కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 5

సృష్టి శక్తి—“భూమ్యాకాశములను సృజించిన యెహోవా”

సృష్టి శక్తి—“భూమ్యాకాశములను సృజించిన యెహోవా”

1, 2.యెహోవా సృష్టి శక్తిని సూర్యగ్రహమెలా ప్రదర్శిస్తోంది?

 మీరెప్పుడైనా చల్లని రాత్రిపూట చలిమంట దగ్గర నిలబడ్డారా? ఆ మంట వెచ్చదనపు ఆనందం ఆస్వాదించడానికి సరిగ్గా సరిపడేంత దూరంవరకే బహుశా మీ చేతులు చాపుతారు. మీరు మరీ దగ్గరకు జరిగితే ఆ వేడిని తట్టుకోలేరు. బాగావెనక్కి జరిగితే చల్లగాలి తగిలి మీకు చలివేస్తుంది.

యెహోవా ‘సూర్యుణ్ణి నిర్మించాడు’

2 మన శరీరానికి ప్రతీరోజు వెచ్చదనమిచ్చే “మంట” ఒకటుంది. ఆ “మంట” దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. a అంత దూరంనుండి మీకు వెచ్చదనం తగిలేటట్లు చేయాలంటే ఆ సూర్యగ్రహం ఎంత శక్తిగలదై ఉండాలో గదా! అయినప్పటికీ, ఆ భీకర అణుథార్మిక కొలిమి నుండి సరైన దూరంలోనే భూమి పరిభ్రమిస్తోంది. ఆ కక్ష్య సూర్యునికి కాస్త దగ్గరయితే భూమ్మీది నీరు ఆవిరైపోతుంది; కాస్త దూరమైతే నీరంతా ఘనీభవిస్తుంది. ఈ రెండింట్లో ఏది జరిగినా మన గ్రహం నిర్జీవం అవుతుంది. భూమ్మీది జీవానికి ఎంతో ఆవశ్యకమైన సూర్యకాంతి శుద్ధమైనది, సమర్థమైనది కూడా, ఇక అది కలిగించే ఆనందం గురించి వేరే చెప్పక్కర్లేదు.—ప్రసంగి 11:7.

3.సూర్యగ్రహం ఏ ప్రాముఖ్యమైన సత్యాన్ని రుజువు చేస్తోంది?

3 తమ జీవితాలు సూర్యునిపై ఆధారపడివున్నా, చాలామంది సూర్యుడ్ని తేలిగ్గా తీసుకుంటారు. ఆ కారణంగా వారు సూర్యుడు మనకు బోధించగల సంగతిని గ్రహించలేకపోతుంటారు. యెహోవా గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘సూర్యుణ్ణి నీవే నిర్మించితివి.’ (కీర్తన 74:16) అవును, సూర్యగ్రహం ‘ఆకాశమును భూమిని సృజించిన’ యెహోవాను మహిమపరుస్తోంది. (కీర్తన 19:1; 146:6) యెహోవాకున్న అపారమైన సృష్టి శక్తి గురించి మనకు బోధించే అసంఖ్యాక ఆకాశ గ్రహ సముదాయాల్లో అది కేవలం ఒకటి మాత్రమే. వాటిలో కొన్నింటిని మనం సునిశితంగా పరిశీలించి ఆ తర్వాత ఈ భూమ్మీదికి, దానిపై వర్ధిల్లుతున్న జీవంపైకి మన అవధానాన్ని మళ్లిద్దాం.

“మీ కన్నులు పైకెత్తి చూడుడి”

4, 5.సూర్యగ్రహం ఎంత శక్తిమంతంగా, ఎంత పెద్దగా ఉంది, అయినా ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు అదెలా ఉంది?

4 మీకు తెలిసే ఉండవచ్చు, మన సూర్యుడు ఒక నక్షత్రం. మనం రాత్రుల్లో చూసే నక్షత్రాలకంటే అది పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే వాటితో పోలిస్తే, అది మనకు చాలా దగ్గరలో ఉంది. అదెంత శక్తిమంతమైనది? సూర్యుని మధ్యభాగంలో దాదాపు 2 కోట్ల 70 లక్షల డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. మీకు సాధ్యమైతే సూర్యుని మధ్యభాగం నుండి ఆవగింజంత ముక్క తీసి భూమ్మీద పెడితే, దాని వేడికి తట్టుకొని సురక్షితంగా ఉండాలంటే మీరు కనీసం దానికి 140 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలో నిలబడాలి. ప్రతీ సెకనుకు, సూర్యుని నుండి అనేక కోట్ల పరమాణు బాంబుల విస్ఫోటనానికి సమానమైన శక్తి విడుదలవుతోంది.

5 సూర్యగ్రహం ఎంత పెద్దదంటే అందులో మన భూమివంటి గ్రహాలు 13 లక్షలకంటే ఎక్కువ పట్టగలుగుతాయి. సూర్యుడే అసాధారణమైన పెద్ద నక్షత్రమా? కాదు, ఖగోళశాస్త్రజ్ఞులు దీనిని పసుపువర్ణంలోవున్న అతిచిన్న నక్షత్రమని పిలుస్తున్నారు. “మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదముకలదు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 15:41) ఆ ప్రేరేపిత మాటలెంత సత్యమో ఆయనకు తెలియక పోవచ్చు. ఒక నక్షత్రం ఎంత పెద్దగా ఉందంటే, దానిని సూర్యుడు ఉన్నచోట పెడితే మన భూమి దాని లోపల ఉంటుంది. మరో నక్షత్రం ఇంకా ఎంత పెద్దదంటే దానిని కూడా సూర్యుడున్న చోట పెడితే దాని పరిమాణం శనిగ్రహం వరకు వ్యాపిస్తుంది. ఈ గ్రహం మన భూమికి ఎంత దూరంలో ఉందంటే, ఒక శక్తిమంతమైన తుపాకినుండి వదిలిన గుండుకంటే 40 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించిన అంతరిక్ష నౌక దానిని చేరడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.

6.మానవ దృష్టికి నక్షత్రాల సంఖ్య విస్తారమని బైబిలెలా చూపిస్తోంది?

6 నక్షత్రాల పరిమాణం కంటే మరింత గమనార్హమైనది వాటి సంఖ్య. నిజానికి, నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయని, వాటిని లెక్కించడం “సముద్రపు ఇసుకరేణువుల[ను]” లెక్కించడమంత కష్టమని బైబిలు సూచిస్తోంది. (యిర్మీయా 33:22) ఈ వాక్యభాగం, దుర్భిణి సహాయం లేకుండా మన కళ్లు చూడగల నక్షత్రాలకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయనే భావాన్నిస్తోంది. యిర్మీయా వంటి ఒక బైబిలు రచయిత రాత్రివేళ ఆకాశంవైపు చూసి కనబడే నక్షత్రాలు లెక్కించడానికి ప్రయత్నిస్తే, ఆయన కేవలం మూడువేల పైచిలుకు లెక్కించి ఉండేవాడు, ఎందుకంటే నిర్మలాకాశంలో వేరే ఏ ఉపకరణాల సహాయంలేని మానవ నేత్రం ఆ మాత్రమే కనిపెట్టగలదు. ఆ సంఖ్యను కేవలం గుప్పిట్లో పట్టుకున్న ఇసుకలోని రేణువులతో మాత్రమే పోల్చవచ్చు. కానీ వాస్తవానికి, నక్షత్రాలు సముద్రపు ఇసుకరేణువుల మాదిరిగా అధిక సంఖ్యలో ఉన్నాయి. b వాటి సంఖ్యను ఎవరు లెక్కించగలరు?

‘వీటన్నిటిని ఆయన పేరులు పెట్టి పిలుస్తున్నాడు’

7.(ఎ)మన పాలపుంత నక్షత్రవీధిలో దాదాపు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ సంఖ్య ఎంత పెద్దది? (బి) ఖగోళశాస్త్రజ్ఞులు నక్షత్రవీధుల సంఖ్య ఎంతో కనుక్కోలేకపోవడం ఎందుకు గమనార్హం, యెహోవా సృష్టి శక్తి గురించి ఇది మనకేమి బోధిస్తోంది?

7 యెషయా 40:26 దానికిలా జవాబిస్తోంది: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా.” కీర్తన 147:4 ఇలా చెబుతోంది: “నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు.” “నక్షత్రముల సంఖ్య” ఎంత? అదంత సులభమైన ప్రశ్న కాదు. మన పాలపుంత నక్షత్రవీధిలోనే నూరు శతకోట్లకు పైగా నక్షత్రాలున్నాయని ఖగోళశాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. c కానీ మన నక్షత్రవీధి అనేక నక్షత్రవీధుల్లో కేవలం ఒకటి మాత్రమే, అలాంటి అనేక నక్షత్రవీధుల్లో ఇంకా ఎక్కువ నక్షత్రాలున్నాయి. ఎన్ని నక్షత్రవీధులున్నాయి? అవి 50 శతకోట్లని కొందరు ఖగోళశాస్త్రజ్ఞులు అంచనా వేశారు. మరికొందరు అవి 125 శతకోట్లు ఉండొచ్చని లెక్కించారు. నక్షత్రవీధులు ఎన్ని ఉన్నాయన్నదే మానవుడు తేల్చిచెప్పలేకపోతున్నాడు, ఇక వాటిలో ఖచ్చితంగా ఎన్ని శతకోట్ల నక్షత్రాలు ఉన్నాయనేది చెప్పడం మానవుడి తలకు మించిన పని. అయితే, వాటి సంఖ్య యెహోవాకు తెలుసు. అంతేకాదు, ఆయన ప్రతీ నక్షత్రానికి పేరు పెట్టాడు.

8.(ఎ)పాలపుంత నక్షత్రవీధి పరిమాణాన్ని మీరెలా వివరిస్తారు? (బి) ఆకాశ గ్రహ సముదాయాల కదలికల్ని యెహోవా వేటిద్వారా శాసిస్తున్నాడు?

8 నక్షత్రవీధుల పరిమాణాన్ని ఆలోచించినప్పుడు అది దేవునిపట్ల మన భక్తిపూర్వక భయాన్ని మరింత అధికం చేస్తుంది. మన పాలపుంత నక్షత్రవీధి పరిమాణం ఈ పక్కనుంచి ఆ పక్కకు లక్ష కాంతి సంవత్సరాలని అంచనావేయబడింది. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల భయంకరమైన వేగంతో కాంతి పుంజం ప్రయాణించడం ఊహించుకోండి. మన నక్షత్రవీధిని దాటడానికి ఆ కాంతి పుంజానికే లక్ష సంవత్సరాలు పడుతుంది! కొన్ని నక్షత్రవీధులు మన నక్షత్రవీధికంటే ఎన్నోరెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఈ సువిశాలాకాశాలను యెహోవా ఒక వస్త్రం మాదిరి ‘పరచియున్నాడని’ బైబిలు చెబుతోంది. (కీర్తన 104:2) ఈ సృష్టి కదలికలను కూడా ఆయన శాసిస్తున్నాడు. అతి సూక్ష్మమైన అంతఃనక్షత్ర ధూళి మొదలుకొని బృహత్తరమైన నక్షత్రవీధి వరకు, ప్రతీదీ దేవుడు రూపొందించి స్థిరపరచిన భౌతిక సూత్రాల ప్రకారమే కదులుతున్నాయి. (యోబు 38:31-33) అందువల్లనే, ఆకాశ గ్రహ సముదాయాల ప్రామాణిక కదలికల్ని, శాస్త్రజ్ఞులు భారీ సంగీత నృత్యనాటిక నిర్దిష్ట కదలికలతో పోల్చారు! ఇప్పుడు వీటిని సృష్టించిన దేవుని గురించి ఆలోచించండి. దేవునికి అంతటి అపారమైన సృష్టి శక్తి ఉందంటే మీకు ఆయనపట్ల భక్తిపూర్వకమైన భయం కలగడంలేదా?

“ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను”

9, 10.మన సౌర వ్యవస్థ, గురుగ్రహం, భూమి, చంద్ర గ్రహాల స్థానాలకు సంబంధించి యెహోవా శక్తి ఎలా స్పష్టమవుతోంది?

9 యెహోవాకున్న సృష్టి శక్తి మన గృహమైన ఈ భూమ్మీదే స్పష్టంగా తెలుస్తుంది. ఈ సువిశాల విశ్వంలో ఆయన భూమిని అత్యంత జాగ్రత్తగా దానిస్థానంలో పెట్టాడు. జీవసంపత్తిగల మన గ్రహంలాగే ఇతర అనేక నక్షత్రవీధుల్లో జీవానుకూల పర్యావరణంలేదని కొందరు శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. మన పాలపుంత నక్షత్రవీధిలో అధికభాగం జీవానుకూలంగా రూపొందించబడలేదని స్పష్టమవుతోంది. నక్షత్రవీధి కేంద్ర భాగంలో నక్షత్రాలు కిక్కిరిసి ఉన్నాయి. వికిరణ తీవ్రత అధికంగావుండి నక్షత్రాలు తరచూ ఢీకోవడం జరుగుతూ ఉంటుంది. నక్షత్రవీధిలోని అంచుల్లో జీవానికి ఆవశ్యకమైన అనేక మూల పదార్థాలు లేవు. మన సౌర వ్యవస్థ అలాంటి విపరీతాలకు మధ్యస్తంగా సరైన స్థానంలో ఉంది.

10 దూరంలోవున్నా మహా సంరక్షక గురుగ్రహం నుండి భూమి ప్రయోజనం పొందుతోంది. పరిమాణంలో భూమికి వెయ్యిరెట్లు పెద్దదిగావున్న గురుగ్రహానికి అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఫలితం? అంతరిక్షంలో వేగంగా దూసుకుపోయే పదార్థాలను అది ఆకర్షిస్తుంది లేదా పక్కకు తొలగిస్తుంది. ఒకవేళ గురుగ్రహమే లేకపోతే వర్షంలా కురిసే పెద్దపెద్ద ప్రక్షేపక పదార్థాలు ప్రస్తుత పరిస్థితికి 10,000 రెట్లు ఎక్కువ తీవ్రతతో భూమిని తాకుతూ ఉండేవని శాస్త్రజ్ఞులు అంచనావేస్తున్నారు. మనకు దగ్గరలోవున్న విషయాలకొస్తే, భూమి అసాధారణ ఉపగ్రహమైన చంద్రునివల్ల ప్రయోజనం పొందుతోంది. చంద్ర గ్రహం అందమైన గ్రహముగా, “రాత్రిపూట దీపముగా” ఉండడంకంటే మిన్నగా భూమిని నిరంతరం, స్థిరంగా ఏటవాలుగా నిలిపి ఉంచుతోంది. అలా ఏటవాలుగా ఉండడంవల్లే భూమిపై నిలకడగా, ముందేచెప్పగల రుతువులు ఏర్పడుతున్నాయి. ఇది జీవానికి మరో ప్రాముఖ్యమైన వరప్రసాదం.

11.భూవాతావరణం రక్షణ కవచంగా పనిచేసేలా ఎలా రూపించబడింది?

11 భూమి రూపకల్పనలోని ప్రతీ అంశంలో యెహోవా సృష్టి శక్తి స్పష్టంగా కనబడుతోంది. ఉదాహరణకు, రక్షణ కవచంగా పనిచేసే వాతావరణం గురించి ఆలోచించండి. సూర్యగ్రహం ఆరోగ్యదాయకమైన, మరణకరమైన కిరణాలను ప్రసరిస్తుంది. మరణకర కిరణాలు భూవాతావరణ పైపొరను తాకినప్పుడు అవి సాధారణ ఆమ్లజని ఓజోన్‌గా మారేలా చేస్తాయి. తత్ఫలితంగా ఏర్పడిన ఓజోన్‌పొర తిరిగి ఆ కిరణాలను చాలామట్టుకు హరించివేస్తుంది. నిజానికి, మన గ్రహం సొంత రక్షణ గొడుగుతో రూపించబడింది.

12.వాతావరణపు నీటి చక్రం యెహోవా సృష్టి శక్తినెలా ఉదహరిస్తోంది?

12 మన వాతావరణానికి సంబంధించి అది కేవలం ఒక అంశం మాత్రమే, ఈ వాతావరణం భూమ్మీద లేదా భూ ఉపరితలానికి దగ్గరగా జీవించే ప్రాణుల జీవనానికి తగిన సంశ్లిష్ట వాయువుల మిశ్రమం. వాతావరణ అద్భుతాల్లో నీటి చక్రమొక అద్భుతం. సూర్యగ్రహం ప్రతి సంవత్సరం భూమ్మీది మహాసముద్రాలనుండి ఆవిరి రూపంలో 4 లక్షల కిలోమీటర్ల ఘనపరిమాణంలో నీటిని పైకెత్తుతుంది. ఆ నీరు మేఘాలై వాతావరణ పవనాల ద్వారా ప్రతీచోటుకు వ్యాపిస్తాయి. ఆ నీరు వడబోసినట్టు ప్రక్షాళనమై వర్షం, మంచు, హిమంగా కురిసి తిరిగి నీటి సముదాయాల్లో నిండుతూ ఉంటుంది. అది “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును” అని ప్రసంగి 1:7 చెప్పినట్లే ఉంది. కేవలం యెహోవా మాత్రమే అలాంటి చక్రాన్ని కలుగజేయగలడు.

13.భూమ్మీది వృక్షసంపదలో, దాని నేలలో సృష్టికర్త శక్తికి సంబంధించిన ఏ రుజువును మనం చూస్తాము?

13 జీవాన్ని మనమెక్కడ చూస్తే అక్కడ, మనకు సృష్టికర్త శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. 30 అంతస్తుల భవనాలకంటే ఎత్తుగా పెరిగే భీకరమైన సింధూరవృక్ష అడవులు మొదలుకొని మహాసముద్రాల్లో విస్తారంగా పెరిగే అతిసూక్ష్మ మొక్కల్లో యెహోవా సృష్టి శక్తి స్పష్టంగా కనబడుతుంది, మనం పీల్చుకునే ప్రాణవాయువులో అధికభాగాన్ని ఇవే అందజేస్తున్నాయి. నేలలో క్రిములు, నాచు, అతిసూక్ష్మక్రిములు వంటి జీవజాతులు విస్తారంగా ఉన్నాయి, మొక్కల ఎదుగుదలకు దోహదపడే సంశ్లిష్ట విధానాల్లో అవన్నీ సమిష్టిగా పనిచేస్తున్నాయి. అందుకే బైబిలు సముచితంగానే, నేలలో ఉన్న సారము గురించి లేదా శక్తి గురించి మాట్లాడుతోంది.—ఆదికాండము 4:12.

14.చిన్న అణువులో సైతం ఎలాంటి శక్తి నిక్షిప్తమైయుంది?

14 యెహోవాయే “తన బలముచేత భూమిని సృష్టించెను” అనడంలో సందేహం లేదు. (యిర్మీయా 10:12) దేవుని అతిసూక్ష్మ సృష్టికార్యాల్లో సైతం ఆయన శక్తి స్పష్టంగా కనబడుతోంది. ఉదాహరణకు, లక్షలాది అణువుల్ని ఒకదాని ప్రక్కన ఒకటి పేర్చినా అవి మనిషి వెంట్రుకంత మందంగా ఉండవు. ఒక అణువును 14 అంతస్తుల భవనమంత పొడుగ్గా సాగదీసి చూసినా, దాని అణుకేంద్రకం 7వ అంతస్తులోవుండే లవణ రేణువు పరిమాణంలోనే ఉంటుంది. అయినప్పటికీ, అంత సూక్ష్మాతిసూక్ష్మ అణుకేంద్రకమే అణు విస్ఫోటనంలో విడుదలయ్యే భయానక శక్తికి మూలస్థానం.

“సకలప్రాణులు”

15.వివిధ అడవి మృగాల గురించి చర్చించడం ద్వారా, యెహోవా యోబుకు ఎలాంటి పాఠం నేర్పిస్తున్నాడు?

15 భూమ్మీది విస్తారమైన జంతుజాతుల్లో యెహోవా సృష్టి శక్తికి మరో ప్రకాశవంతమైన రుజువుంది. 148వ కీర్తన యెహోవాను స్తుతించే అనేక విషయాలను పేర్కొంటోంది. 10వ వచనం వాటిలో అడవి ‘మృగములను, పశువులను’ కూడా చేర్చుతోంది. సృష్టికర్త భయం మనిషికి ఎందుకుండాలో చూపించడానికి యెహోవా ఒకసారి యోబుతో సింహము, అడవి గాడిద, గురుపోతు, నీటిగుఱ్ఱము, భుజంగము (మొసలి) వంటి జంతువుల గురించి మాట్లాడాడు. యెహోవా ఏమి చెప్పాలనుకుంటున్నాడు? మచ్చిక చేయలేని బలమైన, భీకరమైన ఈ జంతువులకు భయపడే మనిషి, వాటి సృష్టికర్త గురించి ఎలా భావించాలి?—యోబు 38-41 అధ్యాయాలు.

16.యెహోవా సృష్టించిన కొన్ని పక్షుల గురించిన ఏ వివరాలు మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి?

16 ‘రెక్కలతో ఎగురు పక్షులను’ కూడా కీర్తన 148:10 ప్రస్తావిస్తోంది. వాటి రకాల గురించి ఒక్కసారి ఆలోచించండి. “గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించు” నిప్పుకోడి గురించి యెహోవా యోబుకు చెప్పాడు. నిజమే, ఎనిమిది అడుగుల ఎత్తుండే ఈ పక్షి ఎగరలేదు గానీ 4.5 మీటర్ల దూరపు అంగలతో అది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. (యోబు 39:13, 18) మరో వైపు, ఆల్‌బెట్రాస్‌ అనే సముద్రపక్షి తన అత్యధిక జీవితకాలం సముద్రం మీద గాలిలోనే గడుపుతుంది. సహజ విమానమని చెప్పగల ఈ పక్షి రెక్కలు దాదాపు 3 మీటర్ల పొడవుంటాయి. రెక్కలాడించకుండా అది అనేక గంటలపాటు ఎగరగలదు. వాటికి భిన్నంగా, కేవలం రెండంగుళాల పొడవుండే తేనెపిట్ట ప్రపంచంలోకెల్లా అతిచిన్నపిట్ట. అది సెకనుకు 80 సార్లకుపైగా తన రెక్కలాడిస్తుంది! మెరుస్తూ ఎగిరే రత్నాల్లా కనిపించే ఈ తేనెపిట్టలు హెలికాప్టర్ల మాదిరిగా ఒకే స్థలంలో అలాగే ఎగురుతూ ఉండిపోగలవు, వెనక్కి సైతం ఎగరగలవు.

17.నీలి తిమింగిలం ఎంత పెద్దగా ఉంటుంది, యెహోవా జంతు సృష్టి గురించి ఆలోచించిన తర్వాత మనం సహజంగానే ఏ ముగింపుకు రావాలి?

17 “అతిపెద్ద జలచరాలు” సైతం యెహోవాను స్తుతిస్తున్నాయని కీర్తన 148:7, NW చెబుతోంది. ఈ భూగ్రహంపై జీవించిన ప్రాణుల్లోకెల్లా అతిపెద్ద జంతువని విశ్వసించబడుతున్న నీలి తిమింగిలం గురించి ఆలోచించండి. సముద్ర అగాధంలో నివసించే ఈ ‘జలచరం’ 30 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. అది బాగా ఎదిగిన 30 ఏనుగులంత బరువు తూగుతుంది. దాని నాలుకే దాదాపు ఒక ఏనుగంత బరువుంటుంది. దాని గుండె ఒక చిన్నకారంత ఉంటుంది. ఈ భారీ గుండెకాయ నిమిషానికి 9 సార్లే కొట్టుకుంటే, దీనికి భిన్నంగా తేనెపిట్ట గుండె నిమిషానికి దాదాపు 1,200 సార్లు కొట్టుకొంటుంది. ఈ నీలి తిమింగిలపు రక్తనాళాల్లో కనీసం ఒకటి ఎంత వెడల్పుగా ఉంటుందంటే, చిన్న పిల్లవాడు దానిలోనుండి పాకుతూ వెళ్లగలుగుతాడు. “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి” అనే కీర్తనల పుస్తకపు ముగింపు ప్రబోధాన్ని ప్రతిధ్వనించేలా మన హృదయాలు నిశ్చయంగా కదిలించబడతాయి.—కీర్తన 150:6.

యెహోవా సృష్టి శక్తినుండి నేర్చుకోవడం

18, 19.యెహోవా ఈ భూమ్మీద కలుగజేసిన జీవజాతులు ఎంత వైవిధ్యంగా ఉన్నాయి, ఆయన సర్వాధిపత్యం గురించి సృష్టి మనకేమి బోధిస్తోంది?

18 యెహోవా తన సృష్టి శక్తిని ఉపయోగించే విధానం నుండి మనమేమి నేర్చుకుంటాము? వైవిధ్యభరిత సృష్టినిబట్టి మనలో భక్తిపూర్వక భయమేర్పడుతుంది. ఒక కీర్తనకర్త బిగ్గరగా ఇలా అన్నాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! . . . నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” (కీర్తన 104:24) అదెంత వాస్తవమో గదా! జీవశాస్త్రజ్ఞులు భూమ్మీద పదిలక్షలకుపైగా జీవజాతులను గుర్తించారు, అయినాసరే, అవి 1 కోటి అనీ, 30  కోట్లనీ లేదా ఇంకా ఎక్కువేననే విభిన్న అభిప్రాయాలున్నాయి. కొన్నిసార్లు మానవ కళాకారుని సృజనాత్మక సామర్థ్యం తరిగిపోవచ్చు. అయితే దీనికి భిన్నంగా, యెహోవా సృజనాత్మక సామర్థ్యం అంటే కొత్తవీ, విభిన్నమైనవీ కనిపెట్టి, సృష్టించే ఆయన శక్తి ఖచ్చితంగా తరగనిది.

19 యెహోవా తన సృష్టి శక్తిని ఉపయోగించే విధానం, ఆయన సర్వాధిపత్యం గురించి మనకు బోధిస్తుంది. “సృష్టికర్త” అనే మాటే మిగతా విశ్వమంతటి నుండి అంటే సమస్త “సృష్టము” నుండి ఆయనను వేరుచేస్తోంది. సృష్టి జరిగినప్పుడు ‘ప్రధాన శిల్పిగా’ పనిచేసిన యెహోవా అద్వితీయకుమారుడు సైతం బైబిల్లో సృష్టికర్త అని లేదా సహసృష్టికర్త అని ఎప్పుడూ పిలువబడలేదు. (సామెతలు 8:30; మత్తయి 19:4) బదులుగా, ఆయన ‘సర్వ సృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.’ (కొలొస్సయులు 1:15) సృష్టికర్తగా యెహోవాకున్న ఆ స్థానం యావత్‌ సృష్టిపై సర్వాధికారిగా ఏక ఛత్రాధిపత్యం వహించే సహజసిద్ధమైన హక్కును ఆయనకిస్తోంది.—రోమీయులు 1:20; ప్రకటన 4:11.

20.యెహోవా తన భూసంబంధ సృష్టిని ముగించిన తర్వాత ఏ భావంలో విశ్రమించాడు?

20 యెహోవా తన సృష్టి శక్తిని వినియోగించడం ఆపుజేసాడా? ఆరవ సృష్టిదినంలో యెహోవా తన సృష్టి కార్యాలను ముగించినప్పుడు, “తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 2:2) ఈ ఏడవ “దినము” వేల సంవత్సరాల నిడివిగలదని అపొస్తలుడైన పౌలు సూచించాడు, ఎందుకంటే అది ఆయన కాలంలో కూడా కొనసాగుతూనే ఉంది. (హెబ్రీయులు 4:3-6) కానీ “విశ్రాంతి” అంటే యెహోవా పనిచేయడం పూర్తిగా ఆపుజేసాడని దానర్థమా? కానేకాదు, యెహోవా పనిచేయడం ఎన్నడూ ఆపుజేయడు. (కీర్తన 92:4; యోహాను 5:17) కాబట్టి, ఆయన విశ్రాంతి ఈ భూమికి సంబంధించిన భౌతిక సృష్టి నుండి విరమించాడని మాత్రమే సూచిస్తోంది. అయితే, తన సంకల్పాలను నెరవేర్చే ఆయన పని నిర్విరామంగా కొనసాగింది. ఆ పనిలో పరిశుద్ధ లేఖనాలను ప్రేరేపించడం కూడా ఒక భాగమే. ఆయన పనిలో, ఈ పుస్తకపు 19వ అధ్యాయంలో పరిశీలించబడే ‘నూతన సృష్టిని’ వెలుగులోకి తీసుకురావడం కూడా ఇమిడి ఉంది.—2 కొరింథీయులు 5:17.

21.శాశ్వతకాలాలన్నింటిలో యెహోవా సృష్టి శక్తి నమ్మకస్థులైన మానవులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

21 చివరకు యెహోవా విశ్రాంతి దినం ముగింపుకొచ్చినప్పుడు, ఆరు సృష్టి దినముల చివర చెప్పినట్లే, ఈ భూమ్మీది తన కార్యమంతటి గురించి ఆయన “చాలామంచిదిగ” ఉందని ప్రకటించగలుగుతాడు. (ఆదికాండము 1:31) ఆ తర్వాత ఆయన తన అపరిమితమైన సృష్టి శక్తినెలా ఉపయోగించాలని ఎంచుకుంటాడో వేచి చూడాల్సిందే. ఏదేమైనా, యెహోవా తన సృష్టి శక్తిని ఉపయోగించే విధానాన్నిబట్టి మనం నిరంతరం పరవశం చెందుతామనే నమ్మకంతో ఉండవచ్చు. యుగయుగాల కాలంలో యెహోవా సృష్టి ద్వారా ఆయన గురించి మనమెక్కువ నేర్చుకుంటాం. (ప్రసంగి 3:11) ఆయన గురించి మనమెంత నేర్చుకుంటే ఆయనపట్ల మన భక్తిపూర్వక భయం అంతెక్కువవుతుంది, మన మహాగొప్ప సృష్టికర్తకు మనమంత సన్నిహితమవుతాం.

a ఆ భారీ సంఖ్యను సులభంగా అర్థంచేసుకోవడానికి, దీని గురించి ఆలోచించండి: కారులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రోజుకు 24 గంటలూ ప్రయాణించినా, అంత దూరం వెళ్లడానికి మీకు 100 సంవత్సరాలకుపైనే పడుతుంది.

b బైబిలు కాలాల్లోని ప్రాచీనులు పాతకాలపు దుర్భిణి యంత్రాలను ఉపయోగించివుంటారని కొందరనుకుంటారు. అలా కాకపోతే మానవ దృష్టికి నక్షత్రాల సంఖ్య విస్తారమని, అసంఖ్యాకమని ఆ కాలాల్లోని మనుషులెలా తెలుసుకోగలిగారనేది వారి వాదన. అలాంటి అనాధారిత ఊహాగానాలు యెహోవాయే బైబిలు గ్రంథకర్త అనే విషయాన్ని గుర్తించవు.—2 తిమోతి 3:16.

c కేవలం నూరు శతకోట్ల నక్షత్రాలను లెక్కించడానికి మీకెంత సమయం పడుతుందో ఆలోచించండి. సెకనుకొక నక్షత్రం చొప్పున మీరు రోజుకు 24 గంటలు లెక్కించగలిగినా మీకు 3,171 సంవత్సరాలు పడుతుంది.