కీర్తనలు 92:1-15
శ్రావ్యగీతం. విశ్రాంతి రోజు* కోసం గీతం.
92 యెహోవాకు కృతజ్ఞతలు తెలపడం మంచిది;+సర్వోన్నతుడా, నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడడం* మంచిది;
2 ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను,రాత్రుళ్లు నీ నమ్మకత్వాన్ని చాటించడం+ మంచిది;
3 పది తంతుల వాద్యంతో,శ్రావ్యంగా పలికే వీణతో* నిన్ను స్తుతించడం మంచిది.+
4 ఎందుకంటే యెహోవా, నీ కార్యాల్ని బట్టి నేను సంతోషించేలా చేశావు;నీ చేతి పనుల్ని బట్టి నేను సంతోషంతో కేకలు వేస్తున్నాను.
5 యెహోవా, నీ పనులు ఎంత గొప్పవి!+
నీ ఆలోచనలు ఎంత లోతైనవి!+
6 బుద్ధిలేని వాళ్లెవ్వరూ వాటిని తెలుసుకోలేరు;మూర్ఖులెవ్వరికీ ఈ విషయం అర్థంకాదు:+
7 శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడానికేదుష్టులు కలుపు మొక్కల్లా* చిగురిస్తారు,తప్పుచేసే వాళ్లంతా వర్ధిల్లుతారు.+
8 అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా హెచ్చించబడ్డావు.
9 యెహోవా, నీ శత్రువుల ఓటమిని చూడు,నీ విరోధులు ఎలా నాశనమౌతారో చూడు;
తప్పుచేసే వాళ్లంతా చెల్లాచెదురౌతారు.+
10 అయితే నువ్వు నా బలాన్ని* అడవి ఎద్దు కొమ్ములా హెచ్చిస్తావు;నేను నా ఒంటికి తాజా నూనె రాసుకుంటాను.+
11 నా శత్రువుల ఓటమిని నేను కళ్లారా చూస్తాను;+నా మీద దాడిచేసే దుష్టుల పతనం గురించి చెవులారా వింటాను.
12 అయితే నీతిమంతులు ఖర్జూర చెట్టులా వర్ధిల్లుతారు,లెబానోనులోని దేవదారు చెట్టులా ఎదుగుతారు.+
13 వాళ్లు యెహోవా మందిరంలో నాటబడ్డారు;మన దేవుని ప్రాంగణాల్లో వాళ్లు వర్ధిల్లుతారు.+
14 వాళ్లు ముసలితనంలో* కూడా ఫలిస్తూ+ఉత్సాహంగా ఉంటారు, పచ్చగా కళకళలాడతారు;+
15 యెహోవా నిజాయితీపరుడని ప్రకటిస్తూ ఉంటారు.
ఆయనే నా ఆశ్రయదుర్గం,*+ ఆయనలో ఏమాత్రం అవినీతి లేదు.
అధస్సూచీలు
^ లేదా “సబ్బాతు.”
^ లేదా “సంగీతం వాయించడం.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “పచ్చగడ్డిలా.”
^ అక్ష., “కొమ్మును.”
^ లేదా “తల నెరిసినప్పుడు.”
^ అక్ష., “బండరాయి.”