యెషయా 41:1-29
41 “ద్వీపాల్లారా, మౌనంగా ఉండి నేను చెప్పేది వినండి;దేశాలు మళ్లీ బలం పుంజుకోవాలి.
అవి నా దగ్గరికి రావాలి; తర్వాత అవి మాట్లాడాలి.+
తీర్పు కోసం మనం సమావేశమౌదాం రండి.
2 దేశాల్ని అతని చేతికి అప్పగించాలని,రాజుల్ని అతనికి లోబర్చాలని+సూర్యోదయం* వైపు నుండి ఒక వ్యక్తిని బయల్దేరజేసింది ఎవరు?+న్యాయం జరిగించడానికి తన పాదాల దగ్గరికి* అతన్ని పిలిచింది ఎవరు?
అతని ఖడ్గం ముందు వాళ్లను మట్టికరిపించేది ఎవరు?అతని విల్లు ముందు వాళ్లను గాలికి ఎగిరే కొయ్యకాలుగా* చేసేది ఎవరు?
3 తన పాదాలు ఎప్పుడూ నడవని త్రోవల్లోఅతను ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్లను తరుముతూ వెళ్తాడు.
4 మొదటి నుండి తరాల్ని రప్పిస్తూఈ పనికి పూనుకొని దాన్ని చేసింది ఎవరు?
నేనే, యెహోవాను, నేను మొదటివాణ్ణి;+చివరివాళ్లతో కూడా నేను ఇలాగే ఉంటాను.”+
5 అది చూసి ద్వీపాలు భయపడిపోయాయి.
భూమి కొనలు వణకడం మొదలుపెట్టాయి.
అవి కలుసుకొని ముందుకు వస్తున్నాయి.
6 ప్రతీ వ్యక్తి తన తోటివాడికి సహాయం చేస్తున్నాడు,తన సహోదరునితో, “ధైర్యంగా ఉండు” అని చెప్తున్నాడు.
7 చేతిపనివాడు కంసాలిని+ బలపరుస్తున్నాడు;సుత్తితో సాగగొట్టేవాడుదాగలి* మీద కొట్టేవాడిని బలపరుస్తున్నాడు.
అతను టంకం పని* గురించి, “అది బాగుంది” అంటున్నాడు.
తర్వాత అది ఒరిగి పడిపోకుండా మేకులతో దాన్ని బిగిస్తారు.
8 “అయితే ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి,+యాకోబూ, నేను నిన్ను ఎంచుకున్నాను,+నువ్వు నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం,*+
9 నేను భూమి అంచుల నుండి నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాను,+భూమి సుదూర ప్రాంతాల నుండి నిన్ను పిలిచాను.
నేను నీతో ఇలా అన్నాను: ‘నువ్వు నా సేవకుడివి;+నేను నిన్ను ఎంచుకున్నాను; నేను నిన్ను తిరస్కరించలేదు.+
10 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+
ఆందోళనపడకు,* ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.+
నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను,+నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.’
11 ఇదిగో! నీ మీద కోపగించుకునే వాళ్లంతా సిగ్గుపడతారు, అవమానాలపాలు అవుతారు.+
నీతో పోరాడేవాళ్లు లేకుండా పోతారు, నాశనమౌతారు.+
12 నీతో పోరాడేవాళ్ల కోసం నువ్వు వెతుకుతావు, కానీ వాళ్లు నీకు కనిపించరు;నీతో యుద్ధం చేసేవాళ్లు ఉనికిలో లేకుండా పోతారు, ఎక్కడా ఉండరు.+
13 ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను,‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.+
14 పురుగులాంటి* యాకోబూ,+ భయపడకు,ఇశ్రాయేలు జనమా, నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ అంటున్నాడు.
15 “ఇదిగో! నేను నిన్ను నూర్చే పనిముట్టులా చేశాను,+పదునైన కొత్త నూర్చే పరికరంలా చేశాను.
నువ్వు పర్వతాల్ని తొక్కి పిండి చేస్తావు,కొండల్ని పొట్టులా చేస్తావు.
16 నువ్వు వాటిని తూర్పారబడతావు,అవి గాలికి కొట్టుకుపోతాయి;సుడిగాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది.
నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు,+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి బట్టి గొప్పలు చెప్పుకుంటావు.”+
17 “అవసరంలో ఉన్నవాళ్లు, పేదవాళ్లు నీళ్ల కోసం వెతుకుతున్నారు, కానీ ఎక్కడా నీళ్లు లేవు.
దాహంతో వాళ్ల నాలుక ఎండిపోతోంది.+
యెహోవా అనే నేను వాళ్లకు జవాబిస్తాను.+
ఇశ్రాయేలు దేవుడినైన నేను వాళ్లను విడిచిపెట్టను.+
18 నేను చెట్లులేని కొండల్లో నదులు పారేలా,+
లోయ మైదానాల్లో ఊటలు ప్రవహించేలా చేస్తాను.+
నేను ఎడారిని జమ్ము మడుగులా,
నీళ్లులేని దేశాన్ని నీటి ఊటలుగా చేస్తాను.+
19 ఎడారిలో దేవదారు చెట్టును,తుమ్మ చెట్టును, గొంజి చెట్టును, పైన్ చెట్టును నాటుతాను.+
ఎడారి మైదానంలో సరళవృక్షాన్ని,యాష్ చెట్టును,* తమాల వృక్షాన్ని నాటుతాను.+
20 దానివల్ల, యెహోవా చెయ్యి దాన్ని చేసిందని,ఇశ్రాయేలు పవిత్ర దేవుడే దాన్ని కలగజేశాడనిప్రజలందరూ చూసి తెలుసుకుంటారు,శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారు.”+
21 “మీ వ్యాజ్యాన్ని నా ముందు పెట్టండి” అని యెహోవా అంటున్నాడు.
“మీ వాదనలు వినిపించండి” అని యాకోబుకు రాజైన దేవుడు అంటున్నాడు.
22 “రుజువులు ప్రవేశపెట్టండి, జరగబోయే వాటి గురించి మాకు తెలియజేయండి.
మునుపటి* విషయాల గురించి మాకు చెప్పండి,అప్పుడు మేము వాటి గురించి ఆలోచించి,* వాటివల్ల చివరికి ఏమౌతుందో తెలుసుకుంటాం.
లేదా ముందుముందు జరగబోతున్న వాటి గురించి మాకు ప్రకటించండి.+
23 మీరు దేవుళ్లని మేము తెలుసుకునేలాభవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మాకు చెప్పండి.+
అవును, మంచో చెడో ఏదో ఒకటి చేయండి.అప్పుడు మేము దాన్ని చూసి ఆశ్చర్యపోతాం.+
24 ఇదిగో! అసలు మీరు ఉనికిలోనే లేరు,మీరు సాధించింది అంటూ ఏమీ లేదు.+
మిమ్మల్ని ఎంచుకునేవాళ్లు అసహ్యులు.+
25 ఉత్తరం వైపు నుండి నేనొక వ్యక్తిని బయల్దేరజేశాను, అతను వస్తాడు,+సూర్యోదయం* వైపు నుండి వచ్చే వ్యక్తి+ నా పేరును మహిమపరుస్తాడు.
అతను బంకమట్టిని తొక్కినట్టు పరిపాలకుల్ని* తొక్కుతాడు,కుమ్మరి బంకమట్టిని తొక్కినట్టు అతను వాళ్లను తొక్కుతాడు.
26 మేము తెలుసుకునేలా మొదటి నుండి దాని గురించి చెప్పిందెవరు?‘అతను సరిగ్గా చెప్పాడు’ అని మేము అనేలా గడిచిన కాలాల నుండి వాటిని ఎవరు చెప్పారు?+
నిజానికి, ఎవరూ దాని గురించి ప్రకటించలేదు!
ఎవరూ దాని గురించి చెప్పలేదు!
మీ నుండి ఎవరూ ఏమీ వినలేదు!”+
27 “ఇదిగో! వాళ్లు ఇక్కడ ఉన్నారు!” అని సీయోనుకు మొదట చెప్పింది నేనే.+
మంచివార్త మోసుకొచ్చే వ్యక్తిని నేను యెరూషలేముకు పంపుతాను.+
28 నేను చూస్తూ వచ్చాను, కానీ ఎవరూ లేరు;వాళ్లలో సలహా ఇచ్చేవాళ్లు ఒక్కరు కూడా లేరు.
బదులు చెప్పమని నేను వాళ్లను అడుగుతూ వచ్చాను.
29 ఇదిగో! వాళ్లంతా మాయ.*
వాళ్ల పనులన్నీ వట్టివి.
వాళ్ల పోత* విగ్రహాలు గాలి లాంటివి, వ్యర్థమైనవి.+
అధస్సూచీలు
^ లేదా “తూర్పు.”
^ అంటే, తనను సేవించడానికి.
^ పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
^ ఇది, కంసాలివాళ్లు లోహపు వస్తువుల్ని కాల్చి సాగగొట్టే ఇనుప దిమ్మె.
^ అంటే, లోహాల్ని అతికించడం.
^ అక్ష., “విత్తనం.”
^ లేదా “దిగులుపడకు.”
^ అంటే, ఏమాత్రం సంరక్షణలేని, దీనమైన.
^ 15 మీటర్ల ఎత్తు దాకా పెరిగే ఒక పెద్ద చెట్టు. దానికి లేతపచ్చ ఆకులు, బూడిద రంగు రెమ్మలు ఉంటాయి.
^ అక్ష., “మొదటి.”
^ లేదా “వాటి మీద మనసుపెట్టి.”
^ లేదా “తూర్పు.”
^ లేదా “ఉప పాలకుల్ని.”
^ లేదా “అసలు ఉనికిలోనే లేరు.”
^ లేదా “లోహపు.”