మత్తయి సువార్త 4:1-25
4 ఆ తర్వాత, దేవుని పవిత్రశక్తి యేసును ఎడారిలోకి తీసుకెళ్లింది. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టడానికి+ ప్రయత్నించాడు.
2 యేసు 40 పగళ్లు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఆయనకు బాగా ఆకలేసింది.
3 అప్పుడు అపవాది* ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు” అని అన్నాడు.
4 కానీ యేసు ఇలా అన్నాడు: “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా* నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి’ అని రాయబడివుంది.”+
5 తర్వాత అపవాది ఆయన్ని పవిత్ర నగరంలోకి+ తీసుకెళ్లి, ఆలయం గోడ* మీద నిలబెట్టి,
6 ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు,’ ‘నీ పాదానికి రాయి తగలకుండా వాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు’ అని రాయబడివుంది.”+
7 అప్పుడు యేసు అతనితో, “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* పరీక్షించకూడదు’ అని కూడా రాయబడివుంది” అన్నాడు.+
8 మళ్లీ అపవాది ఆయన్ని చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్లి, లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు చూపించి,
9 ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.”
10 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “సాతానా, వెళ్లిపో! ‘నీ దేవుడైన యెహోవానే* నువ్వు ఆరాధించాలి,+ ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.”+
11 దాంతో అపవాది ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు,+ అప్పుడు ఇదిగో! దేవదూతలు వచ్చి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టారు.+
12 ఆ తర్వాత, యోహానును బంధించారని విన్నప్పుడు యేసు గలిలయకు వెళ్లిపోయాడు.+
13 అంతేకాదు, ఆయన నజరేతు నుండి వచ్చేసిన తర్వాత జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో సముద్ర తీరాన ఉన్న కపెర్నహూము నగరంలో నివాసం ఉన్నాడు.+
14 అలా యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి:
15 “జెబూలూను దేశమా, నఫ్తాలి దేశమా, సముద్రానికి వెళ్లే దారిలో యొర్దానుకు అవతలి వైపున ఉన్న అన్యజనుల గలిలయ ప్రాంతమా!
16 చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు, మరణ నీడలో కూర్చున్నవాళ్లపై వెలుగు+ ప్రకాశించింది.”+
17 అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.+
18 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ. వాళ్లు జాలరులు.
19 ఆయన వాళ్లతో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను” అన్నాడు.+
20 వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన వెంట వెళ్లారు.+
21 యేసు అక్కడి నుండి వెళ్తూవెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను.+ వాళ్లు తమ తండ్రి జెబెదయితోపాటు పడవలో ఉండి తమ వలలు బాగుచేసుకుంటున్నారు. యేసు వాళ్లను కూడా పిలిచాడు.+
22 వాళ్లు వెంటనే పడవను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్లారు.
23 తర్వాత ఆయన గలిలయ అంతటా ప్రయాణిస్తూ+ సమాజమందిరాల్లో బోధిస్తూ,+ రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ ఉన్నాడు.+
24 ఆయన గురించిన వార్త సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రకరకాల జబ్బులతో, వేదనలతో బాధపడుతున్నవాళ్లను, చెడ్డదూతలు* పట్టినవాళ్లను,+ మూర్ఛ రోగుల్ని,+ పక్షవాతం వచ్చిన వాళ్లందర్నీ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు.
25 అందువల్ల గలిలయ నుండి, దెకపొలి* నుండి, అలాగే యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతలి వైపు నుండి ప్రజలు గుంపులుగుంపులుగా ఆయన వెంట వెళ్లారు.
అధస్సూచీలు
^ లేదా “ప్రలోభపెట్టేవాడు.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “అన్నిటికన్నా ఎత్తైన చోటు.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “పది నగరాలున్న ప్రాంతం.”