సామెతలు 7:1-27

  • దేవుని ఆజ్ఞలు పాటించి బ్రతుకు (1-5)

  • అనుభవంలేని యువకుడు ​మోసపోయాడు (6-27)

    • “పశువు వధకు పోయినట్టు” (22)

7  నా కుమారుడా, నా మాటల్ని పాటించు,నా ఆజ్ఞల్ని సంపదలా దాచుకో.   నా ఆజ్ఞల్ని పాటిస్తూ ఎక్కువకాలం బ్రతుకు;+నా ఉపదేశాన్ని నీ కనుపాపలా కాపాడుకో.   వాటిని నీ వేళ్లకు కట్టుకో;నీ హృదయమనే పలకమీద రాసుకో.+   తెలివితో, “నువ్వు నా సహోదరివి” అని, అవగాహనతో, “నువ్వు నా బంధువువి” అని చెప్పు.   అప్పుడవి దిగజారిన* స్త్రీ+ నుండి,అనైతిక* స్త్రీ మాట్లాడే తియ్యని* మాటల నుండి నిన్ను కాపాడతాయి.+   ఒకసారి నేను నా ఇంటి కిటికీ జాలీలో నుండికిందికి చూస్తున్నప్పుడు,   అనుభవంలేని కొంతమందిని గమనించాను,యువకుల మధ్య వివేచనలేని ఒక యువకుడు నాకు కనిపించాడు.+   అతను ఆ స్త్రీ ఉన్న వీధి మలుపు దగ్గర నడుస్తున్నాడు,ఆమె ఇంటి వైపుగా అడుగులు వేశాడు,   అది సాయంత్రం, సంధ్యవేళ,+రాత్రి చీకటిపడే సమయం. 10  అప్పుడు వేశ్యలా బట్టలు వేసుకున్న ఒక స్త్రీ+కపట హృదయంతో అతని దగ్గరికి వచ్చింది. 11  ఆమె పెద్దగా మాట్లాడుతుంది, బరితెగించింది.+ ఆమె కాలు ఇంట్లో నిలవదు. 12  ఆమె ఒక క్షణం బయట ఉంటే, ఇంకో క్షణం సంతవీధుల్లో ఉంటుంది,ఆమె ప్రతీ వీధి మూల దగ్గర మాటువేస్తుంది.+ 13  ఆమె అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంది;సిగ్గుమాలిన ముఖంతో అతనితో ఇలా అంది: 14  “నేను సమాధాన బలులు అర్పించాను.+ ఈ రోజే నా మొక్కుబళ్లు చెల్లించాను. 15  అందుకే నిన్ను కలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చాను,ఇదిగో, నువ్వు కనిపించావు! 16  నా మంచం మీద శ్రేష్ఠమైన దుప్పట్లు,ఐగుప్తు* నుండి వచ్చిన రంగురంగుల నార దుప్పట్లు+ పరిచాను. 17  నా మంచం మీద బోళం, అగరు, దాల్చినచెక్క+ చల్లాను. 18  రా, తెల్లారేవరకు వలపుతీర తృప్తి పొందుదాం;కలిసి సుఖం అనుభవిద్దాం. 19  మా ఆయన ఇంట్లో లేడు;దూరప్రయాణం వెళ్లాడు. 20  తనతోపాటు డబ్బు సంచి తీసుకెళ్లాడు,పౌర్ణమి రోజు దాకా తిరిగిరాడు.” 21  అలా ఆమె ఒప్పించే మాటలతో అతన్ని మాయచేసింది.+ తియ్యని మాటలతో అతన్ని బుట్టలో వేసుకుంది. 22  పశువు వధకు పోయినట్టు, మూర్ఖుడు సంకెళ్లతో* శిక్షించబడడానికి వెళ్లినట్టుఉన్నట్టుండి అతను ఆమె వెంట వెళ్లాడు.+ 23  చివరికి అతని కాలేయంలోకి బాణం దూసుకెళ్తుంది;పక్షి ఉచ్చులోకి వేగంగా వెళ్లినట్టు అతను వెళ్లాడు, దానివల్ల తన ప్రాణం ప్రమాదంలో పడుతుందని అతనికి తెలీదు.+ 24  కాబట్టి నా కుమారులారా, నేను చెప్పేది వినండి;నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. 25  నీ హృదయాన్ని ఆమె మార్గాల వైపు తిరగనివ్వకు.దారితప్పి ఆమె త్రోవల్లోకి వెళ్లకు,+ 26  ఆమె కారణంగా చాలామంది గాయపడి పడిపోయారు,+ఆమె లెక్కలేనంత మందిని చంపింది.+ 27  ఆమె ఇల్లు సమాధికి* తీసుకెళ్తుంది;అది మరణశాలలకు దారితీస్తుంది.

అధస్సూచీలు

అక్ష., “అపరిచిత.” సామెతలు 2:16 చూడండి.
అక్ష., “విదేశీ.” సామెతలు 2:16 చూడండి.
లేదా “ప్రలోభపెట్టే.”
లేదా “ఈజిప్టు.”
లేదా “బొండలో.”
లేదా “షియోల్‌కి,” అంటే మానవజాతి సాధారణ సమాధికి. పదకోశం చూడండి.