స్వయంత్యాగ ప్రేమ ప్రమాణ చిహ్నంగా ఉండాలి.

న్యాయానికి ఒక సజీవ మాదిరి

14, 15.యేసు తనకున్న అధికార పరిధి హద్దుల్ని తాను గుర్తించానని ఎలా చూపించాడు, ఇదెందుకు ఓదార్పుకరమైనది?

14 ప్రేమను బోధించడం కంటే యేసు ఇంకా ఎక్కువే చేశాడు. ఆయన “క్రీస్తు నియమము” ప్రకారం జీవించాడు. అది ఆయన జీవన విధానంలో బలంగా నాటుకుపోయింది. యేసు, న్యాయమంటే ఏమిటో స్పష్టం చేసిన మూడు విధానాలను పరిశీలించండి.

15 మొదటిది, యేసు ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్తపడ్డాడు. అపరిపూర్ణ మానవులు అహంకారులై వారి అధికార సంబంధిత పరిధుల హద్దు మీరినప్పుడే అనేక అన్యాయాలు జరుగుతాయని బహుశా మీరు గమనించే ఉంటారు. యేసు అలా పరిధులను దాటలేదు. ఒక సందర్భంలో ఒకతను యేసు దగ్గరకొచ్చి, “బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని” అడిగాడు. యేసు ఎలా ప్రతిస్పందించాడు? ‘ఓయీ, మీమీద తీర్పరినిగానైనా పంచిపెట్టేవానిగానైనా నన్నెవడు నియమించాడు?’ (లూకా 12:13, 14) అది గమనార్హమైన విషయం కాదా? యేసుకు, భూమ్మీద మరెవరికీ లేనంత తెలివి, వివేచన, దేవుడిచ్చిన అధికారం ఉన్నాయి, అయినా ఈ విషయంలో కలుగజేసుకునే ప్రత్యేక అధికారం ఆయనకు ఇవ్వబడలేదు కాబట్టి ఆయన అలా కలుగజేసుకోవడానికి నిరాకరించాడు. ఈ విధంగా యేసు అన్ని సందర్భాల్లో, తన మానవపూర్వ ఉనికిలో వేవేల సంవత్సరాల కాలంలో సైతం నమ్రతతో ఉన్నాడు. (యూదా 9) ఏది న్యాయమనేది యెహోవా నిర్ణయించాలని యేసు వినయ స్వభావంతో నమ్మడం, ఆయన గురించి ఎంతో చెబుతుంది.

16, 17.(ఎ)దేవుని రాజ్య సువార్త ప్రకటించడంలో యేసు న్యాయాన్ని ఎలా ప్రదర్శించాడు? (బి) న్యాయం గురించి తనకున్న భావన కనికరంతో కూడుకొన్నదని యేసు ఎలా చూపించాడు?

16 రెండవది, దేవుని రాజ్య సువార్త ప్రకటించిన విధానంలో యేసు న్యాయాన్ని ప్రదర్శించాడు. ఆయన పక్షపాతం చూపలేదు. బదులుగా, ఆయన ధనికులు, పేదవారు అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలిసేందుకు మనఃపూర్వకంగా కృషిచేశాడు. దానికి భిన్నంగా, పరిసయ్యులు ఆమ్‌-హా-రెట్స్‌, లేదా “మట్టి మనుష్యులు” అనే తిరస్కారపూరిత పదాన్ని ఉపయోగిస్తూ బీదలను, సామాన్య ప్రజలను కొట్టిపారేశారు. ఆ అన్యాయానికి యేసు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాడు. ఆయన ప్రజలకు సువార్త బోధించినప్పుడు, లేదా ఆ విషయానికొస్తే, ఆయన వారితో భోజనం చేసినప్పుడు, వారికి ఆహారం పెట్టినప్పుడు, వారిని స్వస్థపరచినప్పుడు లేదా చివరికి వారిని పునరుత్థానం చేసినప్పుడు ‘మనుష్యులందరినీ’ చేరుకోవాలని ఇష్టపడే దేవుని న్యాయాన్ని ఆయన సమర్థించాడు. c1 తిమోతి 2:4.

17 మూడవది, న్యాయం గురించి యేసుకున్న భావనలో కనికరం అపారమైనది. ఆయన పాపులకు సహాయం చేయడానికి తీవ్రంగా కృషిచేశాడు. (మత్తయి 9:11-13) తమను తాము కాపాడుకోలేని దుర్బలులకు ఆయన వెంటనే సహాయం చేశాడు. ఉదాహరణకు, అన్యజనులందరినీ నమ్మకూడదనే విషయాన్ని ప్రచారం చేయడంలో ఆయన మతనాయకులతో చేతులు కలపలేదు. ప్రాథమికంగా తను యూదా ప్రజలకోసమే వచ్చినా, కనికరంతో ఆయన వీరిలో కొందరికి సహాయంచేసి వారికీ బోధించాడు. “ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని” చెబుతూ రోమా సైనికాధికారి కొరకు ఒక అద్భుతమైన స్వస్థత చేసేందుకు ఆయన అంగీకరించాడు.—మత్తయి 8:5-13.

18, 19.(ఎ)యేసు స్త్రీల గౌరవాన్ని ఏయే విధాలుగా పెంపొందింపజేశాడు? (బి) న్యాయానికీ, ధైర్యానికీగల సంబంధాన్ని చూసేందుకు యేసు మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?

18 అదే ప్రకారం, స్త్రీలపట్ల అప్పుడున్న దృక్కోణాలకు యేసు మద్దతివ్వలేదు. బదులుగా, ఆయన ధైర్యంగా న్యాయమైనదే చేశాడు. సమరయ స్త్రీలు అన్యులంత అపవిత్రమైనవారిగా పరిగణించబడేవారు. అయినప్పటికీ, సుఖారు అనే బావిదగ్గర సమరయ స్త్రీకి ప్రకటించడానికి యేసు వెనుకాడలేదు. నిజానికి, యేసు ఈ స్త్రీకే మొదటిసారిగా తానే వాగ్దత్త మెస్సీయనని స్పష్టంగా సూటిగా చెప్పాడు. (యోహాను 4:6, 25, 26) స్త్రీలకు ధర్మశాస్త్రం బోధించకూడదని పరిసయ్యులు చెప్పారు, అయితే స్త్రీలకు బోధించడానికి యేసు ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చించాడు. (లూకా 10:38-42) ఆధారపడదగిన సాక్ష్యంకోసం స్త్రీలను నమ్మడానికి వీల్లేదని సాంప్రదాయం చెబుతుంటే, యేసు తన పునరుత్థానం తర్వాత తనను చూసే ఆధిక్యతను స్త్రీలకే మొదట ఇచ్చి వారిని గౌరవించాడు. ఈ అతి ప్రాముఖ్యమైన సంఘటన గురించి తన పురుష శిష్యులకు తెలుపమని కూడా ఆయన వారికిచెప్పాడు.—మత్తయి 28:1-10.

19 అవును, న్యాయమంటే ఏమిటో యేసు జనాంగాలకు స్పష్టం చేశాడు. అనేక సందర్భాల్లో, తనకు వ్యక్తిగతంగా తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశమున్న పరిస్థితుల్లోనూ ఆయనలా చేశాడు. నిజమైన న్యాయాన్ని సమర్థించడానికి ధైర్యం కావాలని గ్రహించేందుకు యేసు మాదిరి మనకు సహాయం చేస్తుంది. యుక్తంగానే ఆయన “యూదాగోత్రపు సింహము” అని పిలువబడ్డాడు. (ప్రకటన 5:5) సింహం ధైర్యవంతమైన న్యాయానికి చిహ్నమని గుర్తుతెచ్చుకోండి. అయితే సమీప భవిష్యత్తులో యేసు మరింత గొప్ప న్యాయం జరిగిస్తాడు. సంపూర్ణ భావంలో ఆయన ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు.’—యెషయా 42:4.

మెస్సీయ రాజు ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు’

20, 21.మనకాలంలో మెస్సీయ రాజు భూమి అంతటా, క్రైస్తవ సంఘంలో న్యాయం జరగడానికి ఎలా తోడ్పడ్డాడు?

20 యేసు 1914లో మెస్సీయ రాజైనప్పటి నుండి, ఆయన భూమ్మీద న్యాయం జరగడానికి తోడ్పడ్డాడు. ఏవిధంగా తోడ్పడ్డాడు? ఆయన మత్తయి 24:14​లో కనబడే తన ప్రవచన నెరవేర్పు బాధ్యతను తనపై వేసుకున్నాడు. భూమ్మీదున్న యేసు అనుచరులు యెహోవా రాజ్య సత్యాన్ని అన్నిదేశాల ప్రజలకు బోధించారు. యేసు మాదిరిగానే వారు నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రతి ఒక్కరికీ అంటే యౌవనులకు, వృద్ధులకు, ధనికులకు, బీదలకు, స్త్రీలకు, పురుషులకు న్యాయానికి దేవుడైన యెహోవాను తెలుసుకునే అవకాశమివ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

21 యేసు తనే శిరస్సుగా ఉన్న క్రైస్తవ సంఘంలో కూడా న్యాయం జరగడానికి తోడ్పడుతున్నాడు. ప్రవచించబడినట్లుగానే, ఆయన సంఘంలో నాయకత్వం వహించే నమ్మకమైన క్రైస్తవ పెద్దలను ‘మనుష్యులలో ఈవులుగా’ అనుగ్రహిస్తున్నాడు. (ఎఫెసీయులు 4:8-12) దేవుని ప్రశస్తమైన మందను కాయడంలో అలాంటి పురుషులు, న్యాయం జరగడానికి తోడ్పడుతూ యేసుక్రీస్తు మాదిరిని అనుకరిస్తారు. తన గొర్రెల స్థానం, హోదా లేదా వస్తుసంపదలు ఎలాగున్నా వారితో న్యాయంగా వ్యవహరించాలని యేసు కోరుతున్నాడని వారెప్పుడూ మనసులో ఉంచుకుంటారు.

22.నేటి లోకపు విపరీతమైన అన్యాయాల గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు, దాని గురించి ఏమి చేయడానికి ఆయన తన కుమారుణ్ణి నియమించాడు?

22 అయితే సమీప భవిష్యత్తులో యేసు అసాధారణ రీతిలో భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు. ఈ భ్రష్ట లోకంలో అన్యాయం విపరీతంగా ఉంది. ప్రత్యేకంగా యుద్ధాయుధాల ఉత్పత్తికి, సుఖభోగాసక్తిపరుల స్వార్థ మోజులకు విచ్చలవిడిగా డబ్బు, సమయం ఖర్చుచేయడాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆకలి బాధ మూలంగా మరణించే ప్రతీ చిన్నబిడ్డ క్షమించరాని అన్యాయానికి గురవుతున్నట్లే. ప్రతీ సంవత్సరం సంభవించే లక్షలాదిమంది అనవసర మరణాలు అనేక రకాల అన్యాయాల్లో కేవలం ఒక రకమైనవి మాత్రమే, ఇవన్నీ యెహోవాలో నీతియుక్తమైన కోపాగ్నిని రగిలిస్తున్నాయి. సమస్త అన్యాయాన్ని శాశ్వతంగా అంతం చేసేలా ఈ దుష్ట విధానమంతటిపై నీతియుక్త యుద్ధం చేయడానికి ఆయన తన కుమారుణ్ణి నియమించాడు.—ప్రకటన 16:14, 16; 19:11-15.

23.అర్మగిద్దోను తర్వాత, క్రీస్తు ఏ విధంగా యుగయుగాలన్నింటిలో న్యాయం జరగడానికి తోడ్పడతాడు?

23 కానీ, యెహోవా న్యాయం కేవలం దుష్టుల నాశనం కంటే ఇంకా ఎక్కువే కోరుతోంది. ఆయన తన కుమారుణ్ణి “సమాధానకర్తయగు అధిపతి[గా]” పరిపాలించేందుకు కూడా నియమించాడు. అర్మగిద్దోను యుద్ధం తర్వాత యేసు పరిపాలన భూమియంతటా సమాధానం తీసుకొస్తుంది, ఆయన “న్యాయమువలన” పరిపాలిస్తాడు. (యెషయా 9:6, 7) అప్పుడు, లోకంలో ఎంతో దుఃఖాన్ని, బాధను కలిగించిన అన్యాయాలన్నిటినీ తొలగించడంలో యేసు సంతోషిస్తాడు. యుగయుగాలన్నింటిలో ఆయన యెహోవా పరిపూర్ణ న్యాయాన్ని నమ్మకంగా సమర్థిస్తాడు. కాబట్టి, మనమిప్పుడే యెహోవా న్యాయాన్ని అనుకరించడానికి ప్రయత్నించడం ఆవశ్యకం. దానిని మనమెలా చేయవచ్చో చూద్దాం.

a నీతియుక్తమైన కోపాన్ని ప్రదర్శించడంలో యేసు, సమస్త దుష్టత్వం పట్ల “మహోగ్రతగల” యెహోవా మాదిరిగానే ఉన్నాడు. (నహూము 1:2) ఉదాహరణకు, తన మందిరాన్ని ‘దొంగలగుహగా’ చేశారని యెహోవా బాధ్యతారహితులైన తన ప్రజలతో చెప్పిన తర్వాత ఇలా అన్నాడు: “ఈ స్థలముమీద . . . నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను.”—యిర్మీయా 7:11, 20.

b మిష్నా ప్రకారం, కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయంలో అమ్మబడే పావురాల అత్యధిక ధరపై నిరసన పెల్లుబికింది. ఆ వెంటనే దాదాపు 99 శాతం వరకు ధర తగ్గించబడింది. ఈ లాభసాటి వ్యాపారంతో ఎక్కువ లాభపడింది ఎవరు? ఆలయంలోని దుకాణాలు ప్రధాన యాజకుడైన అన్న కుటుంబీకులకు చెందినవని, ఆ యాజక కుటుంబపు విస్తృత సంపదకు ఇవే ఎక్కువగా కారణమని కొందరు చరిత్రకారులు సూచిస్తున్నారు.—యోహాను 18:12-13.

c ధర్మశాస్త్రం తెలియని దీనులు ‘శాపగ్రస్తులని’ పరిసయ్యులు పరిగణించారు. (యోహాను 7:49) అలాంటి ప్రజలకు ఒక వ్యక్తి బోధించకూడదనీ, వారితో వ్యాపారం చేయకూడదనీ, వారితో భుజించకూడదనీ, వారికొరకు ప్రార్థించకూడదనీ వారు చెప్పారు. వారిలో ఒకనికి తమ కుమార్తెనిచ్చి పెళ్లిచేయడం ఆమెను క్రూర మృగాలకు అప్పగించడంకంటే నీచమని వారు పరిగణించారు. అలాంటి దీనులకు పునరుత్థాన నిరీక్షణే లేదని వారు తలంచారు.