బబులోనులో బందీలుగా ఉన్న యూదుల గురించి బైబిలు చెప్తున్న విషయాలు నిజమేనా?
దాదాపు 2,600 సంవత్సరాల క్రితం, యూదుల్ని బబులోనుకు చెరగా తీసుకెళ్లారు. వాళ్లు అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. వాళ్లు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తారో దేవుడు బైబిల్లో ముందే రాయించాడు. బైబిల్లో ఇలా ఉంది: ‘ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి ... నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరుడి.’ (యిర్మీయా 29:1, 4-7) యూదులు నిజంగా ఈ వచనాల్లో చెప్పినట్లే జీవించారా?
ప్రాచీన బబులోను ప్రాంతానికి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 100 మట్టి పలకల్ని పరిశోధకులు పరిశీలించారు. బబులోను పరిపాలనకు శాంతిగా లోబడుతూ చాలామంది యూదులు తమ సంస్కృతి, మతాచారాల ప్రకారం జీవించారని ఆ పలకలు తెలియజేస్తున్నాయి. అవి క్రీస్తు పూర్వం 572 నుండి 477 సంవత్సరాలకు చెందినవి. వాటిలో అద్దెకు తీసుకోవడం, వ్యాపార పనులు, రుణపత్రాలు (ప్రామీసరీ నోట్లు), ఇతర ఆర్థిక సంబంధమైన వివరాలు ఉన్నాయి. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: ‘ఈ దస్తావేజులను బట్టి చెరలో ఉన్న యూదులు పల్లెటూళ్లలో సాధారణ జీవితం గడిపారని అర్థమౌతుంది. వాళ్లు పొలం పనులు చేసేవాళ్లు, ఇళ్లు కట్టుకునేవాళ్లు, పన్నులు కట్టేవాళ్లు, రాజుకు అవసరమైన సేవలు అందించేవాళ్లని తెలుస్తుంది.’
అల్-యహూదు లేదా యూదా-పట్టణం అనే ప్రాంతంలో చాలామంది యూదులు ఉన్నారని ఈ ప్రాముఖ్యమైన పలకల్లో తేలింది. ఆ పలకల్లో ఒక యూదా కుటుంబంలోని నాలుగు తరాల వాళ్ల పేర్లు చెక్కి ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రాచీన హీబ్రూ అక్షరాల్లో ఉన్నాయి. ఆ పలకల్ని కనుగొనకముందు బబులోనులో చెరగా ఉన్న యూదుల జీవితం గురించి పండితులకు (స్కాలర్స్‌కు) పెద్దగా తెలీదు. ఇశ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటిలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పనిచేస్తున్న డా. ఫిలిప్ వుకసావోవిక్ ఇలా చెప్తున్నాడు: “చివరికి, ఈ పలకల వల్ల మనం అప్పటి యూదుల గురించి తెలుసుకోగలిగాం, వాళ్ల పేర్లు ఏంటో, వాళ్లు ఎక్కడ నివసించారో, ఎప్పుడు నివసించారో, వాళ్లేం చేసేవాళ్లో తెలుసుకోగలిగాం.”
ఎక్కడ జీవించాలో, ఏ పని చేయాలో నిర్ణయించుకునే విషయంలో బందీలుగా వెళ్లిన యూదులకు కొంతవరకు స్వేచ్ఛ ఉండేది. వాళ్లు “అల్-యహూదులోనే కాదు, ఇంకా పన్నెండు వేర్వేరు నగరాల్లో కూడా జీవించారు” అని వుకసావోవిక్ చెప్తున్నాడు. కొంతమంది రకరకాల నైపుణ్యాలు నేర్చుకున్నారు, అవి తర్వాత కాలంలో యెరూషలేమును తిరిగి కట్టినప్పుడు ఉపయోగపడ్డాయి. (నెహెమ్యా 3:8, 31, 32) యూదులు తమ సొంతూరుకు వెళ్లిపోవచ్చని చెప్పిన తర్వాత కూడా కొంతమంది యూదులు బబులోనులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు అనే విషయాన్ని కూడా అల్-యహూదు పలకలు నిరుపిస్తున్నాయి. దీన్నిబట్టి బైబిల్లో చెప్పినట్లు యూదులు బబులోనులో కొంతమేరకు ప్రశాంతమైన పరిస్థితుల్లోనే జీవించారని చెప్పవచ్చు.