ఆదికాండం 45:1-28
45 అప్పుడు యోసేపు తన సేవకులందరి ముందు తన భావోద్వేగాల్ని అణుచుకోలేక,+ “అందరూ నా దగ్గర నుండి వెళ్లిపోండి!” అని అరిచాడు. తాను యోసేపునని అతను చెప్తున్నప్పుడు అక్కడ అతని సహోదరులు తప్ప ఇంకెవరూ లేరు.+
2 అప్పుడు యోసేపు ఎంత గట్టిగా ఏడ్చాడంటే అది ఐగుప్తీయులకు, ఫరో ఇంటివాళ్లకు వినిపించింది.
3 చివరికి యోసేపు తన సహోదరుల్ని, “నేను యోసేపును. మా నాన్న ఇంకా బ్రతికున్నాడా?” అని అడిగాడు. కానీ అతని సహోదరులు ఏమీ జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
4 కాబట్టి యోసేపు తన సహోదరులతో, “దయచేసి, నా దగ్గరికి రండి” అన్నాడు. దాంతో వాళ్లు అతని దగ్గరికి వెళ్లారు.
అప్పుడు అతను ఇలా అన్నాడు: “నేను మీ సహోదరుణ్ణి, మీరు ఐగుప్తీయులకు అమ్మేసిన యోసేపును.+
5 కానీ ఇప్పుడు మీరు ఆందోళన పడకండి. మీరు నన్ను ఇక్కడివాళ్లకు అమ్మేసినందుకు ఒకరినొకరు నిందించుకోకండి; మన ప్రాణాల్ని కాపాడడానికి దేవుడే మీకన్నా ముందు నన్ను ఇక్కడికి పంపించాడు.+
6 రెండేళ్ల నుండి దేశంలో కరువు ఉంది,+ ఇంకా ఐదేళ్లపాటు దున్నడం గానీ కోయడం గానీ జరగవు.
7 భూమ్మీద* మీ వంశం* నిలిచి ఉండడానికి,+ శక్తివంతమైన రీతిలో మిమ్మల్ని విడిపించి మీ ప్రాణాల్ని కాపాడడానికి దేవుడు మీకన్నా ముందు నన్ను పంపించాడు.
8 కాబట్టి మీరు కాదు, సత్యదేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. నన్ను ఫరోకు ముఖ్య సలహాదారునిగా,* అతని ఇంటివాళ్లందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటి మీద పరిపాలకునిగా నియమించడానికి దేవుడే అలా చేశాడు.+
9 “మీరు త్వరగా మా నాన్న దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాలి, ‘నీ కుమారుడు యోసేపు ఇలా అన్నాడు: “దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీద ప్రభువుగా నియమించాడు.+ ఆలస్యం చేయకుండా నా దగ్గరికి వచ్చేయి.+
10 నువ్వు గోషెను ప్రాంతంలో నివసించాలి.+ అప్పుడు నువ్వు, నీ కుమారులు, నీ మనవళ్లు, నీ మందలు, నీ పశువులు, నీకున్నవన్నీ నాకు దగ్గర్లో ఉండొచ్చు.
11 నేను నిన్ను పోషిస్తాను. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే నువ్వు, నీ ఇంటివాళ్లు పేదవాళ్లౌతారు, నీకున్నదంతా కోల్పోతావు. ఎందుకంటే కరువు ఇంకా ఐదేళ్లపాటు ఉంటుంది.” ’+
12 ఇప్పుడు మీరూ, నా తమ్ముడు బెన్యామీనూ నన్ను కళ్లారా చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతున్నది నిజంగా నేనే.+
13 కాబట్టి మీరు ఐగుప్తులో నా వైభవం గురించి, మీరు చూసిన ప్రతీదాని గురించి మా నాన్నకు చెప్పాలి. ఇప్పుడు త్వరగా వెళ్లి మా నాన్నను ఇక్కడికి తీసుకురండి.”
14 తర్వాత యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగిలించుకొని* ఏడ్చాడు, బెన్యామీను కూడా యోసేపు మెడ చుట్టూ చేతులేసి ఏడ్చాడు.+
15 తర్వాత యోసేపు తన సహోదరులందర్నీ ముద్దుపెట్టుకొని, వాళ్లను కౌగిలించుకొని ఏడ్చాడు. అప్పుడు అతని సహోదరులు అతనితో మాట్లాడారు.
16 “యోసేపు సహోదరులు వచ్చారు!” అన్న వార్త ఫరో ఇంటికి చేరింది. అది విని ఫరో, అతని సేవకులు సంతోషించారు.
17 కాబట్టి ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “నీ సహోదరులకు ఈ మాట చెప్పు: ‘మీ జంతువుల మీద ధాన్యం సంచుల్ని పెట్టుకొని కనాను దేశానికి వెళ్లండి.
18 మీ నాన్నను, మీ ఇంటివాళ్లను తీసుకొని నా దగ్గరికి రండి. ఐగుప్తు దేశంలో ఉన్న మంచివాటిని మీకు ఇస్తాను. ఈ దేశంలోని శ్రేష్ఠమైన పంటను* మీరు తింటారు.’+
19 అంతేకాదు నువ్వు ఈ మాట కూడా వాళ్లకు చెప్పాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను:+ ‘మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తు దేశం నుండి బండ్లను తీసుకెళ్లి,+ ఒకదానిలో మీ నాన్నను కూర్చోబెట్టుకొని ఇక్కడికి తీసుకురండి.+
20 మీ ఆస్తిపాస్తుల+ గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఐగుప్తు దేశంలోని శ్రేష్ఠమైనవన్నీ మీవే.’ ”
21 ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. ఫరో ఆజ్ఞాపించినట్టే యోసేపు వాళ్లకు బండ్లను, ప్రయాణానికి కావాల్సిన వాటిని ఇచ్చాడు.
22 వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక జత బట్టల్ని ఇచ్చాడు, కానీ బెన్యామీనుకు మాత్రం 300 వెండి రూకలు, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.+
23 వాళ్ల నాన్నకేమో ఐగుప్తు దేశంలో దొరికే మంచివాటిని మోస్తున్న పది గాడిదల్ని, అతని ప్రయాణానికి కావాల్సిన ధాన్యాన్ని, రొట్టెల్ని, ఆహారాన్ని మోస్తున్న పది ఆడ గాడిదల్ని పంపించాడు.
24 అలా యోసేపు తన సహోదరుల్ని సాగనంపాడు. వాళ్లు వెళ్తున్నప్పుడు యోసేపు, “దారిలో ఒకరితో ఒకరు గొడవ పడకండి”+ అని వాళ్లకు చెప్పాడు.
25 అప్పుడు వాళ్లు ఐగుప్తు నుండి బయల్దేరి కనాను దేశంలో ఉన్న వాళ్ల నాన్న యాకోబు దగ్గరికి వచ్చి,
26 “యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, అతను ఇప్పుడు ఐగుప్తు దేశమంతటికీ పరిపాలకుడు!”+ అని చెప్పారు. కానీ యాకోబు వాళ్లు చెప్పేది నమ్మలేదు కాబట్టి వాళ్ల మాటల్ని పట్టించుకోలేదు.+
27 అయితే వాళ్లు యోసేపు తమతో మాట్లాడిన విషయాలన్నిటినీ తమ తండ్రి యాకోబుకు చెప్తూ వెళ్లినప్పుడు, అలాగే అతన్ని తీసుకురావడానికి యోసేపు పంపించిన బండ్లను చూసినప్పుడు యాకోబు మనసు* కుదుటపడింది.
28 అప్పుడు ఇశ్రాయేలు ఇలా అన్నాడు: “ఇక చాలు! యోసేపు బ్రతికే ఉన్నాడు! నేను చనిపోకముందే వెళ్లి నా కుమారుణ్ణి చూడాలి!”+
అధస్సూచీలు
^ లేదా “దేశంలో.”
^ అక్ష., “శేషం.”
^ అక్ష., “ఫరోకు తండ్రిగా.”
^ అక్ష., “మెడ మీద పడి.”
^ అక్ష., “కొవ్వినదాన్ని.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.