మత్తయి సువార్త 21:1-46

  • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (1-11)

  • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (12-17)

  • అంజూర చెట్టును శపించడం (18-22)

  • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (23-27)

  • ఇద్దరు కుమారుల ఉదాహరణ (28-32)

  • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (33-46)

    • ముఖ్యమైన మూలరాయిని వద్దనుకున్నారు (42)

21  వాళ్లు యెరూషలేము దగ్గర్లోకి వచ్చినప్పుడు, ఒలీవల కొండ మీదున్న బేత్పగేలో ఆగారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ,+  వాళ్లకు ఇలా చెప్పాడు: “కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే కట్టేసివున్న ఒక గాడిద, దానితోపాటు దాని పిల్ల మీకు కనిపిస్తాయి. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి.  ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇవి ప్రభువుకు కావాలి’ అని మీరు చెప్పాలి, అప్పుడు అతను వెంటనే వాటిని పంపించేస్తాడు.”  ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికే అలా జరిగింది:  “‘ఇదిగో! నీ రాజు సౌమ్యుడిగా,+ గాడిద మీద, అవును గాడిద పిల్ల మీద కూర్చొని నీ దగ్గరికి వస్తున్నాడు’ అని సీయోను కూతురితో చెప్పండి.”+  కాబట్టి శిష్యులు వెళ్లి యేసు చెప్పినట్టే చేశారు.+  వాళ్లు గాడిదను, దాని పిల్లను తీసుకొచ్చి వాటిమీద తమ పైవస్త్రాలు వేశారు; యేసు వాటిమీద కూర్చున్నాడు.+  ప్రజల్లో చాలామంది తమ పైవస్త్రాలు దారిలో పరిచారు,+ ఇంకొంతమంది చెట్ల కొమ్మల్ని నరికి వాటిని దారిలో పరుస్తూ వచ్చారు.  అంతేకాదు ఆయన ముందు, వెనక వెళ్తున్న ప్రజలు, “దేవా, దావీదు కుమారుణ్ణి కాపాడు!+ యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!+ అత్యున్నత స్థలాల్లో నివసించే దేవా, ఈయన్ని కాపాడు!” అని అరుస్తూ ఉన్నారు.+ 10  ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు నగరమంతా అల్లరల్లరిగా ఉంది, అందరూ “ఈయన ఎవరు?” అని అంటూ ఉన్నారు. 11  ప్రజలు, “ఈయన ప్రవక్త అయిన యేసు,+ గలిలయలోని నజరేతుకు చెందినవాడు!” అని చెప్తూ ఉన్నారు. 12  యేసు ఆలయంలోకి ప్రవేశించి, ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను అందర్నీ బయటికి వెళ్లగొట్టాడు; డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలకిందులుగా పడేశాడు.+ 13  ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “‘నా మందిరం ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’ అని లేఖనాలు చెప్తున్నాయి.+ కానీ మీరు దాన్ని దోపిడీదొంగల గుహగా మారుస్తున్నారు.”+ 14  ఆయన ఆలయంలో ఉన్నప్పుడు గుడ్డివాళ్లు, కుంటివాళ్లు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన వాళ్లను బాగుచేశాడు. 15  యేసు చేసిన అద్భుతాల్ని, “దేవా, దావీదు కుమారుణ్ణి కాపాడు” అని ఆలయంలో పిల్లలు* అరవడాన్ని+ చూసినప్పుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు చాలా కోపం వచ్చింది;+ 16  వాళ్లు ఆయన్ని, “వీళ్లు ఏమంటున్నారో వింటున్నావా?” అని అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను. ‘పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు’ అనే మాటల్ని మీరు ఎప్పుడూ చదవలేదా?” అని వాళ్లతో అన్నాడు.+ 17  తర్వాత ఆయన ఆ నగరం నుండి బేతనియకు వెళ్లి, ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.+ 18  పొద్దున్నే నగరానికి తిరిగొస్తున్నప్పుడు ఆయనకు ఆకలేసింది.+ 19  దారిలో ఆయన ఒక అంజూర చెట్టును చూసి దాని దగ్గరికి వెళ్లాడు, అయితే దానికి ఆకులు తప్ప ఇంకేమీ లేవు.+ అప్పుడు ఆయన ఆ చెట్టుతో, “ఇంకెప్పుడూ నీకు పండ్లు రావు” అన్నాడు.+ వెంటనే ఆ అంజూర చెట్టు ఎండిపోయింది. 20  అది చూసినప్పుడు శిష్యులు చాలా ఆశ్చర్యపోయి, “ఆ అంజూర చెట్టు ఇంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు.+ 21  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీకు విశ్వాసం ఉంటే, మీరు సందేహపడకపోతే ఆ అంజూర చెట్టుకు నేను చేసినదాన్ని మీరు కూడా చేయగలుగుతారు; అంతేకాదు మీరు ఈ కొండతో, ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పినా అది జరుగుతుంది.+ 22  విశ్వాసంతో మీరు వేటికోసం ప్రార్థిస్తారో అవన్నీ పొందుతారు.”+ 23  ఆ తర్వాత ఆయన ఆలయంలోకి వెళ్లి బోధిస్తుండగా ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు?” అని అడిగారు.+ 24  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. దానికి మీరు జవాబు చెప్తే, నేను కూడా ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను. 25  బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా,* మనుషులా?” అప్పుడు వాళ్లలోవాళ్లు ఇలా మాట్లాడుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.+ 26  ఒకవేళ మనం, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్తే, ప్రజలు మనల్ని ఏం చేస్తారో? ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని వాళ్లందరూ నమ్ముతున్నారు.” 27  కాబట్టి వాళ్లు యేసుతో, “మాకు తెలీదు” అని చెప్పారు. దానికి యేసు వాళ్లతో, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు. 28  “మీకేమనిపిస్తుంది? ఒకతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్లి, ‘బాబూ, ఈ రోజు ద్రాక్షతోటలోకి వెళ్లి పనిచేయి’ అని చెప్పాడు. 29  అందుకు ఆ పెద్ద కుమారుడు, ‘నేను వెళ్లను’ అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకుని* వెళ్లాడు. 30  తండ్రి చిన్న కుమారుడి దగ్గరికి వెళ్లి అదే మాట చెప్పాడు. అతను, ‘వెళ్తాను నాన్నా’ అన్నాడు కానీ వెళ్లలేదు. 31  ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని చేశారు?” అప్పుడు వాళ్లు, “పెద్ద కుమారుడు” అని చెప్పారు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, పన్ను వసూలుచేసే వాళ్లు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. 32  ఎందుకంటే యోహాను, నీతి మార్గాన్ని బోధిస్తూ మీ దగ్గరికి వచ్చాడు, కానీ మీరు అతన్ని నమ్మలేదు. అయితే పన్ను వసూలుచేసే వాళ్లు, వేశ్యలు అతన్ని నమ్మారు;+ మీరు అది చూసి కూడా పశ్చాత్తాపపడలేదు, అతన్ని నమ్మలేదు. 33  “ఇంకో ఉదాహరణ* వినండి: ఒక ద్రాక్షతోట యజమాని ద్రాక్షతోట నాటించి,+ చుట్టూ కంచె వేయించాడు; ఒక ద్రాక్షతొట్టి తొలిపించాడు, కాపలా కోసం బురుజు కట్టించాడు;+ ఆ తర్వాత దాన్ని కౌలుకిచ్చి వేరే దేశానికి వెళ్లిపోయాడు.+ 34  కోతకాలం దగ్గర పడినప్పుడు, పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి అతను తన దాసుల్ని ఆ రైతుల దగ్గరికి పంపించాడు. 35  అయితే, ఆ రైతులు అతని దాసుల్ని పట్టుకుని ఒకర్ని కొట్టారు, ఇంకొకర్ని చంపారు, మరొకర్ని రాళ్లతో కొట్టారు.+ 36  అతను మళ్లీ వేరే దాసుల్ని, అంతకుముందు కన్నా ఎక్కువమందిని పంపించాడు. కానీ ఆ రైతులు వాళ్ల విషయంలో కూడా అలాగే చేశారు.+ 37  చివరికి తన కుమారుణ్ణి వాళ్ల దగ్గరికి పంపించాడు; అతను, ‘వాళ్లు నా కుమారుణ్ణి గౌరవిస్తారు’ అని అనుకున్నాడు. 38  అయితే కుమారుణ్ణి చూసినప్పుడు ఆ రైతులు, ‘ఇతను వారసుడు.+ రండి, ఇతన్ని చంపేసి, ఇతని ఆస్తిని సొంతం చేసుకుందాం!’ అని చెప్పుకున్నారు. 39  కాబట్టి వాళ్లు అతన్ని పట్టుకొని, ద్రాక్షతోట బయటికి తోసేసి చంపేశారు.+ 40  మరి ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతుల్ని ఏం చేస్తాడు?” 41  అప్పుడు వాళ్లు ఆయనతో, “వాళ్లు చెడ్డవాళ్లు కాబట్టి అతను వాళ్లను దారుణంగా చంపేసి, కోతకాలం వచ్చినప్పుడు పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తనకు ఇచ్చే వేరే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని చెప్పారు. 42  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి* అయింది.+ ఇది యెహోవా* వల్ల జరిగింది, ఇది మన కళ్లకు ఆశ్చర్యంగా ఉంది’ అనే మాటను మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?+ 43  అందుకే నేను మీతో చెప్తున్నాను, దేవుడు తన రాజ్యాన్ని మీ దగ్గర నుండి తీసేసి, రాజ్యానికి తగిన ఫలాలు ఫలించే జనానికి ఇస్తాడు. 44  అంతేకాదు, ఆ రాయి మీద పడే వ్యక్తి ముక్కలుముక్కలు అయిపోతాడు.+ ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్లను అది నలగ్గొడుతుంది.”+ 45  ముఖ్య యాజకులు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉదాహరణలు విన్నప్పుడు, ఆయన తమ గురించే మాట్లాడుతున్నాడని వాళ్లకు అర్థమైంది.+ 46  వాళ్లు ఆయన్ని పట్టుకోవాలని* అనుకున్నారు, కానీ ప్రజలు ఆయన్ని ప్రవక్తగా చూస్తున్నారు+ కాబట్టి వాళ్లకు భయపడ్డారు.

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
అక్ష., “బాలురు.”
అక్ష., “పరలోకమా.”
లేదా “బాధపడి.”
లేదా “ఉపమానం.”
అక్ష., “మూలకు తల.”
అనుబంధం A5 చూడండి.
లేదా “బంధించాలని.”