దానియేలు 3:1-30
3 నెబుకద్నెజరు రాజు 60 మూరల* ఎత్తు, 6 మూరల* వెడల్పు ఉన్న ఒక బంగారు ప్రతిమను* చేయించాడు. అతను దాన్ని బబులోను సంస్థానంలోని దూరా మైదానంలో నిలబెట్టించాడు.
2 అప్పుడు నెబుకద్నెజరు రాజు, తాను నిలబెట్టించిన ఆ ప్రతిమ ప్రతిష్ఠాపనకు ప్రాంత పాలకుల్ని, ప్రభుత్వ అధికారుల్ని,* అధిపతుల్ని, సలహాదారుల్ని, కోశాధికారుల్ని, న్యాయమూర్తుల్ని, నగర అధికారుల్ని, సంస్థానాల అధిపతులందర్నీ సమకూర్చమని సందేశం పంపాడు.
3 కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన ప్రతిమ ప్రతిష్ఠాపనకు ప్రాంత పాలకులు, ప్రభుత్వ అధికారులు, అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయమూర్తులు, నగర అధికారులు, సంస్థానాల అధిపతులందరూ సమకూడారు. వాళ్లు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ముందు నిలబడ్డారు.
4 చాటింపు వేసే వ్యక్తి బిగ్గరగా ఇలా ప్రకటించాడు: “ఆయా దేశాల, భాషల ప్రజలారా, మీకు ఆజ్ఞాపించేదేమిటంటే:
5 మీరు బూర,* వేర్వేరు పిల్లనగ్రోవులు, వీణ,* చిన్న వీణ, తంతివాద్యం, అన్నిరకాల సంగీత వాద్యాల శబ్దం విన్నప్పుడు, నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాష్టాంగపడి మొక్కాలి.
6 ఎవరైతే దానికి సాష్టాంగపడి మొక్కరో, వాళ్లు వెంటనే మండే కొలిమిలో పడేయబడతారు.”+
7 కాబట్టి బూర, వేర్వేరు పిల్లనగ్రోవులు, వీణ, చిన్న వీణ, తంతివాద్యం, అన్నిరకాల సంగీత వాద్యాల శబ్దం విన్నప్పుడు, వేర్వేరు దేశాల, భాషల ప్రజలందరూ నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాష్టాంగపడి మొక్కారు.
8 ఆ సమయంలో కొంతమంది కల్దీయులు ముందుకొచ్చి యూదుల మీద నింద మోపారు.*
9 వాళ్లు నెబుకద్నెజరు రాజుతో ఇలా చెప్పారు: “రాజా, నువ్వు కలకాలం జీవించాలి.
10 రాజా, బూర, వేర్వేరు పిల్లనగ్రోవుల, వీణ, చిన్న వీణ, తంతివాద్యం, అన్నిరకాల సంగీత వాద్యాల శబ్దం విన్నప్పుడు ప్రతీ ఒక్కరు బంగారు ప్రతిమకు సాష్టాంగపడి మొక్కాలని నువ్వు ఆజ్ఞాపించావు;
11 ఎవరైతే దానికి సాష్టాంగపడి మొక్కరో, వాళ్లు మండే కొలిమిలో పడేయబడాలని కూడా నువ్వు ఆజ్ఞాపించావు.+
12 అయితే రాజా, బబులోను సంస్థానం మీద నువ్వు అధికారులుగా నియమించిన కొంతమంది యూదులు, అంటే షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్లు+ నిన్ను లెక్కచేయడం లేదు. వాళ్లు నీ దేవుళ్లను సేవించడం లేదు, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కడం లేదు.”
13 అప్పుడు నెబుకద్నెజరుకు విపరీతమైన కోపం వచ్చి షద్రకును, మేషాకును, అబేద్నెగోను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో వాళ్లను రాజు ముందుకు తీసుకొచ్చారు.
14 నెబుకద్నెజరు వాళ్లతో ఇలా అన్నాడు: “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్లను సేవించడం లేదంట,+ నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కడం లేదంట, నిజమేనా?
15 ఇప్పుడు మీరు బూర, వేర్వేరు పిల్లనగ్రోవుల, వీణ, చిన్న వీణ, తంతివాద్యం, అన్నిరకాల సంగీత వాద్యాల శబ్దం విన్నప్పుడు, మీరు నేను చేయించిన ప్రతిమకు సాష్టాంగపడి మొక్కడానికి సిద్ధంగా ఉంటే, సరే; ఒకవేళ మీరు మొక్కకపోతే, వెంటనే మండే కొలిమిలో పడేయబడతారు. నా చేతుల్లో నుండి ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు?”+
16 అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగో రాజుతో ఇలా అన్నారు: “నెబుకద్నెజరూ, ఈ విషయంలో మేము నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు.
17 రాజా, మేము ఒకవేళ కొలిమిలో పడేయబడితే, మేము సేవిస్తున్న మా దేవుడు దానిలో నుండి మమ్మల్ని రక్షించగలడు, అంతేకాదు నీ చేతిలో నుండి మమ్మల్ని రక్షించగలడు.+
18 ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, రాజా, మేము నీ దేవుళ్లను సేవించమనీ, నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కమనీ నువ్వు తెలుసుకోవాలి.”+
19 అప్పుడు నెబుకద్నెజరుకు షద్రకు, మేషాకు, అబేద్నెగో మీద విపరీతమైన కోపం వచ్చింది, అతని ముఖ కవళికలు మారిపోయాయి;* కొలిమిని మామూలుకన్నా ఏడు రెట్లు ఎక్కువ వేడిగా చేయమని అతను ఆజ్ఞాపించాడు.
20 షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి, మండే కొలిమిలో పడేయమని తన సైన్యంలో కొంతమంది బలాఢ్యులకు ఆజ్ఞాపించాడు.
21 ఆ ముగ్గురు తమ పైవస్త్రాలు, బట్టలు, టోపీలు, మిగతా బట్టలన్నీ వేసుకొని ఉండగానే వాళ్లను బంధించి, మండే కొలిమిలో పడేశారు.
22 రాజాజ్ఞ చాలా కఠినంగా ఉండడంతో, కొలిమి చాలా వేడిగా ఉండడంతో షద్రకును, మేషాకును, అబేద్నెగోను తీసుకెళ్లిన మనుషులే ఆ మంటలవల్ల చనిపోయారు.
23 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ఆ ముగ్గురు బంధించబడి, మండే కొలిమిలో పడ్డారు.
24 అప్పుడు నెబుకద్నెజరు రాజు చాలా భయపడి, వెంటనే లేచి తన ఉన్నతాధికారులతో, “మనం ముగ్గురు మనుషుల్ని బంధించి, అగ్నిలో పడేశాం కదా?” అన్నాడు. దానికి వాళ్లు, “అవును రాజా” అన్నారు.
25 అప్పుడు రాజు ఇలా అన్నాడు: “ఇదిగో! మంటల్లో నలుగురు మనుషులు స్వేచ్ఛగా నడవడం నాకు కనిపిస్తోంది, వాళ్లకు ఎలాంటి హానీ జరగలేదు; నాలుగో వ్యక్తి చూడడానికి దేవునిలా ఉన్నాడు.”
26 నెబుకద్నెజరు మండే కొలిమి ద్వారం దగ్గరికి వచ్చి, “షద్రకు, మేషాకు, అబేద్నెగోలారా, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా,+ బయటికి రండి, నా దగ్గరికి రండి!” అన్నాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగో మంటల్లో నుండి బయటికి వచ్చారు.
27 వాళ్ల శరీరాలకు అగ్నివల్ల ఎలాంటి హాని కలగకపోవడం+ అక్కడ సమకూడిన ప్రాంత పాలకులు, ప్రభుత్వ అధికారులు, అధిపతులు, రాజు ఉన్నతాధికారులు+ గమనించారు; వాళ్ల తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలేదు, వాళ్ల బట్టలు పాడవలేదు; కనీసం అగ్ని వాసన కూడా వాళ్లకు అంటలేదు.
28 అప్పుడు నెబుకద్నెజరు ఇలా ప్రకటించాడు: “తన దూతను పంపించి, తన సేవకుల్ని రక్షించిన షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడు స్తుతించబడాలి.+ వాళ్లు ఆయన మీద నమ్మకం ఉంచి, రాజాజ్ఞను ధిక్కరించారు; వాళ్లు తమ దేవుణ్ణి కాకుండా వేరే ఏ దేవుణ్ణి సేవించడం కన్నా, పూజించడం కన్నా చనిపోవడానికే ఇష్టపడ్డారు.+
29 కాబట్టి ఏ దేశానికి, భాషకు చెందిన ప్రజలైనా షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాళ్లు ముక్కలుముక్కలు చేయబడాలని, వాళ్ల ఇళ్లు బహిరంగ మరుగుదొడ్లుగా* మార్చబడాలని నేను ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను; ఎందుకంటే ఆయనలా రక్షించగలిగే దేవుడు వేరే ఎవ్వరూ లేరు.”+
30 అప్పుడు రాజు బబులోను సంస్థానంలో షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఉన్నత పదవులు ఇచ్చాడు.*+
అధస్సూచీలు
^ దాదాపు 27 మీటర్లు (88 అడుగులు). అనుబంధం B14 చూడండి.
^ దాదాపు 2.7 మీటర్లు (8.8 అడుగులు). అనుబంధం B14 చూడండి.
^ లేదా “విగ్రహాన్ని.”
^ వీళ్లు బబులోను ప్రభుత్వంలో ప్రాంత పాలకులకన్నా కిందిస్థాయిలో ఉంటారు.
^ అక్ష., “కొమ్ము.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “లేనిపోనివి కల్పించి చెప్పారు.”
^ లేదా “అతని వైఖరి పూర్తిగా మారిపోయింది.”
^ లేదా “చెత్త కుప్పలుగా; పెంట కుప్పలుగా” అయ్యుంటుంది.
^ అక్ష., “వర్ధిల్లేలా చేశాడు.”