కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?

మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?

 ప్రపంచవ్యాప్తంగా, యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునే ఎంతోమంది రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. వాళ్లు ఆయా అభ్యర్థులకు లేదా రాజకీయ పార్టీలకు మద్దతివ్వడం ద్వారా రాజకీయ, నైతిక విషయాల్లో తమ నమ్మకాల్ని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు తరచూ నైతిక లేదా సామాజిక సమస్యల్ని వాడుకొని మతనాయకుల మద్దతు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు, మతనాయకులు రాజకీయ పదవుల కోసం పోటీ చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది. కొన్ని దేశాల్లో అయితే, ఒక “క్రైస్తవమత” శాఖ రాష్ట్ర లేదా జాతీయ మతంగా ప్రత్యేక హోదాను పొందడం కూడా జరుగుతుంది.

 మీకు ఏమనిపిస్తుంది? యేసుక్రీస్తును అనుసరించేవాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా? యేసు ఉదాహరణను పరిశీలిస్తే మనం ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవచ్చు. ఆయన ఇలా చెప్పాడు: “నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.” (యోహాను 13:15) ఇంతకీ రాజకీయాల విషయంలో యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

యేసు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడా?

 లేదు. లోక రాజకీయాల్లో యేసు జోక్యం చేసుకోలేదు.

 యేసు రాజకీయ పదవుల్ని ఆశించలేదు. అపవాది అయిన సాతాను ఈ “లోక ​రాజ్యాలన్నిటినీ” యేసుకు ఇస్తానని చెప్పినప్పుడు, మానవ ప్రభుత్వాల మీద పరిపాలకుడిగా ఉండడానికి యేసు ఒప్పుకోలేదు. (మత్తయి 4:8-10) a మరో సందర్భంలో ప్రజలు, ఒక మంచి నాయకునికి ఉండాల్సిన లక్షణాలు యేసుకు ఉన్నాయని గుర్తించి ఆయన్ని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నించారు. “వాళ్లు తన దగ్గరికి వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే మళ్లీ కొండకు వెళ్లిపోయాడు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 6:15) ప్రజల ఇష్టానికి యేసు లొంగిపోలేదు. బదులుగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించాడు.

 రాజకీయ వివాదాల్లో యేసు తలదూర్చలేదు. ఒక ఉదాహరణ గమనించండి. యేసు కాలంలో యూదులు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టడానికి అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు, అది అన్యాయం అనుకునేవాళ్లు. ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పమని యేసును అడిగినప్పుడు, పన్ను కట్టడం న్యాయమా కాదా అనే రాజకీయ గొడవలోకి ఆయన దిగలేదు. ఆయన ఇలా చెప్పాడు: “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.” (మార్కు 12:13-17) ఆ రాజకీయ వివాదంలో ఆయన తలదూర్చలేదు. బదులుగా, కైసరును సూచిస్తున్న రోమా పౌరసంబంధ అధికారం కోరుతున్నట్టు పన్ను కట్టాలని చెప్పాడు. అదే సమయంలో, లోక అధికారులకు చూపించే విధేయతకు హద్దులు ఉన్నాయని కూడా చెప్పాడు. దేవునికి మాత్రమే చెందాల్సిన భక్తి, ఆరాధన లాంటి వాటిని ప్రభుత్వానికి ఇవ్వకూడదు.—మత్తయి 4:10; 22:37, 38.

 పరలోక ప్రభుత్వం లేదా దేవుని రాజ్యం గురించి యేసు బోధించాడు. (లూకా 4:43) యేసు రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోలేదంటే, మానవ ప్రభుత్వాలు కాదుగానీ దేవుని రాజ్యమే భూమిని దేవుని ఇష్టానికి తగినట్టు మారుస్తుందని ఆయనకు తెలుసు. (మత్తయి 6:10) దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాల్ని ఉపయోగించుకోదని, వాటిని తీసేసి వాటి స్థానంలో పరిపాలిస్తుందని ఆయన అర్థంచేసుకున్నాడు.—దానియేలు 2:44.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారా?

 లేదు. “మీరు లోకానికి చెందినవాళ్లు కాదు” అని అంటూ యేసు ఇచ్చిన ఆజ్ఞను ఆయన అనుచరులు పాటించారు. (యోహాను 15:19) ఆయన ఆదర్శాన్ని పాటిస్తూ వాళ్లు లోక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. (యోహాను 17:16; 18:36) వాళ్లు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకునే బదులు యేసు ఆజ్ఞాపించిన పని చేశారు, అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, బోధించారు.—మత్తయి 28:18-20; అపొస్తలుల కార్యాలు 10:42.

 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవునికి లోబడడాన్ని అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించారు, అయితే తాము ప్రభుత్వ అధికారుల్ని గౌరవించాలని కూడా వాళ్లకు తెలుసు. (అపొస్తలుల కార్యాలు 5:29; 1 పేతురు 2:13, 17) వాళ్లు చట్టాలకు లోబడ్డారు, పన్నులు కట్టారు. (రోమీయులు 13:1, 7) వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా సరే, ప్రభుత్వాలు కల్పించే చట్టపరమైన రక్షణ, సేవల నుండి ప్రయోజనం పొందారు.—అపొస్తలుల కార్యాలు 25:10, 11; ఫిలిప్పీయులు 1:7.

ఈ రోజుల్లో క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు

 యేసు గానీ ఆయన తొలి అనుచరులు గానీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు క్రైస్తవులు కాబట్టి లోక రాజకీయాలకు దూరంగా ఉంటారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే వాళ్లు యేసు ఆజ్ఞాపించిన పని చేస్తారు, అంటే “రాజ్య సువార్త” ప్రకటిస్తారు.—మత్తయి 24:14.

a అలా నిరాకరించినప్పుడు యేసు లోక రాజ్యాలన్నిటినీ ఇచ్చే అధికారం సాతానుకు లేదని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత ఒకసారి యేసు అతన్ని “ఈ లోక పరిపాలకుడు” అని పిలిచాడు.—యోహాను 14:30