మత్తయి సువార్త 10:1-42

  • 12 మంది అపొస్తలులు (1-4)

  • పరిచర్య గురించి నిర్దేశాలు (5-15)

  • శిష్యులు హింసించబడతారు (16-25)

  • మనుషులకు కాదు దేవునికి భయపడండి (26-31)

  • శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం (32-39)

  • యేసు శిష్యుల్ని చేర్చుకోవడం (40-42)

10  కాబట్టి యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి, వాళ్లకు అపవిత్ర దూతల్ని* వెళ్లగొట్టే అధికారం ఇచ్చాడు.+ అలాగే అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేసే శక్తి కూడా ఇచ్చాడు.  ఆ 12 మంది అపొస్తలులు* ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ;+ జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను;+  ఫిలిప్పు, బర్తొలొమయి;+ తోమా,+ పన్ను వసూలుచేసే మత్తయి;+ అల్ఫయి కుమారుడు యాకోబు; తద్దయి;  కననేయుడైన* సీమోను; ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేసింది ఈ యూదానే.+  యేసు ఆ 12 మందిని పంపిస్తూ ఈ నిర్దేశాలు ఇచ్చాడు:+ “అన్యజనుల దగ్గరికి వెళ్లకండి, సమరయులకు చెందిన ఏ నగరంలోకీ+ ప్రవేశించకండి.  అయితే ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికే వెళ్తూ ఉండండి.+  మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం దగ్గరపడింది’ అని ప్రకటించండి.  రోగుల్ని బాగుచేయండి, చనిపోయినవాళ్లను బ్రతికించండి, కుష్ఠురోగుల్ని శుద్ధులుగా చేయండి, చెడ్డదూతల్ని* వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.  మీ డబ్బు సంచుల్లో బంగారు, వెండి, లేదా రాగి నాణేలు తీసుకెళ్లకండి.+ 10  ప్రయాణం కోసం ఆహారం మూటను తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు భోజనానికి అర్హుడు.+ అలాగే రెండు వస్త్రాల్ని* గానీ, చెప్పుల్ని గానీ, చేతికర్రను గానీ తీసుకెళ్లకండి.+ 11  “మీరు ఏదైనా నగరంలో గానీ గ్రామంలో గానీ అడుగుపెట్టినప్పుడు, అందులో ఎవరు మీ సందేశానికి అర్హులో వెదకండి. మీరు అక్కడి నుండి వెళ్లిపోయేవరకు అతని దగ్గరే ఉండండి.+ 12  మీరు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటివాళ్లను పలకరించి, వాళ్లకు శాంతి కలగాలని చెప్పండి. 13  వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తే, వాళ్లకు శాంతి కలుగుతుంది;+ కానీ వాళ్లు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించకపోతే, మీ శాంతి మీ దగ్గరే ఉంటుంది. 14  ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీరు చెప్పేది వినకపోతే, మీరు ఆ ఇంటిని గానీ ఆ నగరాన్ని గానీ విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేయండి.+ 15  నేను నిజంగా మీతో చెప్తున్నాను, తీర్పు రోజున ఆ నగరం పరిస్థితి, సొదొమ గొమొర్రాల+ పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. 16  “ఇదిగో! తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్నట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి పాముల్లా అప్రమత్తంగా, పావురాల్లా కపటం లేకుండా ఉండండి.+ 17  జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు,+ తమ సమాజమందిరాల్లో కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తారు.+ 18  నా కారణంగా మిమ్మల్ని అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకెళ్తారు.+ అప్పుడు వాళ్లకు, అలాగే అన్యజనులకు నా గురించి సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.+ 19  అయితే వాళ్లు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ఆందోళన పడకండి; మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది.+ 20  ఎందుకంటే అప్పుడు మీ అంతట మీరే మాట్లాడరు కానీ, మీ తండ్రి ఇచ్చే పవిత్రశక్తి సహాయంతో మాట్లాడతారు.+ 21  అంతేకాదు, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వాళ్లను చంపిస్తారు.+ 22  మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు,+ కానీ అంతం వరకు సహించినవాళ్లే* రక్షించబడతారు.+ 23  వాళ్లు మిమ్మల్ని ఒక నగరంలో హింసించినప్పుడు, ఇంకో నగరానికి పారిపోండి;+ మీరు ఇశ్రాయేలు నగరాల్లో, గ్రామాల్లో మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడని మీతో నిజంగా చెప్తున్నాను. 24  “విద్యార్థి తన బోధకుడి కన్నా గొప్పవాడు కాదు, అలాగే దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు. 25  విద్యార్థి తన బోధకుడిలా, దాసుడు తన యజమానిలా తయారైతే చాలు.+ ప్రజలు యజమానినే బయెల్జెబూలు* అని పిలిచారంటే,+ అతని ఇంటివాళ్లను ఇంకెంతగా అలా పిలుస్తారో కదా? 26  మీరు వాళ్లకు భయపడకండి. ఎందుకంటే కప్పిపెట్టిన ప్రతీది బయటపడుతుంది; రహస్యంగా ఉంచిన ప్రతీది తెలిసిపోతుంది.+ 27  నేను మీకు చీకట్లో చెప్పేవాటిని వెలుగులో చెప్పండి, నేను మీకు చెవిలో చెప్పేవాటిని ఇంటి పైకప్పుల మీద నుండి చాటిచెప్పండి.+ 28  శరీరాన్ని చంపినా ప్రాణాన్ని* చంపలేనివాళ్లకు భయపడకండి.+ కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో* నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి.+ 29  తక్కువ విలువగల ఒక నాణేనికి* రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయినా మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు.+ 30  మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. 31  కాబట్టి భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.+ 32  “మనుషుల ముందు నన్ను ఒప్పుకునే ప్రతీ ఒక్కర్ని+ నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను.+ 33  అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు అతన్ని తిరస్కరిస్తాను.+ 34  నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి; శాంతిని కాదు, కత్తిని తీసుకురావడానికే వచ్చాను.+ 35  ఎందుకంటే కుమారుడికి తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి మధ్య విరోధం పెట్టడానికే నేను వచ్చాను.+ 36  నిజానికి, ఒక మనిషి ఇంటివాళ్లే అతనికి శత్రువులు అవుతారు. 37  తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు. కుమారుణ్ణి గానీ, కూతుర్ని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.+ 38  అలాగే తన హింసాకొయ్యను* మోసుకుంటూ నన్ను అనుసరించని వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.+ 39  తన ప్రాణాన్ని కాపాడుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు, అయితే నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.+ 40  “మిమ్మల్ని చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటున్నాడు, నన్ను చేర్చుకునే వ్యక్తి నన్ను పంపించిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటున్నాడు.+ 41  ప్రవక్త అనే కారణంతో ప్రవక్తను చేర్చుకునే వ్యక్తి ప్రవక్త పొందే ప్రతిఫలం* పొందుతాడు.+ అలాగే నీతిమంతుడు అనే కారణంతో నీతిమంతుణ్ణి చేర్చుకునే వ్యక్తి నీతిమంతుడు పొందే ప్రతిఫలం పొందుతాడు. 42  నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా శిష్యుడనే కారణంతో వీళ్లలో* ఒకరికి తాగడానికి కేవలం కొన్ని చన్నీళ్లు ఇచ్చే వ్యక్తి కూడా ఖచ్చితంగా తన ప్రతిఫలం పొందుతాడు.”+

అధస్సూచీలు

పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
పదకోశం చూడండి.
లేదా “ఉత్సాహవంతుడైన.”
పదకోశం చూడండి.
లేదా “అదనపు వస్త్రాన్ని.”
లేదా “సహించేవాళ్లే.”
లేదా “బయెల్జెబూబు.” చెడ్డదూతల రాజు లేదా నాయకుడు అయిన సాతానుకు ఉన్న ఒక బిరుదు.
లేదా “జీవితాన్ని,” అంటే భవిష్యత్తులో మళ్లీ జీవించే అవకాశాన్ని.
పదకోశం చూడండి.
అక్ష., “ఒక అస్సారియోన్‌కు.” అనుబంధం B14 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “ప్రవక్త బహుమతి.”
లేదా “ఈ తక్కువ వాళ్లలో.”