యోహానుకు ఇచ్చిన ప్రకటన 7:1-17
7 ఆ తర్వాత, నలుగురు దేవదూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి ఉండడం నేను చూశాను. భూమ్మీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి అనేదే వీచకుండా వాళ్లు భూమి నాలుగు గాలుల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు.
2 అప్పుడు తూర్పు* నుండి ఇంకో దేవదూత పైకి రావడం నేను చూశాను. అతను జీవంగల దేవుని ముద్ర పట్టుకొని ఉన్నాడు. భూమికి, సముద్రానికి హాని చేసేందుకు అనుమతి పొందిన నలుగురు దేవదూతలతో ఆ దేవదూత బిగ్గరగా
3 ఇలా అన్నాడు: “మన దేవుని దాసుల నొసళ్ల మీద మేము ముద్ర వేసే+ వరకు భూమికి గానీ, సముద్రానికి గానీ, చెట్లకు గానీ హాని చేయొద్దు.”+
4 ముద్రించబడిన వాళ్ల సంఖ్య నేను విన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిట్లో+ ముద్రించబడిన వాళ్ల సంఖ్య 1,44,000.+
5 యూదా గోత్రంలో ముద్రించబడిన వాళ్లు 12,000 మంది;రూబేను గోత్రంలో 12,000 మంది;గాదు గోత్రంలో 12,000 మంది;
6 ఆషేరు గోత్రంలో 12,000 మంది;నఫ్తాలి గోత్రంలో 12,000 మంది;మనష్షే+ గోత్రంలో 12,000 మంది;
7 షిమ్యోను గోత్రంలో 12,000 మంది;లేవి గోత్రంలో 12,000 మంది;ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది;
8 జెబూలూను గోత్రంలో 12,000 మంది;యోసేపు గోత్రంలో 12,000 మంది;బెన్యామీను గోత్రంలో 12,000 మంది;
9 ఆ తర్వాత నేను చూసినప్పుడు, ఇదిగో! ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం కనిపించింది. వాళ్లు అన్నిదేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల+ నుండి వచ్చారు. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఖర్జూర మట్టలు+ ఉన్నాయి.
10 వాళ్లు పెద్ద స్వరంతో ఇలా అంటూ ఉన్నారు: “సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది.”+
11 దేవదూతలందరూ ఆ సింహాసనం చుట్టూ, పెద్దల+ చుట్టూ, నాలుగు జీవుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ దేవదూతలు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ
12 ఇలా అన్నారు: “ఆమేన్! యుగయుగాలు మన దేవునికి స్తుతి, మహిమ, తెలివి, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, బలం చెందాలి.+ ఆమేన్.”
13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను, “తెల్లని వస్త్రాలు వేసుకున్న వీళ్లు+ ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
14 వెంటనే నేను అతనితో, “నా ప్రభువా, అది నీకే తెలుసు” అన్నాను. అప్పుడతను నాతో ఇలా అన్నాడు: “వీళ్లు మహాశ్రమను+ దాటి వచ్చేవాళ్లు. వీళ్లు గొర్రెపిల్ల రక్తంలో+ తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు.
15 అందుకే వీళ్లు దేవుని సింహాసనం ముందు ఉన్నారు, దేవుని ఆలయంలో రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ చేస్తున్నారు. సింహాసనం మీద కూర్చున్న దేవుడు+ వాళ్లమీద తన డేరా కప్పుతాడు.*+
16 ఇప్పటినుండి వాళ్లకు ఆకలి వేయదు, దాహం వేయదు; ఎండదెబ్బ గానీ వడగాలి గానీ వాళ్లకు తగలదు.+
17 ఎందుకంటే సింహాసనం పక్కన* ఉన్న గొర్రెపిల్ల+ వాళ్లను కాపరిలా చూసుకుంటూ,+ జీవజలాల ఊటల* దగ్గరికి నడిపిస్తాడు.+ దేవుడు వాళ్ల కళ్ల నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు.”+